సీ.
సరస సంగీత ప్రసారమొల్కుచు వీణ మృదుపాణి తలమున గదిసి మెరయ
పరభృతి ధ్వని కంఠమొరసి తంత్రీ స్వనం బున లీనమై ప్రతి ధ్వనులు నింప
ముంజేతి కంకణంబులు తాళగతితోడ కలిసి చివరను ముక్తాయి తెలుప
సకల చరాచరాత్మక ప్రమోదాలవా లంబులై నాట్య క్రమంబులొనర
తే.గీ
నాదరూపిణి, నాదాత్మ, నాద వంద్య
నాద భాసిని నా వేల్పు నాదు భక్తి
సకల భూత ప్రచారిణి, సర్వలోక
జనని యైనట్టి శారదాంబను నుతింతు
అనే పద్యంలో సరస్వతీదేవి చేతిలో ఆభరణంగా భాసించే వీణ సరససంగీత ప్రసారములు చేయుచుండగా, కోయిల తీయని కంఠస్వరం వీణానాదంలో లీనమై ప్రతిధ్వనులు నింపుతోందని, ఆమె ముంజేతి కంకణములు తాళగతితో ముక్తాయి తెలుపుతున్నాయని నాద రూపిణి, నాద వంద్య, నాద భాసిని అయిన సకల లోక జనని -సరస్వతిదేవిని స్తుతించారు.
ఉ.
మంజులగాత్రమాధురి సమంజసమై శ్రుతియందు లీనమై
రంజిల తాళ జాతులు తిరంబగు మార్గమునం జెలంగ ర
క్తింజెలువార నెమ్మనము కీర్తనలన్ స్వరరాగ భావయు
క్తింజిలుకంగ బాడెద నుతింపుచు నిన్ను, మదంబ శారదా
పద్యంలో సరస్వతిని తల్లిగా భావించి మదంబ శారదాంబ అని సంబోధించి మనోహరమైన మృదుమధురమైన గాత్రంతో శ్రుతిపేయంగా తాళం స్థిరమైన విధంగా, స్వరరాగ భావయుక్తంగా ఉండే కీర్తనలతో నిన్ను స్తుతిస్తానని అని ఆమెకు వాగ్దానం చేసారు. గాయకులైనవారు శృతి, లయ, భావం అన్నిటినీ స్పష్ట పరిచేలా పాడాలని ఆయన భావించారు.
సీ.
కోకిలాలాపంబు కొమరుగాదనిపించు తులలేని గాత్ర మాధుర్యమొసగి
శ్రావ్యంబులై సుధాసారంబు చిప్పిల్లు మృదుభాషణంబుల మెరుగులొసగి
పాల సంద్రంపు జంభాటమాయను దొడ్డ హృదయ భావంబులుప్పొంగ నొసగి
నవరసంబుల సిగ్గు నాణెంబులొల్కింప కుదురైన మోము సంపద నొసంగి
కడు దయారసము చిల్కగ కళల్ తిలకింప కనుల సౌభాగ్య సంగతులొసంగి
తే.గీ
గాయకునిజేసి జ్ఞాన భాస్కరుని జేసి
కవివరుని జేసి కడువన్నెకాని జేసి
రసికవరుజేసి సాత్విక ప్రవరు జేసి
ఒక్కొకని గారవించెదవో మదంబ
శరణు ముఖ జిత శశిబింబ శారదాంబ
పద్యంలో సరస్వతీ దేవి తన సృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చి ఎలా గౌరవిస్తుందో వర్ణించారు శాస్త్రిగారు. రూపానికి సంబంధించిన సొగసుల గురించి వర్ణించిన తర్వాత గాయకుని జేసి జ్ఞానభాస్కరుజేసి, కవివరుని జేసి సాత్విక ప్రవరుజేసి.. అని ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని ఆమె ఎలా తీర్చుతుందో చెప్పి అట్టి దేవిని శరణు కోరుతూ శరణు ముఖజిత శశిబింబ శారదాంబ అని శరణా గతి మార్గాన్ని అవలంబించారు.
తన అనుభవసారంగా బ్రతుకు భారమయిన విధాన్ని వర్ణిస్తూ…
చం.
దలి సుఖమింత లేదిక, మృదంగమునంతకు తీసిపోదుగా
తలపగ రాని యిట్టి దశ దాపురమయ్యె కదమ్మ ఎట్లు నన్
తలపడి బ్రోతువో యిక సుధామధురోక్తులొసంగి శారదా
అని తన వేదనను తల్లిగా నమ్మిన దేవితో తలపోసుకుంటారు. ఆనాటి విద్వాంసులు కర్ణాటక సంగీతాన్ని హార్మోనియం అనుసరించదని భావించేవారు. ప్రభుత్వం కూడా హార్మోనియం ప్రయోగాన్ని ఆకాశవాణి కార్యక్రమాలలో నిషేధించింది. శాస్త్రిగారికి హార్మోనియం అత్యంత ప్రియమైనది. హార్మోనియంని తాము నిరసించినా శాస్త్రిగారు దానిని విడవక పోవడం కొందరు విద్వాంసులు ఈసడించారు.
సరస్వతీదేవి తరువాత ఆయన పద్యాలలో ప్రధాన వస్తువుగా హరిభజన కనిపిస్తుంది. హరిభజన చేయడంలో కలిగే గొప్ప ఆనందాన్ని సౌఖ్యాన్ని వర్ణిస్తూ – అందరు సంతోషం కలిగిస్తాయని అనుకునే వస్తువులను ఉపమానాలుగా పేర్కొంటూ, నిజానికి వాటినుంచి కలిగే సుఖం కన్నా హరిభజనలోనే హాయి హాయి అనిపించే ఆనందం ఉందని వర్ణిస్తారు.
సీ.
ఇండియా సామ్రాజ్యమేలగల్గుట కన్న గాంధీ మహాత్ము ధీగరిమకన్న
అల అప్పరావు కన్యాశుల్కమున కన్న వరకాళిదాసు కావ్యములకన్న
తిరుపతి కవుల వాక్సరళి మాధురి కన్న వనజాక్షి పాడు జావళుల కన్న
రమణీయమౌ గోహర్జాన్ గాత్రమున కన్న త్యాగయ్యగారి కీర్తనల కన్న
తే.గీ.
మోహనమ్మగు ప్రియురాలి మోవికన్న
పడతి యందించు కప్పుర విడెము కన్న
మానితంబగు చిన్ని పూదేనెకన్న
హరిభజనమోయి మనసుకు హాయి హాయి
మనసుకు ఎంతో ఆనందాన్ని, సుఖపారవశ్యాన్ని కలిగించే విషయాలను ఉపమానాలుగా తీసుకొని నిజానికి ఇవన్నీ ఇచ్చే సుఖం కన్నా హరిభజనే మనసుకు హాయినిచ్చేది అని నిర్ణయిస్తారు. అలాగే-
సీ.
ప్రియురాలితోడి సంప్రీతి క్రీడలకన్న షడ్రసోపేత భోజనము కన్న
మేల్మి కుమారుల మృదు భాషణలకన్న సొగసు నద్దములోన జూచుకన్న
అభ్యంగన స్నానమాచరించుట కన్న బల్ హుషారైన గాలి షికారు కన్న
సరసమైనట్టి వాక్సందర్భముల కన్నసకల శాస్త్రంబుల చదువుకన్న
హరిభజన గొప్పదని చెప్పడం కోసం ఎంచుకున్న ఉపమానాలలో ఎంతో కొత్తదనం కనిపిస్తుంది. ఇవి శాస్త్రిగారి కల్పనా చతురతకు నిదర్శనాలు.
తే.గీ.
తల్లిసంరక్షణముకన్న తండ్రి పాద
సేవకన్నను హితుల వీక్షించుకన్న
సర్వసౌఖ్యాల కన్న యిజ్జగము కన్న
హరి భజనమోయి మనసుకు హాయిహాయి
ఈ జగములో గొప్పధర్మాలని చెప్పబడేవాటి అన్నిటి కన్నా, ఆఖరుకు ఈ జగమంతటికన్నా హరిభజనకు మాత్రమే మనసుకు సాంత్వనం కలిగించి హాయి హాయనిపించేలా చేయగలిగే శక్తి కలిగినదని నమ్మే పరమ భక్తుడిగా సీతారామశాస్త్రిగారు ఈ పద్యంలో కనిపిస్తారు.
భక్తితోపాటు వైరాగ్య భావాలు కూడా శాస్త్రిగారి రచనలలోకనిపిస్తాయి. ఎంతో గాఢమైన జీవితానుభవంతో తీవ్రమైన అంతస్సంఘర్షణ పొంది జీవితం పట్ల వైరాగ్యం ప్రదర్శించిన ఒకయోగిలా, ఒక ప్రవక్తలా ఆయన కనిపించేవారని, మహా సిద్ధుల సమక్షంలో కలిగే ఒకమహదానందం ఆయనని దర్శించడంలో కలిగేదని ఆయన శిష్యులు, సన్నిహితులు భావించారు. ఆయనలోని ఈ వేదాంత ధోరణి కనిపించే పద్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు.
కేవలం లౌకికమయిన సుఖాలకోసం, ఎంత సంపాదించినా చేత నిలువని ధనార్జన కోసం, కళల విలువ తెలియని మూర్ఖులను ఆశ్రయించవలసిన స్ధితిని, సుఖసంతోషాలకు దూరమై, దేశాలు పట్టుకొని తిరుగుతూ కుటుంబజీవనానికి దూరం కావలసి వచ్చిన తన దుర్గతిని ఛీ అని ఖండిస్తూ రచించిన పద్యం ఇది –
శా.
ఆదాయంబిసుమంత నిల్వదు కదా హా ఎంత యార్జించినన్,
మోదంబించుక కల్గనేరదు కదా మూర్ఖాళినాశించుటన్,
ఖేదంబే అనిశంబు నిల్చును కదా, క్షేమంబులేదాయె ఛీ
ఛీ దేశాటనమా గృహస్థునకు యోచింపంగదే డెందమా
తన జీవితంలో అనుభవించిన సుఖదుఃఖాలను వర్ణిస్తూ, లౌకికమయిన ఈ జీవితంలోనుండి శాశ్వతానందం పొందే అవకాశం జార విడుచుకొని, యవ్వనకాలం అంతా వృధాగా గడిపి ఆ పరలోకంలో ఏమి ఫలితం పొంద దలచుకున్నావు అంటూ –
సీ.
అనుకూలవతి కాని అతివతో కొన్నాళ్ళు కోర్కెచే పరసతుల్ కొన్నినాళ్లు
ధనము తేలేని విద్యల చేత కొన్నాళ్ళు ఉన్నది తినలేక కొన్ని నాళ్ళు
దేశ బంధుల వీడి తిరుగుట కొన్నాళ్ళు ఉన్న వారల బాధ కొన్ని నాళ్ళు
తనసాటి వారి పంచను జేరి కొన్నాళ్ళు కుత్సితోద్యోగంబు కొన్నినాళ్ళు
తే.గీ
ఎన్నినాళ్ళిట్లు గడుపుటకెంచినావొ
శాశ్వతానంద కందంబు జారవిడిచి
ప్రాయమంతయు వృధ చేసి పరమునందు
ఏమనుభవింపనెంచితి వెరుగ చెపుమ
11 Responses to సాలూరు చినగురువుగారు