తన జీవితం మొత్తాన్ని తననుండి దూరంగా వీక్షిస్తూ పరమాత్మలో లీనం కావడానికి కావలసిన అర్హత సంపాదించుకొనే ప్రయత్నం చేయకుండా మంచి వయసు, శక్తి ఉన్న ప్రాయంలో కేవలం లౌకికసుఖాలకే ప్రాధాన్యం ఇచ్చిన తన ప్రవర్తనకు బాధ పడుతూ, దీనివలన సాధించినదేమిటని తనను తానే ప్రశ్నించుకోవడంలో ఆ శాశ్వతానందాన్ని పొందడానికి చేయవలసిన ప్రయత్నం గురించి వివేచించడం కనిపిస్తుంది.
ఏ జీవికైనా జన్మము, మృత్యువు అనే దశలు తప్పవు. కానీ జీవి తనకు తానై జీవితం నుండి, అది అందించే సుఖాలనుండి దూరంగా తొలగి పోవాలని మృత్యువును ప్రేమగా ఆహ్వానించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ జీవి మానసిక వేదనని గమనించిన వారికి ఎంతో దుఃఖం, బాధ కలుగుతాయి. వైరాగ్యానికి పరాకాష్టగా కనిపించే శాస్త్రిగారి ఈ పద్యం జీవుని వేదనని శోక రసంతో ఆవిష్కరిస్తుంది.
సీ.
ధన ధాన్య భోగ వర్తనము బాయకమున్నె భ్రామికంబులు వీడబడకమున్నె
దారపు త్రాది బంధనము ద్రెంపకమున్నె సంఘ సంపర్కముల్ సనకమున్నె
కరుణార్ద్ర హృదయంబు కఠినమొందకమున్నె కోర్కెలెల్లను కోసి కొనకమున్నె
అంత్రేంద్రియములెల్ల నణగి చావకమున్నె కష్టకాలమ్మును గనక మున్నె
తే.గీ.
దుష్టజాలంబు లెల్లను దొలగి పోవ
పాపకర్మంబులెల్లను బడలిపోవ
శాంతరసమెల్ల కాలంబు స్ధాయి గొనఁగ
మృత్యువా వేగవచ్చి కాన్పింపుమమ్మ
ప్రముఖ గాయకుడు, శాస్త్రిగారి శిష్యుడు ఘంటసాలగారిపై గురువుగారి ప్రభావం అపారం. ఘంటసాల జీవిత పర్యంతం ఆయన ప్రవర్తనలో నడవడికలో మాటతీరులో గురువుగారిని స్మృతికి తెచ్చే ఏవో లక్షణాలు కనిపించేవని ఇద్దరినీ ఎరిగినవారు భావించేవారు. పై పద్యాన్ని ఘంటసాలగారు తన కచేరీలలో తరచు ఆలపించేవారుట.
తరువాతి కాలంలో ఘంటసాల ప్రైవేటు రికార్డుగా ఇచ్చిన తన స్వీయరచన -మృత్యువంటే భయంలేని ఒక వ్యక్తి పాడుకున్న పాట అంటూ ఆలపించిన బహుదూరపు బాటసారీ గేయం పైన గురువుగారి గేయం ప్రభావం ఉందేమో అనిపిస్తుంది.
ఇలాటి వైరాగ్యమే కనిపించే మరొక పద్యంలో మానవులను సృష్టించిన బ్రహ్మ ఏప్రాణికి ఏ సుఖదుఖాఃలను రాసిపెట్టాడో తెలియదుకదా అని అంటారు శాస్త్రిగారు.
తే.గీ.
ఏ స్థలమ్మున ఏ ప్రాణికెప్పుడెట్టి
కష్టసుఖములు గలుగునో కమలభవుడె
వ్రాసి నుదురను పెట్టెలో భద్రపఱచె
వెలుపలను తోలు సీలుంట తెలియరాదు
బ్రహ్మ తాను ప్రాణుల నుదురుమీద వ్రాసిన విషయాలను నుదురు అనే పెట్టెలో పెట్టి బయట తోలుతో సీలు చేసాడట. అందుకే ప్రాణులకు ఎక్కడ సుఖం, దుఃఖం కలుగుతాయనే సంగతిని ముందుగా ఎవరూ తెలుసుకోలేముట. ఎంత చమత్కారమయిన భావం!
బతుకు గడపడంకోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ధనసంపాదన చేయవలసిరావడం, అందుకు ఉద్యోగమనే బానిస జీవితం గడపడం, తుచ్ఛమైనదని తెలిసినా డబ్బు కోసం వెంపర్లాడక తప్పని స్థితి సీతారామశాస్త్రిగారికి దుర్భరమైన వేదన కలిగించేవేమో! ఆయన పద్యాలలో ఈ వేదన కనిపిస్తుంది.
చం.
అనుభవమింత లేని పరిహాస విధాయక నీచకార్య సా
ధన రచనాదులన్ కుజన దాస్యముతో జతచేసి లోకమో
హనకర గానశాస్త్రమకటా వికటంబుల పాలు జేసి జీ
వనమును బుత్తువా దురిత భారము నెత్తిని మోసి మూర్ఖుడా
అని ఒక పద్యంలో స్వీయనిందకు పాల్పడతారు.
మరొక పద్యంలో సొత్తు కోసం తాను ఇంతగా పాటుపడవలసిన పరిస్థితి కల్పించిన భగవంతుడిని ఆక్షేపిస్తారు. అంతూ, దరీ కనిపించని దుఃఖసాగరంలో తనను తోసేసి, బాధలనే అగ్నులతో కాల్చేసి తనని పరీక్షిస్తున్న భగవంతుడిని కరుణతో దయచూసి రక్షించి చేరదీయవలసినదిగా ప్రార్థిస్తూ శరణు వేడుతారు.
మ.
దరిలేనట్టి విచార సాగరమునందా ద్రోసి బాధించి నా
చరితంబింతయు దుఃఖ వహ్నినిడి వ్రేల్చన్ జూచితే సొత్తుకై
అరరే యింతటి ద్రోహచింత తగునా హా పాహిమాం పాహిమాం
కరుణా సాగర మమ్ము బ్రోవుమిల రంగా దీన సంరక్షకా
ఉద్యోగధర్మం శాస్త్రిగారి ప్రవృత్తికి వ్యతిరేకం. స్వేచ్ఛగా, సంతోషంగా జీవితం గడపాలని ఆశించే తనలోని కళాకారుడిని ఉద్యోగం, కుటుంబం వంటి సంకెళ్ళతో బంధించడానికి చూడడం భగవంతుడి ద్రోహచింతనగా భావిస్తారు.
అంతలోనే-
శా.
శరణంటిన్ కడు దీనుడన్ జడుడనాశాపాశ బద్ధుండ వేరొ
క్కరు లేని దుఃఖితాత్ముడను నీవే నన్ను రక్షింపగా
తెరవూహింపకయున్నవే మరి ఏదీ దిక్కు తర్కింపగా
కరుణా సాగర మమ్ము బ్రోవుమిల రంగా దీన సంరక్షణా
అంటూ నీవేతప్ప ఇతఃపరంబెరుగ అనే శరణాగతి మార్గాన్ని అవలంబించి రక్షించమని ప్రార్థిస్తారు.
చం.
సరసత లేని కీర్తనలసంఖ్యలు పాడి సునాదలీననం
బెరుగక కంఠనాళముల నెత్తి బిగింపగనేల, భక్తితో
హరహర పాపనాశ భవహారి శివా మహదేవ శంకరా
సరగున బ్రోవుమంచు మనసా హరునెంచి తరింప జూడుమా
అంటూ ఆ పరమేశ్వరుని అత్యంత భక్తితో కీర్తిస్తారు. గానానికి పరమావధి సంగీతంతో మహాదేవుని స్మరించడంలోనే ఉందని గుర్తుచేస్తారు.
సీతారామశాస్త్రిగారి కృతులు -కీర్తనలు
సీతారామశాస్త్రిగారు అనేక కీర్తనలు రచించారు. కృతి, కీర్తన రెండూ కర్ణాటకసంగీత ప్రక్రియలే. అయితే కృతులు సంగీత ప్రధానంగాను, కీర్తనలు సంగీతంతో పాటు సాహిత్యం కూడా ప్రధాన భూమికగా ఉండి భావ ప్రధానంగా భక్తిరసంతో కూడి భగవంతుడిని కీర్తించేవిగా ఉంటాయి. శాస్త్రిగారు భగవంతుడిని భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములలో కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించారు. వాటిని స్వరపరిచేరు. వీటిలో కొన్ని శ్రీరాముడిని ఆరాధిస్తూ పరమ భక్తుడుగా కీర్తనలు రచించడం చూడవచ్చు. అంతేకాక వీటిలో సంగీత సంబంధమయిన లక్షణాలను వివరించే లక్ష్యరచనలు కూడా ఉన్నాయి. సంగీతంలో స్వరజతులు, వర్ణాలు, కీర్తనలు, కృతులు వంటి ప్రక్రియలలో రచనలు చేసారు.
సంగీతంలోనూ, నాట్యంలోను వర్ణం అనే ప్రక్రియకు చాలా ప్రాముఖ్యం ఉంది. రాగ స్వరూపాన్ని నేర్చుకోవడం కోసం సంగీతంలో వర్ణం ఉపయోగిస్తుంది. వర్ణాలు తానవర్ణాలు, పదవర్ణాలు ఉంటాయి. పదవర్ణాలు నాట్యంలో ఎక్కువగా కనిపిస్తాయి. తాన వర్ణాలలో పల్లవి, అనుపల్లవి, చరణం ఉంటాయి.
వీణకుప్పయ్యర్ వంటి విద్వాంసులతో ప్రసిద్ధి చేయబడిన వర్ణ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరిన్ని క్లిష్ట నియమాలను ఏర్పరుస్తూ కళ్యాణి రాగం ఆదితాళంలో శాస్త్రిగారు ఒక వర్ణ రచన చేసారు. షడ్జమ పంచమాలను విడిచి త్రిస్థాయిలలో రాగసంచారము చూపి, ఆవృత్తి చివర ఖండ మొదలైన జాతిమోరాలను అమర్చినట్టు చెప్పారు. చరణంలో మాత్రం షడ్జపంచమములను ఉపయోగించి రాగము సంపూర్ణము చేసి, రాగనామము చెప్పి, జంత్రగాత్రములు సాధన చేసే ప్రాజ్ఞులకు ఈ వర్ణము మిక్కిలి ఉపకరించునని తలచెదను అని ఈ వర్ణం గురించి చెప్పారు శాస్త్రిగారు. ఈ వర్ణాన్ని స్వరపరచి ఎందరో రసికులైన ప్రేక్షకులకు పరవశమయిన స్థితిని కలిగించి నాదానందములో కరిగించారు.
ఈ వర్ణం లోని సాహిత్యం –
పల్లవి
అనుపల్లవి
చరణం
సంప్రదాయాన్ని అనుసరిస్తూనే క్లిష్టమయిన నియమాలను విధించుకొని త్రిస్థాయిలలో రాగసంచారం చేస్తూ శాస్త్రిగారు ఈ వర్ణం ఆలపిస్తే సంగీత ప్రియులంతా ఆనందంతో పరవశించి పోయేవారు.
11 Responses to సాలూరు చినగురువుగారు