సాలూరు చినగురువుగారు

సీతారామశాస్త్రిగారు అమ్మవారిని స్తుతిస్తూ సంస్కృతంలో ఒక స్వర జతిని వ్రాసారు. స్వరజతిలో పల్లవి, అనుపల్లవి, చరణం అంగాలుగా ఉంటాయి.
ఆ స్వరజతి –

పల్లవి

లలితే సరసగాన కళాశ్రితే సలలిత స్వరాంచితే
పంచమ స్వర రహితే సుచరితే భక్తగాయకాళి కంఠసహితే
సూర్యకాంత నామ రాగ జనితే సుందర షాడవ శ్రుతి ప్రకాశికే

అనుపల్లవి

మృదుల శృంగార రూప సహితే సదమలానంద భావపూరితే
సకల కళ్యాణ భాసురాయితే సరస భావరాగ ప్రసారితే

చరణం

మంజుల పుష్ప విరాజిత కేశే మంజీరారవ రంజిత పాదే
మణిమయ సువర్ణ భూషిత దేహే మామక మానసికాధివాసే

లక్షణగీతంలో చెప్పబడినట్టే ముందు రాగలక్షణం, అందులోని స్వరాలు, జన్యరాగం, ఔడవ షాడవ సంపూర్ణములలో జీవస్వరం దేనిని సూచిస్తోంది అన్న విషయాలను సాహిత్యంలో పల్లవిలో చెప్పారు. అనుపల్లవి చరణాలలో దేవి రూపాన్ని వర్ణిస్తూ కీర్తించారు. ఈ సాహిత్యాన్ని స్వరపరిచారు శాస్త్రిగారు.

శాస్త్రిగారి శిష్యుడు ఘంటసాలకు సంగీత సాహిత్య పరిపోషకమైన ఈ స్వరజతి అత్యంత ప్రియమైనది. ఘంటసాల ప్రప్రథమంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో గురువుగారి ఈ కీర్తననే ఆలపించారు. అంతేకాక, తాను సంగీత దర్శకత్వం వహించిన ‘సారంగధర’ చిత్రానికి టైటిల్స్ ప్రదర్శించేటపుడు నేపథ్యంగా కూడా ఈ కీర్తననే ఉపయోగించుకున్నారు. ఆయన శాస్త్రీయ సంగీత కచేరీలు చేసే రోజుల్లో కూడా ప్రార్థనా గీతంగా ఈ గీతాన్నిపాడి అమ్మవారిని స్తుతించి కార్యక్రమం ప్రారంభించేవారుట.

సంగీత శాస్త్రంలోని రాగాలలో బేగడరాగంపై తన ప్రియత్వాన్ని శాస్త్రిగారు ఒక పద్యంలో చెప్పారు.

తే.గీ.

ఎన్ననగు రాగజాతములెన్నొ రాగ
మండలమ్మున నుండిన నుండవచ్చు
గాక, రుచిమీరి జిగిమించు కళల నించు
బేగడా రాగమన పాలమీగడ కద

అని రాగాలన్నిటిలో అత్యంతమధురంగా పాలమీగడ వంటి రుచిని తలపించేదిగా బేగడ రాగాన్ని వర్ణించారు. ఈ రాగంలోనే శాస్త్రిగారు ఒక వర్ణాన్ని కూడా రచించారు. ఆ వర్ణంలో సాహిత్యం:

పల్లవి

నిన్నే కోరి యున్నదిర


అనుపల్లవి

చిన్నారి చిలుక
కన్నెడ సేయకా గోపాలా


చరణం

సరసకురా చలమేల తాళ జాలదుర

సాధారణంగా తానవర్ణములు చతుశ్రజాతి త్రిపుట తాళమునందుకాని, మిశ్రజాతి ఝంప తాళమునందు కాని, ఖండజాతి అటతాళములో మాత్రమే పూర్వులచే ప్రసిద్ధి చేయబడినవని, చతుశ్రజాతి రూపక తాళమందు వర్ణగ్రంథము కనిపించకపోవుట చేత, సాహిత్యానికి అనుకూలమైన తాళమగుట వలన ఈ వర్ణము రూపక తాళములో తాను రచించినట్టు శాస్త్రిగారు చెప్పారు.

శాస్త్రిగారి విరచితమయిన ఇతర కీర్తనలు-

హంసధ్వని – ఆదితాళంలో రచించిన ‘గణనాథ స్మరణా పావనా’

శంకరాభరణం – ఆదితాళంలో ‘కరుణించరా కరుణానిధే రామ’ ,

గౌరీమనోహరి – ఆదితాళంలో రచించిన ‘ గానము సేయరాదా ప్రణవగానము సేయరాదా’,

పంతువరాళి – ఆదితాళంలో ‘ జగదానందకరా శ్రీరామ’,

మధ్యమావతి – ఆదితాళంలో ‘ ప్రేమలేదా ఉమా సరస్వతి’,

వకుళాభరణం – ఆదితాళంలో ‘దరిసెనమిడరాదా’

పరమ భాగవతోత్తముడిగా శ్రీరాముడిని ఆరాధించిన త్యాగరాజస్వామి ఒరవడిలో సీతారామశాస్త్రిగారు శ్రీరాముడి గురించి రచించిన కీర్తనలు ఇవి.

సింహేంద్ర మధ్యమం – చాపు తాళంలో రచించిన ‘సుగుణ మణి గణ ఖచిత వీణా సుగుణ గాన వినోదినీ’

ముఖారి – ఆదితాళంలో ‘నాదానందమురా ఆహత నాదానందమురా’,

నాదచింతామణి – ఆదితాళంలో రాగభావ స్వర రస పోషణ

1934 లో ఓడియన్ గ్రామఫోన్ కంపెనీ వారు విడుదల చేసిన చినగురువుగారి కీర్తనలు

మొదలైన రచనలలో శాస్త్రిగారి భక్తి జ్ఞాన వైరాగ్యభావాలను దర్శించగలం. ఈ కీర్తనలన్నీ త్యాగరాజువారి కీర్తన సంప్రదాయమును అనుసరించి సంగీత శాస్త్ర సమ్మతమయన పద్ధతులలో రచించినట్టు శాస్త్రిగారు ప్రకటించారు.

1937 సెప్టెంబరులో వేదవిద్యా పరిషత్ వారి ఆంధ్రాంగ్ల పత్రిక వేదిక్ రీసెర్చి శ్రీ ఆకెళ్ళ సత్యనారాయణరావుగారి సంపాదకత్వంలో వెలువడింది. 1938 ఫిబ్రవరి నుండి, 1938 అక్టోబరు వరకు వెలువడిన 9 సంచికలలో శాస్త్రిగారు సంగీత సాహిత్య సమ్మేళనం అనే శీర్షికలో కొన్ని రచనలను ప్రకటించారు. సంగీత లక్ష్య, లక్షణ విశేషాలతో కూర్చబడి, స్వరపరచిన వర్ణ, కృతి, గేయ, స్వరజతి ప్రక్రియలలో తాను స్వయంగా రచించిన ఈ రచనలలోని గుణదోషములను విమర్శించి ప్రోత్సహించవలసినదిగా గానశాస్త్ర పరిశోధకులను అభ్యర్థించారు.

1934 లో ఓడియన్ గ్రామఫోన్ కంపెనీ వారు చినగురువుగారి కీర్తనలను రికార్డుచేసి విడుదల చేసారు.

వకుళాభరణంలో గానం చేసిన ‘దరిసెనమిడరాదా నీదగు దరిసెనమిడరాదా‘, మధ్యమావతి రాగంలో స్వరపరచిన ‘ప్రేమలేదా ఉమా సరస్వతి‘, కీర్తనలు ఈ రికార్డులో ఉన్నాయి. ‘స్టేజి సంగీతమే శ్రేష్ఠమనుచు నెంచి‘ అంటూ సభలలో గురువుగారు ఆ రోజులలో తరచుగా ఆయన పాడిన పద్యం, రెండువేపులా చేయబడిన రికార్డు. నేడు అది అలభ్యం.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

Comments are closed.