విద్వాన్‌ విశ్వం

తెలుగునాట విద్వాన్‌ విశ్వం గారిది ప్రత్యేక స్థానం. వీరి జీవితంలో ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా కలిసిపోయాయి. ప్రాకృతం, సంస్కృతం, ఆంగ్ల భాషలను ఆకళింపు చేసుకున్న పాండిత్యం ఆయన సొంతం. వామపక్ష ఆలోచనలనూ, భారతీయ లోచనాన్నీ కలిపి చూసిన సమన్వయవాది విశ్వం.

ఛాందసమెరుగని సంప్రదాయవాది,

ఆవేశంలేని ఆధునికవాది,

మనసున్న మానవతావాది విశ్వం.

విద్వాన్‌ విశ్వం అనగానే చాలామందికి మాణిక్యవీణ కాలమ్‌ గుర్తుకువస్తుంది. అలాగే ఎంతోమందికి పెన్నేటిపాట, ఒకనాడు కావ్యాలు స్ఫురించవచ్చు. ఇంకొందరికి బాణుభట్టు కాదంబరి, కాళిదాసు మేఘసందేశం అనువాదాలు స్ఫురణకు రావచ్చు. అయినా, ఆంద్రప్రభ సచిత్ర వార పత్రిక సంపాదకుడిగానే ఆయన సుప్రసిద్ధులు. విద్వాన్‌ విశ్వం మొదట సంస్కృత ప్రాకృతాలను లోతుగా అధ్యయనం చేసి తర్వాత ఉపాధ్యాయుడుగా స్థిరపడకుండా, రాజకీయ ప్రవేశం చేసి అటు తర్వాత పాత్రికేయుడుగా సంపాదకుడుగా మన్నన పొందారు.

పత్రికా రచయితగా విశ్వం సామర్ధ్యాన్ని, సృజనను ఆయన శీర్షికా వ్యాసాల ద్వారా చాలావరకూ బేరీజు వేసుకోవచ్చు. అయితే సంపాదకుడుగా ఆయన ప్రతిభ బోధపడాలంటే వారి నిర్వహణలో ఎటువంటి శీర్షికలు ప్రారంభమయ్యాయి, వాటి వస్తు సంవిధానాలు, అలాగే వాటి రచయితల ఎంపిక ఏవిధంగా ఉండేవో ఆయా సంచికలను సూక్ష్మదృష్టితో అధ్యయనం చేస్తే తప్ప బోధపడదు. నిజానికి తెలుగు పత్రికారంగంలో విశ్వం మాణిక్యవీణ కాకుండా మరో రెండు వీణలు ఉన్నాయి. గోరా శాస్త్రి వినాయకుని వీణ వాయించగా బాలాంత్రపు రజనీకాంతరావు విశ్వవీణను సవరించారు.

క్రీస్తుశకం 603 నుంచి 648 వరకు పాలన చేసిన శ్రీ హర్షవర్ధనునకు కృషి సమకాలికుడు అయిన ఆస్థానకవి బాణుడు. బాణుడు రచించిన ‘కాదంబరి’ మహా కావ్యాన్ని విద్వాన్‌ విశ్వం గారు తెలుగులో అందించారు. దానితోపాటు కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్రకు విశ్వం గారు అనువాదాలు చేశారు.

దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. తెలుపు-నలుపు శీర్షికలో విశ్వం భాష గురించి, పలుకుబడుల గురించి చేసిన చర్చ అప్పట్లో సాహిత్యవేత్తల్లో గొప్ప ఆసక్తిని రేపింది.

రాయలసీమ గత వైభవానికి గర్విస్తూ దాన్నే స్తుతిస్తూ ఆగిపోలేదు విద్వాన్‌ విశ్వం. విశ్వానికి – వల్లంపాటి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించినట్టు – ఆ కీర్తి పట్ల పలవరింతగానీ, వెర్రి వ్యామోహం కానీ లేవు. అందుకే, పెన్నేటి పాటలో ఇలా అంటారు –

ఇది గతించిన కథ; వినిపింతునింక

నేటి రాయలసీమ కన్నీటి పాట

కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు

కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు      అని చాలా వాస్తవిక చిత్రాన్ని పాఠకులకు అందిస్తారు.

స్థూలంగా పరిశీలిస్తే మాత్రా చందస్సు, సూక్ష్మంగా గమనిస్తే పద్యం సొగసు కనబడడం పెన్నేటిపాట గొప్పదనం. నిజానికి పద్యానికి మాత్రా ఛందస్సు జోడించి కవి కొత్తబాట వేశారు. తిప్పతీగె, రేణుగంప, తుమ్మతోపు, చిట్గీత, తంగేడు, పల్లేరు గాయలు, గూబమూల్గు తీతువు, పాపరకాయలు వంటి పద ప్రయోగాలతో పూర్తి సజీవ చిత్రణతో విశ్వం కవిత సాగుతుంది. చాలా సాధారణమైన పదాలు పద్యంలో చేరి అలవోకగా కలిసిపోతాయి.

———-

(అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ  వారు ప్రచురించిన సాహితీ విరూపాక్షుడు  విద్వాన్ విశ్వం అన్న పుస్తకం నుండి కొన్ని విశేషాలు)

About డా. నాగసూరి వేణుగోపాల్

ప్రముఖ సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, డా నాగసూరి వేణుగోపాల్ గారు ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ లో ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. ఫిసిక్స్ లో ఎం.ఎస్సి, ఎం.ఫిల్ చేసి అటుపై జర్నలిజం లో ఎం.ఎ, పి.హెచ్.డి ని చేశారు. వృత్తి రీత్యా తెలుగు సాహిత్యం పైన, సామాజిక అంశాలపైనా, విద్యావైజ్ఞానిక అంశాలపైనా కొన్ని వందల కార్యక్రమాలను నిర్వహించారు. విశేషించి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు వందకు పైగా రూపొందించారు.
ముప్ఫైకి పై చిలుకు పుస్తకాలను ఆయన వెలువరించారు. ఆ పుస్తకాలలో తెలుగు సాహిత్యం (విద్వాన్ విశ్వం, శ్రీపాద, నార్లబాట, సాహితీ వీక్షణం, వెలుగుజాడ మొ|| ). ప్రసార మాధ్యమాలు (ఛానెల్ హోరు – భాష తీరు, బుల్లి తెర విశ్వరూపం, వార్తామాధ్యమాలలో విశ్వసనీయత మొ|| ), పర్యావరణం (పర్యావరణం – సమాజం, ప్రకృతి – పర్యావరణం ), పాపులర్ సైన్స్ ( సైన్స్ దృక్పథం, శాస్త్రము- సమాజము, భారత వైజ్ఞానిక వైతాళికులు మొ|| ) , అనువాదాలు (అబ్దుల్ కలాం గారి ఇండియా 2020 మొ||) వంటి విభిన్న రంగాలను విస్తృతంగా శోధించారు. అనేక పత్రికలకు (ఎడిటర్లు ఏమంటున్నారు, విశాఖ ఉత్సవ్ మొ ||) సంపాదకులుగా కూడా వ్యవహరించారు.

డా|| నాగసూరి గారు ప్రముఖ దిన, వార, మాస పత్రికలకు తమ రచనలను అందిస్తున్నారు. ఈయన రచనలను, పుస్తకాలను పాఠ్యాంశాలుగా, పరిశోధనాంశాలుగా వివిధ విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకుంటున్నాయి . అనేక జాతీయ అంతర్జాతీయ సభలలో పాల్గొని పరిశోధానత్మక వ్యాసాలను అందించారు. పలుచోట్ల ఉపన్యాసాలు ఇచ్చారు.

వీరి బ్లాగు SPECTRUM.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

10 Responses to విద్వాన్‌ విశ్వం

Comments are closed.