– కాజా సురేష్
పెరిగిపోతున్న జనాభా భారాన్ని మోస్తున్న భరతమాతలా, రాజకీయ రైలు మరో ఎలక్షను స్టేషనులోకి నెమ్మదిగా వచ్చి ఆగింది. పెళ్ళిళ్ళ సీజనులో జనరలు కంపార్టుమెంటులా, ఆంధ్ర దేశపు బోగీ, పదవీవ్యామోహపరులతో క్రిక్కిరిసి ఉంది.
చెన్నైలో రజనీకాంత్ కొత్త సినిమా విడుదల సందర్భంలోలా, రంగురంగుల నాయకుల పోస్టరులు, కరపత్రాలు, మైకుల శబ్దాలతో స్టేషనంతా గందరగోళంగా ఉంది. మీకిష్టమైన (అభి)రుచులలో, వేడి వాడి కబుర్లు దైవ”సాక్షి”గా, “ఈనాడు” మీకందించి మీలో “జ్యోతి”, “ప్రభలు” వెలిగిస్తామని రకరకాల పేపరు కుర్రాళ్ళు అరుస్తూ బోగీ చుట్టూ కలియ దిరుగుతున్నారు.
ఇక స్టేషను టీవీలలో సరేసరి – త్రివర్ణము, పసుపు, గులాబి, పచ్చ లాంటి వివిధ రంగులలెన్సుల నుండి వస్తున్న గాలిమేడల సీరియలు కబుర్లు, ఉచిత తాయిలాల వర్ణనలు, వెన్నుపోట్ల విశేషాలు, వాత్సాయనుడు సైతం సిగ్గుపడేలాటి అసభ్యపు మాటల తూటాలను, నోట్లో వేలేసుకొని, అతి శ్రద్దతో తమను తాము మర్చిపోయి చూస్తున్నారు వెర్రి జనం.
పంచె, లాల్చీ తొడుక్కుని, గాంధీ టోపీ పెట్టుకున్న ఒక ముసలి ఆసామి – ఏడు పదుల వయస్సు ఉండవచ్చు – తన ఇద్దరు కొడుకులతో రైలు దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళలో ఏదో తెలియని తేజం, పోరాటాలు జరిపిన పట్టుదల, తోటి మనుషుల పట్ల అంతులేని కరుణ, భావి తరాల పట్ల ఆశాభావం ప్రస్ఫుటమవుతున్నాయి.
కొడుకులిద్దరు కొంచెం నాగరికమైన (?) బట్టలు వేసుకున్నా, వాళ్ళంతా దారిద్ర్యరేఖకి దిగువున ఉన్నవాళ్ళే అన్న సంగతి ఇట్టే తెలుస్తున్నది. సినిమాహాలులో బాల్కనీ టికెట్టు ‘అయ్య’వారు ‘నేల’బ్బాయిని చూసినట్టు, మిగతా ప్రయాణికులు పెట్టిలోకి ఎక్కుతున్న వీళ్ళను అసహనంగా, చిరాకుగా చూశారు.
మరి కాసేపటిలో, TC నింపాదిగా బోగీలోకి అడుగుపెట్టాడు, అతని కోటు జేబుమీద తెలుగులోను, ఇంగ్లీషులోను, “మీ సగటు అమాయకపు వోటరు” అని రాసి ఉన్నది. మెట్ల దగ్గర, కింద కూర్చున్న వృద్దుని కుటుంబం వంక ఓరకంటనైనా చూడకుండా, బెర్తులలో దర్జాగా బైఠాయించిన బడాబాబుల దగ్గరికి నేరుగా వెళ్ళాడు.
కూపేలో కూర్చునివున్న ‘సార్రాజు’, “ఏమిసారూ బాగున్నారా?” అని కులాసాగా పలకరించాడు TCని. “మిమ్మలిని కలిసి అప్పుడే ఐదేళ్ళు అయిందా” అని విపరీతమైన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “క్రితంసారి మల్లే ఈతూరి కూడ నాకు మా పోరగాళ్ళకు కిటికీ కాడ సీటు ఇవ్వాలి మళ్ళా” అని, TC చేతిలో రెండు వారుణి పొట్లాలు ఒక సీమసారా సీసా పెట్టాడు. TC విపరీతమైన ఆనందంతో తూలుతూ, కొంచెము ఎదరగా, ఏదో గొడవ జరుగుతున్నచోటికి వెళ్ళాడు.
అక్కడ “రౌడీ రంగడు” నాటు బాంబులు, తుపాకులతో వీరంగం చేస్తూ కనబడ్డాడు. కిందపడ్డ రక్తపు మరకలు చూస్తే అప్పటికే రెండు మూడు మర్డరులు జరిగిఉండవచ్చునని సులభంగా తెలిసిపోతోంది. తన కండలు చూపిస్తూ, మీసాలు మెలేసి, కరుకుగా “ఏమి సారు ఇక్కడ కూర్చోవచ్చా?” అని ఉరుముతున్న గొంతుతో TCని అడిగాడు. “అంతకంటేనా” అని నీళ్ళు నములుతూ బదులిచ్చాడు TC.
“ఆడితో మనకెందుకుగాని ఓపాలి ఈడకి రారా” అని TCని పిలిచాడు అతనికి దూరపు చుట్టపు
వరసైన సుబ్బారావు. “మన కులపోళ్ళంటే బొత్తిగా ఈళ్ళకి ఇలువ లేకుండా పోయిందిరా. అందుకని నువ్వు నాతోపాటు మనోళ్ళందరికి సీటు ఇవ్వాలి” అని అవేశంతో గట్టిగా గొంతు బొంగురుపోయేట్టు అరిచాడు.
“నా కులపోళ్ళేనా తక్కువ తింది?” అని TC, వాళ్ళందరికి సీట్లే కాదు, మంచి మంచి బెర్తులుకూడా ఇచ్చి, ఆ సంతోషంలో కళ్ళవెంట వస్తున్న అనందబాష్పాలు తుడుచుకుంటూ ఇంకొంచెం ఎదరకి వెళ్ళాడు.
అక్కడ, మంద్రస్వరంలో వస్తున్న పాశ్చ్యాత్య సంగీతానికి అనుగుణంగా, కట్టేబట్ట కూడా బరువైన ఒక నాజూకు సుందరి, లయబద్దంగా ఆడుతూంటే, విలాసంగా చూస్తున్నాడు, తాబేదారు అప్పారావు. అశోకుడు రోడ్లు వేయించాడో లేదో, భగీరధుడు సురగంగను తెచ్చాడో లేదో తెలియదుగాని, ఈ ప్రబుద్దుడు మాత్రం నిస్సందేహంగా అనేక ప్రాజెక్టు పనులు పూర్తిచేశాడని సర్కారీ రికార్డుల కథనం.
“ఇదిగో టీసీ, నీకీ యాతనెందుకు గాని, ఈ కట్ట ఉంచుకొని సగము సీట్లు, బెర్తులు మాకిచ్చి ఇవాళ్టికి నువ్వు పండగ చేసుకో” అని ఒక నోట్ల కట్ట, యజమాని కుక్కకు ప్రేమతో బిస్కెట్టు విసిరినట్టు, TC వైపు విసిరాడు. మెరిసే కళ్ళతో ఆ డబ్బు తీసికొని, తన చొక్కాతో బెర్తులు తుడిచి, “సార్, మీరు ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, బోగీ చివరి, మెట్ల దగ్గిరికి బరువైన జేబులతో నెమ్మదిగా వెళ్ళాడు TC.
అక్కడ, కింద గొంతుక్కూచునివున్న వృద్ధుడిని చూసి “నీ దగ్గర సారాగాని, డబ్బుగాని ఏమైనా ఉందా? కనీసం నువ్వు మా కులపోడివేనా?” అని చిరాకుగా అడిగాడు. బిత్తరపోయిన చూపులతో ముగ్గురూ తల అడ్డంగా ఊపారు.
“ఐతే దిగిపోండి” అని కటువుగా (ఓ బూతు పదం జోడించి) చెప్పి, వాళ్ళు చెప్పేది వినకుండా దించేశాడు. రైలు ‘కూ చికు చికు చికు’ అనుకుంటూ చీకటిలో గమ్యము తెలియని భవిత వైపుకు వేగంగా వెళ్ళిపోయింది. ప్లాటుఫారం మీద ఒంటరిగా మిగిలిపోయారు, వాళ్ళు ముగ్గురు.
ప్రపంచంలోని అతి పెద్ద Democracy ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి వచ్చిన ఓ విదేశీ ఔత్సాహికుడు, “ఎవరు మీరు?, ఆ వోటరు మిమ్మల్ని ఎందుకు దించేశాడు?” అని అడిగాడు వాళ్ళను. “నా పేరు ‘దేశ భక్తి’, వీళ్ళిద్దరు ‘నీతీ నిజాయితీ’, ‘సమాజ సేవ’ అనే నా బిడ్డలూ”, దీనంగా బదులిచ్చాడు ఆ వృద్దుడు. అయోమయుంలో పడ్డ ఆ విదేశీయుడు తన డైరీలో ఇలా రాసుకున్నాడు –
“ఇలాంటి వోటర్లు(TCలు), రాజకీయనాయకులు ఉన్న ఈ దేశపు ప్రజాస్వామ్యానికి ఆ దేవుడే దిక్కు”.
———————

సురేష్ కాజా స్వస్థలము కృష్ణా జిల్లా నూజివీడు. పిలాని, కాన్పూర్, డల్లాస్లలో ఉన్నత విద్యనభ్యసించి, ప్రస్తుతం డల్లాస్లో Software Consultant గా పని చేస్తున్నారు. తన ఆలోచనలను http://naazaada.wordpress.com అనే బ్లాగులో చూడవచ్చు.
Pingback: సమకాలీన రాజకీయ పరిస్థితి « మ్యూజింగ్స్
Pingback: ఆగండి..ఆలోచించండి…ఓటెయ్యండి.. « మ్యూజింగ్స్