“సంగీత సాహిత్యాల సంగమంగా దేదీప్యమానంగా విరాజిల్లిన చారిత్రాత్మక కేంద్రం, విజయనగరం. ఈ నగరం తనలో నిలుపుకున్న ప్రత్యేకతలూ, ప్రతీకలూ అన్నీ ఇన్నీ కావు. విజయనగరం… గురజాడ ఆనవాళ్ళను తన పొత్తిళ్ళలో ఇముడ్చుకున్న సారస్వత కేంద్రం. కన్యాశుల్కంలోని గిరీశం, మధురవాణి, రామప్పంతులూ, బుచ్చమ్మ పాత్రలనూ, ఆ నాటకంలోని బొంకులదిబ్బ, అయ్యకోనేరు లాంటి స్మృతి చిహ్నాలను తనలో నిక్షిప్తం చేసుకున్న రంగస్థలం. తెలుగు కథకు ఆద్యునిగా చెప్పుకుంటున్న గురజాడ స్మారక కేంద్రం, మహారాజావారి సంగీత కళాశాలలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమై వెలుగొందుతున్న రాచనగరం. ఆదిభట్ల నారాయణ దాసు, ఘంటసాల, ద్వారం వెంకటస్వామినాయుడు వంటి సంగీత చక్రవర్తుల, గాన గంధర్వుల మధుర స్వరాలు ప్రతిధ్వనిస్తున్న సుందర సౌధాల సమ్మేళనం. విజయనగరం పేరు వినగానే చాసో కథలు వాయులీన తరంగాలై మన హృదయాల్లో ఆర్తినీ, ఆనందాన్నీ నింపుతాయి. రోణంకి అప్పలస్వామి, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబులు చాసోతో చాసో గారి హవేలీలో ఎడతెరిపిలేకుండా జరిపిన సాహితీ చర్చలు స్ఫురణకు వస్తాయి. వర్ధమాన రచయితల్లో చాసో స్ఫూర్తిని నింపేందుకు నెలకొల్పిన చాసో స్ఫూర్తి పురస్కారం గుర్తుకు వస్తుంది. ఆ స్ఫూర్తితోనే ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 2009 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కథా రచయిత్రి చాగంటి తులసి ఆధ్వర్యంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగిన ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంపై ” పొద్దు” పాఠకులకు తవ్వా ఓబుల్ రెడ్డి అందిస్తున్న నివేదిక ఇది.”
-తవ్వా ఓబుల్ రెడ్డి
కడప జిల్లా కు చెందిన ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డికి 2009వ సంవత్సరపు ” చాసో ” స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. జిల్లా కేంద్రమయిన విజయనగరం లోని ఎం.ఆర్.లేడీస్ క్లబ్ ఆవరణంలో జనవరి 17వ తేదీ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు కింద 10 వేల రూపాయల నగదునూ, జ్ఞాపికనూ అందచేసి శాలువా తో సన్నపురెడ్డిని ఘనంగా సత్కరించారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఆవుల మంజులత మాట్లాడుతూ ప్రపంచ కథా సాహిత్యం లో ఏ భాషకూ తీసిపోని విధంగా తెలుగులో గొప్ప కథలు వెలువడ్డాయని పేర్కొన్నారు. తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి తెలియ చేసేందుకు మేధావులు కృషి చేయాలని ఆమె పిలుపిచ్చారు. ఆణిముత్యాల్లాంటి చాసో కథలకు శాశ్వతత్వాన్ని కల్పించడానికి అంతర్జాలంలో ఉంచాలని సూచించారు. (పొద్దు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. -సం.) కేవలం కాలక్షేపం కోసం కాకుండా, సాహిత్యాన్ని ఆస్వాదించే రీతిలో చాసో కథలను పాఠకులు చదవాలనీ, చాసో కథలను సక్రమంగా అవగాహన చేసుకోవడం కష్టతరమని మంజులత అన్నారు. కథా రచనలో చాసో ఆచరించిన శైలీ, శిల్పాలు ఎంతో హృద్యంగా ఉంటాయని, చాసో రచించిన “ఏలూరెల్లాలి” కథను మంజులత ఉదహరించారు.
చాసో పురస్కార గ్రహీత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి కథలను కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సమీక్షిస్తూ “గంపెడు గడ్డి” కథలో మానవ సంబంధాలను కరువు ఏ విధంగా ధ్వంసం చేస్తుందో సన్నపు రెడ్డి చక్కగా చిత్రీకరించారని వివరించారు. చనుబాలు, అంటు, పేడ దయ్యం, పాటలబండి కథలను రాచపాలెం ఈ సందర్భంగా ఉటంకించారు. సన్నపు రెడ్డి రచించిన చనుబాలు కథను తెలుగు కథా సాహిత్యంలోనే ఒక గొప్ప కథగా, సన్నపు రెడ్డిని రాయలసీమ కథకు తూర్పు దిక్కుగా ఆయన అభివర్ణించారు. ప్రకృతిలో మనిషిని అంతర్భాగంగా చిత్రీకరిస్తూ సన్నపురెడ్డి ఆహ్లాదకరంగా కథలను రాశారని ఆచార్య రాచపాలెం పేర్కొన్నారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి అచార్య కొలకలూరి ఇనాక్ చాసో కథలను సమీక్షిస్తూ చాసో స్త్రీ పాత్రలను వైవిధ్యభరితంగా చిత్రీకరించారనీ, సమాజ శ్రేయస్సును కోరుకున్నారని వివరించారు. పురుషుడు ఏం చేస్తే చెల్లుబాటవుతుందో స్త్రీ కూడా అదే పని చేస్తే చెల్లుబాటు కావాలనీ, స్త్రీకి లైంగిక స్వేచ్ఛ ఉండాలని చాసో ఆకాంక్షించారనీ ఆచార్య కొలకలూరి వివరించారు.
పురస్కార గ్రహీత సన్నపు రెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహితీ క్షేత్రాన్ని చాసో అరవాలు మరవాలుగా దున్ని, కథలనే గట్టి గింజలను పండించారని, తూర్పు కొండల్లో పుట్టిన చాసో కథా ప్రవాహం నల్లమల కొండల వరకూ సాగిందని పేర్కొన్నారు. చాసో కథలు వస్తు వైవిధ్యాన్నీ, ఆత్మసౌందర్యాన్నీ ఇనుమడింపచేసేవిగా ఉంటాయని, శ్రీశ్రీ, చలం, శ్రీపాద, కొడవటిగంటి, తిలక్, మధురాంతకం రాజారాం, చాసో, శంకరమంచి, కేతు విశ్వనాథ రెడ్డి, కొలకలూరి ఇనాక్ తనను ప్రభావితం చేసిన రచయితలని, తనకు తెలిసిన, తన చుట్టూ ఉన్న జీవితాలనే కథావస్తువులుగా ఎన్నుకొని కథలను రాస్తున్నానని సన్నపు రెడ్డి తెలిపారు.
చాసోతో తనకు ప్రత్యక్ష పరిచయం లేక పోయినా ఆయన సాహిత్యంతో మంచి పరిచయం ఉందనీ, తన దృష్టిలో రచయితలతో పరిచయం అంటే ఆయా రచయితలు రాసిన సాహిత్యంతో పరిచయమేనని సన్నపురెడ్డి అభిప్రాయపడ్డారు. తన తండ్రి నిత్యం పారాయణం చేస్తూ ఉండిన రంగనాథ రామాయణం వినడం ద్వారా సాహితీ అక్షరాలను దిద్దుకున్నాననీ, తనకు లభించిన ఈ పురస్కారం తన ప్రాంతమైన రాయలసీమకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నట్లుగా సన్నపు రెడ్డి అభిప్రాయపడ్డారు. చాసో రచించిన “కొండగెడ్డ” కథను చాసో కుమార్తె చాగంటి తులసి సభికులకు చదివి వినిపించారు. ఆచార్య కొలకలూరి, ఆచార్య మంజులత చాసో చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రచయితలు వంగపండు, జి.యస్.చలం, తవ్వా ఓబుల్ రెడ్డి, కె. ఎన్. మల్లేశ్వరి, నూకా రాంప్రసాద్ రెడ్డి, ఎన్.కె. బాబు, అల, గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీశ్, చాగంటి కృష్ణకుమారి, చాగంటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
————
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన తవ్వా ఓబుల్ రెడ్డి ప్రవృత్తి రీత్యా కథారచయిత, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓబుల్ రెడ్డి కడప కథ కథాసంపుటికి, మైదుకూరు చరిత్ర, రాయలసీమ వైభవం గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. 20కి పైగా కథలు, 10 కవితలు, 200 వ్యాసాలు వివిధ పత్రికల్లో, ఆకాశవాణి ద్వారా ప్రచురితం, ప్రసారం అయ్యాయి. గ్రామీణ జనజీవన పరిస్థితులు, గ్రామీణ కళలు, గిరిజన జీవన విధానం, ప్రకృతి, అడవులపై అధ్యయనం అంటే చాలా ఇష్టం!
మైదుకూరు లో ” తెలుగు సాహితీ సాంస్కృతిక వేదిక” ద్వారా మిత్రులతో కలిసి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. kadapa.info వెబ్సైటు ద్వారా కడప జిల్లాకు సంబంధించిన సమస్త సమాచారంతోబాటు బ్రౌన్ లేఖలు, మధురాంతకం రాజారాం రచనల్లాంటి అరుదైన పుస్తకాలను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు.
నేను సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచనల్లో ఒక నవల, ఒక కథ మాత్రమే చదివాను, కానీ తిరిగి తిరిగి చదవటం వలన 2007 నవంబర్లో మొదలై పదిహేడు వారాల సీరియల్ గా 2008 ఫిబ్రవరి వరకు వచ్చిన “పాలెగత్తె” కోసం ఎదురుచూడటం ఇంకా గుర్తే. ఇక్కడ సమీక్ష రాసేంత ధీమా లేదు కానీ వీలైతే చదవనివారు తప్పక చదవాల్సిన కథ. ఈ వ్యాసం, 2008 సంచికల్లో వారితో ఇంటర్వ్యూలు చదవగలిగినందుకు సంతోషం. పొద్దు వారికి కృతజ్ఞతలు.