తెలుగులో మాట్లాడినందుకు, ఒక పాఠశాలలో “తెలుగులో ఎప్పుడూ మాట్లాడను” అని రాసిన పలకను పిల్లల మెడలో తగిలించారు. ఈ మధ్య ఈ వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రంలోనే తెలుగు భాషకు జరిగిన అవమానం పట్ల ప్రజలు క్రోధం వెలిబుచ్చారు, బాధపడ్డారు. సమంజసమైన క్రోధమే. మాతృభాషలో మాట్లాడినందుకుగాను శిక్షనెదుర్కోవాల్సిన పరిస్థితిని మనం సహించాల్సివస్తోంది. భాషాభిమానులందరికీ బాధ కలిగించే సంఘటనే ఇది. కానీ ఈ సంఘటన ఆ పాఠశాలకే పరిమితమైనదా? రాష్ట్రంలో మరే బడిలోనూ లేదా? అసలు, సమస్య అదేనా?
తెలుగు తప్ప మరో భాష రాని పసికందులను ఇంగ్లీషులో చదువుకోవాలనే/మాట్లాడాలనే శిక్ష వేస్తున్నారు. ఎందుకు వాళ్ళకీ శిక్ష? ఎవరు వేస్తున్నారీ శిక్ష?
…………
ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనేది ప్రపంచవ్యాప్తంగా విజ్ఞులు చెప్పేమాట!
పుట్టినప్పటి నుంచీ బిడ్డ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగే నేర్చుకుంటాడు. అతడు బువ్వ తింటాడు, ఆడుకుంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, కొడతాడు, పాడతాడు. అంతేగానీ హి డస్ నాట్ ఈట్, డస్ నాట్ ప్లే, డస్ నాట్ లాఫ్, డస్ నాట్ క్రై ఆర్ వీప్! తెలుగు భాషలో, తెలుగు వాతావరణంలో, తెలుగు సంస్కృతిలో మూడేళ్ళు పెరిగిన పిల్లవాడికి, బడిలో చేరగానే వాట్జ్స్యువర్నేమ్, వాట్జ్స్యువర్నిక్నేమ్ అంటూ మాట్లాడితే ఏమర్థమౌతుంది? మనల్ని హఠాత్తుగా స్వాహిలి మాట్లాడే వాళ్ళ మధ్య పడేస్తే మన పరిస్థితి ఏమిటి? “దప్పికతో నోరు పిడచకట్టుకు పోతోంది, కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి” అని తెలుగులో ప్రాథేయపడితే, మంచినీళ్ళు ఇవ్వకుండా “నేనో తెలుగు గాడిదను” అనే బోర్డు మన మెడలో తగిలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంగ్లీషు బడిలోకి నెట్టబడిన ఆ కసుగాయల పరిస్థితీ అదే!
తెలుగులో బోధన జరిగేటపుడు, భాషతో పిల్లలకు ఇబ్బంది ఉండదు -వారికి భాష ముందే వచ్చు కాబట్టి. వాళ్ళకు అక్షరాలు రావంతే! పుస్తకాల్లోని విషయాన్ని చదవేందుకు, చదివినదాన్ని తిరిగి రాసేందుకూ ముందు పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలి. అవి బడిలో చేరగానే నేర్చుకుంటారు. కానీ ఇంగ్లీషులో చదివే పిల్లలు ముందు ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలి. భాష నేర్చుకోవడమంటే చదవడం రాయడం నేర్చుకోవడం కాదన్న సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి.
మనిషి నుంచి మనిషికి సమాచార ప్రవాహం విషయంలో భాష ఎటువంటి పాత్ర పోషిస్తుందో “మాతృభాషలో ప్రాథమిక విద్య శాస్త్రీయ వివరణ” పుస్తకంలో డా. పమిడి శ్రీనివాసతేజ ఇలా రాసారు:
“సంభాషణ లేదా సమాచార మార్పిడి అర్థవంతంగా జరగాలంటే ఇద్దరి వ్యక్తుల మనసుల్లో ముందుగానే భాషకు సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి ఉండాలి. బిడ్డ పుట్టినప్పటి నుండీ జరిగే ప్రోగ్రామింగే భాషాభివృద్ధి. మనకు తెలుగులో ప్రోగ్రామింగు జరిగితే తమిళులకు తమిళ భాషలో ప్రోగ్రామింగు జరుగుతుంది. ఎవరికి ఏ భాషలో ప్రోగ్రామింగు జరూగుతుందో దాన్ని మాత్రమే అర్థం చేసుకోగలరు.ఇతర భాషను అర్థం చేసుకోలేరు. ఒక వేళ ఇతర భాషను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి తీరాలి. అంటే ఆ భాషను నేర్చుకుని తీరాలి.”
అంటే, మన కంప్యూటరుకు తెలుగు నేర్పకుండా పొద్దును చదవడానికి ప్రయత్నించడమెలాగో తెలుగు పిల్లలకు ఇంగ్లీషులో చదువు చెప్పడమలాంటిదే!
ఐరాస పనుపున స్థానిక భాషలపై ఏర్పాటైన అంతర్జాతీయ నిపుణుల సమావేశం ఇలా అభిప్రాయపడింది: మాతృభాషలో విద్యాబోధనే పిల్లలకు మేలని గుర్తిస్తున్నారు. భాషాపరంగాను, సాంస్కృతికంగాను సంబంధం ఉన్న విద్యనే బోధించడం ఆవశ్యకమన్న భావన పెరుగుతోంది. అలాగే మాతృభాషలో చదువుకున్న పిల్లలు, పరాయి భాషలో చదువుకున్నవారి కంటే మెరుగ్గా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఉచిత నిర్బంధ విద్య అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన సంఘం ‘విద్యార్థి మొదటి ఐదేళ్ళ చదువు మాతృభాషలోనే సాగాల‘ని చెప్పింది. పిల్లలలో బహుభాషా ప్రావీణ్యాన్ని పెంపొందించాలని చెబుతూ, ‘మాతృభాషలో చక్కటి ప్రావీణ్యం ఉంటేనే ఇది సాధ్యపడుతుంద‘ని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 తన నివేదికలో చెప్పింది.
జాతీయ, అంతర్జాతీయ నిపుణులే కాదు, స్వయంగా మన రాష్ట్రప్రభుత్వం కూడా ఈ సంగతే చెబుతోంది. మాతృభాషలో బోధన జరిగితేనే పిల్లలు ఆసక్తిగా నేర్చుకోగలుగుతారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం 8 గిరిజన భాషల్లో చదువులు చెప్పించే ఏర్పాట్లు చేసింది. సర్వ శిక్షా అభియాన్ కింద ఈ ప్రయోగం చేసింది. ఆయా భాషల్లో పుస్తకాలు తయారుచేయించింది. దీనితో ఆయా గిరిజన తెగలకు చెందిన పిల్లలు బడికి హుషారుగా రావడం, బడి మానేసేవాళ్ళు తగ్గిపోవడం గమనించినట్టు ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. గోండు, సవర వంటి భాషలలో చదువు చెప్పించే ప్రభుత్వం తెలుగు భాషలో చెప్పించకపోవడం విచిత్రంగా లేదూ?
…………
పిల్లలను ఇంగ్లీషులో చదివించడం పట్ల మనకు ఎందుకంత ఆసక్తి?
దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి.
1. తెలుగులో చదివించాలంటే తగిన వసతులు లేవు: తెలుగులో చదువు చెప్పే పాఠశాలలే బహు తక్కువ. ఉన్నవాటిల్లో చదువు సరిగ్గా చెప్పరు. అందుచేత ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి మనకు ఏర్పడింది. ప్రభుత్వం మనకీ దురవస్థ కల్పించింది.
2.ఇంగ్లీషులో చదివితేనే మంచి ఉద్యోగాలొస్తాయి అనే మిథ్య: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియములో చదివించుకోవాలని తహతహలాడుతున్నారు అని ఒక వాదన ఉంది. నిజమే, తమ పిల్లలు బాగ చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని అందరికీ ఉంటుంది. కానీ, పిల్లలు ప్రాథమిక విద్యను తెలుగులో చదవడానికీ, వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్టువేరు ఇంజనీర్లూ కాలేకపోవడానికీ సంబంధం ఏమీ లేదన్న సంగతిని గ్రహించక అలా అనుకుంటాం.
ఈ కారణాల వలన, ఎంత ఖర్చైనా భరించి, పిల్లలను ఇంగ్లీషు బడుల్లో చదివిస్తున్నాం. ప్రభుత్వానికి ఇది బాగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలల మీద వత్తిడి తగ్గిపోయింది గదా, మరి! ప్రజలు ఇంగ్లీషే కావాలని కోరుతున్నారు, అంచేత ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమంలోనే చదువు చెబుతామంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎటొచ్చీ పిల్లలే ఇంగ్లీషు శిక్షకు గురౌతున్నారు. వాళ్ళను ఈ శిక్ష నుంచి తప్పించే ఉపాయమేమీ లేదా?
ఉంది!
ప్రభుత్వ విధానాలను మార్చాలి, మనం మారడం కాదు.
తెలుగు భాషను, తెలుగు జాతినీ, తెలుగు సంస్కృతినీ కాపాడి, రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరికంటే ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని గ్రహించాలి. తెలుగులో ప్రాథమిక విద్య ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను – ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా – ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? భాషాభిమానులు ఈ విషయమై వత్తిడి తేవాలి. మన భాషను మనం రక్షించుకోకపోతే మరెవరూ మనకోసం ఆపని చెయ్యరు.
“ఏను తెలుగు వల్లభుండ” అంటూ తెలుగు భాషను పోషించిన నృపుణ్ణి నేటికీ – 450 యేళ్ళ తరువాత కూడా – ఎల్ల జనులూ కొలుస్తున్నారు. అతడికి ముందు, అతడి తరువాతా అనేక వందల మంది పాలకులు వచ్చారు, పోయారు. కానీ రాయలొక్కడే మనకు జననాయకుడు. మన ప్రభుత్వాధినేతలు ఈ నిజాన్ని గుర్తెరగాలి.
-చదువరి
———————-
ఈ అంశంపై మీ అభిప్రాయాలను వ్యాసాల రూపంలో ఆహ్వానిస్తున్నాం.
33 Responses to ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?