కవిత్వం నుంచి కవిత్వంలోకి… ‘దారి తప్పిన పక్షులు’

(Telugu translation of Tagor’s Stray Birds by Bolloju Baba)

– నిషిగంధ

కవిత్వమంటే అనుభవించిన క్షణాల్ని అక్షరాల్లోకి అనువదించడం! ఆ అనువదించిన అక్షరాలని పట్టుకుని పాఠకుడు కవి పొందిన అనుభూతిని పొందగలిగినప్పుడే ఆ కవిత్వం సార్థకమౌతుంది.

కవికి కవిత్వం ఒక జీవన విధానంగా ఉండాలి. అంతే కానీ బ్రతుకుతెరువు కోసం రాయడం మొదలుపెడితే అనుభూతి పాలు తగ్గిపోయి అభూత కల్పనలు ఎక్కువైపోతాయి! ‘తత్త్వతః వస్తువు అలంకారాలుగా మారిపోవడమే కవిత్వం. అలాగని కవిత్వమంటే అర్థవైచిత్రిగాని, శబ్దవైచిత్రి కాదని’ అంటారు శేషేంద్ర శర్మ. అంటే క్లిష్టమైన పదబంధాలు, లోతైన భాషా పటిమతో మంచి కవిత్వం పుట్టదు. కవి యొక్క అనుభవాల పరంపర అభివ్యక్తమయ్యే రీతి కళాత్మకంగా, తమ హృదయాలకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే పాఠకుడు అందులో తనని తాను ఆవిష్కరించుకోగలడు.

సరిగ్గా అలాంటి కోవలోకి వచ్చేదే విశ్వకవి రవీంద్రుని కలం నించి వెలువడిన కవితా సంకలనం, ‘Stray Birds’.  టాగోర్ గురించి, ఆయన రచనల గురించి పరిచయ వ్యాక్యాలు చెప్పాలనుకోవడం సాహసమే అవుతుంది. చదవడానికి ఎంతో సరళంగా ఉంటూనే, గాఢమైన భావార్ద్రతను కలిగి ఉండటం వాటి ప్రత్యేకత! తన అక్షరాల్లో కనిపించే వేదాంత దృక్పథం, ఉపనిషత్తుల ప్రభావం అని చెప్పుకునే టాగోర్, తన రచనలన్నీ చాలావరకు బెంగాలీలోనే చేసినా, తర్వాత కొన్నింటిని స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. అలా తర్జుమా చేయబడినదే, 1916 లో అచ్చువేయబడిన ఈ ‘Stray Birds’ కవితా సంకలనం. క్లుప్తత, గుప్తత ఈ కవితల ప్రధాన లక్షణాలు. చైనా, జపాన్ పర్యటనా కాలంలో ఆయా దేశాల కవిత్వ ప్రభావంతో ఈ చిన్న చిన్న కవితలు రాసినట్టు చెబుతుంటారు. అందుకేనేమో అక్కడక్కడా ‘హైకూ’ ఛాయలు కనబడుతుంటాయి!

టాగోర్ రచనలు చాలానే తెలుగులోకి అనువదింపబడినా ఎప్పటికీ నిలిచిపోయేవిగా గీతాంజలి, రాణీఘాట్, గోరా వంటి వాటిని చెప్పుకోవచ్చు.

అడపాదడపా కొంతమంది ఒకటీ రెండు పద్యాలను తెలుగీకరిస్తూనే ఉన్నా బహుకాల విరామం తరువాత టాగోర్ రచించిన ఈ  కవితా సంకలనం ‘Stray Birds’ మొత్తం ‘దారితప్పిన పక్షులు ‘ గా తెలుగులోకి అనువదింపబడినది. అనువాదకుడు మరెవ్వరో కాదు, పదచిత్రాలతో మనల్ని తరచూ సాహితీయానం చేయించే బొల్లోజు బాబా గారు.

ప్రకృతి, ఈశ్వరుడు, స్నేహం, ప్రేమ, మొదలైన వివిధ విషయాలను టాగోర్ చిన్న చిన్న కవితలలో స్పృశించాడు. ఈ చిట్టి కవితలలో కొన్ని, ఒక్క లైనుకే పరిమితమైనవి కూడా ఉన్నాయి. ‘దారితప్పిన పక్షులు’  పేరు వినగానే ఇదేదో వేదనా స్వరమేమోనన్న సంకోచం. కానీ మొత్తం 326 కవితలున్న ఈ సంకలనంలో చతురత, ఆరాధన, వేదాంతం, భక్తి ఇత్యాది భావాలన్నీ కలగలిసి, మంద్రస్వరంలో సాగుతున్న అద్భుతమైన పాటనేదో వింటున్న అనుభూతి కలుగుతుంది! వీటిలో లీనమవుతుండగానే, ఇవి పక్షులు కావు దారితప్పిన కవి ఆలోచనలు, భావాలు అన్న విషయం సుస్పష్టమవుతుంది.

నిజమే కదా! మన ఆలోచనలు కూడా పక్షులంత స్వతంత్రంగా విహరిస్తాయి. ఎక్కడెక్కడో తిరిగిన గువ్వలన్నీ చివరికి గూటికే చేరినట్లు ప్రాపంచిక విషయాలన్నిటినీ స్పృశించిన ఈ ఆలోచనా స్రవంతి కూడా కవి హృదయంలోకి ఒదిగిపోతుంది. అక్షరాలుగా జారి పాఠకులకి విశేషాలను వినిపిస్తుంది!

అనువాద రచన, పైగా ఇది యథామాతృకానువాదం. యథేచ్ఛానువాదం కాదు! అందులోనూ ఈ సంకలనంలోనివి చిన్న చిన్న కవితలు. ఇదే economy of words ని వేరే భాషలోకి తర్జుమా చేయడం అంత సులువు కాదు. అసలు రచనలోని అంతఃస్సూత్రాన్ని అవగాహించుకోవడమే కాదు అందులోని భావం, శిల్పం చెడకుండా అనువదించడం, అదీ సహజత్వానికి ఏమాత్రం దూరం కాకుండా చూడగలగడం కష్టసాధ్యమే!!

చిన్న కవితలలో పదాలను ఆచితూచి ప్రయోగించాలి. ఉన్న పరిధిలోనే ఉన్మీలనం చెందగలిగి ఉండాలి. అంటే కలం పట్టుకున్నవారికి భాషా ప్రావీణ్యమేకాదు, పదాల ప్రయోగంలో నైపుణ్యం ఉండాలి! ఇది సాధించడానికి ఇరు భాషల మీదా పట్టు ఉండాలి. వేరే భాషలో ఉన్న కవిత్వాన్ని అనువదించేప్పుడు భాషా ప్రయోగం కుదరకపోతే, ఆయువుపట్టైన రసజ్ఞతా భావం లోపించి కవిత్వం వచనమైపోయే ప్రమాదం ఉంది. బాబా గారి కవితలు చదివిన వారెవరికైనా ఆయన ప్రతిభ మీద ఏమాత్రం సందేహం కలుగదు. అనువాద వాసనలు ఇసుమంతైనా తగలని చిక్కని కవిత్వాన్నే మనకందించారు!

టాగోర్ సాహిత్యంతో, ముఖ్యంగా కవిత్వంతో పరిచయమున్న వారెవరికైనా తెలుస్తుంది ఆయన ఎన్ని రకాల సూచికలు, ఉపమానాలు, పద చిత్రాలు ఉపయోగించారో! బాబా గారి అనువాదం చదువుతుంటే ‘టాగోర్ మాతృకలో ఎలా వ్యక్తపరిచి ఉంటాడో!?’ అన్న కుతూహలం ఎక్కడా కలుగదు. మన నేపథ్యానికి తగినట్టుగా అనువాదకుడు పరిచిన పదజాలంలో ఒదిగిపోతూ మనమూ ఆ పక్షుల వెనకే చేతనాచేతనలను మరచి సంచరించడం మొదలుపెడతాము!

1

వేసవిలో దారితప్పిన పక్షులు, నాకిటికీ పై వాలి
పాటలు పాడి ఎగిరిపోయాయి.
పాటలు లేని శిశిర పత్రాలు
తల్లడిల్లి నిట్టూరుస్తో నేలరాలాయి.

అంటూ మొదలుపెడుతుండగానే కవి మాయమైపోయి అతని అనుభవాలు, అనుభూతులే మన కళ్ళముందు నిలుస్తాయి! ఇది ఆత్మాశ్రయ కవిత్వమా లేక అనుభూతి కవిత్వమా అంటూ ఒక వర్గానికి పరిమితం చేయలేము. కానీ ప్రధానంగా మూడు కవితా వస్తువులు కనబడతాయి: ప్రాపంచిక విషయ జ్ఞానం (Philosophy of life), భక్తి / ఆరాధన, ప్రకృతి.

ముందుగా ప్రాపంచిక విషయ జ్ఞానం గురించిన కవితలనే తీసుకుంటే వీటిలో మౌలికాంశాలను స్పృశించే తాత్త్వికాలోచన కనిపిస్తుంది.

14

సృష్టి రహస్యం రాత్రి చీకటిలా ఒక అద్భుతం.
జ్ఞానం యొక్క మాయలు
ఉదయపు మంచు పొగ వంటివి.

రాత్రి చీకటి అంటే గాఢమైన నిశ్శబ్దం. చుట్టూ ఉన్న ప్రపంచంతో డిటాచ్మెంట్ కలిగించే అలౌకిక స్థితి. రసానుభూతుల సంఘర్షణ నించి విరామం దొరుకుతున్నప్పుడే నిశ్శబ్దంగా ఒక మొగ్గ మెల్లగా విచ్చుకుంటుంది. అదే సృష్టి రహస్యం. అంతా జరుగుతూనే ఉంటుంది. కానీ రాత్రి చీకటిలా అస్పష్టంగా, అద్భుతంగా! జ్ఞానం మనల్ని మనం అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో మన లోపల, బయట ఉన్న అనేకాంశాలు తేటతెల్లమౌతుంటాయి. ఉదయకాలపు పొగమంచు కిరణాల స్పర్శతో కరిగిపోయినట్లు, జ్ఞాన సముపార్జన ప్రాపంచిక విషయాలపై అప్పటివరకూ ఉన్న భ్రాంతిని కరిగించివేస్తుంది.

20

శ్రేష్ఠమైన దాన్ని నేనెన్నుకోలేను.
శ్రేష్ఠమైనదే నన్ను ఎన్నుకొంటుంది.

మనకు అనువైనది, అవసరమైంది తనంతట తానే మనల్ని చేరుకుంటుంది. అదే అన్నిటికంటే విలువైనది. అలవికాని వాటికోసం వృధా ప్రయాస కూడదనే హెచ్చరిక ఇందులో కనబడుతుంది.

45

అతను తన ఆయుధాలను
తన దేముళ్లుగా చేసుకొన్నాడు.
అతని ఆయుధాల విజయం, అతని ఓటమే.

ఆయుధాలకు ఉన్నత స్థానం ఆపాదించడం, వాటితో సాధించిన విజయమేదైనా వ్యక్తిగత ఓటమిగానే పరిగణించాలంటున్నారు. స్వీయప్రతిభతో చేజిక్కించుకోలేని ఏ విజయమూ మనది కాదు.

మనిషి ఆత్మజ్ఞానం గురించి ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న ఆవేదనను వేరొక కవితలో ఇలా వ్యక్తపరిచాడు.

52

చరిత్రలో మానవుడెక్కడా
తనని తాను బయలు పరచుకోలేదు.
యుద్ధాలతోనే గడిపేసాడు.

48

మిణుగురులుగా
అగుపించటం పట్ల
తారలు భీతినొందవు.

సూర్యునికంటే తేజోవంతమైనవి తారలు. అయినా అవి తమ పరిధులను దాటి వచ్చి విశ్వానికి తమ స్వయంప్రకాశాన్ని ప్రదర్శించాలనుకోవు. యావత్ ప్రపంచం దృష్టిలో కేవలం మిణుకు మిణుకుమనే మిణుగురు పురుగులవలె కనిపించినప్పటికీ తమ తమ స్థానాల్ని వదలక నిలుచుంటాయి. అదేవిధంగా ప్రపంచానికి జ్ఞానుల అంతర్గత శక్తి అవగతమవ్వక వారిని చిన్నచూపు చూసినా, చెదరక స్థిరచిత్తంతో ఉంటారు.

పేదవారని, అధికారబలం ఉన్నవారని, గొప్పవారని, బిచ్చగాళ్ళనీ లేకుండా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు తటస్థపడే ఆఖరి అతిథి మృత్యువు. మనకి మృత్యువు అంటే భీతి. అదొక అత్యంత దుఃఖకరమైన ఘట్టం. మృత్యురహిత ప్రపంచమెందుకు లేదా అని వాపోతుంటాము. కానీ టాగోర్ మాటల్లో మృత్యువు ఎలా ఉంటుందో చూస్తే:

99

మృత్యువనే ముద్ర జీవితం అనే నాణానికి
యోగ్యతనిస్తుంది.
అపుడు మాత్రమే దానితో
ప్రియమైన వాటిని కొనగలం.

మనకి కావాల్సినది మరణరహితమైన సమాజం కాదు, దుఃఖరహితమైన సమాజం. మృత్యువే లేకుంటే మనం చేసే ఏ పనికీ ప్రాధాన్యత ఉండదు. అచ్చు, బొమ్మ ముద్రింపబడని నాణెం లానే!

మన జీవితానికి అర్థాన్ని, ప్రయోజనాన్ని కలుగజేసేది మృత్యువే!
ఇంకొక కవితలో..

222

మృత్యువు ఒక పగులు కాదు
అందుకే ప్రపంచం కారిపోదు.

మృత్యువు ప్రపంచాన్ని నిర్జీవం చేయదు. నిరంతరంగా కొత్తని సృష్టించే అవకాశాన్నిచ్చే అమరత్వం అది!

అసలైన కవికి పరిధి ఉండదు. ఒకేరకమైన వాద కవిత్వానికే కట్టుబడి ఉండాలనుకోడు. స్థూలంగా కవితా వస్తువు జీవితమే అయినా సూక్ష్మంగా పరిశీలిస్తే అవి అనేకానేకం. అనంతం!

ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రకృతిలో తడిసి మైమరిచిపోవాలని అనుకోని కవి ఉండడేమో! ప్రకృతి వ్యక్తపరిచే విభిన్న ప్రేమవల్లరిని చూస్తూ, ఆమె ప్రతి కదలికనీ, ఆ కదలిక తనపై ముద్రించే అనుభూతినీ తనే ప్రేక్షకుడిలా చూసుకుంటూ, అదేదో ప్రపంచానిక్కూడా అనుభవమయ్యేలా చూపాలని తపిస్తాడు.

30

చంద్రమా! దేనికై ఎదురుచూస్తున్నావూ?
“సూర్యునికి వందనమిడి ఆయనకు దారివ్వటానికై”

రాత్రికి రాజుననే అతిశయపు సెగలు ఏ కోశానా చిందించని చందమామ, తన అధిపతి సూర్యుడేనన్న విషయం ఏమరపాటుకి రానివ్వడేమో! అందుకే జాబిలి సన్నిధిలో ఎప్పుడూ మనం చల్లదనాన్నే ఆస్వాదిస్తాము.

65

చిన్నారి గడ్డి పోచా!
నీ పాదం చిన్నదే కావొచ్చు కానీ
పుడమి మొత్తం నీ అడుగుల క్రిందే ఉంది.

సూక్ష్మమైన, సున్నితమైన గడ్డిపోచకు విలువేమిటని తీసిపారేస్తాము. కానీ ధరణి అంతా ఆ సున్నిత పాదాల కిందే ఒదిగి ఉంది కదా!

88

“నీవు ఈ తామరాకు క్రింద ఉన్న పెద్ద మంచుబిందువువి.
నేను పైన ఉన్న చిన్నదాన్ని”
కొలనుతో మంచుబిందువు అన్నది.

ఇది చదవగానే ముందు మంచుబిందువు స్వాతిశయమే కనిపించినా తరచి చూస్తే కొలనుకీ, మంచుబిందువుకీ ఉన్న సమన్వయం ఎంత చక్కగా అవగతమౌతుందో! రెండిటినీ నియంత్రించే శక్తి కిరణాలది.

100

ఆకాశంలో ఒక మూల
ఆ మేఘం వినమ్రంగా నిలుచుంది.
ఉదయసంధ్య
దానికి తేజో కిరీటాన్ని కట్టపెట్టింది.

124

చంద్రునితో సూర్యుడు పంపించిన
ప్రేమలేఖలకు తన జవాబును
గరికపై కన్నీళ్ళతో రచించింది – రాత్రి.

ఒకనాటి ఉషోదయాన పైన ఆకాశం, కింద భూమిలో ఒకేసారి మనకు తెలియకుండానే మమేకమవుతామేమో! ప్రకృతి వర్ణన అంటే శబ్దాడాంబరంతో, అలంకారాలు చేర్చి ఇంత పొడవుగా సాగే కవితలే మనకి ఎదురౌతాయి. చిన్న చిన్న పదాలతోనే టాగోర్ మనకందించిన తాదాత్మ్యత మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేయక మానదు.

ముఖ్యంగా రెండవ కవితలో కనిపించే గాఢానుభూతి గుండెను తడి చేయకమానదు. చంద్రుడిని సూర్యుడు తన ప్రేమలేఖగా రాత్రి కోసం పంపడమన్న భావనే మనసులో మాధుర్యాన్ని నింపుతుంటే, తన ప్రియతముడు సూర్యుడిని కలుసుకోలేని తన అశక్తతకు చింతిస్తూ కన్నీళ్ళను మంచుబిందువులుగా గడ్డి చివుళ్ళపై వదిలి వెళ్ళే, రాత్రి ఉదాత్తమైన ఆరాధనను మనకు పరిచయం చేస్తున్నది.

185

వానలు నిండుకున్న
శరత్కాల మేఘాన్ని నేను
నా నిండుతనమంతా
పండిన వరిచేలల్లో ఉంది.

శరదృతువులో మేఘాలకు తళుకులీనే మెరుపులుండవు. గంభీరమైన గర్జన స్వరముండదు. తమ ఆడంబరాన్నంతా పంటచేలల్లోకి ఒలకబోసేసి అన్నీ త్యజించిన పాత్రల్లా పారదర్శకంగా చెదురుమదురుగా పడి ఉంటాయి. వాటి జీవాన్ని పీల్చుకుని పెరుగుతున్న చేలన్నీ ఆ మేఘాలను మందహాసంతో పలుకరిస్తుంటాయి. ఇంతలా ప్రకృతిలో లీనమవ్వడం సాధ్యమేనా అనిపిస్తుంది.

ఇక ఈశ్వరుని ప్రసక్తి లేని రవీంద్రుని రచన లేదేమో! మనలో ఎవరినైనా ఈశ్వరుడెవరని అడిగితే వెంటనే అలవోకగా చెప్పలేము. నిరాకారుడని, సాకారుడని, నిర్గుణుడని, ఒక్కడని, లేదా అనేకులలో ఒకడని ఎన్నెన్నో రకాలుగా చెప్తాము. టాగోర్ ఇలాంటి తర్కాల జోలికి పోకుండా తనకు అవగతమయ్యే ప్రియసఖుడు, తండ్రి, గురువుల రూపాలలో ఈశ్వరుడిని చూసుకున్నాడు. ఒక ‘గీతాంజలిని’ సమర్పించుకున్నాడు. ఈ సంకలనంలో ఈశ్వరుడు మన వద్ద నించి నిజానికి ఏమి ఆశిస్తాడో విశదపరుస్తున్నాడు.

67

ఈశ్వరుడు గొప్ప గొప్ప రాజ్యాల వల్ల
విసుగునొందునేమో కానీ
చిన్న చిన్న కుసుమాల వల్ల కాదు.

215

తన సుమాలనే తిరిగి
మానవుని కాన్కలుగా పొందటానికై
ఈశ్వరుడు కాచుకొని ఉన్నాడు.

ఈశ్వరుడు మనపై కురిపించే దయ, ప్రేమ, కరుణ, స్నేహానికి మనం బదులుగా ఇవ్వాల్సిన కానుకలు ధనము, విలువైన వస్తువులు కాదు నిర్మలము, కోమలము అయిన పూలు మాత్రమే అని ప్రవచిస్తున్నాడు. ఇహలోకంలో మనం అనుభవించే ప్రతీది ఈశ్వరుని సృష్టే. అలా ఆయన సృష్టించిన పుష్పాలను తిరిగి ఆయనకే సమర్పించినప్పటికీ ఆనందంగా స్వీకరిస్తాడు!!

170

ఈ నిశ్శబ్ధ ఘడియలో
నా హృదయ ఖాళీ పాత్రను ముంచాను.
నీ ప్రేమతో అది నిండింది, ప్రభూ.

247

“నిన్నే గానం చేస్తూ పూజించటమెలా?”
సూర్యుని అడిగింది ఓ చిన్ని పూవు.
“స్వచ్ఛమైన నీ నిశ్శబ్దం ద్వారా”
బదులిచ్చాడు సూర్యుడు.

ఇంతకంటే సరళమైన ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు ఎవరు చూపించగలరు! ప్రభువు ప్రేమను పొందడానికి నిశ్శబ్ద స్మరణకి మించిన మార్గం లేదంటున్నాడు. భగవద్గీత గురించి ఓషో ఇలా అంటాడు “గీత చదివిన ప్రతిసారీ మనం భూమిమీద కాకుండా ఏవో దివ్యలోకాలలో ఉన్న అనుభూతిని పొందుతాము. ఎందుకంటే గీత ఆ లోకాలకి సంబంధించినది!” సరిగ్గా అలాంటి పారవశ్యమే మనకు రవీంద్రుడు ఈశ్వరునిపై రాసిన కవితలు చదువుతున్నప్పుడు కూడా కలుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

గుప్పెడు అక్షరాలతో భావారణ్యాన్ని సృష్టించడం అంటే ఏమిటో ఈ కింది, రెండులైన్ల చిన్న చిన్న కవితలు చదివితే తెలుస్తుంది. కవితకి తగిన వస్తువు. వస్తువుకి తగిన కల్పన. ఉదాత్త కవిత్వ లక్షణాలన్నీ ఈ కవితల్లో ఉన్నాయి. వీటిలోని మాధుర్యాన్ని తగినరీతిలో ఆస్వాదించగలుగుతున్నాము అంటే బాబా గారి అనువాద పటిమ వల్లనే! హైకూ ఛాయలు కొంచెం ఎక్కువగా కనిపించే వీటిని చదువుతుంటే సమయాన్ని స్థంభింపజేయడం అంటే ఏమిటో అనుభవమౌతుంది!

22

నేనున్నాను అనుకోవటం
ఒక నిరంతరమైన అద్భుతం
అదే జీవితం.

24

శ్రమకు విశ్రాంతి
కంటికి రెప్పలా ఉంటుంది.

118

స్వప్నం మాట్లాడే భార్య
నిద్ర మౌనంగా భరించే భర్త

157

రహస్యంగా పూలను పుష్పించే రాత్రి
మెచ్చుకోళ్లను పగలుకు వదిలేస్తుంది.

262

ఈ గలగలలాడే ఆకులు, నా హృదయాన్ని
చిన్నారి శిశువు చేతివేళ్లలా స్పృశిస్తున్నాయి.

కవితా వస్తువు ఏదైనా టాగోర్ కవితల్లో అధికార స్వరం ఉండదు. రణగొణ ధ్వనులు ఉండవు. హృదయాన్ని ఆవిష్కరించే సున్నితత్వం  ఉంటుంది. గానంలో లీనమైన ధ్యానం ఉంది. బాబా గారి కలం కూడా ఆ సున్నితత్వాన్ని బహు జాగ్రత్తగా అందిపుచ్చుకుంది! బాబా గారి పదాల్లో టాగోర్ ప్రతిస్పందించిన వ్యవస్థలన్నీ మనకు సజీవమై సాక్షాత్కరిస్తాయి. అందుకే ఆయన అనువాదకుడి కంటే ఉన్నత పాత్రనేదో పోషించారనిపిస్తుంది! విశ్వకవిగా టాగోర్ లో జీవన వాస్తవికతను చిత్రించే నైపుణ్యంతో పాటు అంతఃలోక వీక్షణ, నూతన దృష్టి, ఉత్తమాభిరుచితో కూడిన భావుకత కనబడతాయి. అందుకే ఆయన రచనలన్నీ విభిన్న పరిస్థితులకి తట్టుకుని నిలబడగలిగాయి.
భావకవి టాగోర్ మస్తిష్కంలో రూపుదిద్దుకున్న ‘Stray Birds’ లో కొన్ని మనస్సుని స్పర్శిస్తాయి. మరికొన్ని కొత్త దృష్టిని పరిచయం చేస్తాయి. ఇంకొన్ని అంతర్లోకాలకు ప్రయాణం చేయిస్తాయి. కవితలన్నీ పూర్తయ్యేసరికి మనకు తెలీకుండానే ఆలోచనాస్థాయి పెరగడం గమనిస్తాము. ఈ సంకలనంలోని కవితా సౌందర్యాన్ని తెలుగులో తేటతెల్లం చేసేందుకు సంకల్పించి, కృషి చేసిన బాబా గారికి ప్రత్యేక శుభాభినందనలు.

————-
బాబాగారి తెలుగు అనువాదపు e-పుస్తకాన్ని ఉచితంగా దించుకోవచ్చు.

About నిషిగంధ

నిషిగంధ గారు పుట్టి పెరిగింది విజయవాడలో. ప్రస్తుతం ఉంటున్నది మయామి, యు.ఎస్.ఎ లో. సిస్టమ్స్ ఎనలిస్ట్ గా పని చేస్తున్నారు. ఇష్టమైన విషయాలు - వదలకుండా పుస్తకాలు చదవడం, కదలకుండా సినిమాలు చూడటం, ఆపకుండా పాటలు వినడం, విడవకుండా స్నేహితులతో కబుర్లు చెప్పడం, అలవకుండా వంట చేయడం.. జీవితాశయం సంతోషంగా ఉండటం.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

17 Responses to కవిత్వం నుంచి కవిత్వంలోకి… ‘దారి తప్పిన పక్షులు’

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    నిషిగంధ గారికి
    అభినందనలు అభినందనలు… అభినందనలు

  2. జాన్ హైడ్ కనుమూరి says:

    పొద్దు సంపాదకులకు

    కొన్ని అక్షరదోషాలు, సాంకేతిక దోషాలు సవరించగలరు

    ఉదా : “ఠాగూర్” మనవాడుక

  3. రవి says:

    నిషిగంధ గారు, పరిచయం బావుంది.

    “Stray birds” అనేక మార్లు, మనం ఒక్కో రకమైన mood లో ఉన్నప్పుడు ఒక్కో విధంగా స్పందింపజేయగల చక్కటి కావ్యం అని చెప్పవచ్చు.

    టాగోర్ గారి పద్యాలకు బాబా గారు చక్కటి న్యాయం చేశారు. ఇంకా Fugitive, Fruit gathering వంటి పద్య సంకలనాలను కూడా అనువదించగలరని ఆశిస్తున్నాను.

  4. నిషిగంధ గారూ, నేను stray birds చదవలేదు. మీ సమీక్ష చదివినతరవాత చదవాలన్న కోరిక కలుగుతోంది. చాలా బాగా రాసారు సమీక్ష. మీరు ఉదహరించిన పాదాలు చూస్తే బొల్లోజుబాబా గారు కూడా మూలానికి న్యాయం చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరికీ అభినందనలు.

  5. పొద్దు సంపాదకులకు,

    ఈవ్యాసం, ఇతర వ్యాసాలు IE Browserలో బాగానే కనిపిస్తున్నాయి. కథామాలతీయం 2 మాత్రమే కనిపించడంలేదు. నాస్నేహితులు కూడా ఈవిషయం అడుగుతున్నారు కనక మీదృష్టి తెస్తున్నాను. దయచేసి ఈ సమస్యని సరి చేయగలరు.

  6. ఒక అభిమాన కవి గురించి ఇంకో అభిమాన కవి… పరమానందం 🙂 ఇరువురికీ అభినందనలు..

  7. Kumar says:

    యాండోయ్ అమ్మాయిగోరు

    మీర్రాసిందంతా ముత్తాలు రాల్నట్టు భలే అందంగుందండీ.తెలవక పస్న అండీ.

    టాగోర్ ఏమో “డు”, బాబా ఏమో “రు”. బాందండీ. ఐనా అల్లదిగో టాగోర్ లాంటోళ్ళు, మనసులో ముద్దరేసినోళ్ళు గుండె గొట్టానికి దగ్గిర సుట్టాలవుతారుగానీ, ఇల్లా గోరవసూచకాలిత్తే ఆరు ఈరవుతారాండీ? ఏలాకోలం ఏట్నేదండీ. సూటిగా పస్నిస్తున్నాను అమ్మాయిగోరు. సమాధానం సెప్పండి.

  8. మాలతి గారూ, “కథామాలతీయం 2” లోని లోపాన్ని సవరించాం. దాన్ని చూపినందుకు నెనరులు

  9. బాబా గారికీ నిషిగంధ గారికీ జేజేలు.

  10. ధన్యవాదాలు జాన్ హైడ్ గారు, రవి గారు, మాలతి గారు, దీపు, కుమార్ గారు, మహేష్ గారు..

    అందరికీ హృదయపూర్వక విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙂

    కుమార్ గారు, మీ ప్రశ్న సరిగ్గా అర్ధం కాలేదండి.. @ ఇల్లా గోరవసూచకాలిత్తే ఆరు ఈరవుతారాండీ? 🙁
    టాగోర్ ని ‘డు ‘ అని అగౌరవపరిచాననా మీ అభిప్రాయం?

  11. Review chaalaa chakkagaa vachchindi… Keep writing!

  12. Kumar says:

    అమ్మాయిగోరు

    అదేటండీ అట్టగనేసినారూ? అర్థం కానేదని ! టాగోరు గోరులాంటోరయితే గిల్లినా గిచ్చినా మరకడిపోద్ది గందా. మరి మీరేమో బాబాగోరి మీదకేమో “రు”కారముచ్చుకుని చర్నా ఝలిపిత్తే గోరవసూచకంగానే మిగిలిపోద్దండీ. పేమ, గోరవం ఎక్కడ్నుంచి పుట్టుకొత్తాయండీ? అల్లా వొచ్చావా అంటారా అమ్మాయిగోరు? అవునండే, సరిత్ర మనకు సానా సెప్పుద్దండీ. మనసుకి దగ్గరయినోళ్ళనే “డు, ము, వు” లతో పిలుత్తామండీ. దూరంగా ఉండేవోళ్ళంతా మిగిలిన జనాబా లెక్కల్లోకి ఎక్కిపోతారండీ అమ్మాయిగోరూ. అల్లాగే ఒక్క మాట్జెప్పి ముగిత్తానండీ సపోసు , ఫర్ సపోసు ఈ మూలా ఆయన ఉన్నాడు కదండీ, ఈయన అంటే నాకు, నా సరిత్రలో సానా పేమ ఉందండీ. కాపోతే నిన్న ఓ టపా ఏసి నాను ఇల్లాగే కామెంటానని టపానే ఎత్తేసాడండీ ఆ మారాజు. మరి ఇప్పుడు ఆయన్ని నా సరిత్రలో ఎట్టా రాసుగోమంటారు సెప్పండీ. సెప్పుకుంటా పోతూ ఉంతే ఇల్లాటివి సానా వత్తాయండీ సరిత్రలో. కాబట్టి అమ్మాయిగోరు, అదండీ

  13. ఎప్పుడో పురాతన చరిత్రలో వ్యక్తుల్ని గురించి మాట్లాడుకునేప్పుడు క్రియా పదాల్లో చేశాడు, చెప్పాడు అని ఏకవచనం వాడటమే జరుగుతుంటుంది తెలుగు వా్డుకలో. బుద్ధుడిలా చెప్పాడు, కృష్ణదేవరాయలు అలా రాశాడు అనే అంటాం. మరీ పాత కాకుండా ఉన్న చరిత్రతోనే వస్తుంది గొడవంతా. చాలా మంది గాంధీమహాత్ముని గురించి కూడా ఏకవచనంలోనే రాస్తుంటారు. కొంతమంది గాంధీగారు అంటారు. టాగోరుని గురించి రచయిత్రి ఏకవచన ప్రయోగం చేసినంత మాత్రాన దాన్ని గౌరవరాహిత్యమని అనుకోవలసిన పనిలేదు.

  14. “బాబా గారి పదాల్లో టాగోర్ ప్రతిస్పందించిన వ్యవస్థలన్నీ మనకు సజీవమై సాక్షాత్కరిస్తాయి. అందుకే ఆయన అనువాదకుడి కంటే ఉన్నత పాత్రనేదో పోషించారనిపిస్తుంది!”
    బాగా చెప్పారు. అందుకే అనుకుంటా ఒక కవి వుద్దేశం ఇంకో కవికి అర్ధమైనట్టు మామూలు మనుషులుకి గబుక్కుని అర్ధం కాదు.

    TO Poddu editors: Please provide a link to Tagore’s english version too. Many online versions are there. One for example below.
    http://www.sacred-texts.com/hin/tagore/strybrds.htm

  15. SRINIVAS says:

    andhayaina venalarehilo
    anukokunda ni gyapakam vachinapudu
    yemicheyanu nishabdan
    ni dhyanam lo kaneeru karchatam thapa
    this is my phone number
    9441915291

  16. SRINIVAS says:

    anushanam chusthuna
    pradhi shanam
    kothaga vundhi
    mana seham

  17. manchi visleshana.abhinandanalu

Comments are closed.