సమానత్వం

– చావా కిరణ్

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

బీయీడీలు యంయీడీలు అయినా ఖాలీగున్నాం
పదయింది, పన్నెండయింది తరువాత ఏంటి?
బీడుభూములన్ని ఆవురావురమంటున్నాయి
శమంతకముంది గాని స్వర్ణమే నిలవడంలేదు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

బీయీడీలకు యంయీడీలకు ఉజ్జోగాలిత్తాడు
పదికి పన్నెండుకు విజ్ఞాన్నిస్తాడు
బీడు భూములకు నీళ్లిస్తాడు
శమంతకం పట్టి స్వర్ణం నిలుపుతాడు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

ఎండకు వానకు నే మగ్గుతుంటే
ఆ రాజ్యపోడికి తాటాకు గుడిసెలు
అయోమయాన నే నిలబడితే
వాడేమో పరుగెడతాడా.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

వాడి గుడిసె పీకి
నాకు పందిరేస్తాడు
వాడి కాళ్లిరిచి
సమానత్వం తెస్తాడు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

6 Responses to సమానత్వం

Comments are closed.