– కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఒక సంగతి చెప్పాలి. మీరిది చదువుతున్నారంటే మీకు ప్రత్యేకత ఉన్నట్టే. మొదటి విషయం మీకు తెలుగు చదవడం వచ్చు. రెండోది వెబ్ పత్రిక చదివేంత సాహిత్యాభిమానం ఉంది. మూడోది ఇదేమీ కథా కాకరకాయా, కవిత్వమూ కాదని తెలిసికూడా చదువుతున్నారంటే మీ ఆసక్తి చెప్పుకోదగినదే. అయితే ఏమిటట? ఆ విషయానికే వస్తున్నా…
ఈ ఏడాది నాకు 60 నిండుతాయి. జీవితమంతా ప్రవాసాంధ్రుడుగానే జీవిస్తున్న నాకు గత 4 దశాబ్దాలుగా అనేక తెలుగు కుటుంబాలను కలుసుకునే అవకాశాలు లభించాయి. వారి సాంస్కృతిక నేపథ్యాన్ని గమనించే సందర్భాలు తటస్థించాయి. అందరు మధ్యతరగతివారిలాగే తెలుగువారుకూడా సంసారసాగరంలో తలమునకలవుతూ, కిందామీదా పడుతూ, హడావిడీ హైరానాల జీవితాలు గడుపుతున్నారు. ముఖ్యంగా పెద్దసిటీల్లో పిల్లలకు కిండర్ గార్టెన్ వయసు రాకముందే చదువుల హడావిడి మొదలవుతుంది. స్కూళ్ళ గొడవతోబాటు కొన్ని కుటుంబాల్లో ట్యూషన్లూ, రకరకాల లలితకళలు నేర్పే క్లాసులూ వగైరాలతో సమయం గడిచిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఆటలూ, టీవీ ప్రోగ్రాములతో కొంత సమయం పోతుంది. పన్నెండోక్లాసు జీవన్మరణ సమస్యగా పరిగణించబడుతుంది. ఆ తరవాత ‘గధా, ఘోడా’ తేడాలు మొదలవుతాయి. డాక్టర్లూ, ఐఐటీలూ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులూ ఇలా జీవనమార్గాన్ని నిర్దేశించే చదువుల్లో పడిపోతారు.
ఇవన్నీకాక పొట్టపోసుకునేందుకు అవసరం అనిపించని విషయాల మాటేమిటి? తెలుగు భాష, సంస్కారం, సాహిత్యం, రాజకీయాలు, సమాజసేవ ఇలాంటి సవాలక్ష విషయాలను గురించి కాస్తయినా పరిచయం పెరగడానికి పిల్లలకు ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయి? అసలు వారికి తల్లిదండ్రులతో ముచ్చటించేంత వ్యవధి ఉంటోందా? ఒకే ఇంట్లో ఉంటూ, తిని తిరుగుతున్నంత మాత్రాన, పక్కపక్కనే మౌనంగా కూర్చుని టీవీ చూసినంతమాత్రాన పిల్లలకు తల్లిదండ్రులతో సరైన కమ్యూనికేషన్ ఉన్నట్టుగా అనుకోలేము. తిండీ, బట్టలూ, చదువూ, ఆరోగ్యం వగైరాలన్నిటి గురించీ బాధ్యతగా ప్రవర్తిస్తూ పిల్లలని పెంచే తల్లిదండ్రులు ఈ ‘అదనపు’ విషయాలను గురించి ఆలోచిస్తారా? పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతున్నారో గమనిస్తారా? మరొక సంగతి. వీటి గురించి పిల్లలకు నేర్పగలిగిన సామర్థ్యం తల్లిదండ్రులకు ఉందా?
పాత తరాలతో పోలిస్తే ఇప్పటివన్నీ న్యూక్లియర్ కుటుంబాలయిపోతున్నాయి. అమ్మమ్మలూ, తాతయ్యలూ, మేనత్తలూ, మేనమామలూ, కజిన్సూ వగైరా బంధువుల రాకపోకలూ, కుటుంబాల్లో కొంతైనా మిగిలి ఉన్న తెలుగు సంస్కారం గురించి తెలుసుకునే అవకాశాలూ పిల్లలకు బాగా తగ్గిపోతున్నాయి. నాకు ప్రత్యేకంగా అభిమానం ఉన్న సంగీతం విషయం గమనించినప్పుడు పిల్లలకు గాత్రమో, వీణో, పియానో వగైరాలో నేర్పిస్తున్న తల్లిదండ్రులుకూడా అదో మొక్కుబడిగా చేస్తున్నారు గాని సంగీతం గురించిన నేపథ్యాన్ని పిల్లలకు వివరించడం, ఇంట్లో అటువంటి సంగీతాన్ని అస్తమానం వినిపించడం, పిల్లలను కచేరీలకు వెంటపెట్టుకు వెళ్ళడం వగైరాలేమీ చెయ్యరని తెలిసింది. పెద్దవారికే లేని అవగాహన పిల్లలకెలా వస్తుంది? తండ్రి ఉద్యోగంతోనూ, తల్లి (ఉద్యోగం ప్లస్) ఇంటిపనితోనూ సతమతం అయిపోయి ఓపిక కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నారు. కాస్త అటూఇటూగా మీరు పెరిగిన వాతావరణం కూడా ఇటువంటిదేనా? మరి మీకు మొదట ప్రస్తావించిన ప్రత్యేకత ఎలా అబ్బింది?
ఈ చొప్పదంటు ప్రశ్నలు వెయ్యడానికి కారణం ఉంది. ఈ మధ్య కొత్తగా చేరిన నా సహోద్యోగి ఒకతనితో ముచ్చటిస్తున్నప్పుడు కొన్ని విషయాలు బైటపడ్డాయి. అతను 30 ఏళ్ళ తెలుగు యువకుడు. తెలుగు బాగానే మాట్లాడతాడు. అయితే చదవడం సరిగా రాదట. అతను ఏ ఝార్ఖండ్‌లోనో పెరగలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్‌దాకా చదువుకున్నాడట. మద్రాసులో పుట్టి పెరిగి బొంబాయిలో 34 ఏళ్ళు గడిపిన నాలాగా కాదు. ఈ సంగతి మిత్రులకు చెపితే అతని పరిస్థితి ప్రత్యేకమేమీ కాదనీ, ఈ తరంవారు చాలామంది అటువంటివారేననీ చెప్పారు.
అందుచేత ఇది చదువుతున్న యువపాఠకులను కొన్ని ప్రశ్నలు అడగబుద్ధి అవుతోంది.
• మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
• అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
• చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
• మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
• ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
పత్రికాముఖంగా మీరిచ్చే జవాబులు చాలా విలువైన స్పందనలవుతాయని నా ఉద్దేశం. ఇవి కేవలం నా వ్యక్తిగతసందేహాలు కావనీ, ప్రస్తుతకాలంలో తెలుగువారందరికీ సంబంధించినవేననీ మీకు తెలుసు. ఈ జవాబులు చదివినవారు వాటిని తమతమ వ్యక్తిగతఅనుభవాలతో పోల్చుకోగలుగుతారు.
వీటికి అనుబంధంగా మరికొన్ని విషయాలున్నాయి. మీకు వివిధ కారణాలవల్ల తెలుగుమీద ఆసక్తి పెరిగింది కనక మీ పిల్లలకు (లేదా మీకన్నా చిన్నవారికి) అటువంటి అవకాశాలు ఎలా కలుగుతాయో, ఏ ప్రయత్నాలద్వారా కలిగించవచ్చో చెప్పగలరా? ఏ తరానికాతరం జాగ్రత్త పడకపోతే పిల్లలు తెలుగు విషయంలో వెనకపడి పోతారు. తన సంస్కృతిమీద గౌరవం లేని వ్యక్తి ఏ సంస్కృతినీ గౌరవించలేకపోయే ప్రమాదం ఉందని పెద్దలంటారు. తెలుగు నేర్చుకోవడం అంటే కేవలం భాష, లిపి, చదవడం, రాయడం వగైరాలే కాదని వేరే చెప్పనక్కర్లేదు. ‘ఇంత ఆందోళన పడాల్సిన అవసరంలేదు. తెలుగుభాష సుబ్భరంగా ఉంది, బతికే ఉంది’ అంటున్నవారూ లేకపోలేదు. అది నిజమైతే మనమంతా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అలా కాకుండా మీవంటివారు నిజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల లాభాలు పొంది ఉంటే ఆ విషయాలు అందరితో పంచుకోవడం అవసరమని నా ఉద్దేశం. దీన్ని ప్రచురించడంద్వారా తెలుగును ప్రోత్సహిస్తున్న సంపాదకవర్గానికి ధన్యవాదాలు.
40 Responses to ఈ తరానికి ప్రశ్నలు