కో హం

-హెచ్చార్కె

ఏడుపు వస్తోంది
ఎట్నుంచి ఎటో వెళ్తూ
ఒక పాడువడిన పాకలో
తల దాచుకున్నాను
ఇక్కడెవరో నివసించిన,
పిల్లల్ని కని పెంచిన,
చనిపోయిన గుర్తులు
నేను దేన్ని వెదుక్కుంటున్నాను?
ఎక్కడ పోగొట్టుకున్న ఆశను?
ఎట్నుంచి వచ్చానో ఎటు వెళ్తున్నానో
తెలియనివ్వకుండా
కళ్లను కబళించేంత కాటుక వంటి చీకటి

దూరంగా బండ్లు వెళ్తున్న చప్పుడు
బండి చక్రాల రాపిడిలో
ఇక తిరిగి రాదల్చుకోలేదనే లోహ ధ్వని
విషాదంగా మోగుతున్న ఎద్దుల మెడ గంటలు
ఇష్టం లేని ప్రయాణం, అమావాస్య రాత్రి
కాసేపు ఇక్కడ మజిలీ చేయరాదా?
అంతగా నొచ్చుకుని వెళ్లడమెందుకు, ఆగిపోరాదా?
అయినా, నాకెందుకు ఏడుపు?
రేపటి సంగతి రేపే అనుకుని నిద్రపోరాదా?

అడ్డదిడ్డంగా పరుచుకున్న గడ్డి పక్కలో
ఎంత వెదుక్కున్నా దొరక్కుండా
గుచ్చుకుంటున్న గుండు సూది
జవాబు కోసం ఒక్కొక్క గడ్డిపోచను తీసి
చూసి పారేయడానికే ఈ రాత్రి చాలేట్టు లేదు
అంధకారంతో కలిసి వెలుగు ఉంటుంది గాని,
కళ్లు కనపడ్డానికి అవసరమైనంత కాంతిని
పిండుకోడానికి ఈ చీకటి చాలేట్టు లేదు

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

26 Responses to కో హం

Comments are closed.