మన పిల్లలు కొందరు-
పాటల పోటీలో ఓడిపోయి లక్షలమంది చూస్తుండగా టీవిలో ఏడుస్తారు,
రేపు పరీక్ష ఫలితాలు రాబోతుంటే రాత్రికి ఇంట్లోంచి పారిపోతారు,
మనలో ఒకడు –
ఉద్యోగం పోతే తనతోపాటు కుటుంబ భవిష్యత్తుకీ విషమిస్తాడు.
ఒకమ్మాయెవరో – అన్నీ ఉన్నతనంలోనుంచి వచ్చిన నిర్లిప్తతతో డిప్రెషన్లోకి వెళ్తుంది.
నాన్న డబ్బులతో స్నేహాల్ని పెంచుకుని మరొక కుర్రాడు డీ-ఎడిక్షన్ సెంటర్లో చేరతాడు.
—
కొన్ని సార్లు కొందరం –
మనం ఆశించినట్టు మరొకరు ఉండకపోతే పిచ్చివాళ్లమైపోతాం,
నాదనుకున్నది నాది కాక మరెవరిదీ కాకూడదని మొండి పట్టు పడతాం.
బలంతోనో, కన్నీళ్లతోనో సొంతవాళ్లనే మానసికంగా యాతనపెడతాం.
_______
ఇదంతా అసహజమో, అవాంఛనీయమో అనలేము. అనివార్యం అని మాత్రం ఒప్పుకోవాలి. కొన్ని సమస్యలకి పరిష్కారాలు తోచవు. మరికొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. అలాంటప్పుడు ప్రశ్నల్ని తెలుసుకోవడమే పురోగతి. అలాంటి ఒక ప్రశ్న అప్పుడప్పుడూ మనకి మనం వేసుకుంటూ ఉండాలి –అసలు మనమిలా ఎందుకున్నాం?
ఆవేశంలో, ఇతరులతో సంబంధాల్లో ఎంత హుందాగా స్పందిస్తున్నాం?
మనమేమిటో తెలుసుకునే ముందు మనమేం కాదో అర్ధం చేసుకుంటున్నామా?
కొత్త ఏడాదుల్లో సంతోషాల్ని మాత్రమే అకాంక్షిస్తూ షడ్రుచుల నిండుదనానికి దూరమౌతున్నామా?
ఏమాత్రం సంక్లిష్టత లేకుండా ’ఫలానా’ అని నిర్వచించదగ్గ వ్యక్తిత్వం బహుశా ఎవరికీ ఉండదు. సహజంగా కొత్తవిషయాలంటే భయపడే మనిషి ఒక దశలో జీవితంలో కొత్తదనం లేకపోవడాన్నిభరించలేకపోవచ్చు. అది మరొకరకమైన నిర్లిప్తతగా మారి మానసికంగా బలహీనుణ్ణి చెయ్యవచ్చు.
———————
ఒత్తిడితో, ఒంటరితనంతో, లక్ష్యాల బరువుతో అయోమయంలోపడుతున్న నేటి పిల్లల విషయం మాట్లాడుతూ ఒక స్నేహితుడు అన్న కొన్ని మాటలు;
"మన చిన్నప్పుడు సాలెపురుగు గూడు అల్లడాన్ని, వాన పడినప్పుడు వానపాముల్నీ, గడ్డి మొలవడాన్నీ, పూలు పూసిన దగ్గరనుండీ అవి కాయలయ్యే క్రమాన్ని దగ్గరుండి గమనించాం. బంకమన్నుతో బొమ్మలు చేశాం. ఉదయం తూరుపుదిక్కున వెలుగును చూశాం. రాత్రిళ్లు చుక్కలు చూసి ఆనందాతిశయాలకు, భయానికి లోనయ్యాం. అది సప్తర్షిమండలం, అది అరుంధతి, ఆ మూడు చుక్కలను తోడుదొంగలంటారు, ఇది గురుగ్రహం , దీన్ని గుడ్డిసుక్క అంటారు అని అబ్బురపడ్డాం. ప్రకృతికి మనం కాస్తంత దగ్గరయ్యాం, కానీ ఇప్పటి పిల్లల సంగతేంటి? అసలిప్పుడు ఆకాశాన్ని చూడటమే కుదరదు మనకు, అపార్టుమెట్లమధ్యల్లో patchలుగా కనిపిస్తుందది. వాన ముసురు ఒక పక్కనుండి కమ్ముకురావడం అంటే ఏమిటో మన పిల్లలు చూడలేరేమో.
దీని వల్ల నష్టాలున్నాయి; విలువ కట్టలేనంత తీవ్రమైన నష్టాలు. పోటీ తప్పించి, సాటి జీవుల పాట్లు తెలియవు పిల్లలకు. ఒక ముదుసలి కాళ్లూచేతులు కూడదీసుకొని మెటికలు పటపటా సద్దుచేస్తుండగా కష్టంమీద లేచి నిలబడటాన్ని మనం చూశాం. ఇప్పుడా సమయం ఎవరికుంది? లేనప్పుడు, ఆ ముసలి వ్యక్తి కష్టాన్ని , అతని జీవితానుభవాన్ని గౌరవించే సంస్కారం మనకెక్కడనుంచి వస్తుంది?"
——————————-
ప్రస్తుత యువతరం అనుభవిస్తున్న చాలా మానసిక సమస్యల్లో – ప్రేమ లేదనీ, చాలదనీ, ఒకవేళ ఉంటే అక్ఖర్లేదనీ గందరగోళంలోపడి తెచ్చుకునే గొడవలెక్కువ. ప్రేమని క్రియాశీలకంగా జీవితాల్లో నింపడం కన్నా ప్రేమిస్తున్న సంగతిని బయటికి చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెడితే ’ప్రేమ’ ఒక మాట/పదంగానే మిగుల్తుంది. ప్రేమ పేరుతో ద్వేషాన్ని, కెరీర్ అనుకుని కొరివిని తలమీద పెట్టుకుంటున్న యువత గురించి అనుభవజ్ఞులొకరు ఇలా అన్నారు:
"ఇప్పటి యువతరం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంది. చిన్నప్పటినుంచీ ట్యుటోరియల్ షాపుల్లోనూ, ఆపైన ఎందుకూ కొరగాని కమర్షియల్ కాలేజీల్లో ఏళ్లకేళ్ళు గడిపేసి, ఏ రకమైన విలువలనీ, ఆలోచించటాన్నీ నేర్వలేక, ప్రపంచంగురించీ, మనుషులగురించీ, సమాజం గురించీ ఏమీ తెలుసుకోకుండా, తెలుసుకోవాలన్న కనీస ఆరాటం కూడా లేకుండా, బోలెడు జీతాలు వచ్చే ఉద్యోగం అనే బండచాకిరిలో కుదురుకుంటారు. పెంచిన పెద్దలకికాని, చుట్టుపక్కల పెద్దరికం నటించే నక్కలకిగానీ ఈ పిల్లలు అనుభవిస్తున్న స్పిరిచ్యువల్ బాంక్‌రప్ట్సీ అసలు ఏమీ తెలియదు. వీళ్లని అప్పుల చట్రంలోకి నెట్టేస్తారు, లేదా వీళ్ళే ఇంకో తెలిసీ తెలియని, అర్థంపర్థంలేని, ఏగాలి ఎటువీస్తే అటు ఊగిసలాడే అభిప్రాయాలనే ప్రేమ అని నమ్మి పెళ్ళిళ్ళు చేసుకొంటారు.
They are the most lonely, they are not anchored by any valuable upbringing, and their courage lacks conviction.
ఉద్యోగంలో సమస్యలు, చదివే చదువొకటి, చేసే పని మరొకటి. పెళ్ళైతే ఎంత సేపూ అహాల సంఘర్షణలే కాబట్టి అభిప్రాయభేదాలు. వాటిని తప్పించుకోటానికి కెరీర్ లోనికి నత్తగుల్లల్లా ముడుచుకుపోవడం — గట్టిగా ముప్పై రాకుండానే బతుకు బరువైపోయిన ‘ప్రొఫెషనల్’ కి ప్రతీకలు వీళ్ళు."
——————————
తన ఆశలకి, అవకాశాలకీ మధ్య దూరం పెరుగుతున్నప్పుడు,
నమ్మిన విలువలకి ప్రవర్తనకీ మధ్య సమన్వయం కుదరనప్పుడు,
తనని తాను సమర్ధించుకోలేని, సమాధానపరుచుకోలేని అసమర్ధత మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఈ సందర్భాల్లో తన గొప్పతనం మీద మితిమీరిన విశ్వాసం కంటే తనలోని సాధారణత్వం పట్ల స్పృహ ఉండటం అవసరం. కొన్ని తప్పనిసరి సంఘటనలు అప్పటికే మనతోఉన్న గొప్ప వస్తువుల ఉనికిని తెలియజేస్తాయి.ఒక చిన్నపాటి ఎడబాటు రోజూ అతిమాములుగా చూసే సంబంధాలకి గొప్ప విలువని అపాదించవచ్చు.ఘాటైన విషాదం ఒకటి అంతవరకూ ఉన్న జీవితంలోని కులాసాని సూచించవచ్చు.
ఏ భాషలో ఐనా పదాల మధ్య వ్యాకరణం ఉంటేనే అవి అర్థవంతమైన వాక్యాలౌతాయి. భాషకి వ్యాకరణంలానే మానవ సంబంధాల మధ్య సంస్కారం అర్థాన్నిస్తుంది. అహం, వ్యక్తిత్వం, గుర్తింపు, ఒంటరితనం… ఈ విడిపదాలన్నిటిని సమన్వయపరిచే వ్యాకరణం సంస్కారం. ఉదాత్తమైన మిగతా అన్ని ఆశయాల్లానే మానవ సంబంధాల్లో, మానసిక స్పందనల్లో సంస్కారం కోసం సాధన సాగుతూనే ఉండాలి. కొన్ని రోజులో, కొన్ని సందర్భాల్లోనో మాత్రమే కాదు… మనిషి ఉన్నంత కాలం, మెరుగైన మనిషిగా బతకదల్చుకున్నంతకాలం.
————————XXXXXXXXXXX———————
*సిముర్గ్ గారికి కృతజ్ఞతలతో
చాలా బావుంది. కృతఙ్ఞతలు.
మంచి విషయం లేవనెత్తారు. టీవీ, వీడియోగేమ్స్, సినిమాలు లేకపోతే పిచ్చి కామిక్స్ తప్ప వేరే సామాజికకార్యక్రమాలలో పాల్గొనకుండా ముట్టుకట్టల్లా పెరుగుతున్నారు పిల్లలు. మిష్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో విశ్వనాథ్ చెప్పినట్లు, పెళ్ళికెళ్ళి, ఎవరి ఫోనులు, లేప్‌టాపులతో వాళ్ళు గడిపేస్తుంటే మానవసంబంధాలిలాగే ఉంటాయి.
మంచి విషయం లేవనెత్తారు. టీవీ, వీడియోగేమ్స్, సినిమాలు లేకపోతే పిచ్చి కామిక్స్ తప్ప వేరే సామాజికకార్యక్రమాలలో పాల్గొనకుండా ముట్టుకట్టల్లా పెరుగుతున్నారు పిల్లలు. మిష్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో విశ్వనాథ్ చెప్పినట్లు, పెళ్ళికెళ్ళి, ఎవరి ఫోనులు, లేప్‌టాపులతో వాళ్ళు గడిపేస్తుంటే మానవసంబంధాలిలాగే ఉంటాయి.
-“నాలుగు వందల సంవత్సరాల కింద ఒక రోజున మనమంతా ఉన్నా ఇదే మాట మాట్లాడి ఉండే వాళ్ళం అప్పటి నవ యువతరం గురించి.”
ఒక్క తేడా మాత్రం ఉంది. ఈ కాలంలో సామాజిక మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి (భారతదేశంలో).నా చిన్నతనంలో ఆంధ్రులు ఆరు కోట్ల మంది. ఇప్పుడు పది పైనే. కొత్తగా వచ్చిన నాలుగు కోట్లూ ఒకింత తీవ్రమైన మార్పులనే చూశారు వారి జీవితాల్లో. కాబట్టి వాళ్ళలో “ఇలా ఎందుకున్నారు?” బాపతు వారి శాతం ఎక్కువే.
“మనమిలా ఎందుకున్నాం?” అనే ప్రశ్నకు నా సమాధానం “మన తల్లిదండ్రుల వల్ల, మన గురువుల వల్ల, మన చుట్టూ ఉంటూ వచ్చిన సమాజం వల్ల, అతి సహజంగా వచ్చే మన సంస్కారం వల్ల”.
ఏ కాలంలోనైనా సరే తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. ఈ మధ్యనే ఒకరి చిన్నిపాపతో నేను “బూచి” అని దాగుడు మూతలు ఆడితే, ఆ పాప తెల్లబోయి చూసింది. వాళ్ళమ్మ “అంకుల్ పీక్-అ-బూ చెబుతున్నారు” నాన్నా అని పాపకు అర్థమయ్యేట్టు చెప్పింది. పాప తుమ్మగానే “బ్లెస్ యూ బేబీ” అని కూడా దీవించింది. ఆ తల్లిదండ్రులే రేపు ఆ పాప ఏ తెల్లవాణ్ణో పెళ్ళి చేసుకుంటే తెల్లబోతారు. పొద్దులో సుదీర్ఘమైన వ్యాసాలు రాయబోతారు. పాప మాత్రం తికమక పడిపోతుంది. అదీ సంగతి!
very nice article
కారణం. పెద్దల దురాశ, పిల్లలను అతిగారం చేసి కొండమీద కోతినడిగినా తెచ్చివ్వడం. పిల్లలను ఎలా పెంచాలో తెలియక మేము అఫర్డ్ చెయ్యగలిగినప్పుడు అడిగిందల్లా ఇస్తా మనుకోవడం వల్ల పిల్లలు నో అనేది భరించలేని స్థితి కి రావడం. అందుకే వుడ్ బి పేరెంట్స్ కు కౌన్సెలింగ్ అవసరం.
“ఒక చిన్నపాటి ఎడబాటు రోజూ అతిమాములుగా చూసే సంబంధాలకి గొప్ప విలువని అపాదించవచ్చు.” బావుందండి. చాలా చిన్న వాక్యంలో పెద్ద బావాన్ని పలికించారు..!!
ayya naa vayasu 60+.choodabote maa taram talli tandrule parama durmargamuga kanipistunnaru.maa chinappudu chala saada seedaaga batukulu
gadipi(ante aatte dabbulu leka vunnadi naluguru tobuttuvulato punchukovalasi
vachhi) biddalandariki ee taramlo dabbulu vunte anni vunnatte anabade oka
verri munda samskaram alavatuchesaru.daani phalitaanni anubhavistunnamu.
kanisam grand children ki ayina oka vemanapadyam oka chandamamakatha
oka chakkani telugu paata vinipichhi chastunnama? neevu eadi vittite ade’ panta
gadaa nuvvu pondedi.kaniyyandi a amerika vaado atombomb vesi sarva naasanam cheyyada manuku tirigi manchi buddhi ravataniki……aavedanato