— కాజ సురేశ్ (surkaja@gmail.com)
ఏ కులము, ఏ మతముర నీది
దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు
ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ
యాస బాసల ముక్కలంత
అవసరమా, ఓరి ఎర్రిబాగులోడ

గోచీ వేమనా, ఆడెవ్వడు
మాకు నీతులుచెప్పెటోడా
ఆదికవి మీ గోదాటొడ్డువాడా
మీ పోతన మా రాయల కొలవునుండెటోడా
కాళోజీ!! కాడు వాడు మా సీమపక్కోడు
శ్రీశ్రీ!! హూ వాడు వట్టి ఉత్తరాంధ్రవాడు
‘ఇజాలు’లేని దాశరథిదేమి కవితరా
వాడు మెచ్చిన ఆ ‘ఎఎన్ఆర్’దేమి నటనరా
కృష్ణమూర్తి వేమి ‘జిడ్డు’రాతలురా
మీ ‘సినారె’దేమి బడాయి
ఆడి కంటెముందె మా ‘విశ్వనాథు’డు
‘గ్యానపీట’ నెక్కెనోయి
క్షేత్రయ్య, ఘంటసాల గొంతులు మావొంతు
బద్రాద్రి రామదాసు ఆడి వొంతు
తాళ్లపాక అన్నమయ్య ఈడి వొంతు
త్యాగయ్యను ఇసిరి పారెయ్యరా
ఆడు ఎప్పుడో తమిళోడివంతు.
ఇయ్యన్నీ పచ్చినిజాలు
కాదు గీదు మనమంత ఒకటని గింజుకుంటనంటే,
పోయి దూకరాదె గోదాట్లోన
పారుతున్నాదది ఏ నడిబొడ్డులోన
సన్నబడిపోయి ‘బాబ్లీ’ మూలాన
అటు పోరాటాల పురిటిగడ్డ
త్యాగాల తెలంగాణ
ఇటు రోసాల రాయలసీమ
అటు కొమరము భీమన్న
ఇటు ఉయ్యలవాడ నరసింహ
మన మన్నెం దొర అల్లూరి
పోరలేదా వీరంతా నా ఛాతి పొంగిపోయేల!!
నైజాము నిరంకుశాన్ని
తెల్లోడి సామ్రాజ్యవాదాన్ని
మీసం మెలెయ్యలేనా ఇంకా, ఏం
వాడు మా ప్రాంతపోడు కాదు గదాని?
సుబ్బారాయుడు, పైడితల్లి, తిమ్మప్పలదేమి బంధము
యాదగిరితో లేని అంత పెద్దచుట్టరికము?
పాలమూరు పాలెగాడ్నినేను
అంబలైన లేని అన్న అనంతపురమునుండ
కరీమునగరు దొరెట్టా నావోడు?
కల్లు తీసెటోడ్ని, బట్టలుతికెటోడ్ని,
కాళ్లు పట్టెటోడ్ని, బొగ్గు గనుల్లో నలిగెటోడ్ని
‘అబ్బా అమ్మా’ అది ఏ యాస అయితేమి
నా తమ్మి అన్నిప్రాంతాలా పడే ప్రయాస ఒకటె గాదా!!
కాకా హోటలెట్టి, కప్పులన్ని కడిగికడిగి
కోరినన్ని ఇడ్డెనులెట్టి కాయకష్టము
చేసెటోడి మీద ఎందుకన్న అంత గుస్సా?
ఫ్లోరైడు నీళ్లు తాగి, నడుము నిక్కిపోయి,
నీ వళ్ళుగుల్లైతే, ఏడ తొంగున్నాడన్నా
ఆ ఎమ్మెల్లే, ఎంపీఓడు?
నీ సొమ్మంతా దోచిదోచి, గోచీగూడ
మిగలకుండా జేసిన నీ ఇలాక ఏలేటోడ్ని
నిగ్గదియ్యరాదే అన్న
ఆడెక్కడ పండినాడో గదన్న!!
మంత్రులు, సిఎమ్ములు, పియమ్ములు
ఎందరిని పంపలేదే అన్న
వాళ్లేమి ఊడబొడిసారే అన్న
మార్చకుంటే ముందుముందు
ఏలేటోళ్లు ఆళ్లే గదన్నా!!
రియలుదందాలెన్నో జేసి, గనులన్నీ కొల్లగొట్టి
సొమ్ములేన్నో కూడబెట్టారీ ఘనులు
ఆ దోపిడి చాలలేదా
ఎందుకన్నా ఆళ్లకోసం నీ బస్సుల తగలెట్టడం?
ప్రాజెక్టులు, ఫాక్టరీలు
పక్క రాష్ట్రపోడు పట్టుకెళ్తె మౌనం
రైలు, రక్షణ, హోము, విత్త
మంత్రి పదవులన్ని వేరేటోళ్లకెళ్తె ఆమోదం
హస్తి’నమ్మ’కు తెలుగు గౌరవం
తాకట్టు పెట్టినప్పుడులేని పౌరుషం
ఇప్పుడెందుకు ఈ కొత్త’రాగం’?
ఎందుకీ నిరసనలు ఈ నిరాహారదీక్షలు
ఎంతవరకు నిజమీ ఉపవాసం
ఎవరికోసమీ ఆయాసం?
ఈ మరుగుజ్జులా మన భావి ‘పొట్టి’ శ్రీరాములు?
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు
మేలుకో తమ్ముడా!!!
ఇనపడలేదా ఆ వెక్కి వెక్కి ఏడ్పులు
గుచ్చే గునపాల హోరులో
ఆ మాయ మాటల మోతలో?
కనపడలేదా ఆ కన్నీళ్లు
ఈ కాళ నిశీధిలో?
ఎందుకమ్మా ఆ కన్నీరు ఓ మాయమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ
మా మేటి తెలుగు పెద్దమ్మ
సింహాద్రి అప్పన్న
యాదగిరి నరసన్న
చిత్తూరు ఎంకన్న
నీ బిడ్డలనింక చల్లగా ఆళ్లే చూడాల
ఈ కాళరాత్రి గడిచిపోవాల!!!
18 Responses to తెలు’గోడు’