మతవిశ్వాసాల పునాదులు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

ప్రపంచమంతటా మనుషులు నమ్మే రకరకాల మతాలు ఎప్పటినుంచీ మొదలయాయో ఊహించాలే గాని ఖచ్చితంగా చెప్పలేము. సుమారు 5 లక్షల ఏళ్ళ క్రితం నుంచి పది, పన్నెండు వేల ఏళ్ళ క్రితం వరకూ పాతరాతియుగం కొనసాగింది. ఆ కాలపు అవశేషాలనూ, రాతి వస్తువులనూ, చెక్కడాలనూ బట్టి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని విశేషాలు ఇతరత్రా లభిస్తాయి. ఈనాటికీ నాగరికత సోకకుండా తమకు ప్రత్యేకమనిపించే తంతులు నిర్వహిస్తూ బతికే ఆదిమతెగలు ప్రపంచమంతటా కనిపిస్తారు. వారి ఆచారాలూ, నమ్మకాలూ మనకు విచిత్రంగా, అనాగరికంగా అనిపించినప్పటికీ ఆధునిక ముసుగులు తగిలించుకున్న నేటి మతవిశ్వాసాల పునాదులన్నీ వాటిలో కనిపిస్తాయి. వీటిలో కొన్ని వివరాలు కొందరికి జుగుప్సనూ, కొందరికి కోపాన్నీ కలిగించవచ్చు. అయినా కాస్త ఆలోచిస్తే మనుషులకు మొదటినుంచీ ఉన్న కొన్ని మానసిక బలహీనతలే ఈ విషయంలో పని చేశాయని స్పష్టమౌతుంది.

పాతరాతియుగపు సమాధి

పాతరాతియుగపు సమాధి

అనాగరికదశలో ఉన్నప్పుడు మనుషులకు ఒక అస్పష్టమైన తాత్వికచింతన ఏర్పడడానికి చావు అనేదే ముఖ్యకారణమని పాత అవశేషాలనుబట్టి తెలుస్తుంది. 5 లక్షల ఏళ్ళనాటి పీకింగ్ గుహల్లోనూ, 70 వేల సంవత్సరాలనాటి యూరప్ గుహల్లోనూ చనిపోయినవారి తలలను కోసి పాతిపెట్టడం, అంతకు ముందుగా చనిపోయినవారి జ్ఞాపకార్థమో, వారి శక్తిని పొందేందుకో ఆ తలల అంతర్భాగాలను తినడం వగైరా తంతులు అప్పటివారు జరిపినట్టు తెలుస్తోంది.
ఫ్రాన్స్‌లో దొరికిన కొన్ని అవశేషాల్లో అలాంటి పుర్రెలను పానపాత్రలుగా తయారుచేసి ఉపయో గించారని తెలిసింది. ఇవన్నీ జాగ్రత్తగా దాచిన వస్తువులు కనక వీటికి ఏవో ఆటవిక పూజాసామగ్రి వంటి ప్రాముఖ్యత ఉండేదని అనుకోవచ్చు. శవాలు పాతిన చోట్లలో తంతులు జరిగిన దాఖలాలు కనిపిస్తాయి. కొన్ని స్థలాల్లో కుంకుమవంటి ఎర్రని పొడి కనిపించింది. ఎర్రని పొడి వాడకం చాలా ప్రాచీనమైనది. మనవాళ్ళు పూజల్లో విరివిగా ఉపయోగించే కుంకుమ రక్తానికి ప్రత్యామ్నాయమైన సంకేతమని ఈనాడు చాలామందికి తెలియదు. బలులివ్వడం ఆచరణలో కష్టమౌతున్నకొద్దీ పురాతన ఆచారాలను సూచనప్రాయంగా ద్యోతకం చేసే సంకేతాలు మాత్రమే మిగిలాయి. సున్నమూ, పసుపూ కలిపితే సులువుగా, చవకలో తయారయే కుంకుమ ఇందుకు ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా కట్టిన ఇళ్ళ గుమ్మాలకు పుచ్చకాయను (అది అన్నిచోట్లా, ఎల్లకాలమూ దొరకదు కనక గుమ్మడి పండును) వేలాడగట్టడం, దానిమీద మనిషి ముఖంలా గీతలు గీయడం, నరబలికి సంకేతం. ఎర్రగా, రక్తం ఓడుతున్నట్టు కనబడే పుచ్చకాయ బలి అయినవాడి తలకు “న్యాయబద్ధమైన” సంకేతం అన్నమాట.

శిశువుల అవశేషాలు

ఎర్రనిపొడితో 27 వేల ఏళ్ళనాటి శిశువుల అవశేషాలు

ఈ ఎర్రని రంగుపొడి ప్రపంచంలో అనేకచోట్ల మానవులు నివసించిన అతిప్రాచీనమైన గుహల్లో శవాలను పాతిపెట్టిన చోట కనబడింది. ఆస్ట్రియాలోని ఒక గుహలో 5 మీటర్ల లోతున పాతిన ఇద్దరు కవల శిశువుల అవశేషాలు దొరికాయి. 27 వేల ఏళ్ళనాటి ఈ పిల్లలను జాగ్రత్తగా చర్మంలో చుట్టి, మేమత్ ఏనుగు దంతాల చాటున ఖననం చేశారు. వారి శరీరాలకు ఎర్రనిపొడి పూశారు. ఏదో పెద్ద తంతు జరిపి ఉంటారని ఈ ఏర్పాటునుబట్టి తెలుస్తోంది. రక్తం అనేది జీవానికీ, ప్రాణానికీ ప్రతీక. ఋతుస్రావం జరగడం స్త్రీల సంతానోత్పత్తికి సంకేతం. ఇటువంటి విషయాలు ఆదిమానవుల మేధస్సును చాలా ప్రభావితం చేసి ఉంటాయి కనకనే ఇప్పటికీ మన పూజల్లో కుంకుమ లేకుండా జరగదు. బలి ఇచ్చిన మేక రక్తాన్ని ముఖానికి ‘రక్ష’గా పూసుకునే అలవాటు పశ్చిమాసియా తెగల్లో ఉందట. మన దేశంలో జంతువు (లేదా మనిషి) రక్తాన్ని ముఖానికో, నుదుటికో పూసుకునే అలవాటు కొనసాగి ప్రస్తుతం ఎర్రని తిలకాలూ, బొట్లూ మిగిలాయి. దీనికి మరేదో వివరణ ఇవ్వడానికి అష్టవంకర్లు తిరగనవసరంలేదు. ఇప్పుడు మనకేలా అనిపించినా ప్రాచీనుల తంతులన్నీ సమాజశ్రేయస్సు కోసం ఏర్పాటైనవే అని గుర్తుంచుకోవాలి.
ప్రాచీనులు శవాలను పాతిపెట్టడంలో పద్ధతి ఉండేది. కొన్నిచోట్ల పడమటి దిక్కుకేసి అమర్చిన 27 పుర్రెలు కనబడ్డాయి. ఈ తలలన్నీ శరీరాలనుంచి నరకబడ్డాయి. ఫ్రాన్స్‌లోని ఒక స్థలంలో ఒక యువకుడి శవాన్ని కుడివేపుకు తిప్పి, మోచేతిని తలకింద అమర్చి పాతారు. దగ్గరలోనే రాతి ఆయుధాలు ఉంచారు. ఆ పక్కనే ఆ కాలపు ఎద్దును కాల్చిన అవశేషాలున్నాయి. అంటే ఏదో విందు కూడా జరిగిందన్నమాట. మరొకచోట ఒక నియాండర్తాల్ మానవుడి శవాన్ని ఇలాగే పడమటివేపుకు తిప్పి, రాతి పనిముట్లతో సహా జాగ్రత్తగా బండల మధ్యన పాతిపెట్టారు. కొన్నిచోట్ల శవం తలచుట్టూ వలయాకారంలో అమర్చిన రాళ్ళు కనిపిస్తాయి. ఇవన్నీ మనం ప్రాచీనం అనుకునే ఈజిప్ట్ నాగరికత వగైరాలకన్న ఎంతో పాత సంఘటనలు. ఏది ఏమైనా అంతటి ప్రాచీనయుగంలోనే మనుషులు చనిపోయిన సాటివారి గురించీ, చావును గురించీ ఎంతో ఆలోచించేవారని స్పష్టంగా తెలుస్తోంది.

నియాండర్తాల్ శవం

70 వేల ఏళ్ళ క్రితం పాతిపెట్టిన నియాండర్తాల్ శవం

చచ్చిపోవడమనేది తప్పనిసరి అని తెలిశాక ప్రాచీనులు చావును గురించి ఎంతగా బెదిరి ఉంటారో మనకు తెలియదు. కష్టాలమయంగా గడిచిన అప్పటి కాలంలో ప్రాణానికి ఇప్పటికన్నా చాలా ఎక్కువ విలువ ఉండేదని ఊహించవచ్చు. అసలే సగటు ఆయుఃప్రమాణం చాలా తక్కువగా ఉండి, రోగాలూ, గాయాలూ, ప్రమాదాలూ బలి తీసుకున్నప్పుడల్లా అప్పటి జనాభా తగ్గుతూ ఉండేది. నలుగురూ కలిసి ఐకమత్యంతో బతికితేగాని పూట గడవని ఆ కాలంలో చావు అనేది చాలా అవాంఛనీయం అనిపించి ఉండాలి. ఈ కారణలవల్ల చావు అనేది ఎంతో తాత్వికచింతనకూ, తొలి మతపరమైన తంతులకూ దారితీసి ఉండాలి. చనిపోయిన తరవాత ఏమవుతుందోననే అనుమానాలూ, అపోహలూ, చనిపోయినవారి శక్తిని నిలిపి ఉంచే ప్రయత్నాలూ, వేరే రూపంలో వారు కొనసాగుతారేమోననే ఆశతో రకరకాల సంకేతాల అన్వేషణలూ, ఇలా ఆలోచించడం కేవలం పొట్ట పోసుకునేందుకు పాటుపడే జీవితాలకు సంబంధించని దిశలో మనుషుల మానసికజీవితాన్ని మలుపు తిప్పి ఉంటుంది. ఇప్పటికీ ‘పరలోకం’ గురించి ఆలోచించడానికి మనని పురికొల్పడంలో దేవుడికన్నా మరణం గురించిన ఆలోచనలే బలంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.
మనిషి ఏనాడైనా తనకు తెలిసిన విషయాలను గురించి నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తాడు. తెలియనివే కలవరపెట్టి బాధిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది చావు. తెలియని వాటి గురించే బాధంతా. జబ్బు చేస్తే మందులు తీసుకుంటాం కాని పూర్తి నమ్మకం ఉండదు. చావు భయంతో మొక్కుకోవడం, జ్యోతిష్కులదగ్గరికి వెళ్ళడం వగైరాలు చూస్తాం. మనస్సు బలహీన పడినప్పుడల్లా మతాలు కావలసివస్తాయి. అయితే ఒకసారి వచ్చి తిష్ఠ వేసిన మతాలు మనను వదిలి పెట్టకుండా బాధిస్తూ, అప్పుడప్పుడూ రక్తపాతానికీ, హింసకూ కూడా కారణమవుతూ ఉంటాయి.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు (http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

36 Responses to మతవిశ్వాసాల పునాదులు

Comments are closed.