పట్రాయని సుధారాణి
సంగీత సాహిత్యరచన చేసి గాత్రజ్ఞులై దానిని గానం చేసేవారు వాగ్గేయకారులు. తెలుగు సాహిత్యచరిత్రలో వాగ్గేయకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్షేత్రయ్య, అన్నమయ్య వంటివారు శృంగార భక్తిరస ప్రధానములైన రచనలు చేసి, గానం చేయడంలో ప్రసిద్ధులైన వారు. అలాగే జయదేవుడు, నారాయణ తీర్థులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి ఎందరో మహానుభావులు మన సాహిత్యాన్ని, సంగీత శాస్త్రాన్ని ఉత్కృష్టమయిన స్థితిలో నిలిపిన వాగ్గేయకారులు.
ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థానికి చెందిన సంగీత విద్వాంసుడు, రసవద్గాయకుడిగా ప్రజామోదం పొందిన పట్రాయని సీతారామశాస్త్రిగారు అటువంటి వాగ్గేయకారుల కోవకు చెందుతారు.
పట్రాయని సీతారామశాస్త్రిగారిని గొప్ప సంగీత విద్వాంసుడిగా, సాలూరు చినగురువుగారు అనే పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతాలలో చాలామంది ఎరుగుదురు. మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి విజయనగరంలో సంగీతవిద్య నేర్పిన గురువుగారిగా మరికొంత మందికి తెలుసు. 2010 సంవత్సరం సీతారామశాస్త్రిగారి 110వ జయంతి సందర్భంగా మే 24వ తేదీన మద్రాసు మ్యూజిక్ అకాడెమీ మినీహాల్ లో శాస్త్రిగారికి స్వరనివాళినర్పిస్తూ జయంత్యుత్సవ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాస్త్రిగారి స్వరరచనలకు ప్రాచుర్యం కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ నేపథ్యంలో సీతారామశాస్త్రిగారికి సంబంధించిన జీవితవిశేషాలను, రచనలను ఈ తరం వారికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ వ్యాసరచన సాగింది.
సీతారామశాస్త్రిగారి జీవన రేఖలు
పట్రాయని సీతారామశాస్త్రిగారు పట్రాయని నరసింహశాస్త్రిగారి కుమారుడు. ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన సాలూరు, విజయనగరం సంస్థానాలలో, ఒరిస్సారాష్ట్రంలోని బరంపురం, పర్లాకిమిడి వంటి ప్రాంతాలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసులుగా ప్రసిద్ధి పొందిన పట్రాయని నరసింహశాస్త్రిగారు ‘సాలూరు పెదగురువుగారు’ గాను, పట్రాయని సీతారామశాస్త్రిగారు ‘సాలూరు చిన గురువుగారు’ గాను ఉత్తరాంధ్ర ప్రజల ఆదరాన్ని పొందారు.
సీతారామ శాస్త్రిగారి బాల్యం
పట్రాయని సీతారామశాస్త్రిగారు 1900 సంవత్సరం మార్చి 20న (ఫాల్గుణశుద్ధ విదియ, ఆదివారం) జన్మించారు. అతి చిన్న వయసులోనే మాతృవియోగం కలగడం వల్ల మాతామహుల ఇంటిలోనే పది సంవత్సరాలపాటు పెదతల్లి చెల్లమ్మగారి సంరక్షణలో పెరిగారు.
మాతామహులు మధురాపంతుల కూర్మన్నగారు. మానాపురం దగ్గర గుడివాడ అగ్రహారంలో వ్యవసాయవృత్తి ఆధారంగా జీవిస్తూ ఉండేవారు. సీతారామశాస్త్రిగారిని బాల్యంలో చిట్టిబాబు అని పిలిచేవారుట. తాతగారు కూర్మన్నగారు ఇసుకలో ఓం నమః వ్రాయించి అక్షరాభ్యాసం చేయించారు. బాలరామాయణం కంఠస్థం చేయించారు. అంతకుమించి సీతారామశాస్త్రిగారు ఏ బడిలోనూ చదువుకోలేదు. ఆవులు కాస్తూ, గాలిపాటలు పాడుకుంటూ, తాతగారికి పూజాపునస్కారాలలో సహాయం చేస్తూ పదిసంవత్సరాలు వచ్చేవరకు స్వేచ్ఛామయ జీవితం గడిపారు.
పట్రాయని నరసింహశాస్త్రిగారికి ముగ్గురుపిల్లలు. వారిలో ఒక కుమారుడు, కుమార్తె చనిపోగా మిగిలిన పుత్రుడు, సీతారామశాస్త్రిగారు. కొంతకాలానికే భార్య సూరమ్మగారు కూడా స్వర్గస్థులు కావడం నరసింహశాస్త్రిగారిని తీవ్ర మానసికవేదనకు గురిచేసింది. కుమారుడిని గుడివాడ అగ్రహారంలో మామగారు కూర్మన్నగారి సంరక్షణకు వదిలి దేశాటనం ప్రారంభించారు. అత్యంత శ్రద్ధాసక్తులతో నేర్చుకొని, అప్పటికే ప్రావీణ్యం సంపాదించిన దాక్షిణాత్య సంగీతం ఆయన జీవికకు ఆధారం అయింది. ఒరిస్సాలో జమీందారీ ఆస్థానాలకు చెందిన రాజుల ఆదరణలో చాలాకాలం గడిపారు. ఘనమైన సన్మానాలను అందుకున్నారు. జరడా, పర్లాకిమిడి, చినకిమిడి, ధారాకోట, చీకటికోట ఇంకా అనేక చిన్న చిన్న సంస్థానాలు నరసింహశాస్త్రిగారిని ఆదరించాయి.
పిల్లవాడు తండ్రిదగ్గరే పెరగడం మంచిదన్న అభిప్రాయంతో మాతామహులు పదిసంవత్సరాల వయసుగల సీతారామశాస్త్రిగారిని తండ్రికి అప్పగించారు. నరసింహశాస్త్రిగారు అప్పటికి బరంపురంలో సంగీత శిక్షకులుగా కొంత మానసికంగా, ఆర్థికంగా స్థిరపడ్డారు. బరంపురంలో త్రిపాసూరి ముఖ్యప్రాణరావు, చక్రవర్తిపంతులుగారు వీరిరువురినీ అత్యంత ప్రేమానురాగాలతో ఆదరించారు.
సీతారామశాస్త్రిగారు తండ్రివెంట తిరుగుతూ ఆయన సంగీతం చెప్పుకొనే ఇళ్ళలోని విద్యార్ధులతో పాటుగా సంగీతం నేర్చుకున్నారు. ప్రత్యేకంగా తండ్రిగారు సంగీత శిక్షణ అంటూ ఇవ్వలేదు. తండ్రి చెప్పిన పాఠాలన్నీ వారి విద్యార్థులతో పాటు నిత్యపారాయణ చేసేవారు. సంవత్సరం తిరిగే సరికి సంగీత గ్రంథం కంఠస్థం అయింది. తరువాత స్వయంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పన్నెండవ ఏడు వచ్చేసరికి సహజమయిన ప్రతిభా వ్యుత్పత్తుల వలన బాలగురువుగా పేరు సంపాదించుకున్నారు.
బాలుడైన సీతారామశాస్త్రిగారి మీద ఏదో అవ్యాజమైన అనురాగం ఏర్పరచుకున్న ఒక వంటబ్రాహ్మణుడు, నరసింహశాస్త్రిగారికి నచ్చచెప్పి తను పనిచేసే నాళంవారి సత్రానికి తీసుకొని పోయి, తల్లికన్నా ఎక్కువగా సంరక్షించేవాడుట.
బరంపురం మంగళవారప్పేటలోని విద్యార్థి బృందంతో సీతారామశాస్త్రిగారికి అనుబంధం ఉండేది. ఒక దేవాలయంలో ఆ బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి కచేరి చేసి స్వర్ణ కంకణం అందుకున్నారు.
ఆ రోజుల్లో బరంపురం గొప్పవిద్యాకేంద్రం. గొప్పసాహిత్యవేత్తలు, సంగీత విద్వాంసులకు నిలయం. ఆ వాతావరణంలో ఏ మహాపండితుల, విద్వాంసుల ప్రభావం పడిందో తెలియదుకానీ, పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రత్యేకమైన విద్యాభ్యాసం చేయకపోయినా, స్వయంగా పద్యాలు వ్రాయడం, స్వతంత్రంగా సంగీత రచన చేయడం అలవోకగా అలవడ్డాయి సీతారామశాస్త్రిగారికి.
తండ్రీకొడుకులు ఇద్దరూ ఎవరికి వారే ధనసంపాదన చేసేవారు. ఒరిస్సాలో చాలా జమీందారీలలో తండ్రి, కొడుకు కలిసి కచేరీలు చేసారు. జరడా, చీకటి కోట, చినకిమిడి, పెదకిమిడి వంటి చిన్నచిన్న సంస్థానాలు వీరిరువురినీ సన్మానించాయి. బరంపురం, జయపురం, ధారాకోట, విజయనగరం, తణుకు మొదలైన ప్రదేశాలలో అనేక సంగీత కచేరీలు చేసి ఘనసన్మానాలు, మెడల్స్ అందుకున్నారు.
సాలూరు జీవితం
నరసింహశాస్త్రిగారు, కుమారుడు సంపాదించిన ధనంలో రూపాయికి కాణీ వంతున అతని ఖర్చుకి ఇచ్చి మిగిలినసొమ్మును ఆదా చేసేవారుట. ఆవిధంగా మిగిల్చిన ధనంతో బొబ్బిలి సమీపంలోని ఆనవరం అగ్రహారం దగ్గర కొద్దిగా భూమిని కొన్నారు. వృద్ధురాలైన నరసింహశాస్త్రిగారి తల్లి ఆనవరంలోనే తన కుమార్తె వద్ద ఉండేవారు. ఆమెని చూడడానికి వెళ్లినపుడే సాలూరు, బొబ్బిలి రాజాస్థానాలను దర్శించడం, వారి కోరిక మీద సాలూరులో స్థిరపడడం జరిగింది. సాలూరులో తండ్రీ కొడుకుల సంగీత శిక్షణలో ఎందరో, గొప్ప సంగీత విద్వాంసులుగా రూపుదాల్చారు. అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు ఆదినారాయణరావు నరసింహశాస్త్రిగారి శిష్యులే. సాలూరులో స్థిరపడేనాటికి సీతారామశాస్త్రిగారు నవ యువకులు.
సాలూరు రాజులు సవరలు. సాలూరు, ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం ప్రాంతంలో ఉండేది. రాజుల భాష ఒరియా అయినా తెలుగు భాషా సాహిత్యాలమీద సంగీతం మీద చాలా అభిమానం ఆదరణ చూపేవారు. సాలూరు చిన్న సంస్థానమే అయినా కళలను ఎంతగానో ఆదరించింది. సాలూరు అధిపతులలో పదవతరానికి చెందిన లక్ష్మీనరసింహ సన్యాసిరాజు కళలకు మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. అతని భార్య కృష్ణపట్ట మహాదేవి కూడా సంగీత కళానిధి. ఈ రాజుగారు సంగీతసాహిత్యాలకే గాక నాటకాలకు కూడా ప్రోత్సాహం ఇచ్చినవారు. అంతేకాక స్వయంగా నాటకాలలో వేషాలు కూడా వేసేవారు. రాజుగారు మంచి మార్దంగికులు కూడా. రాజకుటుంబాలన్నిటి తోటి శాస్త్రిగారికి ఆత్మీయమైన అనుబంధం ఉండేది.
సాలూరు రాజావారికి, సీతారామశాస్త్రిగారికి మంచి స్నేహం. రాజుగారికి నాటకాల సరదా ఉండేది. నాటకం రిహార్సులకు ఒక సమయం అంటూ ఉండేది కాదు. ఆ నాటకాలకు చినగురువుగారు హార్మోనియం వాయిస్తూ ఉండేవారు. వేళాపాళా అంటూలేని ఈ కార్యక్రమాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తండ్రి నరసింహశాస్త్రిగారు ఆందోళన పడేవారు. ఆనాటికి ఆయన ఒకయోగిలాగ, సన్యాసి జీవితం గడిపేవారు. సాలూరులో స్థిరపడేనాటికి తండ్రీ కొడుకుల జీవన విధానంలో చీలిక వచ్చింది.
సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల అక్కడ నాట్య, సంగీత శిక్షణకు అవకాశం చాలా ఉండేది. గృహస్తుల కుటుంబాల పిల్లలకు పెదగురువుగారు, భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు. ఏ సంఘటనల ప్రభావమో కానీ కొంతకాలానికి వేశ్యలకు సంగీతం చెప్పనని శపథం చేసుకున్నారట సీతారామశాస్త్రిగారు.
సాలూరులో స్థిరపడిన వెంటనే చినగురువుగారికి కిండాం అగ్రహారానికి చెందిన ఆయపిళ్ల లక్ష్మీనారాయణ గారి కుమార్తె మంగమ్మగారితో వివాహం జరిగింది. స్వేఛ్ఛామయ జీవితం గడుపుతున్న చినగురువుగారికి సంసారబంధం కళ్ళెం వేసింది. మానసికంగా, ఆర్థికంగా జీవితానికి కట్టుబాటు ఏర్పడింది.
జీవనభృతి కోసం పాటుపడుతున్న రోజులలో ఫీల్కానా శివరావు పంతులుగారి ఆహ్వానంపై శ్రీకాకుళంలో నివాసం ఏర్పఱచుకున్నారు. గుడివీధిలో కొంతకాలం, పాలచెట్టువీధిలో కొంతకాలం నివసించారు. అప్పటికి ముగ్గురు మగపిల్లలు సంతానం. పెద్దకుమారుడు సంగీతరావు, రెండవకుమారుడు నారాయణమూర్తి, మూడవకుమారుడు ప్రభాకరరావు. ఆఖరిపిల్లవాడు రెండు సంవత్సరాల వయసులో ఉండగా మంగమ్మగారు స్వర్గస్థులయేరు. అప్పటికి చినగురువుగారికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పునర్వివాహం తలపెట్టలేదు. తల్లిలేని పిల్లలు ఒక్కొక్కరుగా మాతామహుల దగ్గరనుండి సీతారామశాస్త్రిగారి దగ్గరకు చేరారు.
శాస్త్రిగారి తండ్రి నరసింహశాస్త్రిగారు సాలూరులో లూథరిన్ చర్చి వెనక, చిన్న ఇంట్లో ఉండేవారు. సీతారామశాస్త్రిగారు పిల్లలతో పాటుగా తండ్రి వద్దకు వచ్చి సాలూరులో స్థిరపడ్డారు. ఆయన పెదతల్లిగారి కూతురు అయిన నరసమ్మగారు వీరందరి సంరక్షణభారం వహించారు.
దేశాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న కాలం అది. ప్రజలకు గడ్డు రోజులు. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులులేవు. డబ్బు ఖర్చుచేసి సంగీత కళని సాధన చేసేవారు అప్పటి ఆంధ్ర దేశంలో తక్కువ. అందువల్ల ధనసంపాదనకు సంగీత శిక్షణ ఇవ్వడమో, కచేరీలు చేయడమో తప్ప వేరే మార్గం లేక, దేశాలు పట్టుకుని తిరగవలసి వచ్చింది చినగురువుగారికి. రెండు మూడు మాసాల గ్రాసానికి సరిపడా డబ్బు సంపాదించి సాలూరుకు తిరిగివచ్చేవారు. సాలూరులో ఉన్న సమయంలో విద్యార్థులకు ఉచితంగా సంగీత పాఠాలు చెప్తూ ఉండేవారు.
పెదగురువుగారు నరసింహశాస్త్రిగారు సంగీతాన్ని సంప్రదాయానుసారం ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నారు. సంప్రదాయానికి ఏ మాత్రం భంగం ఏర్పడినా ఆయన తట్టుకోలేక పోయేవారు. కానీ చినగురువుగారిది సృజనాత్మకమైన స్వతంత్రమార్గం. గానసభలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసుల కచేరీలలో గాయకులు పాడిన కీర్తనలు విని, తనకి రానివి ఉంటే తన పద్ధతిలో వాటికి రాగతాళాలతో స్వంతంత్రంగా స్వరరచన చేసేవారు. సంప్రదాయమైన కీర్తనలతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించే విధంగా పద్యరచనలు చేసి వాటిని ఎంతో మధురంగా గానం చేస్తూ తన సభలను జనరంజకం చేసేవారు. ఈవిధంగా చినగురువుగారి కచేరీ పద్ధతి జనాకర్షణ కలిగి, ఎంతో ప్రజాదరణకు నోచుకున్నా పెదగురువుగారికి మాత్రం అసంతృప్తి కలిగించేది. సంప్రదాయహాని జరుగుతోందని వ్యాకులపడేవారు. చినగురువుగారు దీన్ని పట్టించుకునేవారు కాదు. తండ్రి మరణించిన తరువాత చినగురువుగారిలో సంప్రదాయం పై కొంత అభిమానం కలిగింది.
సాలూరులోని శ్రీ శారదా గాన పాఠశాల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. నరసింహశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు కలిసి 1919 లోనే విద్యార్థులకు ఉచితంగా సంగీతబోధ చేయాలనే ఆశయంతో సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి, సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. నరసింహశాస్త్రిగారు మరణించాక సీతారామశాస్త్రిగారు పాఠశాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. పూరిల్లులా చుట్టూ వెదురు మణిగింపుతో పర్ణశాల రూపంలో ఉండేది పాఠశాల. రంగారావు పంతులుగారి సహకారంతో పర్ణశాల రూపం నుండి భవనంగా మార్చడానికి ప్రయత్నం చేసారు. కానీ ఆ ప్రయత్నం పునాదులతో ఆగిపోయింది. సీతారామశాస్త్రిగారి అనారోగ్యం వంటి కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ రెండేళ్ళ తరువాత శాస్త్రిగారు స్వయంగా పూనుకొని కొందరు పురప్రముఖుల సహాయంతో సాలూరు తాలూకాలోని వివిధ గ్రామాలలో పాఠశాల నిమిత్తం కచేరీలు చేసి, సాలూరు ప్రజలు ఇచ్చే అతి చిన్న మొత్తాలను విరాళాలుగా స్వీకరించి పాఠశాలన భవనరూపంలోకి మార్చారు. మొత్తానికి 1936 నాటికి సాలూరు గ్రామస్థుల సహకారంతో, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల అండదండలతో, శాస్త్రిగారి దేశాటనలో వివిధ ప్రాంతాలలో చేసిన కచేరీలతో సంపాదించిన సొమ్ముతో పాఠశాల నిర్మాణం పూర్తయింది.
ఆంధ్రదేశం, ఒరిస్సా ప్రాంతాలనుంచి ఎందరో విద్యార్థులు ఎంతో శ్రద్ధగా సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. సంగీత విద్యార్థులలో వయోభేదంకాని, జాతి భేదాలు కాని ఉండేవికావు. అనేక వృత్తులకు చెందినవారు విద్యార్థులుగా వచ్చేవారు. పాఠాలకి ప్రత్యేకమైన వేళలు కూడా ఉండేవికావు. ఇలా నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్ధులలో చాలామంది నిర్థనులే. సాలూరు ప్రజలు ఈ విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు సంగీత పాఠాలు ఉచితంగా చెప్పినా, వారికి భోజన సౌకర్యాలు కల్పించడం చిన గురువుగారికి తలకు మించిన భారం అయేది. సాలూరులో ఉన్న చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు కాని ఆధారం కానీ లేవు. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతాలలో గురువుగారికి చాలామంది అభిమానులు ఉండేవారు. వివాహాలకు, ఉత్సవాలకు గురువుగారు చేసే కచేరీలే జీవికకు ఆధారం.
జయపురం మహారాజు విక్రమ దేవవర్మ గారు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపేవారు. ఉత్సవాలకు వచ్చే కళాకారులు, కవులు అందరికి సాలూరులోనే మకాం. సాలూరు రాజుగారి సహాయం, పౌరుల సహాయంతో వారందరినీ చినగురువుగారు ఆదరించేవారు. సాలూరుకు వచ్చే హరిదాసులకు కార్యక్రమాలు ఏర్పాటుచేసి, వారికి హార్మోనియంతో పక్క వాయిద్య సహకారం ఇచ్చేవారు.
పాఠశాలను అభివృద్ధి చేయాలని, సంగీత విద్యార్థులకు ఉచిత శిక్షణతో సహా సకల సౌకర్యాలు కల్పించాలని, అనేక మంది పండితులను అధ్యాపకులుగా రప్పించి బోధన చేయాలని, భక్తి, జ్ఞాన వైరాగ్యాల ఆదర్శంలో సంగీత విద్యా ప్రచారం చెయ్యాలని సీతారామశాస్త్రిగారు ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ భగవత్సంకల్పం వేరుగా ఉంది.
ఆర్థికంగా గురువుగారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలిసిన ఆయన శిష్యులు విజయనగరం సంగీత కళాశాలలో వోకల్ పండితుడి పదవికి దరఖాస్తు పంపించారు. తరువాత ఆ పదవిని కాదనుకోవడం చినగురువుగారి ఆత్మగౌరవానికి పరీక్షగా తయారయింది. విజయనగరంలో జరిగిన విద్వత్పరీక్షలో నెగ్గి ఆ పదవిని దక్కించుకున్నారు. తాను అమితంగా ప్రేమించిన తన పాఠశాలను, తనను ఆదరించిన సాలూరును వదిలివెళ్ళవలసి వచ్చింది. తన శిష్యులకు పాఠశాలను అప్పగించి విజయనగరం వెళ్లి వోకల్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ప్రవేశించడానికి సాలూరు విడిచి వెళ్లిన సందర్భంలో సాలూరు ప్రజలు శాస్త్రిగారికి ఘనసన్మానం జరిపి అశ్రు నయనాలతో ఆత్మీయమైన వీడ్కోలు పలికారు


11 Responses to సాలూరు చినగురువుగారు