సాలూరు చినగురువుగారు

యవ్వనంలో సీతారామశాస్త్రిగారిని అడిదం సూరకవి రచించిన పద్యాలు చాలా ఆకర్షించాయి. లౌకిక విషయాలను వస్తువులుగా తీసుకొని పద్యరచన చేసిన ఈ కవి శైలి, శాస్త్రిగారి మీద ప్రభావం చూపింది. కచేరీలలో కూడా అడిదం సూరకవి పద్యాలను గానం చేస్తూ ఉండేవారుట.

శాస్త్రిగారు రచించిన పద్యాలలో చాలా పద్యాలు లౌకికమయిన విషయాలు వస్తువులుగా ఉండడంతో పాటు, భాషలో ప్రయోగించిన పదాలు అప్పటి వ్యవహారంలో ఉండడం గమనించగలం.

ప్రాసకోసం సరదాగా చెప్పిన పద్యాలు రెండు కనిపిస్తాయి.
తే.గీ.

పురుషుడిటుమిండ యింటిలో – పొలతి రండ
తగవులిలునిండ చేసొమ్ము తరుగుచుండ
మనసు కడుమండ పాపకర్మములు పండ
కలియుగపు జెండ ఎగురును తెలియకుండ

అటు ఇల్లాలు ఇటు ప్రియురాలు ఇద్దరి మధ్య నలిగే వాడి బాధ ఎలా ఉంటుందో చెప్పే పద్యం. ఇంటిలో ఎప్పుడూ తగవులు, చేతిలో సొమ్ము తరిగిపోవడం వంటి కష్టాలతో ఆఖరికి పాపం పండుతుందని చమత్కరిస్తారు. ఘనుల తలవంపు వారకామినుల సొంపు, కులటల తలంపు కులవధూటుల చలింపు, కలికి మనసింపు సొగసరి కౌగలింపు అంటూ ఇల్లాలిని వదలిన మగవాడి వేశ్యా ప్రియత్వాన్ని వెల్లడిస్తూ, .కామియై స్త్రీలోలత్వం చూపి, ఆడదాని కటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నం చేస్తే అధమగతి తప్పదని లోకంలోని మగవారిని హెచ్చరిస్తారు.

ఇదే వస్తువుతో మరొక పద్యం-
చం.

మదన వికార సంజనిత మాధురికిన్ మనసొగ్గి కామినీ
ముదిత కటాక్షవీక్షణల మోహముకున్ కనులూగి యెప్పుడున్
మదగజయాన పై మెరగు మాటలకున్ చెవియొగ్గియున్
అథమ గతిన్ చరించెదవురా మగవాడవురా తలంపరా

సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల నృత్య, సంగీత శిక్షకులకు అవకాశం ఎక్కువగా ఉండేది. పెదగురువుగారు గృహస్థుల కుటుంబాలలోని వారికి పాఠాలు చెప్తే, చినగురువుగారు ఊళ్ళోని కళావంతుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పాఠాలు చెప్పేవారు. చిన్న వయసులోనే వేశ్యలతో గల పరిచయం వల్ల సంసారజీవితంపై వేశ్యాప్రియత్వం, విచ్చలవిడి శృంగార జీవనం చూపే చెడు ప్రభావం వంటి విషయాలన్నీ శాస్త్రిగారికి అవగతం అయిఉంటాయి. పై పద్యాలలోని భావాలు, మగవాడికి హెచ్చరికలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి.

తంపెళ్ళ సత్యనారాయణగారితో

సాలూరులో చినగురువుగారి వద్ద ఎందరో విద్యార్థులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు, రేడియో కళాకారుడు తంపెళ్ళ సత్యనారాయణగారు, శాస్త్రిగారి తొలితరం శిష్యవర్గంలోని వారు. ఇద్దరికీ వయోభేదం ఎక్కువ లేకపోవడం వలన స్నేహంతో పాటు స్పర్థ కూడా ఉండేదట.

తంపెళ్ళ సత్యనారాయణగారు గ్రామఫోను రికార్డులు కూడా ఇచ్చారు. ఒక రికార్డులో కొన్ని పాటలు సీతారామశాస్త్రిగారి రచనలే. సింహేంద్ర మధ్యమంలో ధవళ మృదుతర, చక్రవాకంలో భావమెరిగిన, కాపిరాగంలో భజరే గురు చరణం శాస్త్రిగారి రచనలు.

తంపెళ్ళ సత్యనారాయణగారి గ్రామఫోను రికార్డులో కొన్ని పాటలు సీతారామశాస్త్రిగారు రచించారు

సాలూరు జమీందారు సన్యాసిరాజుగారి స్నేహం, ఆదరణలతో తనలోని కళాకారుడిని బహుముఖంగా ప్రదర్శించిన శాస్త్రిగారి స్వేచ్ఛామయ కళా జీవితానికి కుటుంబ బాధ్యతలు సంకెళ్ళు వేసాయి. కుటుంబ పోషణార్థం దేశసంచార బాట పట్టారు. కొంతకాలం కలకత్తా, ఖరగ్ పూర్ వంటి ప్రాంతాలలో ఉత్తరదేశ సంచారం చేసారు. ఈ విధంగా హిందుస్తానీ సంగీతంలోని లోతుపాతులను కూడా గ్రహించే అవకాశం ఆయనకి కలిగింది. కొంత సొమ్ము సంపాదించుకొని సాలూరు వచ్చి సంగీత పాఠాలు చెప్తూ జీవిక సాగించేవారు. ఆ డబ్బు అయిపోతే తిరిగి దేశాటన! కానీ కాలక్రమంలో కుటుంబ పోషణతో పాటు, పాఠశాల నిర్వహణ భారంగా మారి, డబ్బుకు కటకట పడవలసిన పరిస్థితిలో విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో అథ్యాపకుడిగా స్థిరపడవలసి వచ్చింది. విజయనగరంలో సీతారామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలు రెండిటిలోను అసమానప్రజ్ఞ కనపరిచారు. తన సంగీత విద్యా ప్రదర్శనతో సంగీత విద్వాంసులతో పాటు, సాహిత్య రచనలతో పండితులనుకూడా మెప్పించారు. విభిన్నమయిన వస్తువుతో అనేక పద్యరచనలు చేసి వాటిని స్వరపరచి సభలలో వాటిని ఆలపించేవారు.

సంగీత సంప్రదాయం-శాస్త్రిగారి ప్రయోగాలు

పండు తమలపాకు వంటి శరీరం, విశాలమైన నుదురు, వంగి కొనతేలిన నాసిక, అమాయకంగా ఆకర్షణీయంగా ఉండే నేత్రాలు, అర్భకంగా కనిపించే నాజూకైన రూపం – సీతారామ శాస్త్రిగారిది. రూపంలోనే కాక, సంగీత ప్రదర్శనలోను జనరంజకంగా ఉండే ప్రత్యేకతను ప్రదర్శించిన వ్యక్తిత్వం ఆయనది.

కర్ణాటక సంగీతంలోని కచేరీ పద్ధతిలో విద్వాంసులు చేసే రాగాలాపనలో సంగీత శాస్త్ర విషయంలో నిష్ణాతులైన వారికి కలిగే శాస్త్రానందం తప్ప సాధారణమైన ప్రజానీకానికి కలిగేది పరోక్షానందమే. అటువంటి సంగీత కచేరీలలో సాధారణమైన భాషలో లలితమైన పదాలతో, సమకాలీన వస్తువుతో చమత్కారంగా చేసిన రచనలను సీతారామశాస్త్రిగారు సభలలో పాడేవారు. సామాన్య ప్రజానీకానికి సంగీతంలో రససిద్ధి కలిగించే అనుభవాన్ని రుచిచూపడానికి శాస్త్రిగారు ఎన్నుకున్న మార్గం ఇది. సుందరమైన మందస్మిత వదనంతో ఎంతో తన్మయంగా గానం చేస్తున్న శాస్త్రిగారి పాటకు సభలో యావన్మందీ రసానుభూతిని పొందేవారుట.

ఆనాడు కచేరీలలో సంప్రదాయంగా మారిన కొత్త పద్ధతి ప్రతి సంగీత కచేరీలోను త్యాగరాజకీర్తన పాడి తీరాలి అనేది. అందువల్ల సంగీత విద్వాంసులందరూ తప్పనిసరిగా త్యాగరాజ కీర్తనలు నేర్చుకోవలసిన అవసరం, అదీ గురుముఖతః నేర్చుకోవలసిన అగత్యం ఉండేది. తెలుగువారు చాలామంది దక్షణదేశం వెళ్లి త్యాగరాజ సంప్రదాయంలో కీర్తన గ్రంథం నేర్చుకునేవారు. కర్ణాటక సంగీతం తెలుగువారిదే అయినా అత్యంత భక్తిశ్రద్ధలతో అభ్యసించి ప్రచారం చేసినవారు తమిళులు. అందువల్ల తమిళభాష ప్రభావం త్యాగరాజుగారి తెలుగుకీర్తనలపై కనిపించేది. తమిళుల సంగీతానికి సాహిత్యం ఒక ఉపకరణం మాత్రమే.

త్యాగరాజస్వామి విరచిత కీర్తనలను తెలుగువారు తమిళయాసతో పాడడం, సాహిత్యంలో ఔచిత్యభంగం కలిగే విధంగా పదాలను విరవడం ఆయనను చాలా బాధించేది. అందువల్ల వివిధ ప్రాంతాలలో తాను విన్న త్యాగరాజ కృతులకు, విన్న సాహిత్యానికి స్వతంత్రంగా స్వరకల్పన చేసి రాగాలాపన చేస్తూ సాహిత్యానికి తగిన రాగాన్ని, సంగతులను ప్రదర్శిస్తూ కచేరీలలో గానం చేసేవారు శాస్త్రిగారు. దాక్షిణాత్య సంగీత సంప్రదాయం పేరున సంగీత విద్వాంసులు కచేరీలలో పాడే త్యాగరాజు కీర్తనలలో సాహిత్యపోషణకు ఔచిత్యభంగం కలుగుతోందని గురువుగారు అభిప్రాయపడేవారు. రామ నన్ను బ్రోవరా, ప్రక్కల నిలబడి వంటి త్యాగరాజకృతులు పాడినప్పుడు సంగీత విద్వాంసులు సాహితీ భంజకంగా సంగతులు వేస్తున్న విధానం ప్రదర్శిస్తూ, సాహిత్య భావానుగుణంగా సంగతులువేసి ఔచిత్యానికి భంగం కలుగకుండా ఏ విధంగా పాడవచ్చునో నిరూపిస్తూ గానం చేసి సభలలో జనాకర్షణ పొందేవారు.

సీతారామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలు రెండూ సమానమైన తూకంలో ఉంటేనే ఆ కృతి రాణిస్తుందని నమ్మేవారు.భాష భావం కలిస్తేనే రాగరసస్ఫూర్తి కలుగుతుందని భావించారు.

ఆనాటి కచేరీలలో సంగీత విద్వాంసులు సంప్రదాయంగా భావించే పద్ధతిలో సీతారామశాస్త్రిగారి కచేరీలు ఉండేవి కావు. ముందు శృంగార రసభావాన్ని వెల్లడించే వర్ణం పాడడం, వెంటనే భక్తిరసప్రధానమైన కృతిని పాడడం అనే ఆనాటి కచేరీ సంప్రదాయం ఆయనకు నచ్చేదికాదు.

సీతారామశాస్త్రిగారిది మొదటి నుంచి సంప్రదాయంలో ఒదిగిన ధోరణి కాదు. శుద్ధసంప్రదాయవాది యైన తండ్రిగారితో ఆయన కొంత విభేదించవలసి వచ్చినా, తను నమ్మిన మార్గంలోనే శాస్త్రిగారు జీవించారు. శాస్త్ర సమ్మతమైన సంప్రదాయమార్గంలో ప్రయాణిస్తూనే స్వతంత్ర మార్గంలో ప్రయోగాలు చేయడం శాస్త్రిగారి ప్రత్యేకత. ఆవిధంగా ఆయన చేసిన ప్రయోగం – తెలుగు సంగీత కచేరీలలో పద్యాలు, లలితగేయాలు పాడడం. సంగీత కచేరీలలో సంప్రదాయంగా వస్తున్న వర్ణం, కీర్తనలు, కృతులు మొదలైనవి పాడుతూనే, తన స్వీయరచనలైన పద్యాలు గానంచేసేవారు. సమకాలీన వస్తువుతో రచించిన పద్యాలు సామాన్యుడిని సైతం ఆకట్టుకునేవి. సంగీతం మీద కంటే సాహిత్యం మీద మక్కువ ఎక్కువగా ఉన్న సభికులు ఉన్న సభలలో స్వీయ రచనలతో పాటు ప్రబంధాలలోని పద్యాలు, చాటుపద్యాలను జనరంజకంగా గానం చేసేవారు. “వనజాతాస్త్రకుడేయు సాయకములన్ వారింపగా రాదు” “ఏ వనితల్ మముందలఁపనేమి పనో, తమరాడువారుకారో, వలపించు నేర్పెరుగరో” “వరబింబాధరమున్” మొదలైన పద్యాలను సంగీతపు సొబగులద్ది ఆలపించి సభికులను అలరించేవారు.

కేవలం రాగప్రదర్శనకు, తన వాక్పటిమ ప్రదర్శనకు కాక సంగీతాన్ని ఆయా పద్యభావానికి తగ్గట్టుగా కూర్చి ప్రదర్శించేవారు.

జనరంజకమైన సంగీతానికి ముఖ్యస్థానం ఇస్తూ కచేరీ సంప్రదాయంలో శాస్త్రిగారు చేసిన ప్రయోగం ఆయనకి సంగీత విద్వాంసులలో ఒక ప్రత్యేకస్థానాన్ని కల్పించడమే కాక, తదనంతర కాలంలో సంగీత కచేరీ అంటే పద్యాలు, భావగీతాలు, లలితమైన సంగీతం వినిపించడం కూడా అన్న మరో కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఘంటసాల వంటి గాయకులు ఆకాలంలో భావగీతాలతో కచేరీలు చేయడం మనం గమనించవచ్చు. శాస్త్రీయ సంగీత కచేరీలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో ఆయన రకరకాల ప్రయోగాలు చేసారు. ఆ అసంతృప్తిని వెల్లడిస్తూ ఆయన రచించిన పద్యం “స్టేజి సంగీతమే శ్రేష్ఠమంచును నెంచి” -.బహుళ జనాదరణ పొందినది.

ఆనాటి తెలుగు పౌరాణిక నాటకాలలో చదివే పద్యాలపై మరాఠీ సంగీత ప్రభావం ఉండేది. దాక్షిణాత్య సంగీత ప్రదర్శనలలో విద్వాంసుల కీర్తనలపై తమిళయాస ప్రభావం ఎక్కువగా ఉండి, కేవలం రాగ ప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి తెలుగు భాషా సాహిత్య మర్యాదలను పక్కన పెట్టడం చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. దీనిని గురించి సీతారామశాస్త్రిగారు స్వయంగా రచించి సభలలో గానం చేసిన ఈ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్యాన్ని ఓడియన్ గ్రామఫోన్ కంపెనీ వారు ఒక రికార్డుగా విడుదల చేసారు.
సీ.

స్టేజి సంగీతమే శ్రేష్ఠమంచును నెంచి పరవశత్వముఁజెందు సరసులార
అరవనొక్కులె శాస్త్రమంచు నెంచి దాని భావమే యెరుగని ప్రాజ్ఞులార
మహరాష్ట్ర గానంపు మహిమ చూపెదనంచు గళము గిర్గిర త్రిప్పు ఘటికులార
మూలనుండిన వీణ ముందరకున్ లాగి తంత్రులంద్రెంపు విద్వాంసులార

తే.గీ

కాలగతి చేత ప్రస్తుత కాలమందు
ఆంధ్ర సంగీతమిన్ని విధంబులాయె
గాన శాస్త్రజ్ఞులార సుజ్ఞానులార
గాన శాస్త్రజ్ఞులార అజ్ఞానులార

ఎన్నెన్నో తెన్నులుగా చీలిపోయి ఎందునా రససిద్ధి పొందలేకపోయిన నాటి ఆంధ్ర సంగీతాన్ని గురించి విమర్శించిన పద్యం ఇది. ఆంధ్రసంగీతం ఈ విధమైన అధ్వాన్న స్ధితిని పొందడానికి కారకులు – తాము గాన శాస్త్రజ్ఞులమనుకుని భాషని అలక్ష్యం చేసే గాయకులేనని శాస్త్రిగారి అభిప్రాయం. ఆ భావానికి తగినట్టు శాస్త్రిగారు పద్యంలో మాటలను మహారాష్ట్ర ప్రభావం కనిపించే విధంగా గళము గిరగిరా త్రిప్పడం, అరవనొక్కులే అన్న చోట తమిళయాసతో పలుకుతూ ఒక కొత్త పద్ధతిలో గానంచేసేవారుట. అది ఆనాటి శ్రోతలను ఎంతగానో ఆకర్షించింది. అందువల్లనే సమకాలీన విద్వాంసులలో వెలిపడ్డ వారిగా కనిపించినా అత్యంత జనాదరణ పొందిన మేటి విద్వాంసులుగా జనుల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు

శాస్త్రిగారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత రోజులో చాలాసేపు గానం చేస్తూనే ఉండేవారుట. ఆ గానం కూడా కేవలం పాటలా కాక పరమేశ్వరుడికి సమర్పించుకునే హృదయ నివేదనలా ఉండేదట. అలాంటి భక్తి, జ్ఞాన యోగాలను ప్రదర్శించే పద్యాలను కీర్తనలను శాస్త్రిగారు స్వయంగా రచించి అమృతమయంగా గానం చేసేవారుట.

అతిబాల్యంలోనే తల్లిని పోగొట్టుకొని సహజమయిన ప్రతిభతో సంగీతంలోను, సాహిత్యంలోను నవనవోన్మేషమయిన ప్రజ్ఞా పాటవాలను చూపి సంగీతంతో నాదోపాసన చేసి, సరస్వతీ పుత్రులుగా ఆనాటి ప్రజల అభిమానాన్ని పొందారు శాస్త్రిగారు. తనకు ఈ విద్యను ప్రసాదించిన సరస్వతీదేవిని తల్లిగా, పుత్రుడి లాగే ఆరాధించారు శాస్త్రిగారు. తన ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా సరస్వతి అమ్మవారితో పంచుకున్నారు.

సంగీతకళా మూర్తి శారదాదేవిని తల్లిగా భావించి ఆమెకు చేసుకున్న నివేదన-

సీ.

రాగమందనురాగ రసమునొల్కించుటే అమ్మరో నీ మందహాసమమ్మ
గడియారమునకె సద్గతి జూపు లయతాళ గతులెన్న నీ మందగమనమమ్మ
పూలమాలికల కూర్పును బోలు స్వరకల్ప నలు నీదు మృదుల భాషలు గదమ్మ
శ్రుతి యందు లీనమౌ గతి మది నిల్పుటే భారతీ నీ శాంత భావమమ్మ
నవరసంబుల సముద్భావమంద జేయుటే శారదా నీ కటాక్షము గదమ్మ

తే.గీ.

భావ రాగంబులను, తాళ ఫణితి, శ్రుతియు
గలియ గానంబు చేసెడి గాయకునకును
శ్రుతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జనని
శరణు ముఖజిత శశి బింబ శారదాంబ

పద్యంలో కనిపిస్తుంది. ఇందులో వస్తువు సరస్వతిని స్తుతించడం. రాగమందు అనురాగ రసమునొల్కించుట ఆమె మందహాసమని, గడియారమునకే గతులు చూపే లయతాళగతులు ఆమె మందగమనమని, పూలమాలికలవలె కూర్చిన స్వర కల్పనలు ఆమె భాషలని, ఈ విధంగా చేసే నవరస సముద్భవం ఆమె కటాక్షమని, భావరాగ తాళాలతో శ్రుతిపక్వంగా పాడి ఆమెను ఆనందింపచేయని గాయకుడు గాయకుడే కాదని వర్ణించారు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

Comments are closed.