ఆదివారం మధ్యాహ్నాలు

అదోలా వుంటాయి
ముందురోజు
హడావిడి మతలబులన్నీ
ముడి వీడి
కళ్ళ మీద మత్తుగా

వాలుతుంటాయి,
యుద్ధానంతరం సాగే
విరామంలా తోస్తూనే

మరో మహాసంగ్రామానికి
సిద్ధమయే భ్రమలో

అదోలా వుంటాయి

ఆదివారం మధ్యాహ్నాలు!

అంత వెలుగులోనూ
నలుపూ తెలుపుల్లో
నలిగిన
ఛాయాచిత్రపు లోతుల్ని

గ్రహించలేనంత తీరిగ్గానూ,
సగంలో ఆపబడిన పుస్తకంలా
సుదీర్ఘంగానూ సాగుతుంటాయి,
గుమ్మం ముందు
ఎండ పొడలో అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు!
ఆకులు కదలవు
గాలి వీచదు
సందేహాత్మక నిశ్చలత్వాన్ని
ఆపాదించుకుని
ఆరుబయట అంతా
అదో మాదిరిగా వుంటుంది
కనిపించని వేడిని వెంటేసుకుని

సమాధానపడని
ఓ నగ్నజ్ఞాపకంలా
గుండెని సర్రున కోస్తూ,

స్రవిస్తున్నదేమిటో
భారమో…భావమో

తెలీకుండా!

నిజంగానే….

అదోలా వుంటాయి

ఆదివారం మధ్యాహ్నాలు!

About రామినేని లక్ష్మితులసి

లక్ష్మీతులసి రామినేని, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, కుటుంబంతో చికాగోలో ఉంటున్నారు. కవితలు చదవడం-వ్రాయడం, పెయింటింగ్, సంగీతం వినడం, స్నేహితులతో గడపడం వీరి హాబీలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

8 Responses to ఆదివారం మధ్యాహ్నాలు

  1. Pingback: ఈమాట » మూడు లాంతర్లు -11

Comments are closed.