“తోటరాముడు” – పాతాళ భైరవిలో ఎన్.టి.ఆర్ పోషించిన పాత్ర పేరట. ఓ పదేండ్ల ముంగట గదే పాత్రను తనికెళ్ళభరణి డిసైడ్ చేసిండంట. సినిమా పరిజ్ఞానం బాగా ఉండి కూడా, “తోటరాముడ”నగానే బ్లాగ్లోకులకు గుర్తొచ్చేది మాత్రం “రెండు రెళ్ళు ఆరు” బ్లాగుకర్త డి.ఎస్. గౌతమ్. ఎక్కడా ఎక్కువగా కనిపించని గౌతమ్, పలకరించగానే ఎన్నో అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. విశేషాభిమానాన్ని చూరగొన్న ఈ బ్లాగరి అంతరంగం -కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులుగా!
తోటరాముడు తోటరాముడెలా అయ్యాడు?
జంధ్యాల గారి తర్వాత, తివిక్రమ్ వచ్చే ముందు తెలుగు సినిమాలో కొద్దో గొప్పో హాస్యాన్ని పండించింది దివాకర్ బాబు అనీ ఒక మాటల రచయిత. యమలీల సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర “తోటరాముడు” వీరి సృష్టే. ఆ సినిమాని కేవలం తోటరాముడి కోసం రెండు మూడు సార్లు చూశాను, కృష్ణ డాన్స్ ఉన్నా సరే! నేను స్కూల్లో ఉండగానే వచ్చినదనుకుంటా, బ్లాగు పెట్టినప్పుడు “తోటరాముడు” ఉండాల్సిందే అనుకున్నాను. అలా పెట్టాను.
ఇప్పుడు గౌతంగా కన్నా మీరు “తోటరాముడు”గానే వ్యవహరించబడుతున్నారు.. తెలుసా?
హుమ్మ్.. తెలుసు. ఆ పేరు పెట్టిందే అందుకు.
“రెండు రెళ్ళు ఆరు” అని పెట్టడానికి కారణం..?
నా బ్లాగు టెంప్లేటూ అవీ సెట్ చేసుకుని, ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా “రెండు రెళ్ళు ఆరు” సినిమా డీవీడీ కనిపించింది. అంతే.. పెట్టేసాను, ప్రత్యేక కారణాలు లేవు.
జంధ్యాల అభిమానిలా అనిపిస్తారు.. మీ బ్లాగు పేరు కూడా వారి ప్రముఖ సినిమాల్లో ఒకటి. మీమీద వారి ప్రభావం గురించి చెప్పండి.
జంధ్యాల ఒక్కొక్క సినిమా మీరు ఎన్ని సార్లు చూసారో నాకు తెలియదుగానీ.. నేను తప్పకుండా మీకన్నా ఓ నాలుగైదు సార్లు ఎక్కువే చూసుంటాను. ఆయన రాసిన ప్రతి సంభాషణ నేను నవ్వుకోవటానికే రాసారేమో అన్నంత సాన్నిహిత్యం ఏర్పడిపోయింది ఆయన రచనల/సినిమాలతో! అడిగారు కాబట్టి, ఏదో రెండు ముక్కలు చెప్పడానికి ప్రయత్నించానుగానీ, లేకపోతే ఓ పది టపాలయినా పడుతుంది, ఆయన గురించి నా అనుభవం చెప్పాలంటే.
(నవతరంగం వాళ్ళు వింటున్నారా? ;-))
అసలు బ్లాగెందుకు పెట్టాలనిపించింది?
నేను ఇంగ్లీషులో బ్లాగులు గత మూడేళ్ళుగా చదువుతూ ఉన్నాను. అప్పటిలో నా ఫ్రెండ్స్ సర్కిల్ కోసం కొన్ని కథలు రాసేవాడిని. ఇంటర్నెట్లో తెలుగులో రాయటానికి ఏవఁయినా avenues ఉన్నాయేమో వెతుకుతుండగా కొన్ని బ్లాగులు దొరికాయి. నేను మొట్టమొదటిసారి చూసిన బ్లాగు పేరు – “మూసుకు కూసోరా పూలసొక్కా”! ఆ బ్లాగు ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, ఎవరు రాసేవారో కూడా గుర్తు లేదు. (
ఆ బ్లాగు ఇక్కడ -http://www.mkps.org/cgi-bin/blosxom.cgi- ఉండేది. ప్రస్తుతం ఈ లింకు వేరే సైటుకు పోతోంది. -సం) ఆ తరువాత తేనెగూడు, కూడలి పరిచయమయ్యాయి…తెలుగులో కూడా బ్లాగులు ఉన్నాయి అని తెలుసుకున్న తరువాత తెలుగులో స్క్రిప్టు ఎలా రాయాలో తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాను. ఇక్కడ నేను చెప్పదలచుకున్న ముఖ్య విషయం – తెలుగులో బ్లాగు అనే కాన్సెప్టు ఇంతగా వృద్ధి చెందటానికి కారణం లేఖిని అని నేను నమ్ముతాను..I tip my hat to Veeven!
తెలుగు సాహిత్యంతో మీ అనుబంధం? ప్రత్యేకించి హాసం పత్రికతో?
నేను తెలుగులో మొట్టమొదట చదివినది నా చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను తిడుతూ రాసిన పద్యం. నేను చిన్నప్పుడు, సాహిత్యం అని చెప్పను గాని, బాలమిత్ర, బాలజ్యోతి ఒక addict లాగా చదివేవాడిని. వీటి తరువాత తెలుగు చదివింది హాసం ద్వారానే! ఆందులో నా జీవితానికి lifeblood లు అయిన సంగీతం, హాస్యం, సినిమాలు కలబోసి ఉండేవి. దానికితోడు రావికొండలరావు, ఎమ్బీయెస్ ప్రసాద్, తనికెళ్ళ భరణి లాంటి దిగ్గజాలు తరచుగా రాసేవాళ్ళు. తెలుగు సాహిత్యం అంటూ చదవటం ప్రారంభించింది ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే. నిజం చెప్పాలంటే నేను బ్లాగు ప్రారంభించాకే తెలుగులో విరివిగా చదవటం జరిగింది. చదివిన వాటిల్లో మహ్మద్ ఖదీర్ బాబు రాసిన పోలేరమ్మబండ కథలు, నామిని రాసిన ‘పచ్చనాకు సాక్షిగా ‘ నాకు అత్యంత ఇష్టమైనవి. అఫ్‌కోర్స్, ముళ్ళపూడి రమణ గారి సాహితీ సర్వస్వం నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్…అన్నీనూ.
మీ బ్లాగును హాస్యరచనకే పరిమితం చేయడానికి గల కారణాలు..
నాకు సీరియస్ చర్చలపై పెద్ద నమ్మకం లేదు. నేను ఏదో వాదిస్తుంటే, అవతలి వాడు వాడిదే పట్టు అని కూర్చుంటే, దాని వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అనుకుంటాను. Not that I don’t have strong opinions about anything. కానీ నా బ్లాగు అందుకు సరైన వేదిక కాదని నమ్ముతాను.
“రెండు రెళ్ళు ఆరం”టే మీ దృష్టిలో ఏంటి?
చాలా వ్యక్తిగతమైన సన్నిహితమైన స్నేహం. నేను నా అప్తులతో, సన్నిహితులతో ఒక వ్యక్తిగా ఎలా (సరదాగా) ఉంటానో నా బ్లాగుతో కూడా అంతే.
దినకర్ పాత్రను(?) ఎలా మలిచారు? ఆ పాత్రపైనే అధికంగా ఆధారపడుతున్నారన్న విమర్శకి మీరెలా స్పందిస్తారు? (స్పందిచాలనుకుంటే.. )
నాకున్న అత్యంత సన్నిహితుల్లో దినకర్ ఒకడు. వాడి పాత్రను ఎలా మలచానూ అంటే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను అది కాన్షస్‌గా చేసినది కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను దినకర్ గురించి రాసే విషయాలకు వాడు బాధపడడా అని అసంఖ్యాకమైన ఉత్తరాలు వచాయి నాకు (అసంఖ్యాకమైన=1). నేను రాసినవి అందరికన్నా ఎక్కువ ఆస్వాదించేది వాడే (వాడికి అర్థం కాకపోయినా). వాడు పని చేసే కంపెనీలో భాషా భేదం లేకుండా వాడికి తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డు చేస్తాడు నా టపాలు. సో, నా బ్లాగులో వాడి ఫొటో పెట్టినా బాధపడడు.
ఎంతో మంది ప్రశంసిస్తున్న ఈ బ్లాగు మీ మీద ఒత్తిడి పెంచిందా? మీకొస్తున్న ప్రశంసల వెల్లువను గమనించినప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే స్థాయిలో ప్రతి టపా ఉండాలంటే, అందులోనూ హాస్యం అంటే, కష్టమనిపించదూ!?
నేను నా బ్లాగులో వచ్చిన కామెంట్స్‌కి రెస్పాండ్ అవ్వకపోవటానికి కారణం.. ఎలా ఇవ్వాలో, ఏం చెప్పాలో తెలీకపోవటమే! “థాంక్స్ అండి” అని చెప్తే నన్ను నేను మెచ్చుకోవటమల్లే అనిపిస్తుంది. అందుకే బదులివ్వను. నేను రాయడానికి కూర్చున్నప్పుడు, నా మూడ్, నా సెన్సిబిలిటీస్ బట్టి రాస్తానే తప్ప, అంతకు ముందు ఎవరేం అన్నారన్నదాన్ని బట్టి రాయలేను. అందుకే నా ప్రతీ టపాలో ఎవరో ఒకరు, “ఇంకా బాగా రాయండి, మునుపటి వాటంత బాలేవివీ” అని చెప్తూనే ఉంటారు. ఒత్తిడన్న సమస్యే లేదు.
ఈ ఏడాది బొత్తిగా మూడే టపాలు రాయడానికి కారణాలు?
కేవలం నా సోమరితనం..అంతే!
ఇంతిలా ఎలా రాస్తారండీ బాబూ…!?
I DON’T KNOW
బ్లాగ్లోకంలో హాస్యాన్ని ఇంతగా విరగ పూయిస్తున్న మీకు, సినీ, సాహిత్య రంగాల్లో ప్రవేశించే ఆలోచన ఉందా? -ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హాస్యపులోటుని భర్తీ చేయడానికి?
రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకోవటం గురించి ఇంత వరకు ఆలోచించలేదు..మీరు అడిగిన “హాస్య విభాగంలో కొరతలు పూర్తి చెయ్యటం” లాంటి పెద్ద విషయాల గురించయితే ఖచ్చితంగా ఆలోచించలేదు. నాకు ప్రతి రోజూ రాయాలని ఉంటుంది, కానీ పేపర్ మీద పెన్ను పెట్టటం అనేది ఎప్పుడు, ఎందుకు చేస్తానో నిజంగా తెలియదు.
మీరు ఇష్టపడే బ్లాగులు, తెలుగులో లేక ఇంగ్లీషులో?
చాలా చదువుతాను. ఇంగ్లీషులో
greatbong.net,
bosey.co.in,
dilbert.com/blog. తెలుగులో
రానారె,
ఫణీంద్ర,
కొత్తపాళీ,
విహారి. ఈ మధ్యకాలంలో వచ్చిన బ్లాగుల్లో
చేగోడీలు,
అశ్విన్ బూదరాజులవి చూస్తాను. ఈ క్షణాన గుర్తు వచ్చిన బ్లాగులివీ, ఇంకా కూడా చదువుతాను. ( రానారె, ఫణీంద్ర, కొత్తపాళీ, విహారి, చేగోడీల రిషి, అశ్విన్.. మీ పేర్లు చెప్పాను. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు, 5000 రూపాయలు పంపమని ప్రార్థన.)
మీ బ్లాగులో మీ కత్యంత ఇష్టమైన టపా?
నా మొదటి టపా.. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో రాశాను దాన్ని.
తోటరాముడి బ్లాగులో మరిన్ని నవ్వుల పండుగలు జరగాలని కోరుకుందాం!
————————
ఇంటర్వ్యూ చేసినవారు: పూర్ణిమ తమ్మిరెడ్డి
31 Responses to తోటరాముడితో ఇంటర్వ్యూ