సాలూరులో ఆర్థికంగా ఏమాత్రం ఆసరా లభించినా శాస్త్రిగారు సాలూరు ప్రజలను, తను ప్రాణప్రదంగా భావించే పాఠశాలను విడిచి వెళ్ళేవారు కాదు. 1946 సంవత్సరంలో సాలూరు శారదా గాన పాఠశాలకు రజతోత్సవం జరిపించారు శాస్త్రిగారు. ఈ ఉత్సవాలకు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు అద్యక్షత వహించారు. “పరమోత్కృష్టమయిన సంగీతవిద్యను ఉచితముగా బోధింపగల ధర్మపాఠశాలను నెలకొల్పి, ఇప్పటికి ఇరువది ఐదు సంవత్సరములనుండి అవిచ్ఛిన్నముగ నిర్వహించుచు కళోపాసకులను తయారుచేయుచు..” – అంటూ సీతారామశాస్త్రిగారి ఉన్నతాశయాలను ప్రశంసించారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు. సీతారామశాస్త్రిగారి శిష్యులు, వారి ఆఖరి కుమారుడు ప్రభాకరరావుగారు సాలూరు పాఠశాలను కొంతకాలం నిర్వహించారు. ప్రస్తుతం సాలూరులో జరజాపు ఈశ్వరరావుగారి సారధ్యంలో జరజాపు రమేష్ మెమోరియల్ ట్రస్టు, సాలూరు రాజేశ్వరరావు మెమోరియల్ ట్రస్టు సంయుక్తంగా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి సంగీత పాఠశాల పేరుతో శారదా గాన పాఠశాలను నిర్వహిస్తున్నాయి.
విజయనగరం జీవితం
విజయనగరం సంగీత కళాశాలలో చినగురువుగారి ప్రవేశం నాటకీయంగా జరిగింది. ఎస్టేట్ కలెక్టర్ డబ్ల్యు.ఆర్.ఎస్.సత్యనాధన్, ఐ.సి.ఎస్.తో పాటుగా గొప్ప సంగీత వేత్తలెందరో ఆ కార్యక్రమానికి అతిథులు. కళాశాల భవనం ఆహూతులతో క్రిక్కిరిసిపోయింది. ఆదిభట్లనారాయణదాసుగారు అప్పటికే పదవీ విరమణ చేయడం వల్ల ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు. ఓకల్ ప్రొఫెసర్ పదవికి పోటీపడే అభ్యర్దులకు విద్వత్పరీక్ష జరిగింది. స్వకీయమైన రచనతో, కళ్యాణి రాగంలోని క్లిష్టతను అసాధారణరీతిలో ప్రదర్శించిన చినగురువుగారు సంగీత విద్వాంసులతో పాటు సామాన్యులను కూడా సూదంటు రాయిలా ఆకర్షించేరు. సీతారామశాస్త్రిగారు ప్రథమ స్ధానంలో ఎన్నికయినట్టు ఎస్టేటు కలెక్టరుగారు ప్రకటించారు.
విజయనగరంలో 1936లో గెడ్డవీధిలో కాపురం ప్రారంభించారు సీతారామశాస్త్రిగారు. పగలు ఉద్యోగం, సాయంత్రాలు మిత్రులతో సాహితీ సమావేశాలతో విజయనగరంలో శాస్త్రిగారి జీవితం సంగీత సాహిత్య సమ్మేళనంగా ఉండేది. ఈ సమావేశాలే తదనంతరం కౌముదీ పరిషత్తుగా పరిణామం చెందాయి. బుఱ్ఱా శేషగిరిరావుగారు ఈ కౌముదీ పరిషత్తును శ్రీ భారతీ తీర్థ అనుబంధ సంస్థగా గుర్తించడం వల్ల మరెందరో విద్వాంసులు దీనిలో సభ్యులుగా చేరారు. ఆకుండి సత్యనారాయణగారు, పంతుల లక్ష్మీ నారాయణశాస్త్రిగారు, నల్లాన్ చక్రవర్తుల వెంకట చక్రవర్తి, రంగాచార్యులు సోదరులు, భళ్ళమూడి నరసింహశాస్త్రిగారు, కొల్లూరు ధర్మారావుగారు, తంపెళ్ల సత్యనారాయణగారు, మూర్తిరాజుగారు, క్రొవ్విడి రామంగారు, మరెందరో సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతులైనవారు, సంగీత విద్వాంసులు ఈ పరిషత్తులో సభ్యులు. తరచుగా సంగీత సాహిత్య రంగాలకు సంబంధించిన చర్చలు, కవి సమ్మేళనాలు, కావ్య పఠనాలు జరుగుతూ ఉండేవి. సున్నితమయిన హాస్యధోరణితో, చెరగని చిరునవ్వుతో గురువుగారు ప్రసంగాలు చేస్తూ స్వవిరచితమయిన గేయాలు, పద్యాలు ఆలపిస్తూ ఉండేవారు.
భారతీతీర్థ వారు నిర్వహించిన దసరా సభలలో 1939లో కౌముదీ పరిషత్తువారు సీతారామశాస్త్రిగారిని సంగీత విద్యా భూషణ బిరుదుతో సత్కరించారు. ఈ కౌముదీ పరిషత్తుకు, ప్రారంభించినది మొదలు 1957లో మరణించేవరకు సీతారామశాస్త్రిగారే శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారు. మహాకవులు, సంగీతవిద్వాంసులు, ప్రాక్పశ్చిమభాషా పండితులు సభ్యులుగా గల పరిషత్తును చినగురువుగారు అంతకాలం అధ్యక్షుడిగా నిర్వహించడంలో ఆయన ప్రతిభతో పాటు ప్రసన్నమయిన వ్యక్తిత్వం, సమయస్ఫూర్తితో కూడిన సభారంజకమైన వాక్శక్తి కూడా వెల్లడవుతాయి.
వేదవిజ్ఞాన వర్ధనీ పరిషత్తువారు, జ్ఞానానందాశ్రమం వారు, చుట్టుపక్కల గ్రామాలవారు నిర్వహించిన సభలలో, మహారాజ సంగీత కళాశాలవారు నిర్వహించే సిద్ధి గణపతి నవరాత్రి ఉత్సవాలలో -ఇలా అనేక సందర్భాలలో గురువుగారు చేసిన సంగీతకచేరీలు సభ్యులను బ్రహ్మానందపరిచేవి.
సంగీత కచేరీలు చేయడంతో పాటు కౌముదీ పరిషత్తు అధ్యక్షుడిగా అనేక సందర్భాలలో శాస్త్రిగారు సంస్కృతంలో, తెలుగులో అనేక పద్యరచనలు చేసి వెలువరించారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే సంగీత సభలలో నాదోపాసన, సంగీత సాహిత్య సమ్మేళనం వంటి శీర్షికలతో సంగీతం సాహిత్యపోషకంగా ఏవిధంగా ఉండాలో నిరూపిస్తూ ప్రసంగాలు చేసేవారు.
సహజమయిన ప్రతిభా వ్యుత్పత్తులతో ఎన్నో పద్యాలు, గేయాలు మొదలైన రచనలు చేశారు శాస్త్రిగారు. ఈ రచనలన్నీ ప్రాచీన వాగ్గేయకారుల రచనలతో సమంగా సంగీతసాహిత్య పరిపుష్టంగా, రక్తికట్టించేవిగా ఉన్నాయని సంగీతవిద్వాంసుల మన్ననలు పొందాయి.
త్యాగయ్య చెప్పిన సంగీత పరమైన మోక్షం కేవలం శాస్త్రసమ్మతంగా గానం చేసినప్పుడు మాత్రమే లభించదని, శ్రవణానందదాయకంగా గానం చేస్తేనే సిద్ధిస్తుందని నమ్మేవారు శాస్త్రిగారు. .శ్రవణానందము, శాస్త్ర సమ్మతము సమ్యక్ గీతము సంగీతమని, రాగభావ, స్వరరసపోషణ గాత్ర సంగీత ధర్మమని భావించేవారు. ఆయన స్వరపరచిన గీతాలలో ఈ భావాన్ని పదే పదే ప్రకటించడం కనిపిస్తుంది.
శాస్త్రిగారి ప్రత్యేకత హార్మోనియం వాయిద్యం. ఆనాడు భారతీయ సంగీత సంప్రదాయానికి పొసగదు అంటూ ప్రభుత్వంవారు హార్మోనియం వాయిద్యాన్ని నిషేధించారు. చినగురువుగారి కచేరీలో హార్మోనియం వాయిద్యానికి చాలా ప్రాముఖ్యం ఉంది. పండితులు, ప్రభుత్వం చిన్నచూపు చూసినా శాస్త్రిగారు హార్మోనియంను తన కచేరీలలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. ఆకారణంగా అంతటి మహా విద్వాంసుడూ, ఆకాశవాణికి దూరంగా ఉండిపోయారు. హార్మోనియంపై అతి సున్నితమయిన సంగతులను పలికిస్తూ, ప్రదర్శించగలిగే కళానైపుణ్యం, ఆనందించగల రసార్ద్ర హృదయం ఉన్నప్పుడు రసోత్పాదనకు, రసాస్వాదనకు హార్మోనియం ఎంత చక్కగా సహకరిస్తుందో, సోదాహరణంగా నిరూపించారు చినగురువుగారు. వారి చేతిలో హార్మోనియం సూక్ష్మాతిసూక్ష్మమైన, అతి సున్నితమైన సంగతులను, మూర్ఛనాది ధ్వనులను వెలువరిస్తూ, పరోక్షంగా విన్నవారికి అది హార్మోనియం అని తెలిసేది కాదట. హార్మోనియం వాయించడంలో గురువుగారికి గల అసాధారణమైన ప్రతిభ, సభలలో శ్రోతలను అమితంగా ఆకట్టుకునేది. ‘పరసీమ యంత్రాన వరగాన మొలికించు మిన్న పట్రాయని చిన్న గురువు‘ అన్నారందుకే ఆరుద్రగారు- శాస్త్రిగారి హార్మోనియం ప్రతిభ గురించి.
విజయనగరం సంగీత కళాశాలలో వోకల్ పండితుడి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు సీతారామశాస్త్రిగారికి యోగ్యతాపత్రం అవసరమైంది. దానికోసం ఆయన ఆదిభట్ల నారాయణదాసుగారి దగ్గరకు వెళ్ళారుట. పెదగురువుగారు నరసింహశాస్త్రిగారు దాసుగారికి మంచి మిత్రులు. “ఒరే నీకెందుకురా ఆ బాడుఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు. స్వతంత్రంగా ఉన్నావు. నీ ప్రారబ్థం అలా ఉంది. తప్పదు” అని అంటూనే దాసుగారు సీతారామ శాస్త్రిగారికి యోగ్యతా పత్రం రాసి ఇచ్చారుట. పక్కనున్న వాళ్ళతో “ఆ హార్మోనియం లేదూ, అదొక కొయ్య. దాని నుండి అమృతం పిండుతాడు వీడు” అన్నారుట. హార్మోనియం వాదనలో సీతారామశాస్త్రిగారి నైపుణ్యం గురించి ఆదిభట్ల నారాయణ దాసుగారిచ్చిన యోగ్యతా పత్రం అది.
గాయకులు సాహిత్యభావాన్ని పోషిస్తూనే, నాదంలో లీనమై గానం చేయాలని, ఆ ఆదర్శాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన శాస్త్రిగారు జీవితపర్యంతం దాన్ని ప్రచారం చేసారు. దాక్షిణాత్య సంగీతపు ప్రభంజనంలో కొట్టుకుపోతున్న సమకాలికులైన విద్వాంసులకు ఆయనపట్ల ఈ విషయంలో విభేదం ఉన్నా ఆయనకి సంగీతంలో గల అసాధారణ ప్రజ్ఞతో, శ్రవణపేయమైన తన గాంధర్వ గానంతో, స్వకీయ స్వరకల్పనలతో సాధారణ జనసమూహంలో రససిద్ధికి నిర్వచనం అనిపించేలా కచేరీలు చేసి, గొప్ప విద్వాంసుడిగా జనామోదం పొందారు. ఒక్కొక్క పద్యం అరగంట సమయమైనా రాగాలాపన చేస్తూ చదివేవారు.
సీతారామశాస్త్రిగారు- ఘంటసాల

విజయనగరంలో గురువుగారు శిష్యులతో కలిసి ఉన్న ఫోటో ఇది.
ఇందులో గురువుగారి ఎడమ వేపు మొదటి వ్యక్తి – ఘంటసాల.
విజయనగరంలో ఆయన విజయరామరాజ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్నపుడు శిష్యులను కన్నబిడ్డలతో సమానంగా ఆదరించి ఆప్యాయతను పంచేవారు. విజయనగరంలో సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులెందరో ఆర్థికపరిస్థితులు సహకరించని పరిస్థితులలో గురువుగారి ఇంటిలోనే బస చేసేవారు. ఆవిధంగా వచ్చిన శిష్యులలో ఘంటసాల వెంకటేశ్వరరావు ముఖ్యులు. శిష్యులలో నిగూఢంగా ఉన్న సంగీత కళాసంపదను పసిగట్టి ప్రోత్సహించేవారు సీతారామశాస్త్రిగారు. గురువుగారి దగ్గర సంగీతగ్రంథం నేర్చుకోవడంతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా చేసుకున్నారు ఘంటసాల. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన జీవితంలో గురువుగారి ప్రభావం ఎంతో ఉంది. ఆయనకు గురువుగారి పట్ల అమితమైన ప్రేమ, అనురాగం ఉండేవి. ‘శ్రీ గురువుగారిని దర్శించిన ఆ క్షణమే వారి మూర్తిమంతం, ప్రియభాషణ, నన్ను పరవశుణ్ణి చేసేయి. వారి గురుత్వం ఆజన్మ సిద్ధమయినదనిపించింది‘ అన్న ఘంటసాల మాటలలో గురుశిష్యులిద్దరికీ ఒకరిపట్ల ఒకరికి కల ఆత్మీయత కనిపిస్తుంది. గురువుగారి గురించి ఘంటసాల ఇంకా ఇలా అన్నారు-
“సంగీత శాస్త్రమూ, లక్ష్య గ్రంథమూ నేను ఇతర పండితులనుండి గ్రహించగలిగే వాణ్ణేమో కాని గురువుగారు నాకు ప్రసాదించినది అనితర దుర్లభమైనదని నా విశ్వాసం. ముఖ్యంగా గాత్రసాధన చేయడంలో అలవర్చుకోవలసిన శ్రుతి శుద్ధి, నాద శుద్ధి, గమక శుద్ధి, తాళగత స్వరగత లయశుద్ధి, శిష్యులకు బోధించడంలో ఆ మహానుభావుడు సిద్ధుడు. వారు ఈ నాదానుభవాన్ని సాంబసదాశివ సాంబసదాశివ అనే నామ సంకీర్తనంతో మంత్రవత్ గా నాలో ప్రసరింపచేసారు. కీర్తనలోని రసభావములకు అనుగుణ్యంగా పట్టువిడుపులతో గమకాలను సార్థకంగా ప్రయోగించడం గురువుగారి వంటి నాదసిద్ధులకు మాత్రమే సాధ్యమని నా నమ్మకం. గురువుగారి పద్యాలలోను, కీర్తనలలోను గల భావోద్రేకము, చిత్తశుద్ధి అస్మదాదులను తాత్త్వికోన్ముఖులను చేయగలిగినవి“.
ఘంటసాల సినీరంగంలో స్థిరపడకముందు ఎన్నో సంగీత కచేరీలు చేసారుట. వాటన్నిటిలోను గురువుగారి పద్యాలు, స్వరపరచిన కీర్తనలు గానం చేసేవారుట. ప్రతి కచేరీలోను గురువుగారు రచించిన లలితే సరసగాన కళాశ్రితే కీర్తనను ప్రార్థనగా ఆలపించేవారుట.
ఘంటసాల తెలుగు చిత్రసంగీతంలో ప్రవేశించే నాటికి చిత్రసీమ పై మహారాష్ట్ర సంగీత ప్రభావం కనిపించేది. ఘంటసాల సంగీతదర్శకుడిగా, గాయకుడిగా తెలుగు సినిమాలలో తెలుగు పాటను తెలుగు నుడికారంతో వినిపించారు. ముఖ్యంగా తెలుగు చిత్రాలలో ఘంటసాలకు ముందు పద్యపఠనంలో మహారాష్ట్ర ప్రభావం, స్టేజినాటకాల ప్రభావం కనిపిస్తుంది. సాహిత్యంలోని మాటలన్నీ గబగబ అనేసి తీరిగ్గా రాగాలాపన చేయడం అనేది ఘంటసాలకు ముందున్న పద్యపఠన శైలి. ఘంటసాల సంగీతంలో వచ్చిన ప్రైవేటు రికార్డులు సాహిత్యానికి సంబంధించి తెలుగు నుడికారం ఎక్కడా జారిపోకుండా, సంభాషణాత్మకంగా, వర్ణనాత్మకంగా రాగభావం మొత్తం పద్యాన్నంతా ఆవరించి ఉండడం కనిపిస్తుంది.

11 Responses to సాలూరు చినగురువుగారు