అత్తరు గానాలు

[dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]గా [/dropcap] యమైన గుండే గజలౌతుంది

విషాద గానాల ఖజానా అవుతుంది.

 

నడుచుకుంటూ పోయే కాలపు నల్ల నీడల దారులు

కన్నీటి పైన మాయమయ్యే అలల అడుగులు

సప్త వర్ణాల తనువుల మబ్బు వస్త్రాలు

నిశ్శబ్ద నీరవాలు – గజళ్ళు.

 

నువ్వెళ్ళిపోయిన దారి మలుపులు

తారట్లాడే చీకటి వెలుగుల చారలు

మెలిపెట్టే జ్ఞాపకాల ఆనవాళ్ళు

గొంతు కొసల చిట్లిన జీరలు – గజళ్ళు

 

నీ అరిపాదాల అద్దకాల ముద్రలు

ఎదకెత్తుకున్న మట్టిజన్మ జాడలు

వలపు పరిమళాల విలాపాలు

పగిలి రాలిన మొగలిరేకుల గుత్తులు – గజళ్ళు.

 

నీ తలపుల తెమ్మెర తెరలు వీచి

మత్తైన విషాదపు పువ్వులు విచ్చినపుడు

కనులలొలికిన కన్నీరుబుడ్డి జల్లి పొయే

మధుర వేదనా అత్తరులు

– గజళ్ళు.

 

ఎడబాసిన కరకుతనపు కరవాలాలు

హృదయ కుత్తుకని మెత్తగా నొక్కుతున్నప్పుడు

మడత పడ్డ ప్రాణాలు మెలికలు పోతుంటే

గాలి – నా బాధను పాడే గానాలు గజళ్ళు.

 

సఖా!

నువ్ వెనుదిరిగేసరికి నే వుందునో లేనో..

అందుకే ఇక్కడ గుమ్మరించి పోతున్నా

నీకై నిశ్శబ్దించిన నా గుండె చప్పుళ్ళు

– గజళ్ళు

 

About ఆర్ దమయంతి

దమయంతి గారు 25 కవితలు, 50 కథలు రాశారు. కానీ, ఎప్పటికప్పుడు రచనలకు కొత్తేనని చెప్పుకుంటారామె. చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువ ఇష్టమైనది- మొదటిది అనే దమయంతి గారికి కొన్ని పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం వుంది.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

12 Responses to అత్తరు గానాలు

Comments are closed.