ఒక అనేకానేక నది… రెండవ మైథునం!

-అభిశప్తుడు

పైట జారుతున్నా పట్టని పచ్చి వయ్యారాలు…
పిరుదులూపుకుంటూ చిలిపి పరవళ్లు…
…ప్రళయకావేరి
నాదా…?
పోనీ నీదా?
మునగీతలేసిన మోహపు మచ్చలే నీ హక్కుకి సాక్ష్యాలా? దోసిట దాస్తావా… పుక్కిట పడతావా, లేదా పుస్తకాల దొంతర్లతో ఇరుకైన నీ గది మూల బుల్లి ఆక్వేరియంలో దిసమొలగా మెసలే మగచేపల ఎంగిలి కూడా అంటనివ్వక భద్రపరుస్తావా-
ఏదీ! బారెడు ప్రణయంలా చిక్కులు పడ్డ ఆమె జడ రెండోమారు పట్టు చూద్దాం!

* * * * * * * * * * * *

“నవంబర్ 29, 30… రెండ్రోజుల సదస్సు మీరు తప్పకుండా…”
… వచ్చి సమకాలీన సాహిత్యం ఏమైపోతోందో, ఎటుపోతోందో… అసలు పోతోందో, లేదో… స్తబ్దతే అయితే, ఇది క్షీణదశా, నిర్లిప్త దశా, లేక సంధి దశా… చర్చలు చేసి నిగ్గుదేల్చి సమాజానికి దిక్సూచులమై, దిశానిర్దేశం చేస్తూ…

చిత్తడితో లసలసలాడ్తున్న నల్లరేగడి నేలమీద వడగళ్లు రాలినట్టు, పంటపొలాల పచ్చని ఏకాంతం మీదకి మిడతల దండు తెగబడినట్టు… ఒక్కసారిగా ఆడిటోరియంలో చప్పట్లు,

అబ్బ… ఈ సోది వద్దు…
“నమస్తే! నా పేరు మీనలోచని… నేను బెంగళూరు…”
చాలు… ఇంతవరకు. ఆసక్తి రగిలించడానికి అంతకు మించి వివరాలు అనవసరం నాకు.
“నాపేరు మీనలోచని…”
స్వరం… మంద్ర మందాకిని!
ఊరు… మధుర సుషమ సుధాగాన మంజువాటి?
ఆ వివరాలు అలభ్యం…
లేదా మెదడుతో వెట్టిచాకిరి చేయించేందుకు కలిగిన సౌలభ్యం.
మీనలోచని…. అంటే చేపల్లాంటి కళ్లా?
ఏం చేపలు?
బొమ్మిడాయిలు, మట్టగిడుసులు, కొరమీను… లేదా సొరచేపలు, తిమింగలాలు (తిమింగలాలు చేపలేనా….?) కులగోత్ర నామాలు తెలుసు గానీ, ఆకారాలు తెలియవు.
ఇంతకీ చేపల్లాంటి కళ్లా, లేక చేప కళ్ల వంటి కళ్లా, రెప్పలు లేకుండా –
కనుబొమ్మల్లేని మొనాలిస వంటిదా, ఆ రెప్పల్లేని లాలస?
ఆ చిర్నవ్వు ఆరనిదా… అంతుచిక్కనిదా?
రెప్పలు లేకపోవడమా? లేక అనిమేష లోకంలోకి విప్పారి రెప్పలు వేయకపోవడమా?
అంటే అది రెప్పల్లేని తనమా? రెప్పవాల్చని తనమా?
అలాంటిదేదైనా అయితే, అది శాపమా… వరమా… (ఆమెకు కాదు) నాకు?

వెలుగు చీకట్లు మసక నీడలై చిరుచెమట్ల మీద తారాడే చిక్కని ఏకాంతంలో ఎంతకీ అలవాటు కాలేని పాతస్పర్శలు ఒంటిమీద ఒక్కొక్క నూగునే నిగ్గదీస్తూ చూచుకాన్ని ఉలిమొన చేస్తుంటే అరమోడ్పులై ఈ లోకంలో మూసుకుపోయి మరో లోకంలోకి మేల్కొనే సమ్మోహన దృశ్యాన్ని చూసే, పోనీ ఊహించే అవకాశం లేకపోవడం వరమెలా అవుతుంది…., శాపమే గాని.
ప్రమిదె కింద నక్కిన ఊదాకాంతి కలికాన్ని కాటుకగా పెట్టుకుంటుంటే విదియ చంద్ర దర్శనాలు వీలుకానితనం వరం కాదు, కచ్చితంగా శాపమే.
మహద్విశ్వ స్వప్నం అనబడే చెట్టుకు కాయని కలల్ని సగం కన్నుతో చూసీ చూడకపోవడం, సూర్యుడి సూదుల ఆక్యుపంచర్‌కి చీమకళ్లై చికిలించడం….
…ఇంకా అనేకానేక చిత్రరచనల్లాంటి చెలువాలని చేజార్చుకోవడం…. శాపమే కదా మీనలోచనీ …..అని ఆ టెలిఫోన్ సుందరికి ముఖానే చెప్పేయాలని ఆత్రపడి, సదస్సుకి హాజరయిపోతే డీలా పడిపోవాల్సి వచ్చింది.

“నమస్తే…. నేను మీనలోచని….”
ఈసారి ప్రథమ దర్శన సందర్భంగా, ప్రకాశంగా-
మీనాలు లేవు…. ఆకర్ణాంత లోచనాలూ లేవు, చేప పొలుసు లాంటి ఓ ముక్కెర, ఇంగిలాయి పిల్లలా కదిలే నవ్వు తప్ప. పాలతో… కాదు… కాదు… లేత పసుపు జున్నుపాలతో చేసిన బొమ్మ. ‘అమ్మోరు’ కదా అని గమ్మున బొట్టు పెట్టినా, కుంకుమ కంటే ఎర్రగా కందే మేను.

ఊహల ఉష్ణానికి ఉడికిన నా ఒళ్లు చప్పున చల్లారిపోయింది. ఆటలమ్మ దిగవిడ్చిన తర్వాత వేపాకుల చలవ స్నానం చేసిన తెరపిలా అనిపించింది, ఆమెకి ప్రతినమస్కారం చేస్తుంటే-
ఎరక్టైల్ డిస్ఫంక్షన్‌తో బాధపడుతున్నట్టు ఒరిగిపోతున్న కాగితాల కత్తులతో మర్యాదస్తుల మోమాటపు కదన కుతూహలం…
చర్చోపచర్చల్లో గురువులు.
చప్పట్లై మాటిమాటికి మార్మోగే ప్రశిష్యులు.
బిగి సడలి, ముట్లుడిగిన సింపోజియంతో రెండ్రోజుల బలవత్ రతి… సాధ్యమా?

“వేదిక నలంకరించిన పెద్దలకు…”
అమ్మో… మొదలైంది. ప్రత్యామ్నాయమని మర్యాదగా పిలవబడే అడ్డదారులేమైనా ఉన్నాయేమో తప్పించుకునేందుకని దేవులాడాను ఆదుర్దాగా. పరకాయించి చూస్తే…. ముసలి మేధో ముతక చీరలు, చిరుజల్లులకి తడిసి చివికిన న్యూస్‌పేపర్ ముడతలు, ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టినా కంటికానని సొగసు మడతలు.
“కృష్ణాకావేరి అపూర్వ సంగమమిది. బెంగళూరు నగరంలో నేడు కన్దెలుగై లేక తెన్కన్నడై పారే శ్రోతస్విని ఈ నవ్యసాహిత్య జీవనది…..”
ఇలా వక్తల మాటల గోళాలు కక్ష్యలు తప్పి పరిభ్రమిస్తున్న సమయం.

దొర్లుకొస్తున్న నిప్పు కణికలు…. కాదు, క్షణాలు మూకుమ్మడిగా చీకటి బిలంలోకి జారిపోతుంటే కాలం ఒడిసి పట్టలేని ‘వర్తమాన’మనే అబద్ధమే జీవితానికి ప్రతీక కావడం, బతుకు రథానికి పతాక కావడం ఎంత దుర్భరం?
పరిసరాలన్నీ… దుర్భరం… దుస్సహం… అసహ్యం…
ఈ మాలిన్యమంతా ఎక్కడ? బైటా, లేక లోపలా?
బైట, లోపల… అనే ద్వంద్వాలున్నాయా?
బైటదంటూ ఏదైనా ఉంటే, అది లోలోపలి ప్రతిబింబమేనేమో కదా..
అయితే, ఎరువు ఎనామిల్ లేని వెలుపలి అద్దాల మీద కుడిఎడమల తేడాతో తారాడే అసహ్య బింబాలు అన్నింటిలోనూ నేనేనా?
ఆ దుర్భర దుస్సహ అసహ్యం… అంతా నాదేనా? నేనేనా అంతటి నైచ్యం?
అంతటి రోత మీద అంతులేని వ్యామోహమేంటి నాకు, narcissistic గా నిత్యం బింబంతో సంపర్కించే నాకు!
ఏమో….

స్వీయస్తుతి… పరనింద వంటిదే కావొచ్ఛు. కానీ, స్వీయనింద పక్కవాడి ఔన్నత్యాన్ని గుర్తించిన పరస్తుతి కాదు, ఇరుకు గదుల బూజు దులిపే ఆత్మక్షాలనమూ కాదు… సరికదా, ‘స్వస్వరూప జ్ఞాన’మనే ముసుగుల ఎరుక చాటు దొంగ కన్ఫెషన్. ఆశిస్తున్నదేదో అందట్లేదనే ఉక్రోషం….
ఏం కావాలి నాకు… అసలేం కావాలి?
‘జీవితమంతా చిత్రమైన పులకింత’ కావాలి, చీదరింపుతో కలిగే గగుర్పాటు కాదు.
‘నెనరు కూరిమి ఈనాడే పండెను….” అన్నపాట నిజం కావాలి!
కూరిమి… స్నేహం… చెలిమి…
‘నీ చెలిమి లోనున్న నెత్తావి మాధురులు…”
ఆ నెత్తావి మాధురులు కావాలి
ప్చ్… లేదు… అంత ఆశకు ఆస్కారం లేదు.
చెలిమే లేదు… ఇక నెత్తావి…
‘నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేల…’
‘ప్రళయకాల మహోగ్ర భయద జీమూతోరు గళ ఘోర గంభీర ఫెళఫెళార్భటుల’లో తటిల్లతల్ని తోడిచ్చి ‘నేనున్నా’నని భరోసా ఇచ్చే చెలిమికి అవకాశమే లేదు.
నేను హేమంత కృష్ణానంత శార్వరిని…
నా కుగాదులు లేవు… నాకుషస్సులు లేవు….
ఏమీ లేవా ఉషస్సులు…
నా ఉషస్సు… ఉష…. నా పిల్లలు…
నా చీకట్లు చీల్చే కోటి కిరణాల ఉషస్సు కావడానికి కర్పూరకళికై మండి అంతర్వేదనై కరిగిపోతున్న నా ఉష! సాంధ్యారుణిమతో నా తూరుపు వాకిలి ముస్తాబు చేయడానికి అనూరుడిలా నిత్యం నెత్తురోడే నా ఉష… నా ఇద్దరు పిల్లల తల్లి!
“నువ్ గుర్తించవు గానీ, నీ బ్రతుకు కూడా చిత్రమైన పులకింతే…”
…హితవు చెప్పిందొక శరజ్జ్యోత్స్న, నామీద ప్రసరించ దల్చని మంకుపట్టుతో…
నిజమే… ఇంకేం కావాలి నాకు…
ఏ నెత్తావి చెలిమి
ఏ నెనరు కూరిమి…
ఏ గగన కుసుమం… ఏదూరపు కొండ??
ఏది… నాకేది కావాలి…

* * * * * * * * * * * *

చిత్తడితో లసలసలాడ్తున్న నల్లరేగడి నేలమీద వడగళ్లు రాలినట్టు, పంటపొలాల పచ్చని ఏకాంతం మీదకి మిడతల దండు తెగబడినట్టు… ఒక్కసారిగా ఆడిటోరియంలో చప్పట్లు, నిజంగానే తానేదో భూమ్యాకాశాల్ని తలకిందులు చేశానేమోనన్న భ్రమ వక్తలో కల్గిస్తూ-
బైటకి మర్యాదగా జారుకోవడానికి నాకు చిక్కిన చిన్న అవకాశం.
లోన, బైట… ఆట్టే తేడా లేదు. ఆడిటోరియం లోపల మూలమూలలకి పాకుతున్న షాండ్లియార్ కాంతి, బైట మండ్రగబ్బ కుట్టినట్టు అంచెలంచెలుగా సలపరించే సూర్యకాంతి!
‘ఈ అశ్రు ఝరులతో… ఇరులతో… రొదలతో… సొదలతో… విసముతో…’
చేదు బ్రతుకు పాట…

“మీ యూనివర్శిటిలోనే చూశాను. ఆవిడే డాక్టర్ శ్రీలత… అని మిత్రులు మీ గురించి పరోక్ష పరిచయం చేస్తుంటే, జలపాతాన్ని బట్టి కొండని గుర్తించుకున్నట్టు, మీ జడ ఆనవాలుగా మిమ్మల్ని గుర్తించాను…”

…ఆగాగు… హాస మృదు వాసనలు… కొసరు తేనియలు కూడా ఉన్నట్టున్నాయ్…
చలువ చేసిన పెళుసు ఆర్గండి చీర!
విసుగుతో ముడిపడి, మత్స్యయంత్రాన్ని కొట్టేందుకు అర్జునుడి చేతిలో అడ్డంగా ఒదిగిన కనుబొమ్మల ధనుస్సు…
పూలను చుట్టిన కాగితంలా ఆమెను పొదివిన లావెండర్ పూల చీర, చీర మీద గుబురుగా అల్లుకున్న నలుపు లతలు.

ఆలస్యమైనందుకేమో విసవిసలాడుతూ వస్తూ, మర్యాద పూర్వకమైన చనువుతో విసిరిందొక ప్రశ్న ఆంగ్లంలో “సభ మొదలయిందా?”
కర్త, కర్మ, క్రియల్లో బిర్రబిగవని వాక్యం… సింటాక్టికల్ దోషం. అలా అని కవిత్వం కాదు. చెత్త ఇంగ్లీషు… రాయలసీమ బండయాస.
మామూలుగా వేరే ఎవరైనా అయితే చిర్రెత్తుకొచ్చేది. ఆమె కావడం వల్ల చిరాకు రాలేదు సరికదా ఆమె పలికే ప్రతి పదంలో (ఆ మాటకొస్తే, ఆమె ప్రతి అణువులోనూ) కదలాడే పచ్చి వగరు pornoతో గిలిగింత పుడుతుంది.

“అంత కొంప మునిగిందేమీ లేదు..” అన్న వాక్యాన్ని పొలైట్‌గా మలిచి, తెలుగులోనే ప్రయోగించాను, అలవాటు చొప్పున కాలివేళ్ళు, మడమల పగుళ్లు చూస్తూ, మెట్టెలు మెరిసినందుకు కించిత్ వగస్తూ-
తొలిచూపులోనే స్నేహాన్ని ఆమోదించిన ఆమె పరివారంలో ఒకడినై, “దయ చేయండి…” అన్నట్టు స్వాగతించాను, ఆమె నవ్వుల నజరానా అందుకుంటూ-
ఇన్విటేషన్ కార్డులో తెలిసిన పేర్లు మినహాయించి, ముసలి పేర్లు కొట్టేసి, మిగిలిన వాటిలో ప్రాంతాన్ని బట్టి విసిరానొక రాయి చీకట్లోకి-
“మీరు డాక్టర్ శ్రీలత కదూ…”
అంత కచ్చితంగా తగులుతుందని ఊహించనే లేదు…
“ఔను… మీరు…?”
నేనెవరో పరిచయం చేస్కోగానే, కళ్ళింత పెద్దవి చేసి అంది – “ఓ మీరేనా? మీ ఫ్రెండ్ శ్రీపతి, యూనివర్శిటిలో నా కొలీగ్, చెప్పారు లెండి, మీరొస్తున్నారని. నైస్ మీటింగ్ యూ…”
మళ్లీ ఇంగ్లీషు… మీటింగ్… మేటింగ్… అని ఊరిస్తూ-

ఈసారి చేయి కలపడం ద్వారా మరింత పోర్నో.
అంతకు ముందు నే వెదికిన ప్రత్యామ్నాయం దొరికింది కనుక, ఇక నిర్భయంగా ప్రవేశిస్తాను సభాస్థలిలోకి-
ఆమెకి నే దారి తీస్తుంటే, నా హైడ్ తన కొలతలు తూనికల విధి నిర్వహణలో మునిగిపోయాడు క్షణాల్లో-
తన కళ్లు ఎలా ఉన్నాయన్న వర్ణన కంటే, ఏమంటున్నాయన్నదే ఇక్కడ ప్రధానం. తల చెక్కిన తాటికాయలో లేత ముంజని తోడేస్తున్న బొటనవేలు నేర్పరితనం ఆ చూపులో కనిపించింది. ఏకకాలంలో ఎన్నో దృశ్యాలకు పాశాలు వేసే దూకుడుతో కదిలే కంటిపాపలున్న ఆ చూపులో!

లిప్తపాటులో కన్రెప్పలు మూసుకుపోవడం కనిపించకుండా, విప్పారడమే పదే పదే కనిపించడం, అదేదో స్వాగత ద్వారాలు తెరుచుకోవడంలా తోచడం… నిజమైతే బాగుండే నా ఊహలేనేమో!
సౌందర్యంతో పోలిక లేదేమో గానీ, ముక్కు విషయంలో మాత్రం ఉంది క్లియోపాత్రతో సామ్యం. తరచూ మునిపంటి కింద చిక్కడం వల్ల కాబోలు, నాజూగ్గా కత్తిరించిన నిప్పుకాడలా ఉన్న కింద పెదవి మీద చిన్న గాటు లాంటి గుంట. ఒంటిమీదకి అదనపు ఆచ్చాదనల్ని తెచ్చిపెట్టే కాటన్ చీర కావడం వల్ల ఊహలకే పరిమితం కావాల్సి వస్తున్న అనివార్య దుస్థితిలో నేలను తాకుతున్న ఆమె జడ పెద్ద ఊరట.
అన్ని ఒంపుల కదలికను లయాత్మకంగా ఏకతాటి మీదకి తెచ్చినట్లనిపించే ఆ జడ మూడుపాయల మొదలులో చూపు నిలపాలనే నా లక్ష్యం, సిసిఫస్ యత్నంలా ఓడిపోయింది పదేపదే-
వేదికపైన, కింద ఉన్న ప్రముఖులు, ప్రముఖులమని అనుకుంటున్నవారు… ఎందరో పలకరింపుల్లో, ప్రత్యుత్తరాలలో నిమగ్నమై ఆమె ముందుకు వెళ్లిపోయింది, మళ్లీ నన్ను నాకు వదిలేసి నిర్దయగా-

* * * * * * * * * * * *

మగధీరులంతా గ్లాసులు గలగలలాడిస్తుంటే ఆడ మేధావులంతా రెడ్డిగారి రూమ్‌లో సమావేశమయ్యారు. సతీసమేతంగా వచ్చిన రెడ్డిగారు గత్యంతరం లేక ఆ నిర్మద్య సాహిత్యగోష్టికి పరిమితమైపోయారు, మధ్య మధ్య ఒకట్రెండు పెగ్గులుగా మగ గదుల్ని పలకరిస్తూ-

లంచ్ బ్రేక్‌లో కాసింత అవకాశం… మళ్లీ కలవడానికి-
మార్నింగ్ సెషన్ ప్రసంగాలలో కుండబద్దలు కొట్టిన జెరిమియాలు సాధ్యమైనన్ని స్పందనల్ని సేకరించే యావలో ఆవరణ అంతా కలియ తిరుగుతున్నారు, అదోరకం ఆకలితో. కుండబద్దలు కొట్టారో లేదో గానీ, బ్రహ్మాండం బద్దలు చేసిన నమ్మకం, ఏదో ఘనకార్యం చేసిన గర్వం. వారి వలల్లో బహు ఐచ్చికంగా చిక్కి, వారు ఆశించిన దానికన్నా ఎక్కువ స్పందిస్తోంది శ్రీలత, కొంటెగా గిజగిజలాడుతూ, మాయగా పకపక లాడుతూ-

ఆమె నకరాలు చూడటం ముచ్చటగానే ఉన్నా, లింగ భేదాలు కించిత్తయినా గుర్తించనట్టు, ‘మనిషి’ అన్న పదం కామన్‌నౌన్ అన్నట్టు, కొంచెం వాడిపోయి గోధుమ వర్ణంలోకి ఇప్పుడిప్పుడే మళ్లుతున్న మల్లెల మధ్య తరగని పచ్చ కవ్వింపై నక్కిన మరువం రెమ్మల్ని సాదాసీదా ఆకులుగానే గుర్తిస్తున్నట్టు, ఆద్యంతాలు లేని ఆమె నల్లగాజులు అచ్చం తమలా తుది, మొదలు అర్థంకాని సంకేతాల సహస్రాన్ని సృష్టిస్తుంటే పట్టించుకోనట్టు, పట్టించుకున్నా ఆ అనేకానేక వృత్త రహస్యాల సంఖ్య కచ్చితంగా డజనే అన్నట్టు, అసలు మేధతో తప్ప మేనుతో బొత్తిగా సంబంధం లేనట్టు ప్రవర్తిస్తూ, ఎక్కడికక్కడ మినీ సాహిత్య గోష్ఠుల్ని నిర్వహిస్తున్న మగ సాహితీవేత్తల్ని చూడలేక, ఆమెకు దగ్గర్లో అసలు చూడలేక, కొంత చొరవతో కక్ష్య తప్పించానామెను-
సంభాషణలకి కావ్య గౌరవం దక్కాలంటే, మరీ ముఖ్యంగా స్త్రీతో జరిగే సంభాషణకి, అందులో సత్యాలకు తావుండకూడదేమో.

అబద్ధాలు కూడా అందంగా మాత్రమే కాదు, అకారణంగా కూడా ఉండి తీరాలేమో!
‘అంతకు ముందు మిమ్మల్ని చూశాన’ని నే చెప్పడం వెనక కారణాలు ఉండకపోవచ్చు (పోవచ్చు కాదు… లేవు) ‘ఎప్పుడు… ఎక్కడ…” అని స్థల కాలాదుల గురించి ఆసక్తిగా నిలదీసినప్పుడు నిజం చెబితేనే బాగుండేదేమో-
వివస్త్రంగా మారిన స్పృహ కూడా లేని విరహంతో వేగుతున్న ఇసుక తిన్నెల్ని ముప్పిరిగొన్న ప్రణయావేశంతో నువ్ ముంచెత్తినప్పుడు మొదటిసారి చూశాను… కావేరి!
… అంటూ నిజం చెప్పాల్సింది.
అందమైన అలసటలో రాలిన చెమట చుక్క, అలుపెరగని ముద్దుల్తో ఊరిన ఉచ్చిష్టం, యుగాల నిష్ఫల సాఫల్యాలని తేల్చలేని వీర్య బిందువు…
…..ఆల్చిప్పవై దేన్ని పొదువుకొని మేలిముత్యాన్ని చేస్తావో తేలని ప్రతిసారీ నిన్ను చూస్తూనే ఉన్నానని కూడా మరో నిజం చెప్పాల్సింది. ఈ నిజాలలో అందం ఉందో, లేదో గానీ, అవి చెప్పడానికి నాకప్పుడు ధైర్యం లేదు. అందుకే అబద్ధం చెప్పాను. అతి రసహీనమైన అబద్ధం-
“మీ యూనివర్శిటిలోనే చూశాను. ఆవిడే డాక్టర్ శ్రీలత… అని మిత్రులు మీ గురించి పరోక్ష పరిచయం చేస్తుంటే, జలపాతాన్ని బట్టి కొండని గుర్తించుకున్నట్టు, మీ జడ ఆనవాలుగా మిమ్మల్ని గుర్తించాను…”
పంచదార పాకం ఒలికిన పాలరాతి గచ్చు వంటి వీపు మీంచి, అరిటాకు ఈనెలా లేతగా, లోతుగా ఉన్న వెన్నుపూస మీంచి, జఘన జంట తబలాల మీంచి దిగ్గున లేచిన జడ, ఆమె మెడ కింద పియానో మెట్ల పక్కగా ముందున్న మిట్టపల్లాల మీదకి చేరింది పొగరుగా-
దాన్ని అంతే మిడిసిపాటుతో ఒడిసిపట్టి అందామె- “ఇప్పడేం చూశారు… ఇంతకు ముందు ఇంకా ఒత్తుగా…”
మరింత మత్తుగా కూడానా. ఏమో అడగలేదు, అంతరాయంగా మొదలయిన సమావేశం వల్ల-

* * * * * * * * * * * *

మొదటి రోజు సమావేశం ముగింపుకొచ్చింది.
…అనుకున్న దానికన్నా ఆగమాగం చేస్తున్న మార్గశిరపు చలి. వెల్తురు వలువలు అరకొరగ ఉన్న చీకటికి ఒళ్లంతా చక్కిలిగింత కాబోలు.
ఓరగా తెరిచి ఉన్న కిటికీ రెక్కలోంచి బైటకి చూస్తుంటే గోరుగిచ్చుళ్లలా మెరుస్తున్నాయి దూరంగా వెలుగుతున్న దీపాలు. ఏవో కనిపించని కుట్రలతో మాయదారి మంచు మోహాన్ని రగిలిస్తోంది, గుబురు పొదల చుట్టూ మూగిన మిణుగురు రెక్కల మీద-ఆమె నడుము చాటుగా నక్కిన నీడలు పైట కిందకు పారాడుతూ వెళ్తున్న దృశ్యాన్ని… అంతసేపు… అన్ని సార్లు చూస్తున్నా… మొనాటనీ అనిపించలేదెందుకో-
మురిపించి, వాన కురిపించకుండానే కదిలిపోయే అల్లరి మబ్బులు, కొబ్బరాకు దోసిళ్లలో నిండీ నిండక మట్టిపాలయ్యే వెన్నెల తరగలు, పచ్చి పచ్చని పిందెల్ని దిష్టికళ్ల నుంచి దాచే ఆకుల జాడలు…
ఇంకా ఎన్నెన్నో… అలా చూస్తున్న కొద్దీ కదులుతున్నాయి కళ్లముందు…
మధ్య మధ్య మౌనంగా బదులిచ్చే ఆమె క్రీగంటి చూపులు, రవ్వంతే విచ్చుకొని పెదాలు రువ్వుతున్న అరనవ్వులు తెంపులేని నా తీపి యాతనకి అజ్ఞాత ప్రేరణలు!

సమావేశం ఆసాంతం నత్తలా నడిచిన కాలం, ఆ తర్వాత మమ్మల్ని హోటల్‌కి చేరుస్తున్న క్వాలిస్‌లానే దూకుతోంది, పక్కపక్కనే కూర్చున్న మా ఇద్దరికీ స్పర్శల వింత రంగులు చూపిస్తూ-
ఆమె మొత్తం ఒక కంపించే వక్షమై నన్ను తాకుతున్నప్పుడు, పచ్చిమోసం వంటి నా ఆచ్ఛాదనలన్నీ చీలికల పేలికలై తప్పుకున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఆ బ్లాక్ అండ్ వైట్ బాధా సందర్భం…వెనక అనివార్యత ఉందా? అనైచ్ఛికమా… అని తర్కించడం అప్పుడు, దాన్ని నిర్మోహంగా నెమరేస్తున్న ఇప్పుడు కూడా శుద్ధ దండగే అనిపించింది/అనిపిస్తోంది.

“హైస్కూలు కూడా దాటీ దాటనట్టు కనిపిస్తున్నావోయ్…” అని రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ యశోదా రెడ్డి రెస్టారెంట్‌లో ఆత్మీయంగా భుజం తట్టినప్పుడు “హైస్కూలు దాటబోతున్న కూతురుంది మేడమ్…” అని నా ముక్కునుంచి ఊడిపడిన నా పింకితల్లిని తలుచుకుంటున్నప్పుడు శ్రీలత చూసిన చూపులకి అర్థాలు అనుభవంలోకి రాలేదు గానీ, అవి రాక్షసలతలై చుట్టేసిన అనుభవాన్ని అర్థం చేసుకున్నాను.
నా పక్క టేబుల్‌లో ఆడవాళ్ల మధ్య కూర్చొని, అసందర్భంగా సందర్భాలు కల్పించుకుంటూ నా మీదకి కొంటె కామెంట్లు విసురుతూ నన్ను ఉడికిస్తున్నప్పుడు బహుశా ఇద్దరమూ మర్చిపోయాం మా వయసులు-
కూరలు చప్పబడి, పాయసం చేదెక్కి, అన్నం సహించక నేను, నాకు తెలియని కారణాలతో ఆమె- చివరికి మిగిలిపోయాం రెస్టారెంట్‌లో…

Promenade అనబడే వ్యాహ్యాళికి ప్రతిపాదించి, నా సహజాత బద్ధకాన్ని మంత్రం వేసినట్టు మాయం చేసి నన్ను నడిపించినప్పుడు ఆ రాత్రి Silhouette ల్లా కదలాడే దృశ్యాల్లో ఆకారాలన్నీ జంటగా పదకొండు అంకెలానే కనిపించాయి. ఏకీభవిస్తున్నట్టు పదకొండు సార్లు మోగింది అక్కడ చౌరస్తాలో క్లాక్ టవర్.
దిశ తెలియని ఆ మహానగరి రోడ్ల మీంచి ఇరుకిరుకు సందుల్లోకి గమ్యం లేకుండా నడిచాను ఆమె వెంట.
‘జీవితపు సన్నని సందులకే ఆకర్షణ మాకు (?)’

సింగిల్ ట్రాక్ స్టీల్ బ్రిడ్జి మీద రొద చేసుకుంటూ వెళ్లిపోయిందో లోకల్ ట్రైన్. కంపిస్తూ మిగిలిపోయిన వంతెన.
“వంతెన దాటి అటు వెళ్దామా?”…
శరీరంతో పాటు కంపిస్తున్న నా వేళ్లలోకి వేళ్లు జొనిపి అడిగిందామె, దేన్నీ లెక్కచేయని తెంపరితనంతో-
అంతలోనే చటుక్కున అడిగింది – “ఏమిటి చలేస్తోందా?”
మంచుగోళ్లని వెన్నులో దించే చలి ధృతరాష్ట్ర కౌగిలి…
లెక్కలేనన్ని నెగళ్లు రాజేసి అందులోకి లాగేసే మహాగ్నికీలలా ఆమె స్పర్శ…
ఆ వైరుధ్యానుభవాల వైపరీత్యం తట్టుకోలేని ఊగిసలాటలో తన చేయి విదుల్చుకొని వడివడిగా అడుగులేశాను హోటల్ వైపు-
నన్ను, నానార్థాలు స్ఫురిస్తున్న నా ‘తొందర’ని పట్టేసిన నెరజాణతనంతో అనుసరించిందామె.

* * * * * * * * * * * *

“తాళాలు జేబులో వేసుకు వచ్చేశావ్ (ఒకే ఒక నిశిరాత్రి నడక ఏకవచనంలోకి చిక్కబరిచింది పరిచయాన్ని) నీ రూమ్మేట్ ఎవరో ఏడవడూ…” అడిగింది.
ఒక్కో రూమ్‌కి ఇద్దరు డెలిగేట్లను కేటాయించారు.
“నా అదృష్టవశాత్తూ నాతోపాటు మరెవ్వరినీ వేయలేదు నా గదిలో. అది విరహోత్కంఠితై వేగుతున్న ఏకాంత మందిరం… శ్రీ (పేర్లు ముద్దుగా కత్తిరించడంలో బహుశా ఏదో లైంగిక వాచాలత ఉందనుకుంటా)”
“భలే లక్కీ… అయితే నీ రూమ్‌నాకిచ్చేయ్, నువ్ నా రూమ్‌లోకి వచ్చేయ్, నా రూమ్మేట్ కంజిర కమలకి తోడుగా. మహాతల్లి… తెలంగాణ వీరనారి… పెద్దనోరు…”
అవును… కమల ‘అరిస్తే పద్యం… చరిస్తే వాద్యమే.’ తెలంగాణ దళిత ఆత్మగౌరవ ప్రతీక కంజిర కమల మాటే రణ నినాదం.

ద్వార బంధనాల పరంపరలో ఒక్కొక్కటే చప్పుడు లేకుండా తెరుచుకుంటున్నప్పుడు తన పక్కన కాకుండా, వెనక అనుసరించానంటే నా సిగ్గులేని కళ్లకి నేరాన్ని అంటగట్టడం మినహా వేరే కారణం చూపలేను.

లిఫ్టు ఐదో అంతస్తుకి చేరగానే ఎదురుగా ప్రొఫెసర్ రామిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రిటైర్డు వైస్ చాన్సలర్, శ్రీలత గురువుగారు కూడానూ-
“ఏమిటమ్మా లతా! ఇంత ఆలస్యం… ఇదేమన్నా మన జమ్మలమడుగు అనుకుంటున్నావా…” చనుఫుగా మందలిస్తూ దారి తీశారు ఆయన గదిలోకి. అనుసరించాం మేము. మగధీరులంతా గ్లాసులు గలగలలాడిస్తుంటే ఆడ మేధావులంతా రెడ్డిగారి రూమ్‌లో సమావేశమయ్యారు. సతీసమేతంగా వచ్చిన రెడ్డిగారు గత్యంతరం లేక ఆ నిర్మద్య సాహిత్యగోష్టికి పరిమితమైపోయారు, మధ్య మధ్య ఒకట్రెండు పెగ్గులుగా మగ గదుల్ని పలకరిస్తూ-

గది తాళం చెవి తీస్కెళ్లితే,తానులోన ప్రశాంతంగా నిద్ర పోతానని కమల అంటోందని, మళ్లీ వస్తానని అనేసి వెళ్లిపోయింది శ్రీ, నా కర్థం కాని సైగలు చేస్తూ-
వెర్రి వెధవగా దొరికిపోయానక్కడ నేను. రెడ్డిగారు నాస్టాల్జియాలోకి జారిపోయారు.
‘హౌండ్ ఆఫ్ హెవెన్’ తాను చూపించేంతవరకూ పుణెలో తన ప్రొఫెసర్లు చూడనేలేదని, యూనివర్శిటీల్లో ఈనాడే కాదు, ఆనాడూ ‘చదువు’ లేదని వాపోయారు, ఇంగ్లీషు ప్రొఫెసరుగా నాలుగు దశాబ్దాలు పనిచేసిన రెడ్డిగారు.
‘హౌండ్ ఆఫ్ హెవెన్’ని ఆలస్యంగా చదివింది ఆయన గురువులే కాదు, ఫ్రాన్సిస్ థామ్సన్ పోయాక గాని చదవలేదు ఆంగ్ల పాఠక లోకం…
ఇంతకీ ఆ హౌండ్ ఆఫ్ హెవెన్, మహాప్రస్థానంలో ధర్మరాజుని వెంబడించిన శునకరాజం ఒకటేనా?
“ఆ మాటకొస్తే, మన పొరుగువాడైన భారతీయ ఆంగ్లకవి గోపాల్ హోనెల్‌గెరె కవిత్వాన్ని ఎవరో నీబోటి కుర్రాడు చూపించే వరకూ నేను చూశానా…” అంటూ ఆయన నేరాంగీకరానికి దిగేసరికి దాదాపు రూమంతా ఖాళీ అయింది.
ఆయన దగ్గర, మర్యాద కోసం సహిస్తున్న ఆయన సతీమణి దగ్గర సెలవుతీస్కొని బైటపడ్డాను.

* * * * * * * * * * * *

విరిగిన పచ్చికొమ్మల్లోంచి కారే జిల్లేడుపాలలా బుల్లి దీపాల్లోంచి స్రవిస్తోంది మసకకాంతి, ఏ అలికిడీ లేని పొడవాటి కారిడార్‌లో-
ఆ మార్మిక కాంతిని చీలుస్తూ వస్తుందొక నారింజ కాంతిపుంజం-శ్రీ!
చిక్కులు వేస్తుందో, తీస్తుందో మోకాళ్లు దాటే జుట్టుని విరబోసుకుని వేళ్లతో దువ్వుకుంటూ నడిచొస్తుంది, జాముల అంగలతో కదిలొచ్చే కామ యామినిలా-
“అయిపోయాయా సారూ… మీ చందన చర్చలు…”
తన చిలిపి వెటకారంతో ఏవో అసందర్భ సందేహాలు నన్ను కమ్ముకోవడమేమిటో…
ఖాండవ దహనంలో కాలిపోయిన మొగలి పొదలెన్ని?
ఊరపిచుకల అవిరామ మైథునంలో భావప్రాప్తి పరిమాణమెంత?
అలుపు లేని అలల కవ్వింపుకు కించిత్తయినా ఉద్రేకించని తీర్థపు రాళ్ల వంధ్యత్వానికి విరుగుడు వయాగ్రా ఉంటుందా?
నన్ను నిరుత్తరుడ్ని చేశాననే (చేసిందేమో) సౌందర్య గర్వంతో నవ్వింది తను, ఆ నిశ్శబ్ద నీరవాన్ని నిర్భయంగా చరుస్తూ-
కళ్ళలో (ఎవరి?) కాంక్ష జీరల్లాంటి కెంజాయ రంగు స్లీవ్‌లెస్ నైటీ. పల్చటి దీపకాంతి వెనకనుంచి సోకి కాంతిద్రాక్షలో పారదర్శకంగా కనిపించే గింజలా తోచిందామె దేహం. గోరంతల్ని కొండంతలు చేయాల్సిన అగత్యం లేకపోయినా, దూకే జలపాతాల్ని కాసేపు కట్టడి చేయడానికైనా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తున్నాయ్ కొన్ని లో ఆనవాళ్లు-

“నిద్ర పట్టట్లేదు… అలా టెర్రస్ మీదకెళ్దాం పద…”
ద్వార బంధనాల పరంపరలో ఒక్కొక్కటే చప్పుడు లేకుండా తెరుచుకుంటున్నప్పుడు తన పక్కన కాకుండా, వెనక అనుసరించానంటే నా సిగ్గులేని కళ్లకి నేరాన్ని అంటగట్టడం మినహా వేరే కారణం చూపలేను. గండ శిలల మోటు సరసంతో పటుత్వం పట్టు తప్పినట్టు పీలగా ఉన్నాడు చంద్రుడు నడి ఆకాశంలో. మంచుతెరల భుజాలు పట్టి సోలిపోతుంది పల్చని వెన్నెల.
చలిని కాచుకునే మంటలు… కాదు మాటలు రాజేసింది.

విరహంతో కాగిపోతున్నానని, రెక్కలు కట్టుకొని వాలిపొమ్మని, పెళ్లైన కొత్తల్లోని నాటు సరసాన్ని ఇక్కడ స్టార్ హోటల్ గదిలో కొత్తగా గుర్తు చేసుకుందామని… తన సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, నీలి చిత్రాన్ని శ్రవణేంద్రియంతో చూపించే ప్రయోగ ప్రియత్వం కనబరచింది.
“మా ఆయనోయ్! ఆయన అక్కడ ఊళ్లో… నేనెక్కడో యూనివర్శిటీ క్వార్టర్‌లో… నెలకోసారి… మహా అయితే రెండు సార్లు. పాపం… ఒకటే యావ…”
ఇక మొత్తం అర్థం కావడానికి అడ్డైన సంక్లిష్టత లేమీ లేవు. ఆఖరి వల్లెవాటుని కూడా జారవిడిచిన నగ్నోద్విగ్న ఆహ్వానాలు! ఇంకేం కావాలి! నీ ఆమోద, తిరస్కారాలతో సంబంధం లేని మహావశీకరణ వయస్కాంతం ముందు విరిగిన ఇనుప చీలవైన గుంజాటన కన్నా మహత్తరమైనది మరింకేం కావాలి? పట్టిందల్లా బంగారంలా మార్చే ఆ సరస పరసవేదితో నఖచ్ఛేద, సీత్కృత, చుంబన, ఆలింగనాలు తప్ప వేరేమి కావాలి?
లతా వేష్టితకం, వృక్షాధి రూఢకం, తిల తండులకం, క్షీర నీరకం…

ఎవరినైనా పాదాక్రాంతం చేసుకోగలనన్న గర్వం…
వయసును దాచే సొగసు సొంతమన్న అతిశయం…
అరనవ్వులే వశీకరణ గాలాలన్న నమ్మకం…
…వంటివి ఎన్నింటినో సతత హరితంగా ఉంచుకోగలిగానన్న ధీమా ఆమెలో పెంచడం నాకేదో నిష్కామ తృప్తినిచ్చింది.

ఎలాంటి ఆలింగన కావాలి?
శరీరం ఏమైపోవాలి?
ఎముకల్లేని చలిమిడి ముద్దయిపోవాలి.
నిప్పుల్లేని నిట్టూర్పుల కొలిమైపోవాలి…
మిగలపండిన నల్లద్రాక్ష తోటై పోవాలి…
ఇంకేమీ అక్కర్లేదా…
నీ నిరీక్షణకి అర్థం లేదా…
నెనరు కూరిమి… నెత్తావి చెలిమి
దశాబ్దాల ఎదురుచూపు… పంచప్రాణాల్ని అరిచేతులు చేసి దీపాన్ని కాచిన సహనం, నమ్మకం!
అనంతానంత రహస్యాలై గజిబిజిగా అల్లుకుపోయిన నరాల్ని మనఃశరీరాల్ని కలిపే తంత్రులుగా చేసే వైణికురాలు ఆమె ఒకత్తె వస్తుందని…
చీలిక నాలుకల శ్లేష్మాన్ని నే ఒదుల్చుకోలేని స్పర్శ చేసే సరీసృపమై వస్తుందని…
గుర్రపువాతం కమ్మి బతుకంతా వెలుగులు నిషేధమైన నను దళసరి గొంగళై దాచేస్తుందని… ఎంత పిచ్చిగా నమ్మాను?
పెళ్లికి ముందు పదేళ్లు… దేహమంతా దోసిలి చేసి కైమోడ్చి ఆమె వస్తుందని ఎదురు చూశాను. పెళ్ళయ్యాక ఈ పదిహేనేళ్ళలో ఆ హేమాంగి వస్తుందేమోనని శంకిస్తూ, తప్పుకు తిరిగాను, విరోధాభాసకి నిలువెత్తు నిదర్శనంలా-
నైతికాద్వైత ఆదర్శాన్ని కనిపించని గొలుసులు చేసి, తను బందీయై, నన్నూ బందీ చేసిన నా ఉషని ఊహల్లో కూడా విదిల్చుకోవడం వీలుగాక, అర్థాంగిలో ‘ఆమె’ ని ప్రతిక్షేపించుకోవడం చేతగాక అనుభవాల ముఖం చాటేసి పారిపోయాను.
ఏ చీకటి లోగిళ్లలో పోగొట్టుకున్నానో తెలియకుండానే, వెలుతురు దారుల్లో వెదుక్కుంటున్న నా వెర్రితనం చూసి ఫక్కున నవ్విన వేనవేల చుక్కలు ఒకట్రెండింటిలో నా హేమాంగి ఆనవాళ్లు కనిపించాయి కూడా. పట్టలేని సంబరంతో అందుకోవాలని చేయి చాస్తే తృణీకారంగా అవి నొసట్లు ముడవటం కూడా నే దాచేస్తే దాగని తుమ్మముల్లు అనుభవమే.
అయితే గుణపాఠాల బరువుతో నిబంధనల పట్టాల మీద బుద్ధిగా నడిచే రైలు కాదు జీవితం (నా జీవితం).
రెక్కలకి పుప్పొడి – అప్రయత్నంగా, అనుకోని అద్భుతంలా అంటాలని ఎదురు చూసే తూనీగ… దారం కట్టిన తూనీగ.
అందుకే, నా హేమాంగి మ్రానుపండని నిరాశ పడలేదు… అందని ద్రాక్షేనని ఈసడించనూలేదు.
కనుకనే… ఇంకా ఈ ఎడతెగని నిమీలిత నిరీక్షణలు… బలవత్ శారీరక బ్రహ్మచర్యాలూ-

కాముని పున్నమి నాడు కాలిన గంధపు దుంగని మూడో జాము బూడిదపొరలా కమ్మేసిన నపుంసక దృశ్యం… ఆ రాత్రి మా ఇద్దరి మధ్య ప్రతీక్షించింది. వెలుతురు మాసికలతో రంగు పోల్చుకోవడం వీలైన చీకటి, అస్థిమితంగా కదిలే పల్చని నీడల వల్ల అస్తిత్వం పొందిన చలి, ప్రళయం ముందటి ప్రశాంతతై ఆమె, అనుభవాలకు ప్రవేశం లేని స్వచ్ఛంద స్వయంకృతాపరాధంలా నేను… ఆ టెర్రస్ కాన్వాస్ మీద అదొక అవకతవకల చిత్రం! నాబోటి నిరానుభవుడు చేతగాక ఒలికించిన రంగుల కంగాళి!!
అయితే అంత బాధేమీ లేదు, చాచిన నాలుక మీద రాలే తేనెచుక్క, దారిమళ్లి కంటిపాప మీద తేనెటీగ ముల్లై జారిన సలపరింత తప్ప-

నా ఒంటరి హోటల్ గదిని యుగళశ్వాసలతో వెచ్చబరిచే అవకాశాన్ని చేజార్చుకున్నానన్న బాధ కన్నా, పాతికేళ్లుగా లోన జ్వలిస్తున్న చమురంటని నీలికాంతిని సజీవంగా ఉంచగలిగానన్న ఆనందానిదే పై చెయ్యి అయిందా క్షణం.
కాబట్టే ఆ తర్వాత మరి కొన్ని గంటలు తన గదిలో ఒకే మంచం మీద పోచుకోలు కబుర్లాడుకున్నా, మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకి నా మేల్కొలుపుకి లేచింది మొదలు, నీళ్లు జీరాడే జుట్టులో నన్నూ చుట్టి జారుముడి వేసేంత వరకూ ప్రతి భంగిమలోనూ అష్టవిధ నాయికల్ని అభినయించినా, అంతకు ముందు తనని చూశాననడం ఒకానొక లౌకిక అబద్ధమని నా ఒప్పుకోలుకి మెచ్చుకోలుగా భుజం తట్టినా, తనకి పెళ్ళై పదేళ్లయిందన్న ‘కఠోర నిజా’న్ని వెల్లడి చేసినందుకు ‘ఇంత మోసం చేస్తావా’ అని నే ‘గుండెపోటు’ అభినయించినప్పుడు నా బుగ్గలు పొడిచినా…
…నిన్నటి అస్కలిత రాత్రిని తలచి నే వగచలేదు.

ఆ నడిరాత్రి ఊగిసలాటకి ముందున్న నేను, తర్వాత నేను ఒకటికాదు. మొదటి ‘నేను’ ఆడిన మాటలు, చేసిన చేష్టలన్నీ స్వయంతృప్తి సాధకాలు. ఇక రెండవ కృష్ణుడి అభినయాలన్నీ ఆమె మోహోద్దీపనకి ఉద్దేశించిన ఉత్ర్పేరకాలు.
ఎవరినైనా పాదాక్రాంతం చేసుకోగలనన్న గర్వం…
వయసును దాచే సొగసు సొంతమన్న అతిశయం…
అరనవ్వులే వశీకరణ గాలాలన్న నమ్మకం…
…వంటివి ఎన్నింటినో సతత హరితంగా ఉంచుకోగలిగానన్న ధీమా ఆమెలో పెంచడం నాకేదో నిష్కామ తృప్తినిచ్చింది. అలాంటి కుట్రలు లేని తీపి మోసానికి కొనసాగింపుగా ఆమె వేదికమీద ప్రసంగానికి సిద్ధమవుతున్నప్పుడు, వెళ్లి అందించానొక చిరు సందేశం “నా వంటి అశేష అభిమానుల్ని ఉత్సాహపరిచే మాటల ఉప్పెన సృష్టించమని-”
లేత నారింజ తొనల్ని కంటి ముందు చిదిమినట్లు చిలిపి నవ్వులు, తిమ్మిరెక్కిన చోట తొడపాశం పెట్టినట్టు కొంటె సైగలు బదులుగా అందుకున్నాను.
అయితే, కొత్తగా ఏర్పడిన కొన్ని ఐహిక పరిస్థితుల్ని గుర్తించక పోవడం, పరిణామాల్ని గమనించకపోవడం నా దోషమే కావొచ్చు.

ఆ సెషన్ ప్రారంభానికి ముందు వచ్చాడు శ్రీపతి. జ్ఞానమంటే స్వాతిశయం కాదని గ్రహించిన సాత్విక జ్ఞాని, నిండుకుండ.
పదిహేడేళ్లుగా తనతో పరిచయం, ఏనాడూ స్నేహంగా మారలేదు. కారణం ‘గౌరవం’ అనే భావం నాకు అడ్డుగా ఉండటం వల్ల. బహుశా రెండు, మూడేళ్లు నాకంటే పెద్దయి ఉంటాడు. పుస్తకం, ప్రపంచం… రెంటిలోంచి సమంగా జ్ఞానాన్ని తోడాలన్న ఆలోచనే కాదు, ఆచరణ కూడా ఉన్నవాడు.
శ్రీపతి ఒక బ్రహ్మచారి.
తన పెళ్లికానితనానికి ఏవైనా విరహ, వియోగ, రస వైఫల్య మూలాలు కాక, సగటు కౌటుంబిక కారణాలున్నాయని చూచాయగా తెలియడం, ఆడపిల్లల విషయంలో తార్కికమైన అనాసక్తి ఏదో ఉన్నట్లు నా కనిపించడం… వంటి కారణాల వల్ల కూడా బహుశా శ్రీపతికి నేను సన్నిహితం కాలేదేమో!

అటువంటి dispassionate బ్రహ్మచారి రాకపోకలు- పలకరింపులకీ, ఆపై వీడ్కోళ్లకీ మినహా మరి వేటికి సంబంధ ప్రతిబంధకాలవుతాయి? ఒకవేళ అయితే….
“ఏమిటా చీటి? ఏం రాశావందులో …..” ఎంత మామూలుగా అడిగినా, కొత్త శ్రీపతి కనిపించాడు తొలిసారిగా-
కొద్దిపాటి వ్యవధిలో ఇదే ప్రశ్న ఎన్నో రంగుల్లో ఎదురవ్వడం…. మరో వింత.
సమాధానాన్ని కావాలని దాటవేసి, పరిశోధనకి సిద్ధమయ్యాను, శ్రీలతకి సంబంధించిన ప్రశ్నలతో-
అవి తన కొలీగ్ (మాత్రమేనా?) గురించిన ప్రశ్నలని గుర్తించలేదేమో అనిపించింది, బదులివ్వని శ్రీపతిని చూస్తుంటే.

శ్రీ ప్రసంగం ప్రారంభమయింది. నిజంగానే వాక్ వరద సృష్టించింది. సహజాత ప్రవాహశీలతతో-
నా చప్పట్ల ‘అతి’ సహ శ్రోతలకే చిరాకు కలిగిస్తే ఇక శ్రీపతి విషయం చెప్పాలా? దురదగుంటాకు గుబురుని ఆనుకున్న అసహనంతో బైటకు నడిచాడు. ‘అదరగొట్టేశావ’న్న నా సైగలకి, ఎవరికీ దొరకకుండా మూతి విరవడం ఒక ముచ్చటైన నేర్పరితనమే…
“మొత్తం మీద బాగానే మాట్లాడానంటావా…” అంది స్టేజ్ దిగొచ్చి నా పక్కన కూర్చొని చేయి కలుపుతూ-
మరికొద్ది నిమిషాలకి తిరిగొచ్చి నాకు మరో పక్క కూర్చున్నాడు శ్రీపతి. కాసేపటికి చీమలు కుడ్తున్నాయని శ్రీ, కనిపించని కీటాకాలేవో గిల్లి శ్రీపతీ లేచిపోయారు. ఆ తర్వాత ముందస్తు సూచికలు, హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా మారిన వాతావరణానికి శాస్త్ర సాంకేతిక, లేదా తర్కరహిత కారణాలు కూడా నా దగ్గర లేవు. ఆపైన పరిణామాల పరంపరని అర్థం చేసుకోవడానికి నాకు నా ఊహే ఊతమయ్యింది.

* * * * * * * * * * * *

నిండైన ఆడిటోరియంలో అన్యుల ఉనికిని పూర్తిగా ఏమారి, ఓ మూల ఆమెతో గుసగుసలకు పరిమితమైనప్పుడు శ్రీపతి జంట చిలుకల్లో ఒకటయ్యాడు.
“ఏదో రాశావంటగా అసభ్యంగా, హర్ట్ అయింది. చాలా కోపంగా ఉంది…” అని నా పక్కకొచ్చి గొణిగినప్పుడు, “మా ఆడోళ్లతో నీకు మాటలేంట్రా” అని చాచి లెంపకాయ కొట్టగలిగే సహజ జంతు వాసనలు చచ్చి, చచ్చు నిర్మమత్వ మేధావుల జాతికి విధిలేక చెందిన ‘అమానవుడ’ య్యాడు.
‘నిన్ను నా ఫ్రెండ్‌గా చెప్పాను…” అని అర్థోక్తిగా ఆపి, “కానీ, నువ్వింత కుసంస్కారంతో ప్రవర్తించి ఆమె సున్నిత హృదయాన్ని గాయపరుస్తావా…” అన్న నిష్ఠూరాన్ని తన ‘నిర్మోహం’ మాటున దాచేయాల్సి వచ్చినప్పుడు కొమ్మలు విరగదీసినా ఏమనలేని మూగమానయ్యాడు.
“ఋజువర్తనలేని, సభ్యత లేని మగపురుగుల సాంగత్యం నీ వల్లే కదా…” అని నిందించిన ఆ మానిని అభిమానభంగానికి నొచ్చుకొని సపర్యలు చేస్తున్నప్పుడు క్రౌంచ పక్షయ్యాడు.
మరింత దగ్గరితనాల మద పరిమళాన్ని విస్తృతంగా విరజిమ్మి ఆమెని అరక్షణమైనా విడవక అక్కున చేర్చుకున్నప్పుడు possessive మత్తేభమయ్యాడు.
కంజిర కమల వెళ్లిపోవడం వల్ల ఒంటరయిన ఆమె హోటల్ గదిని ఆ రాత్రంతా ఏకాంత మందిరంగా మార్చినప్పుడు అలుపెరగని పెనుబామయ్యాడు.

* * * * * * * * * * * *

చాటు మోహాలు రాల్చిన పూలతేరు…
… నీ నాల్గు గోడల గదిలో పాతివ్రత్యపు పాన్పు కాదు.
విస్తరించే విరహంలాంటి గుర్రపుడెక్క తీగలతో అదిమి పట్టేందుకు…
… అది నీ అడుగులకు అద్దిన అణకువైన మడుగు కాదు.
ఆమె….. ఓ నది!
మోకాలు మించి లోతు లేదనిపించే నంగనాచి ప్రవాహాలు…
కదలని కోనేరులా సొంతమనిపించే కనికట్టు విధేయతలు…
…రేయి ఆపని యేరు… ఆ ప్రళయ కావేరి!
నాది కాదు సరే…
నీదా??
* * * * * * * * * * * *
అక్షరాలు మరిచిన నా నాలుకమీద బీజాక్షరాలు రాసిన వాగ్దేవి, నాకు పునర్జన్మనిచ్చిన నా రాగలీనకు-

This entry was posted in కథ and tagged , , , , . Bookmark the permalink.

17 Responses to ఒక అనేకానేక నది… రెండవ మైథునం!

  1. anita says:

    adbhutam.. chaala rojula tarvatha manasunu kadilinchina katha (Katha leka anubhavama) Konni similarities ee kathaku naku … nenu kudaa challa, bahusa jeevithamantha vethukkunnanemo nenaru kurimi kosam netthavi madhurula kosam,, kaani naa anubhavalanni eedo oka vishadam loo anthamainave.. anduke naaku ee katha chaala nacchindi.. rachayithaku abhinandanalu.

  2. మంచి వచనం అందించినందుకు అభినందనలు. అందులో పడి భావం తేలిగ్గా దొరకటం లేదేమో?

  3. Meher says:

    Wow! It’s a goose-bumpy ride for me! All the way! Mind numbingly handsome prose. (Yes, “handsome”! Let’s leave the lame adjective “beautiful” to ballerinas for a change.) Never read anything like this before in Telugu. Actually, read it — bits and pieces, here and there. But in one heady draught like this? Nay! Thank you very much.

    >>> క్షణాలు మూకుమ్మడిగా చీకటి బిలంలోకి జారిపోతుంటే కాలం ఒడిసి పట్టలేని ‘వర్తమాన’మనే అబద్ధమే జీవితానికి ప్రతీక కావడం, బతుకు రథానికి పతాక కావడం ఎంత దుర్భరం?

    >>> స్వీయస్తుతి… పరనింద వంటిదే కావొచ్ఛు. కానీ, స్వీయనింద పక్కవాడి ఔన్నత్యాన్ని గుర్తించిన పరస్తుతి కాదు, ఇరుకు గదుల బూజు దులిపే ఆత్మక్షాలనమూ కాదు… సరికదా, ‘స్వస్వరూప జ్ఞాన’మనే ముసుగుల ఎరుక చాటు దొంగ కన్ఫెషన్. ఆశిస్తున్నదేదో అందట్లేదనే ఉక్రోషం….

    >>> అందమైన అలసటలో రాలిన చెమట చుక్క, అలుపెరగని ముద్దుల్తో ఊరిన ఉచ్చిష్టం, యుగాల నిష్ఫల సాఫల్యాలని తేల్చలేని వీర్య బిందువు…ఆల్చిప్పవై దేన్ని పొదువుకొని మేలిముత్యాన్ని చేస్తావో తేలని ప్రతిసారీ నిన్ను చూస్తూనే ఉన్నానని కూడా మరో నిజం చెప్పాల్సింది.

    >>> ఇంకేమీ అక్కర్లేదా…
    నీ నిరీక్షణకి అర్థం లేదా…
    నెనరు కూరిమి… నెత్తావి చెలిమి
    దశాబ్దాల ఎదురుచూపు… పంచప్రాణాల్ని అరిచేతులు చేసి దీపాన్ని కాచిన సహనం, నమ్మకం!
    అనంతానంత రహస్యాలై గజిబిజిగా అల్లుకుపోయిన నరాల్ని మనఃశరీరాల్ని కలిపే తంత్రులుగా చేసే వైణికురాలు ఆమె ఒకత్తె వస్తుందని…
    చీలిక నాలుకల శ్లేష్మాన్ని నే ఒదుల్చుకోలేని స్పర్శ చేసే సరీసృపమై వస్తుందని…
    గుర్రపువాతం కమ్మి బతుకంతా వెలుగులు నిషేధమైన నను దళసరి గొంగళై దాచేస్తుందని… ఎంత పిచ్చిగా నమ్మాను?

    >>> అయితే అంత బాధేమీ లేదు, చాచిన నాలుక మీద రాలే తేనెచుక్క, దారిమళ్లి కంటిపాప మీద తేనెటీగ ముల్లై జారిన సలపరింత తప్ప-
    నా ఒంటరి హోటల్ గదిని యుగళశ్వాసలతో వెచ్చబరిచే అవకాశాన్ని చేజార్చుకున్నానన్న బాధ కన్నా, పాతికేళ్లుగా లోన జ్వలిస్తున్న చమురంటని నీలికాంతిని సజీవంగా ఉంచగలిగానన్న ఆనందానిదే పై చెయ్యి అయిందా క్షణం.

    — హ్మ్! ఇలా కోట్ చేసుకుంటూపోతే, కథంతా తెచ్చి ఈ కామెంట్ బాక్సులో పెట్టేస్తానేమో అనిపిస్తోంది. ఇప్పుడు పైన తెచ్చి పెట్టినవి కూడా బయటికి తీసుకొచ్చి చూపించగలిగిన అందాలే! ఇలాగాక కథ మధ్యలోనే వేరు చేసి చూపించలేనంతగా ఇమిడిపోయినవీ చాలా వున్నాయి. ఇప్పటికే రెండోసారి చదవటం. అపూర్వమనిపించే అనుభవాన్ని మిగిల్చింది. మళ్ళీ ధన్యవాదాలు.

    ~ మెహెర్

  4. indra prasad says:

    Life in its path, while throwing open most of the thoughts and experiences hides some under wraps for reasons best known. When these are opened up due to the passage of winds of nostalgia or deliberate attempts to unburden / empty the sand from the pockets, flow like complex poetic expression. The style allows the writer to hide and open up as much as he desires to disclose. Desire, jealousy, protective failure and the sublime guilt make the narrative spell bind.

  5. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

    గురూగారు,

    మిమ్మల్ని మరోరకంగా సంభోదించడం న్యాయం కాదేవో. ఆమధ్య ఎప్పుడో పోయినాయనా మమ్మలనందరినీ మాయచేసి, పోకుండా, ఆ, ఇప్పుడే ఏంపోతాంలే ఇదిగో ఈయన(ఈవే)న్ని అంటకాగుదాం మరికొన్ని రోజులు అన్నట్టు. బింబం, ప్రతిబింబం ఒకటిగావున్న, నీకోసవో, నాకోసవో, మనకోసవో కాకుండా, మనసుకి ఏది నచ్చితే అది, మనసుకి ఏది తోస్తే అది, ఆత్మా, పరమాత్మా కలిసిమెలిసిపోయి, ఏ భేషజాల ముసుగులు, ఏ గొప్పదనాల కృత్రిమ సొబగులు లేకుండా, కోరికలతో కాలిపోవటవే తెలిసిన లోకాన్ని, ఆ కాలటంలోంచి జారిపోతున్న ఆలోచనలనలని మనసుపెట్టి, గుప్పిట్లోపట్టి అక్షరాల్లో పట్టగలిగిన వడ్డెర చండీ దాసు గార్ని పుక్కిటపట్టిన మీరు గురువుగారే.

    గురూగారు, ఒక అద్భుతవైన, మనుషులు మనసులో గుట్టుగా దాచుకున్న అనుభవాల్ని మీరు ఇంత హృద్యంగా రట్టుచెయ్యటం మీకు, చండీదాసు గారికే చాతనౌనేవో.

    మీ రచనలు మరేవైనా అంతర్జాలంలో లెకపోతే పుస్తకాల రూపంలో లభ్యవేవో చెప్పగలరా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  6. Purnima says:

    “Language is a skin: I rub my language against the other. It is as if I had words instead of fingers, or fingers at the tip of my words. My language trembles with desire. The emotion derives from a double contact: on the one hand, a whole activity of discourse discreetly, indirectly focuses upon a single signified, which is “I desire you,” and releases, nourishes, ramifies it to the point of explosion (language experiences orgasm upon touching itself); on the other hand, I enwrap the other in my words, I caress, brush against, talk up this contact, I extend myself to make the commentary to which I submit the relation endure. ”
    — Roland Barthes (A Lover’s Discourse: Fragments)

    That is all, your honour! 😛

  7. Purnima says:

    By the way, I’ve not read the story completely. May be, I’ll never complete it.. I don’t want to “finish” it!

  8. కొడవళ్ళ హనుమంతరావు says:

    రేవతీదేవి కవిత http://www.eemaata.com/em/library/silaalolita/1032.html గుర్తొచ్చింది:

    “తన అక్షరాలు
    అవటానికి
    అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ
    అదేమిటో వాటి రూపే మారిపోతుంది
    తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి

    ఒక్కోసారి మరీ ముద్దొచ్చి
    కాసిన్ని అక్షరాల గుత్తుల్ని
    గుప్పెట నిండా పట్టుకుంటానా
    చేతి నిండా తేనె చిప్పిలుతుంది

    తన అక్షరాలు పదబంధాలు
    తేనెలా మంచులా వెన్నెలలా
    అవసరమైతే అగ్నిశూలాల్లా
    తన అక్షరాల పదబంధాలు”

    శ్రీపతి లో మార్పు కొత్తగానే ఉంది!

    కొడవళ్ళ హనుమంతరావు

  9. abhisapthudu says:

    Thanks a ton for the responses showered upon…

    Dear Anita… Thank u – ur response is a reminder of self-referential integrity constraint!

    Dear Aruna!
    Mahakavi Kalidasa says in his Raghuvamsha kavyam : Vagartha viva sampruktau vagartha pratipattaye Jagataha Pitarau Vande Parvati Parameswarau…
    And
    Viswanatha Satyanarayana of West, T S Eliot wrote: ‘What I call the “auditory imagination” is the feeling for syllable and rhythm, penetrating far below the conscious levels of thought and feeling, invigorating every word; sinking to the most primitive and forgotten, returning to the origin and bringing something back, seeking the beginning and the end. It works through meanings, certainly, or not without meanings in the ordinary sense …’
    ….. and I have no answer to your left hand shake hand.

    Dear Meher!
    Ic þancie þe
    It was goose-bumpy ride for you. But, my colleague misconstrued it a Goosebumps (R L Stine) experience. Thank God, it was not so…!:-)

    Dear Indra Prasad,
    You said- “Desire, jealousy, protective failure and the sublime guilt make the narrative spell bind.” However, I failed to understand from the seemingly generalized statement that whether the desire, jealousy, protective failure and the sublime guilt of Abhisapthudu made the narrative enthrall, or not? You are shrewd enough in leaving ur comments neutral. However, thanks for your keen reading…..

    Dear Ravi Kiran,
    I am ecstatic for being compared with Vaddera Chandidas.
    At the same time I am diminished for being conceived as your Guru. I do not deserve to be Guru of any. My writings are not found on Internet. However, it would be my privilege if I am read by astute readers. I’ll send a few of my writings personally, if you drop a test mail to abhisapthudu@gmail.com

    Dear Purnima,
    I am really honoured for having a permanent (as you never ‘finish’ the story) and eruditely esoteric reader.
    In my reply, I could not be as candid as Roland Barthes is, owing to the etiquette of communication. However, I read your response between the lines and inundated in euphoria! Thank you very much…..

  10. yakoob says:

    మంచి వచనం అందించినందుకు అభినందనలు. అందులో పడి భావం తేలిగ్గా దొరకటం లేదేమో?

  11. చాలా అద్భుతంగా ఉందండీ మీ పద ప్రయోగం. చాలా చోట్ల భావం దొరకక మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండిపోయాను. వడ్డెర చండీదాస్ గారిని గుర్తు చేసారు. ఆయన తరువాత మళ్ళీ ఇటువంటి వచన కవిత్వాన్ని చదవలేదు. నిఘంటువుల వెంట పరుగులు పెట్టించారు గా ! 🙂 . రెండు సార్లు చదివేసా . అయినా సరిపోదు. అనుభూతి ని మాత్రమే వర్ణించి భావాన్ని పాఠకుల ఊహకే వదిలేసినట్లున్నారు.

  12. జాన్ హైడ్ కనుమూరి says:

    నేను కథలు ఎప్పుడో కాని చదవను.

    రాత్రి చదవటం మొదలుపెట్టి చదువుతూ,
    చదువుతూ ఎప్పుడు నిద్దురపోయానో ఎన్ని సార్లు చదివనో

    ఎదో అర్థమైనట్టు, ఏమీ అర్థంకానట్టు

    మళ్ళీ, మళ్ళీ చదవలేమో

    జాన్ హైడ్ కనుమూరి

  13. Sri says:

    Few questions after reading your story…

    Should the river belong to one always? Should cock fighting happen when a river finds her ocean?

    Would appreciate if you reveal your real name?

    -Sri, Jammalamadugu

  14. I saw Krishnasashtri,SriSri in Vachanam once again.Marvellous masterpiece.Hats off to u Naresh.

  15. చాలా గొప్ప అనుభూతి కలగజేశారండీ. నా విన్నపాన్ని మన్నించి ఈ రచనని చూపించినందుకు దండాలు.
    ఒక్కసారి చదివితే సరిపోని రచన, సందేహం లేదు.
    పైన కొందరు చండీదాస్ తో పోల్చారు. అది వారి ఇష్టం, కానీ ఆ పోలిక అసహజమూ అనవసరమూ నా దృష్టిలో. మీ పద్ధతి మీదే.

  16. a gandhi says:

    dear naresh,
    may be my faculty to perceive is too blunt to be able to appreciate so much flourish.
    gandhi

  17. k.v.reddy says:

    manchi vachnam kasta suthiminchindi baayodrekam baagundi

Comments are closed.