సాలూరు చినగురువుగారు

సంగీతం ఎలా ఉండాలని ఆయన భావిస్తున్నారో చెప్పే కీర్తన ఒకటి శాస్త్రిగారు రచించారు. రాగ భావ స్వర రసపోషణ అనే కీర్తనలో శ్రవణానందం, శాస్త్రసమ్మతం కలిగిన సమ్యక్ గీతంగా సంగీతం ఉండాలని నిర్వచించారు.

ఇదివరకు ప్రసిద్ధమై ఉన్న రాగాలలోనే కాక ఒక కొత్తరాగాన్ని కూడా వేదిక్ రీసెర్చి పత్రికలోప్రకటించారు శాస్త్రిగారు.

స్మృతి రంజని రాగం అనే కొత్తరాగం 22మేళకర్త అయిన ఖరహరప్రియ జన్యమని, భాషాంగ రాగమని, ఔడవ సంపూర్ణరాగం మూర్ఛన సగమపనిస సనిదనిపమగరిస గా ఈ రాగలక్షణాలను చెప్పారు. దీనికి లక్ష్యంగా శాస్త్రిగారు రచించిన కీర్తన –

పల్లవి

ఇహపర సాధనమే ఓ మనసా

అను పల్లవి

విహితకర్మ బంధమున చరించుట

వేదస్వరూపునిగన మదినెంచుట

చరణం

రక్తి రాగ సాగరము తరించి వి
రక్తి యోగ మార్గము దరిచేరుట
శక్తిహీన మానవుదయ చూచుట
యుక్తి సాధనుని యొద్ద చేరుటయ

ఈ కీర్తన కొత్తరాగంలో కూర్చబడడమే కాక భావగాంభీర్యంతో, ఆధ్యాత్మికానందాన్ని వర్ణించిన గొప్ప సాహిత్యంతో రచించబడింది.

గానరసాన్ని ఏరీతిగా అనుభవించాలో అందులో గల ఆనందం ఎలా ఉంటుందో వర్ణించే గేయం –

పల్లవి

సరసగాన సుధా సరసిని బడివడి
జలకములాడగరారా

అనుపల్లవి

హాసముతో సువిలాసముతో ఉ
ల్లాసముతో -దరహాసముతో – పరిహాసముతో
మిసిమి జవ్వనుల మేళనతో బల్
“సరసగానసుధాసరసిని బడివడి”

చరణం

తొలకరి మెరపుల తళుకుల కళలను
కలకలరవముల నింపరా ఆహా
పులకలతో మైపులకలతో మరు
ములుకులతో సరి పలుకులతో
నెలతల కనుగవ మెలపులతో
వయ్యా రముతో సయ్యాటలతో
“సరసగానసుధాసరసిని బడివడి”

కాపిరాగంలో చతురశ్రంలో కూర్చబడిన రక్తిని కలిగించే గేయం ఇది. భావగీతం వలె హుషారును కలిగిస్తుంది. దీనిని స్వరపరిచారు శాస్త్రిగారు. పల్లవి, అనుపల్లవి, చరణం ఈ గేయంలో ఉన్నాయి. జావళీ వలె కూర్చబడిన రక్తి గేయం ఇది.

సాధారణంగా జావళీ రచనలు శృంగార రస ప్రధానములై ఉంటాయి. ప్రేయసీ ప్రియుల శృంగారానికి సంబంధించినవిగా ఉంటాయి. గ్రామ్యభాషలో సుళువుగా పాడుకోవడానికి వీలయిన సాహిత్యంతో ఉంటాయి. ఆది, రూపక, చాపు తాళములతో రచింపబడినవిగా ఉంటాయి. పరకీయ అయిన నాయికకి సంబంధించినవిగా ఉంటాయి జావళీలు. సీతారామశాస్త్రిగారు స్వకీయ అయి గృహిణిగా ఉండే నాయికకు సంబంధించిన అంశాలతో సాహిత్యాన్ని కూర్చి జావళీ వంటి రచన చేసారు. జావళీలో ఒక కొత్త ప్రయోగం ఇది.

వగల వయ్యారి అదిరా…
ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా
అంటూ సాగే ఈ గీతంలో సాహిత్యం – సంసార జీవితంలో స్త్రీ గృహిణిగా భర్తను, అత్తమామలను, మరుదులను, ఆడపడచులను ఏవిధంగా ఆదరిస్తూ, అందరి అభిమానానికి పాత్రమవుతూ వ్యవహరిస్తుందో చమత్కారంగా వివరిస్తుంది.

జ్ఞానానందాశ్రమంవారి పత్రిక అమృతవాణిలో ‘శ్రీ పోతనామాత్యుడు-త్యాగబ్రహ్మ’ అనే వ్యాసాన్ని 1947లో వెలువరించారు. పోతనకు, త్యాగయ్యకు రచనలో ఉన్న భావసామ్యాన్ని చక్కగా వివరించిన వ్యాసం ఇది. సంగీత శాస్త్రానికి సంబంధించి శాస్త్రిగారు రచించిన వ్యాసాలు ఆనాటి పత్రికలలో ప్రకటించబడ్డాయి.

ఉపసంహారం

పరమ భాగవతోత్తములుగా భాసించే మన వాగ్గేయకారులు ఎంతో చక్కని రచనలు చేసి గానకళను అభివృద్ధి చేసారు. అటువంటివారి రచనలను అభ్యసించి, పదిమందికీ చెప్పి, సాధనతో వాటి మర్మాలను, సంగీతశాస్త్ర రీతులను గ్రహించి తనదైన శైలిలో సంగీత ప్రక్రియలలో ఇన్ని విధాలుగా రచనలు చేసారు సీతారామశాస్త్రిగారు. ఈ రచనలను కేవలం సాహిత్యంగా లిఖించడమే కాక, వాటిని సుస్వరంగా స్వరపరచి స్వయంగా సభలలో పాడి జనావళికి తన్మయత్వాన్ని, నాదానందములోని రససిద్ధిని అనుభవానికి తెచ్చారు.

చినగురువుగారు ఒకపద్యంలో సరస్వతీ దేవి ఒక్కొక్కరిని కవివరుని చేసి, గాయకప్రవరుజేసి గారవిస్తుందని అన్నారు. దేవి ఆయనకి ఆ రెండు వరాలు ఇచ్చి కటాక్షించింది. ఆ శారదాంబను శాస్త్రిగారు తల్లిగా భావించి నాదోపాసన అనే తపస్సు చేత మెప్పించి సంగీతామృతంతో పాటు, సారస్వత మకరందాన్ని కూడా వరప్రసాదంగా పొందారు. తన కవితా మకరందాన్ని, సంగీతామృతంతో కలిపి రసజ్ఞులైన శ్రోతలకు పంచిపెట్టారు. శరణాగతి మార్గాన్నివరించి శరణు ముఖజిత శశిబింబ శారదాంబ అని ఆ దేవిని స్తుతించారు. భక్తిజ్ఞాన వైరాగ్యమార్గంలో రచనలు చేసి, గానం చేసి పరమ యోగిలా జీవించారు.

అద్వితీయమైన గాయకుడిగా, అసమాన ప్రజ్ఞాశీలి అయిన సంగీత విద్వాంసుడిగా భక్తి, జ్ఞాన, వైరాగ్య భావాలను ప్రకటించే కీర్తనలు రచించి రసభావములకు అనుగుణ్యమైన తాళగత, స్వరగతులతో లయశుద్ధితో స్వరపరిచి ఒక నాదసిద్ధుడిగా భాసించి రసికులైన ప్రజల హృదయాలను గెలుచుకున్న సంగీతకారుడు శాస్త్రిగారు.

సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, స్వరరచనలో స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ పద్య, గేయరచనలు చేస్తూ, వాటిని పారవశ్యంతో గానంచేస్తూ వాగ్గేయకారుడిగా రామభక్తిలో తరించిపోయిన ఒక పోతన, ఒక త్యాగయ్య కలిసిన మూర్తిమంతంగా సంగీత సాహిత్య మేళవింపుగా కనిపిస్తారు -సాలూరు చిన గురువుగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు.

========================

వ్యాసం- ఆధారాలు-సంప్రదించిన గ్రంథాలు,వ్యాసాలు

1. “గురువుగారు”-పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు-వ్యాసం. (శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి జయంత్యుత్సవ సంచిక-శ్రీ సీతారామ, త్యాగరాజ నారాయణదాస మహోత్సవ కమిటీ,సాలూరు,1972.గౌరవ సంపాదకులు -పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు)

2. చింతాసక్తి – పట్రాయని సంగీత రావుగారి జ్ఞాపకాలు. (అముద్రితం)

3. ఎందరో మహానుభావులు-అజ్ఞాత సంగీత విద్వాంసుల అద్భుత జీవిత చిత్రాలు-తనికెళ్ళ భరణి.(హాసం ప్రచురణలు,2005)

4. ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు-సంగీత వాజ్మయం -డా.సి.విజయలక్ష్మి. మార్చి,2000.ప్రథమ ముద్రణ.

5. సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు – శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ఈమాట తెలుగు ఎలక్ట్రానికి్ పత్రిక
6. వ్యాసానుబంధం-కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ -ఈమాట ఎలక్ట్రానికి్ పత్రిక

7. రచయితగా మన ఘంటసాల-చీకోలు సుందరయ్య. ఈనాడు-సాహిత్యం.

8. పట్రాయని సీతారామ శాస్త్రి, వికీపీడియా వ్యాసం.

9. wapedia : Wiki : Patrayani Seetharama Sastry

10. వంకాయల నరసింహం గారి తెలుగు వ్యాసానికి పి.ఎస్.ఎస్.శాస్త్రి, పాండిచ్చేరి, గారి ఇంగ్లీషు అనువాదం

11. రాగయోగి సాలూరు చినగురువుగారు- పట్రాయని సంగీతరావు గారి వ్యాసం. పట్రాయని సీతారామశాస్త్రిగారి సంస్మరణార్థం సాలూరులో ఏర్పాటు చేసిన స్మృత్యంజలి కార్యక్రమం కోసం.

12. .నేనెరిగిన ఘంటసాల – సంగీతరావుగారు “ఇంటింటా ఘంటసాల” వారికోసం ఇచ్చిన ఇంటర్య్వూ-

13. .శ్రీ ఘంటసాల – పట్రాయని సంగీతరావుగారి వ్యాసం. విజయచిత్ర సినిమా పత్రికలో ఘంటసాల జన్మదినం సందర్భంగా.

14. .”నేనెరిగిన ఘంటసాల” – పట్రాయని సంగీతరావుగారి వ్యాసం. 2000సం.లో నమ్ టి.వి.లో ఘంటసాలగారి జయంతి సందర్భంగా .ప్రసారం.

15. Forgotten Father – వి.ఎ.కె. రంగారావు గారు పట్రాయని సీతారామశాస్త్రిగారి గురించి వ్రాసిన వ్యాసం.

16. ఘంటసాల భువన విజయము-1971 ముద్రణ. సం.వి.ఎ.కె.రంగారావు

—————————
పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు – హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు – ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు.

సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

Comments are closed.