స్వాతి:
మీ దృష్టి లో కథకీ ఇతర ప్రక్రియలకీ తేడా ఏమిటి? మీర్రాసేవాటిలో ఎక్కువ కథలే కావటానికి కారణం ఏమిటో !
మాలతి:
ప్రాథమికంగా కథ, కవిత, వ్యాసం – ఇవన్నీ ఒక వ్యక్తి తన అనుభవాలూ, అనుభూతులూ, ఆలోచనలూ వ్యక్తం చెయ్యడానికీ, పంచుకోడానికే కదా. ఈ అనుభూతులూ అనుభవాలూ ఆవ్యక్తి వాతావరణంలోనుండి ప్రభవించేవే. వాతావరణాన్నిబట్టి ఒకొక కాలంలో ఒకొక ప్రక్రియ ప్రాచుర్యంలోకి రావచ్చు. నాచిన్నతనంలో ముందు చెప్పినట్టు స్త్రీవిద్యని ప్రోత్సహించిన కాలం. ఆరోజుల్లో అన్నదమ్ములూ, తండ్రులూ కూడా ఆడపిల్లలకి ఇంట్లో చదువుకునే వాతావరణం కల్పించారు. ఆడపిల్లలు వీధిలోకి వెళ్లకూడదు అనుకున్నవారు కూడా ఆడవారు ఇంట్లో కూర్చుని చదువుకోడానికీ, రాసుకోడానికీ అభ్యంతరాలు పెట్టలేదు.
మాఇంట్లో కూడా నేను చదువుకోడానికీ రాసుకోడానికీ అనుకూలవాతావరణమే వుండేది. పోతే కథే ఎందుకు ఎంచుకున్నానంటే, అప్పట్లో నాకు రాయాలనిపించిన విషయాలు కథకి అనువుగా వుండడం. పరిణతిలేని వయసు కనక ఏదో సంఘటనో, అనుభవమో నా దృష్టికి వస్తే కథ రాస్తూ వచ్చేను. నిజానికి కథ రాయడం సుళువు అని కూడా నేను అనుకుంటాను. ఏదైనా చెప్పగల అంశం వున్నప్పుడు కథ చెప్పడమే తేలిక. మనం నడవలోనో అరుగుమీదో కూర్చుని “నిన్న ఏం అయిందో తెలుసా” అనో “సుబ్బమ్మత్త పుట్టింటికెళ్లినప్పుడూ” అంటూనో మొదలు పెట్టి ఆడుకునే వూసులన్నీ కథలే. జరిగిన కథ, చూసిన కథ రాయడం తేలిక. చెప్పడానికి సరుకు వుంటుంది కనక. నేను కవితలు అనుకుని రాసినవి వున్నాయి. కొందరు అవీ కవితలేనా అంటూ నవ్వేరు. నేను అలాటి వచనకవితలు చూసాను కనక నేను రాసినవి వచనకవితలే అనుకుంటాను. ఎందుకంటే, నాకు ఏదో ఒక భావం చెప్పాలన్న ఆతురతో ఆవేదనో కలిగినప్పుడు, అందులో కథకి కావలసినసరుకు లేనప్పుడు కవితలాగ రాస్తాను.
అలాగే వ్యాసాలూను. చెప్పాలనుకున్న విషయమే ప్రక్రియని ఎంచుకుంటుంది. మరొకరి అనుభూతి కథగా రాయొచ్చు కానీ కవితగా రాయలేం. కవితలు నూటికి నూరు పాళ్లూ వైయక్తికం. కథ వైయక్తికం కావచ్చు, కాకపోవచ్చు. అంతే కాదు. నేను సమీక్షలు కూడా రాసేను. ఇండియాలో వున్నప్పుడు, 1970, ‘71లో ఆంధ్రజ్యోతివారు నాకు పుస్తకాలు పంపేవారు సమీక్షలకోసం.
స్వాతి:
స్త్రీలకోసం ప్రత్యేకమైన సాహిత్యం ఉండాల్సిన అవసరం ఎంతవరకూ ఉంది? ఇప్పటివరకూ ఈ కోవకు చెందిన రచనలు స్త్రీల ఆలోచనల్లో, జీవితాల్లో ఎంతవరకూ మార్పులు తీసుకొచ్చాయంటారు.
మాలతి:
స్త్రీలకి ప్రత్యేక సాహిత్యం ఆనాదిగా వుంటూనే వుంది. లాలిపాటలూ, దంపుళ్లపాటలదగ్గర్నుంచీ, కుటుంబంలో హాస్యం, వెటకారం, బాధనీ ఆవిష్కరించే కథలూ, పాటలూ, గ్రామదేవత కథలూ – ఇలా ఎన్నో రకాల సాహిత్యం కేవలం స్త్రీలే పాడుకున్నవీ, చెప్పుకున్నవీ చాలానే వున్నాయి. వీటిలో ప్రథానాంశాలు ఉపశాంతినివ్వడమో నీతిమార్గం బోధించడమోగా కనిపిస్తోంది. లాలిపాటలు పిల్లలిని నిద్రపుచ్చితే, కోడళ్లు పాడుకునే పాటలు తమబాధని ఇరుగమ్మతోనో పొరుగమ్మతోనే చెప్పుకునేవిగా వుంటాయి. అదే ఆనాటి థెరపీ అన్నమాట. గ్రామదేవతల కథలూ, వీరమాత కథలూ స్త్రీలకి మనోదారుఢ్యాన్ని చిత్తస్థైర్యాన్ని ఇచ్చేవి అని నాకు తోస్తోంది. పోతే ఈనాడు స్త్రీవాదంపేరుతో వస్తున్న సాహిత్యానికీ, పైన చెప్పిన పురా సాహిత్యానికీ ముఖ్యమయిన తేడా తమ అనుభవాల్నీ అనుభూతుల్నీ వ్యక్తం చేసే విధానంలో. ఫూర్వపుసాహిత్యంలో సామరస్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఔద్ధత్యంతో కూడుకున్నది. నా అభిప్రాయంలో ఔద్ధత్యంతో పనులు సాగవనే. ఒకరు ఎప్పుడయితే దుర్భాషలాడేరో, అప్పుడే రెండోవారు అదే స్థాయిలో జవాబిస్తారు. అలా ఇద్దరూ దుర్భాషలాడుకుంటూ కొంతకాలం గడిచేసరికి ఆమాటలు అలవాటయిపోయి, వాటిపదును తగ్గిపోతుంది. వాటికి విలువ లేకుండా పోతుంది. నిజానికి ఈ స్త్రీవాదం కానీ మరో వాదం కానీ చదివేదీ చర్చించుకునేదీ కూడా పండితులే. అవి సామాన్యులస్థాయికి చేరుతున్నాయా అంటే అనుమానమే.
రెండోది ఏవాదం తీసుకున్నా, ఏకాభిప్రాయం వున్నట్టు కనిపించదు. ఆదృష్టితో చూసినా, వాదాలన్నవి పండితులకోసమే అనిపిస్తుంది.
ఈనాటికీ అప్పారావుగారి దిద్దుబాటు గొప్ప సాంఘికకథ అంటే నాకు ఆశ్చర్యంగా వుంటుంది. నేను చూసినంతవరకూ, వేశ్యాలోలత్వం, జూదంవంటి దురలవాట్లు చాలా బలమైనవి. క్షణాలమీద మార్చుకోగల అలవాటు కాదు అది. అప్పారావుగారికథలో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలియగానే ఆ భర్త నిల్చున్న పళాన మారిపోయాడంటారు రచయిత. నాకు తెలిసినంతవరకూ నిజజీవితంలో భార్య పుట్టింటికి పోతే, వేశ్యాలోలురకి మరింత ఆటవిడుపు, అదేకథ స్త్రీ రాసివుంటే ఇంత అమాయకంగా వుండదు.
ఈనాడు విద్యావంతురాళ్లయిన స్త్రీలు చాలామంది వున్నారు. స్త్రీలకి ప్రత్యేక సాహిత్యంమూలంగా వారి ఆలోచనల్లో, జీవితాల్లో మార్పులు వచ్చేయా అన్నవిషయం వారే చెప్పాలి.
నా అభిప్రాయంలో మార్పు సహజం. మనం వద్దనుకున్నా వస్తుంది. అయితే మార్పు రావడానికి ఒక్క సాహిత్యమే చాలదు. అనేక సాంఘిక పరిస్థితులు, స్థానికంగా ఉత్పన్నమయినవీ, బయటినుండి వచ్చినవీ (ఉదా. అమెరికన్ సంస్కృతి) ఏకమయి మార్పుకి దోహదం చేస్తాయి. ఏకారణంవల్ల ఏమార్పు వచ్చింది అని విడదీసి చెప్పడం సాధ్యం అనుకోను.
స్వాతి:
మీ కథల నుండి మీరు ఏమి ఆశిస్తారు. మీకు బాగా తృప్తినిచ్చిన మీ కథలేమిటి? ఎందుకు?
మాలతి:
నేను కథ రాయడం సాధారణంగా కథకి అనుగుణమైన వస్తువు దొరికినప్పుడు జరుగుతుంది. అది ఎలాటిది అంటే నాకో, నాకు తెలిసినవారికో ఆనందమో, బాధో, కోపమో, ఇష్టమో – ఏదో ఒక అనుభూతి బలంగా కలిగించేది అయివుండేది. చాలామంది చదివి స్పందిస్తే, ఓహో నాలా ఆలోచించేవారు వున్నారు, నేను చెప్పినవిషయం సమంజసమే అని అర్థం అవుతుంది కనక తృప్తిగా వుంటుంది.
నాకు బాగా తృప్తినిచ్చినవి చాలానే వున్నాయి. ఎంచేతంటే. రాసిన ప్రతికథకీ వెనక నామనసుకి తగిలిన ఏదో ఒక స్పందన వుంటుంది కదా. అంచేత కథ మొత్తం కాకపోయినా, ఒక సంఘటన, ఒక వాక్యం, ఆఖరికి ఒకమాటవల్ల కూడా ఇది మంచి కథే అనిపిస్తుంది నాకు. నిజానికి పాఠకులస్పందనలు కూడా అంతే. ఒకొకసారి ఒక్కవాక్యం వారిని ఆకట్టుకుని, బాగుంది అనిపించొచ్చు. ఉదాహరణకి, ప్రాప్తం అన్నకథలో ఇంటివారమ్మాయి, పనిఅమ్మాయి మధ్య గల అనుబంధం ఒక స్థాయిలోనూ, ఆ అమ్మాయికీ ఆమెభర్తకీ మధ్యగల అనుబంధం మరొకస్థాయిలోనూ ఆవిష్కరించడానికి ప్రయత్నించేను. నామటుకు నాకు అది మంచికథే. అయితే ఈనాడు విమర్శకులదృష్టితో చూస్తే, “ఏముంది అందులో అనిపిస్తుంది. గొప్పవారు బీదవారిని బాధపెట్టడం లేదు. భర్త భార్యని హింసించడం లేదు. కొంచెం వుందిలెండి. అనుకున్నరోజుకి తిన్నగా ఇంటికి రాకుండా, స్నేహితుడియింటికి వెళ్తాడు కనక భార్యని బాధపెట్టినట్టే. కానీ కథలో ఆకోణానికి ప్రాధాన్యం లేదు. అయినా అతిమామూలు విషయాన్ని చిన్నకథగా మలచడంలో కృతకృత్యురాలిని అయేననే అనుకుంటున్నాను. మరొక ఉదాహరణ, నాస్నేహితురాలు వైదేహితో మాటాడుతున్నప్పుడు, తనకి చాలా నచ్చినకథల్లో ఒకటిగా “అవేద్యాలు” అన్నకథని పేర్కొంది. నిజానికి మరెవరూ ఎప్పుడూ అనలేదు ఆమాట. నాకథాజీవితంలో తొలిసారిగా తననుండే విన్నాను ఆకథపేరు. ఆకథలో మేనబావ తనని పెళ్లి చేసుకోడానికి మొదట నిరాకరించి, మరో అమ్మాయిని చేసుకోడానికి నిశ్చయించుకుని, మళ్లీ మనసు మార్చుకుని తిరిగి మరదలిని చేసుకుంటానంటాడు. అతనికి మరదలు చెప్పినజవాబు ఆఅమ్మాయి వ్యక్తిత్వానికి గీటురాయి. మరదలి ఆత్మాభిమానం, చిత్తశుద్ధి తనని ఆకట్టుకున్నాయి అంది వైదేహి.
నేను కథలు రాస్తున్న తొలిదశలో, పెద్ద రచయితలదృష్టిని ఆకట్టుకున్న కథ మంచుదెబ్బ. ఒకరకంగా చూస్తే ఒక సాంఘికసమస్యని ఆవిష్కరించిన కథ. 1963-64 ప్రాంతాల్లో ప్రచురించారు ఆనాటి రచనలో. నేను మాత్రం నేనేదో సాంఘికప్రయోజనం గల కథని రాస్తున్నానన్న స్పృహతో రాయలేదు. చెప్పొచ్చేదేమిటంటే, స్పందన ముఖ్యం. ప్రయోజనాలు తరవాత వస్తాయి. నాధ్యేయం పాఠకుడు మనిషిగా స్పందించడమే కానీ అతడిని సంస్కరించడం కాదు.
ఇలా ఆలోచిస్తే, మీప్రశ్నకి సమాధానం, నాకు కథల్లో, నావి కానీ మరొకరివి కానీ, నచ్చే అంశం మానవనైజాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించినవి.
అంచేత నేను ఒకకథ ఎంచుకోడం కంటే, మీరే ఫలానాకథలో మీకు నచ్చినఅంశం ఏమిటి అని అడిగితే, చెప్పడానికి ప్రయత్నిస్తాను.
“నాధ్యేయం పాఠకుడు మనిషిగా స్పందించడమే కానీ అతడిని సంస్కరించడం కాదు.”
స్పందన …సంస్కరణకు మొదటి మెట్టే కదా !
థాంక్స్ ! స్వాతి గారూ !
నెటిజన్, అాలా వాక్యం కొట్ చేసి వదిలేస్తే ఎలా. మీ అభిప్రాయం కొంచెం స్పష్టం చెయ్యండి.
పరిమళం, నామటుకు నాకు పాఠకులు స్పందిస్తే చాలు అన్నాను.ఏమనిషిని గానీ ఒక్కకథ మార్చేయలేదు అని నా అభిప్రాయం. ఆవ్యక్తి పరిస్థితులూ, చుట్టూ వున్న మనుషులూ, అనుభవాలూ అన్నీ కలిసి మార్చవచ్చు. అంచేత ఎవరైనా మారడం సంభవిస్తే, ఒక్క రచయిత మాత్రమే క్రెడిట్ తీసుకోడం న్యాయం కాదు కదా. అంచేత నేను కథలు రాసినప్పుడు, దీనివల్ల ఎవర్ని మార్చగలను అన్న దృష్టితో రాయను అన్నాను. అంతే.
పరిమళం, మరోమాట చెప్పడం మర్చిపోయాను. సంస్కరణే ప్రధానంగా రాసినకథల్లో ముగింపులో పరిష్కారం తప్పనిసరిగా పురోభివృద్ధిని సూచించేదిగా వుండాలి. ఈరోజుల్లో సామాజికదృక్పథంగల కథలని అలాటివాటినే అంటున్నారు. నాకథలన్నిటిలోనూ ఆధోరణి లేదని మీరు గుర్తించేవుంటారు.
కధ స్పందింపచేసేది గా ఉండాలి అన్నది మీ ఉద్దేశం. ఎటువంటి స్పందన? దయచేసి మీరు కొరుకునే “స్పందన” ని నిర్వచించగలరా?
Your post is a timely coutbirntion to the debate