సాలూరు చినగురువుగారు

సంగీతానికి సాహిత్యానికి సమన్వయం ఉండాలని, సాహిత్య పోషకంగా సంగీతం ఉండాలని భావించి, ఆ ఆశయాన్ని ప్రచారం చేసారు శాస్త్రిగారు. పద్యపఠనంలో సాహిత్యానికి తగిన స్వరకల్పన చేస్తూ, తెలుగు నుడికారంతో తెలుగుపాట వినిపించాలని భావించేవారు శాస్త్రిగారు. ఘంటసాల ప్రైవేటు రికార్డులుగా ఇచ్చినవాటిలో పద్యపఠనంలో గురువుగారి ప్రభావంతో ఏర్పరుచుకున్న ఒక నూతన శైలి కనిపిస్తుంది. తమ తండ్రి గారి ప్రభావం, తమ పైన కన్నా శిష్యుడు ఘంటసాలగారి పైనే ఎక్కువ అని, ఆయన ఆశయం ఘంటసాల రూపంలో వ్యక్తం అయిందని భావిస్తారు గురువుగారి కుమారుడు, సంగీతరావుగారు1. భాషలోని సాహిత్యభావానికి తగిన సంగీతకల్పన చేయడంలో, తెలుగుపాటలో మాట తెలుగుమాటగా వినిపించాలన్న గురువుగారి ఆదర్శాన్ని ఘంటసాలగారు అక్షరాలా ఆచరించారు.

సీతారామశాస్త్రిగారు విద్యార్థులకు సంగీతం నేర్పినప్పుడు కేవలం సంగీతగ్రంథం బోధించడమే కాక విద్యార్థులలోని భావనా శక్తిని, నిర్మాణాత్మకమైన శక్తిని, స్వాతంత్ర్యాన్ని, రసదృష్టిని ప్రోత్సహించేవారు. ’గురువుగారి ప్రభావం వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్టత, ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి’ – అన్నారు ఘంటసాల.

నేను ఎక్కడ, ఎప్పుడు ఏ పరిస్ధితులలో ఉన్నా గురువుగారి పవిత్రాత్మ నన్ను వెంట అంటి ఉంటుందని నమ్ముకొంటున్నాను‘ – అన్న ఘంటసాల పలుకుల్లో సీతారామశాస్త్రిగారిని కేవలం విద్యనేర్పిన గురువుగానే కాక ఆత్మీయతానురాగాలతో ఒక ఆత్మబంధువుగా ఆరాధించడం కనిపిస్తుంది.

మద్రాసు టి.నగర్ లో ఘంటసాలగారి ఇల్లు. ఘంటసాలగారి గృహప్రవేశం సందర్భంగా ఆహ్వాన పత్రం అందులోనే  సీతారామ శాస్త్రిగారి  గాత్ర సంగీత కార్యక్రమం వివరాలు
మద్రాసు టి.నగర్ లో ఘంటసాలగారి ఇల్లు ఘంటసాలగారి గృహప్రవేశం సందర్భంగా ఆహ్వాన పత్రం అందులోనే సీతారామ శాస్త్రిగారి గాత్ర సంగీత కార్యక్రమం

1950లో మద్రాసు టి.నగర్ లో ఘంటసాలగారి నూతన గృహ ప్రవేశ సందర్భంగా గురువుగారిని మద్రాసుకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఇది గురువుగారి పట్ల ఘంటసాలకుగల గౌరవాభిమానాలకు తార్కాణం. ఈ శుభసందర్భంలో గురువుగారి కచేరీ కూడా ఏర్పాటు చేసారు.

సీతారామశాస్త్రిగారు సాలూరులోను, విజయనగరంలోను ఇచ్చిన సంగీత శిక్షణ ఎందరి జీవితాలకో రాచబాటను పరిచింది. కేవలం సంగీతపాఠాలను చెప్పే గురువుగానే కాక నిర్మలమయిన, మందస్మిత పూర్వకమయిన ఆత్మీయదృక్కులతో మధురమైన సంభాషణతో కూడిన మూర్తిత్వంతో శిష్యుల కళాజీవితంతో పాటు, వారి వ్యక్తిత్వాలను కూడా ప్రభావితం చేసి, వారిని ఆదర్శమయంగా తీర్చిదిద్దారు సీతారామశాస్త్రిగారు. శాస్త్రిగారిలో వ్యుత్పత్తి కన్నా ప్రతిభ, ప్రతిభ కన్నా వ్యక్తిత్వమూ ఘనమైనవి అని సంగీతరావుగారి భావన.

విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్రపండితులుగా 1936నుంచి 1956 వరకు పనిచేసారు శాస్త్రిగారు. ఆయన శిష్యులు గాయకులుగా, అధ్యాపకులుగా, మరికొంత మంది సినిమా సంగీతరంగంలో కళాకారులుగా రాణించారు. శాస్త్రిగారు అథ్యాపకుడిగా మహత్తరమయిన బాధ్యతను నిర్వర్తించారు.

కానీ సీతారామశాస్త్రిగారి లోని కళాకారుడు రసవద్గాయకుడిగా, వాగ్గేయకారుడిగా రూపొందే వ్యక్తిత్వాన్ని పొందినది సాలూరు జీవితంలో చినగురువుగారుగా మాత్రమే. తన స్వేచ్ఛాప్రకృతికి విరుద్ధంగా ఉద్యోగధర్మం అనే పంజరం ఆయనను చిలుకను చేసి బంధించింది. అత్యంత ప్రాణప్రదంగా నిర్మించుకొన్న తన పాఠశాలలో తన అభిమాన శిష్యుల మధ్య సాలూరులోనే ఉండి ఉంటే, ఈనాటి సంగీత కచేరీ విధానం ఎంతో రసస్ఫూర్తిగా రూపొంది ఉండేదని, ఎన్నో విశిష్టమయిన ఆయన సంగీత రచనలతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం సుసంపన్నం అయివుండేదని భావిస్తారు సంగీతరావుగారు.

సీతారామశాస్త్రిగారు ఏనాడూ ప్రత్యేకంగా పూనుకొని కవిత్వం వ్రాయలేదు. ఆయన రచించిన పద్యాలు, కీర్తనలు ఎక్కడా అచ్చుకాలేదు. రోజూ గంటల తరబడి భగవంతుడి సన్నిధిలో గానంచేసేవారు. ఆ గాన తన్మయత్వంలో వచ్చిన పద్యాలను, కీర్తనలను వారి శిష్యులు అప్పుడప్పుడు రాసుకున్నవి ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. తన స్వర రచనలను తాను పాడుకోవడం కోసమే అని భావించేవారు. శిష్యులకు ప్రత్యేకంగా ఎప్పుడూ పాఠంగా చెప్పేవారు కాదు. వోకల్ పండితుడిగా పాఠం చెప్పినపుడు కూడా సంగీత సంప్రదాయం ప్రకారమే సంగీత శిక్షణ ఇచ్చేవారు. తన రచనలను పాఠంగా చెప్పలేదు.

విజయరామరాజ సంగీత కళాశాల సహోద్యోగులతో శ్రీ శాస్త్రిగారు

విజయరామరాజ సంగీత కళాశాల సహోద్యోగులతో శ్రీ శాస్త్రిగారు

శాస్త్రిగారి పద్యాలు, గేయాలు గానానికి అనుగుణంగా, గాయక దృష్టితో రచించినవి. రచనలో, భావంలో సూటిదనం, ఆవేశం, అమాయకత్వం, భక్తిభావం, వాటి ప్రదర్శనలో భావానికి అనుగుణ్యమైన సంగీతం ప్రేక్షకులను ఆకర్షించిన లక్షణాలు అని శ్రీ సంగీతరావుగారి అభిప్రాయం.

1957 సంవత్సరం ప్రారంభంలో విజయనగరం సంగీత కళాశాలలో ఉద్యోగవిరమణ పొందారు. మరి కొద్ది కాలంలోనే ఆరోగ్యం క్షీణించి, హేవిళంబి నామ సంవత్సరం 1957 ఏప్రెల్ నెల 17 వ తేదీన కన్నుమూసారు.

వాగ్గేయకారుడుగా సీతారామశాస్త్రిగారు

సీతారామశాస్త్రిగారు అతి చిన్నవయసులోనే సంగీతవిద్వాంసుడిగా ప్రజామోదాన్ని, గౌరవాలను అందుకున్నారు. బరంపురం ఆనాటి తెలుగుసంస్కృతీ కేంద్రంగా ఉండేది. సాహిత్యగోష్టులు తరచుగా జరిగేవి. తండ్రి నరసింహశాస్త్రిగారి వెంట ఉంటూ ఈ సాహిత్యసభలలో పాల్గొనడం, ఆనాటి సాహితీవేత్తలతో పరిచయం సీతారామశాస్త్రిగారికి సంగీతంలోనే కాక, సాహిత్యంలోనూ పట్టు సాధించడానికి దోహదపడింది. క్రమమైన విద్యాభ్యాసం లేకపోయినా అతి చిన్నవయసులోనే ఛందోబద్ధంగా పద్యరచన చేయడం అలవడింది.

సీతారామశాస్త్రిగారి పద్యరచన

సీతారామశాస్త్రిగారికి పదిహేను సంవత్సరాల వయసులో ఒకసారి శ్రీకాకుళంలో సంగీత కచేరీ నిమిత్తం తండ్రిగారితో కలిసివెళ్ళారు. తండ్రి గానం పూర్తి కాగానే సీతారామశాస్త్రిగారు కూడా పాడారు. సభలోనివారు కుర్రవాని సంగీత జ్ఞానానికి ఎంతో ముగ్థులయేరు. సభాసదులలో ఒకరు బాబూ ఒక పల్లవి పాడు అని అడిగారుట.

శాస్త్రిగారు వెంటనే సద్యస్ఫూర్తితో ఒక పల్లవిని కల్పించి పాడేరుట. అది ఇలా ఉంటుంది.
తిన్న చిలుకా…..
కాయలు తిన్న చిలుకా,
కాకర కాయలు తిన్న చిలుకా,
మా దొడ్లో కాకర కాయలు తిన్న చిలుకా

అంటూ ఈ సాహిత్యాన్ని పల్లవిగా ఆలపించి శ్రోతలతో శహబాసులు పొందారుట. తన చిన్ననాట మిత్రులతో స్పర్థ వచ్చినప్పుడు వారిని అధిక్షేపిస్తూ కొన్ని పద్యాలు చెప్పారు.
తే.గీ.

ఈ వసంతంబునందు నీ యిచ్ఛకొలది
కోకిలా కూయుమా నీవు కోకొ యంచు
కాకి పెంపకమౌట ఆ కారుకూత
కూయబోకుమా నైజంబు కూలిపోవ

కాకి, కోకిల చూడడానికి ఒకే రూపంలో ఉండే పక్షులు. వాటి గుణాలు మాత్రం వ్యతిరేకం. మధురమైన కంఠస్వరానికి కోకిల, వికృతశబ్దాలకు కాకీ, పేరు పొందాయి. కోకిల తనగుడ్లను పొదగడం చేతకాక, కాకి గూటిలో పెట్టి వెళ్తుందని, కాకి ఆ గుడ్లను పొదిగి తన పిల్లలతో పాటు పెంచుతుందని, కూత నేర్చిన తర్వాత నిజం గ్రహించి కోకిల పిల్లలను తరిమేస్తుందని కవిసమయం. దీన్ని శాస్త్రిగారు కొత్తగా ప్రయోగించారు. కోకిల వసంతంలో మధురంగా కూ కూ అని కూయాలి కాని, కాకి తనను పెంచింది కదా అని కఠోరమైన శబ్దాలతో కాకిలా కూయకూడదని, తన సహజమయిన గుణాన్నివదలకూడదని అంటారు. దుష్టసాంగత్యం వలన తన మంచిలక్షణాన్ని పోగొట్టుకోవద్దని తన మిత్రుడిని పరోక్షంగా హెచ్చరించారు శాస్త్రిగారు.
తే.గీ

కీరమనుకొని మురిసి స్వకీయ వాక్య
ములను ముద్దుగ పలికింప దలచుచుండ
కాల గతి చేత ప్రారబ్ద కర్మ వశత చేత
తెలిసి కూసెను కాకి కూతలనె యకట

కాకి తన పిల్లను చిలుక అనుకుని ముద్దుముద్దు మాటలను ఎంతో ముద్దుగా నేర్పించినా కొంత కాలానికి అది జాతి ధర్మము ప్రకారము కాకి కూతలనే కూసిందని, తల్లి కాకి తన ప్రారబ్థ వశాత్తూ తెలుసుకుంది – అని కల్పించడంలో కొత్తదనం కన్పిస్తుంది.

ఎంత ప్రయత్నం చేసినా సహజమయిన జాతి గుణాలు మారవని కాకి చిలుకలా మధురంగా పలకలేదని, కాలక్రమంలో సహజమయిన జాతి లక్షణాలు బయటపడతాయని అంటారు శాస్త్రిగారు. తన స్నేహితుడి పైన ప్రేమతో మంచి విషయాలు నేర్పించడానికి ప్రయత్నిస్తే, అతను తనను పట్టించుకోక నిర్లక్ష్యం చేసినపుడు అతన్ని మందలిస్తూ చెప్పారట ఈ పద్యం.

అలాగే తనకు నచ్చని ఒక విద్వాంసుడిగురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తంచేసారు-
తే.గీ.

మశకమా నీవు రొద జేసి మధురమైన
కోకిల ధ్వనియంచు వాకొనెదవేల
గీయనెడి యొక్క రొదయె సంగీతమగునె
కోకిలమ్మేడ నీవేడ కోర్కెలేడ

దోమ గీయనే శబ్దం చేస్తూ తను సృష్టించిన ధ్వని గొప్పసంగీతమని, కోకిల ధ్వనివంటిదని భావించినా అది నిజానికి సంగీతమవుతుందా. శ్రుతిపక్వంగా తనువును పులకింపచేసే సంగీతమే సంగీతం కాని, మిగిలినవన్నీ కేవలం అరుపులతో సమానం అని పరోక్షంగా ఆ విద్వాంసుని సంగీతంపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇలాంటిదే మరొక పద్యం –
తే.గీ.

మించి కృష్ణుడు మురళి వాయించుచుండ
కోయనుచు కూయు కోకిల కూతలేల
పాంచజన్యపు నాదంబు ప్రబలుచుండ
పృథుల భీకర ధ్వనుల కల్పింపనేల

——————
1. సంగీతరావు గారు సీతారామశాస్త్రిగారి పుత్రుడు. వారి గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

Comments are closed.