సంక్రాంతి శుభాకాంక్షలు

-శ్రీమతి పింగళి మోహిని

ఉ:

బంతులు బంతులై కనుల పండువు చేయగ, గోమయంబుచే
కాంతలు గొబ్బిళుల్ మిగుల కౌతుక మొప్పగ తీర్పరించగా
వింతగు బొమ్మలన్ కొలువు వేడుక మీరగ తీర్చి దిద్దు, సం
క్రాంతి శుభోదయంబు మనగావలె జాతికి భవ్యక్రాంతియై !

ఇంతలు ఇంతలై పుడమి యీవలె సస్యము మానవాళికిన్
చింత రవంత లేని సుఖ జీవన భాగ్యము కల్గజేయగా
శాంతి సమానతా సుగుణ సంపద తుష్టిని పుష్టి నిచ్చు, సం
క్రాంతి శుభోదయంబు మనగావలె జాతికి భవ్యక్రాంతియై !

లేతలిరాకు జొంపముల లీలగ తోచుచు పూచినట్టివౌ
పూతలు పిందెలై పెరిగి వేలఫలంబులొసంగునట్లు గా,
జాతి హృదంతరాశలను శాశ్వతరీతి ఫలింప చేయ, నీ
నూతన వత్సరంబునకనూన ముదావహ స్వాగతంబిదే !

———————-

శ్రీమతి పింగళి మోహిని, బి.ఏ,బి.ఇడి కృష్ణాజిల్లా చల్లపల్లిలో శ్రీమాన్ యస్.ఆర్.వైస్.ఆర్.పి.జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పద్యరచన ఆమె ప్రవృత్తి.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

7 Responses to సంక్రాంతి శుభాకాంక్షలు

Comments are closed.