సందె వేళ –
నే సిగ కట్టి, నువ్ చిట్టిచేమంతుల చెండు చుట్టి
మొగలేఱు అద్దంలో మనం – మురుసుకుంటూంటే..
ఫక్కుమన్న చుక్కల భరతం పట్టాలని – పరుగులు తీసే కోడెగాళ్ళం.
ఒకరి చేతుల మీద ఒకరంగా
జంట పిట్టలకు మల్లే.. గాల్లో తేలుతూ
పిల్లపక్షులకు ఈత నేర్పాల్సిన ఈడుగాళ్ళం
కన్రెప్ప పాటే జీవితం.
కలసి పంచుకునే సంతోషాలే – శాశ్వతం.
నలుపు తెలుపు ‘కల’నేత వస్త్రాలు ధరించిన దేహాలం మనం.
చీకటి చీలినప్పుడో..వెలుగు విరిగినప్పుడో..
ఎవరికి వారం ఒకరొకరంగా విడిపోవాల్సిన వాళ్ళం.
మనకంతా తెలుసు జీవన సారం. ఔనా?
మరి ఈ కాసిన్ని క్షణాలకే
తూర్పుకి తలపెట్టుకుని నువ్వూ, పడమరకి ముఖం తిప్పుకుని నేనూ..
ఇలా శతృశిలలకు మల్లే బ్రతుకుతున్నామెందుకనీ?
ఏమో, ఇపుడెందుకులే ఆ సంగతులూ..
పండగపూట అనుకోడాల్నూ !
ఒట్టు.
ఈ చలి కాలం నుంచైనా మనం.. సరికొత్త జంటలౌదాం.
పుష్యంలో రాలే నిశాపుష్పాల తడుద్దాం.
సంకురాతిరి సాక్షిగా –
పూటకో వెన్నెల పక్క
ఇంటెనక జొన్నమొక్క పక్క
కొండ మీద తళుక్కుమన్న వెండి చుక్క
నీ నవ్వే-
నా వలపు వాకిట బంతి పూ రెక్క.
కాలమొక కలం. ఆకాశాని కేది అంతం!
మనమధ్య మంచు తెరలు మాసాక, ఇక కథంతా సుఖాంతం.
ఇలా క్షణం క్షణం జీవితం – సంక్రాంతి సంబరం.
5 Responses to వెన్నెల మేనా..