మతాల స్వరూపాలు

మతభావనలు, మనిషికీ నరవానరానికీ తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే భావించవచ్చు. ప్రాథమికస్థాయిలో, సముదాయాలుగా గుహల్లో తలదాచుకుని, వేటాడుతూ బతికిన ఆదిమానవులకు ఆహారసేకరణ అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాపకంగా ఉండేది. ఏదైనా జంతువును మాటువేసి చంపగలిగినప్పుడు వారికి ఆ జంతువుపట్ల కృతజ్ఞతాభావం కలిగేదేమో. తమ కడుపులు నింపి, తమ ప్రాణాలు కాపాడిన ఆ ప్రాణి తమను భవిష్యత్తులోకూడా 'కరుణించాలని' వారు కోరుకోవడంలో ఆశ్చర్యంలేదు. ప్రాంతాన్నీ, తెగనీబట్టి ఒక్కొక్క జంతువు ఆదిమానవులకు పూజనీయంగా తయారయింది. ఇప్పటికీ పాతపద్ధతులను విడనాడని చాలా ఆటవికతెగలకు చిహ్నాలుగా టోటెమ్ జంతువులు కనిపిస్తాయి. వారు వాటిని ఆరాధిస్తారు. తమ తెగకు వాటిని గుర్తుగా భావిస్తారు.
 

తరవాతి దశల్లో ఇటువంటివాటి విగ్రహాలను తయారుచేసి పూజించడంకూడా మొదలయింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇలా ఒకొక తెగకీ ఒకొక జంతువు ప్రతినిధి కావడం, ఈ తెగలమధ్య పోటీలు పెరిగి కొట్లాటలు జరగడం ఆరంభమయింది. ప్రాచీనమతాలలో ఒకటైన యూదుమతంలోనూ, ఆ తరవాత వచ్చిన ఇస్లాంలోనూ ఈ విగ్రహారాధనను గర్హించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది దైవశాసనాలను తీసుకొచ్చిన మోసెస్ అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా భగవంతుడనేవాడికి రూపం ఏదీ ఉండదని చెప్పవలసివచ్చింది. ఎందుకంటే ఎటువంటి రూపాన్ని ఆమోదించినా కొందరికి సంతోషమూ, తక్కినవారికి ఆగ్రహమూ కలిగే ప్రమాదం ఏర్పడింది. నిత్యమూ చిహ్నాల పేరుతో కయ్యాలకు కాలుదువ్వే తెగలన్నిటినీ ఏకం చెయ్యడానికి 'నిరాకారుడైన' భగవంతుణ్ణి నిర్వచించడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.
 

మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండేవి. కాని పురోహిత, అర్చక, ఋత్విజుల వర్గాలు ఈ సమస్యను మరొక పద్ధతిలో పరిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు శివుడినో, పశుపతి నాథుణ్ణో ఆరాధించేవారు సర్పాలను ఆరాధించేవారితో పోట్లాడకుండా ఉండడానికి పాములను శివుడి మెడలో వేశారు. అలాగే ఎద్దును శివుడికి వాహనం చేశారు. ఈ విధంగా విడిగా ఉన్న తెగలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రాచీనకాలంలోనే విజయవంతంగా జరిగాయి. మరొకవంక ఆదిశక్తిని స్త్రీరూపంలో పూజించే సంప్రదాయం, శివుడితో వైరం పెట్టుకోకుండా ఆమెను శివుడి భార్య అన్నారు. రానురాను ఈ కుటుంబం మరింత విస్తరించడంతో వినాయకుణ్ణి (ఏనుగును ఆరాధించే తెగ) వాళ్ళ కొడుకుగా పేర్కొన్నారు. దక్షిణాదిలో ఎప్పటినుంచో ఆరాధిస్తున్న వేల్ మురుగన్ (కుమారస్వామిని) మరొక కుమారుడన్నారు. హిందూసంప్రదాయంలో పాతనమ్మకాలను త్యజించడం అనేది ఎప్పుడూ, ఎక్కడా జరగదు. ప్రాచీనకాలపు నమ్మకాలన్నిటికీ ఏవో భాష్యాలూ, వివరణలద్వారా కొనసాగించడమే కనబడుతుంది.
 

ఆర్యభాషీయులు క్రీ.పూ. 1400-1200 ప్రాంతాల సింధునది ప్రాంతాలకు వచ్చినప్పుడు వారు ఆరాధించినది తమ ప్రాణాలు కాపాడే అగ్నినీ, ప్రకృతిదేవతలైన వరుణుడినీ, సూర్యుడినీ (మిత్రుడు) మాత్రమే. ఆ తరవాత వీరి ప్రాధాన్యత తగ్గింది. ఆర్యభాషీయులకు సమకాలికులుగా మన దేశానికి వచ్చి, ఏవో అభిప్రాయభేదాల కారణంగా తిరిగి వెళ్ళిపోయిన ఇండోఇరానియన్ భాషీయులు ఋగ్వేద కాలానికి చెందిన పార్శీ మతగ్రంథం జెంద్ అవెస్తా రాసుకున్నారు. అందులో అసుర శబ్దానికి చాలా గౌరవం ఉండేది. సృష్టికర్తను అహురమజ్ద అనేవారు. వారికి దైవ అనే శబ్దం పాపిష్టిది. మన దేశంలో స్థిరపడ్డవారు మాత్రం ఈ పదాలకు వ్యతిరేకార్థాలు ఆపాదించుకున్నారు. జెంద్ అవెస్తాలో మహనీయుడుగా పేరు పొందిన జొరాస్టర్ (జరతుష్ట్ర) కశ్మీరుకు చెందినవాడనీ, అతన్నే మనవాళ్ళు వశిష్ఠుడంటారనీ కొందరి అభిప్రాయం.
 

ఆర్యభాషీయులు మన దేశంలో స్థిరపడ్డాక వారికి ఇంద్రుడు గొప్ప దేవత అయాడు. కాని కొంతకాలానికి వేటమీదా, ఏరుకుతినడంమీదా మాత్రమే ఆధారపడిన ఆ ప్రజలు ముందు పశుపాలననూ, ఆ తరవాత వ్యవసాయాన్నీ వృత్తిగా స్వీకరించారు. ఆ దశలో ఇంద్రుడి ప్రాభవం తగ్గి 'గోపాలుడైన' కృష్ణుడికీ, 'హలధరుడైన' బలరాముడికీ ఆదరణ పెరిగింది. అంతేకాక అడుగడుగునా ఇంద్రుడు కృష్ణుడి చేతిలో పరాభవం చెండడం చూస్తాం. ఇదంతా అప్పటి సమాజంలో తలెత్తిన మార్పులకు ప్రతిబింబంలాగా అనిపిస్తుంది. క్రీ.పూ.2400 ప్రాంతాల మొదలైన సింధునాగరికత నాటినుంచీ ఉన్న శివుడి ఆరాధన మటుకు కొనసాగింది.
 

అతిప్రాచీనదశలో హిందూదేవతలమధ్య తలెత్తిన విభేదాలు ఏనాడో సమసిపోయాయి. మళ్ళీ క్రీ.శ. ఎనిమిదోశతాబ్దం తరవాత వైదిక, అర్చకవర్గాలకు మాత్రమే పరిమితంగా ఉండిన భగవదార్చనకు ప్రజాస్వామిక లక్షణాలు ఏర్పడ్డాయి. క్రైస్తవమతంలో ఆ తరవాత జరిగిన పెనుమార్పులన్నీ మనదేశంలో ఎప్పుడో మొదలయాయి. వీరశైవులుగానూ, వైష్ణవులుగానూ బ్రాహ్మణేతరులు చాలామంది అధికసంఖ్యలో దేవతార్చనలు మొదలుపెట్టారు. కేవలం సంస్కృత మంత్రాలేకాక హిందీ, తమిళం, కన్నడం, తెలుగువంటి స్థానికభాషల్లో భక్తిగీతాలూ, పాటల రచన జరిగింది. పురాణాల అనువాదం జరిగింది. సమాజంలో అంతకంతకూ జరుగుతూవచ్చిన మార్పులు మతస్వభావాలను కూడా ప్రభావితం చేశాయి.
 

ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ ఏ మతంలోనైనా ప్రార్థన చేసే పద్ధతి ఆటవికదశనే తలపిస్తుంది. ఎక్కువగా దేవుడి పేరు తలుచుకోవడమే చూస్తాం. అది పిలుపే. ఎన్నో సార్లు పిలిస్తేగాని పట్టించుకోని సాటిమనిషిని పరిగణించినట్టే భక్తులు ప్రవర్తిస్తారు. సామాజిక కారణాలవల్ల తలెత్తిన జీవితసమస్యల పరిష్కారానికై 'ఆకాశంవేపు' చూడడం మనుషులకు అలవాటయింది. అలాంటి ప్రయత్నాలవల్ల ఫలితం ఉంటుందా అనే ప్రశ్నని పక్కనపెడితే దానివల్ల చాలామందికి మనశ్శాంతి కలుగుతుందనే విషయంలో సందేహమేమీ లేదు. పట్టణంలోని వ్యవస్థ సరిగా లేదని అధికారులకు విన్నవించుకున్న పద్ధతిలోనే భక్తులు ప్రవర్తిస్తారు. అతని 'దయ' ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. లేకపోతే లేదు. మన బాధ్యతల్లా విన్నవించుకోవడమే!
 

ఇదంతా మతభావనలను వెక్కిరించడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. సంగతేమిటంటే తక్కిన విషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తించేవారుకూడా మతం విషయంలో హేతువాదవైఖరిని విడనాడతారని మనం గమనించవచ్చు. అంతేకాక తాము స్వయంగా పరిష్కరించుకోగల ఎటువంటి సమస్యకూ వారు 'దైవసహాయం' కోసం ఎదురుచూడరు. తెలియనివీ, అస్పష్టంగా అనిపించేవీ, చిక్కుముడిలాగా తమనను సవాలుచేసేవీ అయిన కష్టాలు ఎదురైనప్పుడే ఈ భక్తి వెల్లడవుతుంది.
 

మనిషికి అనాదిగానూ, అనుభవపూర్వకంగానూ అలవడిన కార్యకారణసంబంధం మతం విషయంలో బలంగా పనిచేస్తుంది. 'ఎవరో ఒకరు తిప్పకపోతే' తారలచుట్టూ గ్రహాలూ, అణువులోని న్యూక్లియస్‌చుట్టూ ఎలక్ట్రాన్లూ ఎలా తిరుగుతాయి? ఏదైనా 'తనంతట తానుగా' ఉనికిలోకి వస్తుందనే భావనను చాలామంది జీర్ణించుకోలేరు. ఏ భగవంతుడు ఏ వర్క్‌షాప్‌లో కూర్చుని అన్నిటినీ సృష్టిస్తాడో ఎవరికీ తెలియనప్పటికీ అలాంటిదేదో జరుగుతుందని జనం నమ్ముతారు.
 

మనిషికన్నా శక్తివంతుడైన ఒక పాతకాలపు భగవంతుణ్ణి ఆమోదించలేని పాశ్చాత్యులు ’ఇదిగో పులి అంటే అదిగో తోక' అన్న పద్ధతిలో గ్రహాంతరజీవుల గురించీ, ఫ్లయింగ్ సాసర్ల గురించీ వదంతులు లేవనెత్తుతారు. తమతమ సంస్కృతీసంప్రదాయాలనుబట్టి తమను చుట్టుముట్టిన బాధలనుంచి విముక్తి ఎలా పొందాలో తెలియక జనం రకరకాలుగా భ్రమలకు లోనవుతారు. మరణించిన తరవాత ఏమవుతుందో తెలియక అయోమయానికి లోనవడం మరొక ఇబ్బంది. తక్కిన కీటకాలూ, జంతువులూ, సాధారణప్రజలేకాక కోట్లమంది జీవితాలను ప్రభావితం చేసిన 'యుగ పురుషులు' సైతం చనిపోయాక నామరూపాలు లేకుండాపోతారని తెలిసినప్పటికీ 'మరణాంతర జీవితం' గురించిన ఆశలు మనుషుల మనసుల్లో బలంగా పాతుకుని ఉంటాయి.
 

మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పథం అలవరుచుకోవటానికి ఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

21 Responses to మతాల స్వరూపాలు

Comments are closed.