– కొడవటిగంటి రోహిణీప్రసాద్
చూస్తూండగానే ప్రపంచం మారిపోతోంది. ఒకటి రెండు దశాబ్దాల కిందట తెలుగువాళ్ళింటికి ఎప్పుడైనా వెళితే పిల్లలు తలుపు తీసి లోపలికెళ్ళి తల్లిదండ్రుల్ని పిలుచుకొచ్చేవాళ్ళు. ఆ తరవాత పిల్లలు కనబడేవాళ్ళు కాదు. టీవీలో తెలుగు ప్రోగ్రాం పెట్టినా, తెలుగుకి సంబంధించిన ఏ విషయాన్నయినా సీదా స్థాయిలో చర్చించినా పిల్లలు కూర్చోవడంగాని, వినడంగాని చేసేవారు కాదు. ‘వాళ్ళ ఇంట్రస్టులు వేరులెండి’ అని తల్లిదండ్రులు ముద్దుగా, కాస్త గొప్పగా చెప్పేవారు. నిజమే. ఏ తరాని కాతరం మారిపోతుంది. అయితే ఆ పద్ధతిలో మాతృభాషతో ఏ విధమైన సంపర్కమూ లేకుండా పెరిగిన (లేదా పెంచిన) పిల్లలు ప్రస్తుతం పెద్దవాళ్ళయిపోయారు. వారు కోల్పోయిన సంస్కారం ఎటువంటి మార్పులు తెస్తోందో ప్రతిచోటా కనిపిస్తోంది. ఇది తెలుగువాళ్ళ విషయంలోనే కాదు. అన్ని భాషలకూ వర్తిస్తుంది.
తెలుగు మరుగున పడడానికి ఇంగ్లీషును మాత్రమే తప్పుపట్టి లాభం లేదు. మనతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం తక్కువే. ఆ కారణంగా అక్కడివారు సాప్ట్‌వేర్ తదితర ఉద్యోగాలకు పోటీ పడలేకపోతున్నారనే ఫిర్యాదుకూడా ఉంది. అయితే అక్కడివారికి జాతీయ, ప్రాంతీయ సంస్కారం పెరిగిందా అంటే అవునని చెప్పలేం. ఇంగ్లీషు మానేస్తే సరిపోదు; మాతృభాష గురించీ, సంస్కృతి గురించీ పిల్లలకు నేర్పడం తప్పనిసరి. మీడియా ఆ పని సవ్యంగా చెయ్యటంలేదు కనక తల్లిదండ్రులే అందుకు పూనుకోవాలి.
స్కూలు, కాలేజీల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుని కాస్త పెద్దయాక పశ్చాత్తాపంతో తెలుగును గురించి తెలుసుకుందామనుకునేవారూ, కోల్పోయిన సంపర్కాన్ని మెరుగుపరుచుకుందా మనుకునేవారూ కనిపిస్తారు. వీరికి మంచి విషయాలను సులభపరిచయం ద్వారా తెలియజెయ్యడం ఒక బాధ్యతగా పెద్దవారు తీసుకోవాలి. ఆసక్తి లేనివారు ‘ఇదంతా అనవసరపు సుత్తి’ అనుకున్నా సరే. తమకు తెలిసిన విషయాలనూ, అనుభవాలనూ ఏదో ఒక విధంగా యువతరంతో పంచుకోవాలి. ఈ సందర్భంలో నేను గమనించిన ఒకటి రెండు విషయాలను ప్రస్తావిస్తాను.
చాలా ఏళ్ళ క్రితం మానాన్న కొడవటిగంటి కుటుంబరావుగారు (ఆయన శతసంవత్సర జయంతి అక్టోబర్ 28న మొదలయింది) ఒక ఇంటర్వ్యూలో తన ఆత్మకథ రాసే ఉద్దేశం లేదని చెపుతూ, తనకు తెనాలిలో చిన్నతనంలో పరిచయస్థులందరూ తరవాత ప్రసిద్ధికెక్కారనీ, ఆత్మకథ రాస్తే అదంతా నేమ్ డ్రాపింగ్‌లాగా ఉంటుందనీ అన్నారు. చక్రపాణి, సినీదర్శకుడు పి.పుల్లయ్య, ప్రముఖ నటుడు స్థానం నరసింహారావు, సినీనటులు సి.ఎస్.ఆర్ (మాయాబజార్ శకుని)., లింగమూర్తి, నటగాయకుడు రఘురామయ్య, ‘ఆంధ్రగంధర్వ’ గా ఆరోజుల్లో పేరు మోసిన జొన్నవిత్తుల శేషగిరిరావు (ఈ తరం సినీ రచయిత తాతగారు), షావుకారు సినిమాలో షావుకారు పాత్రధారి గోవిందరాజు సుబ్బారావు, డజన్ల కొద్దీ రచయితలు, మహాకవులు, సాహితీపరులు ఇలా అందరితోనూ ఆయనకు పరిచయాలుండేవి. ఆ రోజుల్లో వారెలా ఉండేవారో, ఎలా ఎదిగారో ఆ వివరాలన్నీ ఆయన ఎక్కడో అక్కడ చెప్పిఉంటే తరవాతి తరాలకు ఎంతో ఆసక్తికరంగా పరిణమించేది. కొన్ని వ్యాసాల్లో అరుదుగా తప్ప ఆయన ఆ పని చెయ్యలేదు. మహాకవి గురజాడకు శిష్యుడైన బుర్రా శేషగిరిరావు మా నాన్నకు ఉపాధ్యాయుడు. ఆయన గురించి కొంత తెలియజేశారు. విజయనగరంలో చదువుకున్నప్పటికీ ఆదిభట్ల నారాయణదాసును గురించి ఒక్క ముక్క రాయలేదు; నెగెటివ్‌గానైనా సరే! తరవాత గొప్ప సంగీతదర్శకుడైన సాలూరు రాజేశ్వరరావు ఏడో ఏట కచేరీ చెయ్యడం గురించి చెప్పారు. అంతే.
- గురజాడ అప్పారావు
- ఆదిభట్ల నారాయణదాసు
-
స్థానం నరసింహారావు
- ఈలపాట రఘురామయ్య
- లింగమూర్తి
- సీయెస్సార్
‘చందమామ’లో తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుత సీరియల్ రచనలు చేసిన దాసరి సుబ్రహ్మణ్యంగారిని ఈ మధ్య విజయవాడలో కలుసుకున్నప్పుడు ఆయన చక్రపాణిగారి గురించి వివరంగా రాయడానికి తాను నిరాకరించినట్టుగా చెప్పారు. ఎందుకు? అదంతా ‘రిఫ్లెక్టెడ్ గ్లోరీ’ అని! చక్రపాణిగారితో ఆయనకు రెండున్నర దశాబ్దాల పరిచయం ఉంది. ఇప్పుడు మన మధ్య లేని నాగిరెడ్డి, చక్రపాణి తదితరుల గురించిన స్మృతులన్నీ పంచుకోదగినవే అని ఇప్పటివారు అనుకోవచ్చు. 83 ఏళ్ళ వయసున్న సుబ్రహ్మణ్యంగారిని ఒప్పించడమే కష్టం!
- పి.పుల్లయ్య
- చక్రపాణి
- గోవిందరాజు సుబ్బారావు
ఈ పై ఉదాహరణలు రెండూ నిరాశ కలిగించేవే. గత తరం అనుభవాలను గురించి రాసే రచయిత ఎవరైనా సరే, వాటిని తన గొప్పలు చెప్పుకోకుండా వర్ణించినట్టయితే అవెంతో విలువైనవిగా తయారవుతాయి. ఇటువంటివాటిని నేమ్ డ్రాపింగ్ అనిగాని, రిఫ్లెక్టెడ్ గ్లోరీ అనిగాని అనుకోకూడదు. అలా అనుకుంటే మనకే నష్టం. ఇదొక రకమైన జర్నలిజం అనుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో రచయిత విలేకరిగా మాత్రమే పనిచెయ్యాలి. విషయం చెప్పేవాడి గురించికాక ప్రసిద్ధవ్యక్తిని గురించినదై ఉండాలి. చెపుతున్న విషయానికి ఇప్పటి సందర్భంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉందో వివరించాలి.
అసలీ సొదంతా ఎందుకు? పోయినవాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరవాత వ్యక్తిపూజ చెయ్యడం అవసరమా? కొంతవరకూ అవసరమే. వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసినవారు మన సంస్కృతికి కాస్తకాస్తగా తోడ్పడినవారు. వారిని పూజించనక్కర్లేదుగాని సాంస్కృతిక విలువలు పెరగడానికీ, నిలదొక్కుకోవడానికీ వారేమేం చేశారో తెలుసుకుంటే ఒక జాతిగా మనం ఆ వారసత్వాన్ని మరింత బాగా కొనసాగించగలుగుతాం. ఎక్కణ్ణుంచి వచ్చామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో మరింత బాగా తెలుస్తుంది.
చాలా ఏళ్ళ క్రితం నేనొకసారి మా మిత్రుడి తండ్రిగారిని ఒకాయనని కలుసుకున్నాను. అప్పటికే ఆయనకు 85 ఏళ్ళు. ఆయనది విజయనగరమని చెప్పగానే నేనాయన్ని ‘మీకు గురజాడ అప్పారావుగారు తెలుసా?‘ అనడిగాను. ‘అయ్యో మేమంతా చిన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాం‘ అని ఆయన చెప్పడం నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే అప్పారావుగారు 1915లోనే మరణించారు. ఆయనను చూడలేకపోయినా ఆయనను బతికుండగా చూసినాయనను చూడగలిగాను! అదే గొప్ప. అంతకు ముందు అప్పారావుగారి మనుమడు ఒకాయన బొంబాయిలో తగిలాడు కాని ఆయన తన తాతయ్యను ఎన్నడూ చూడలేదట.
నేనీమధ్య చదివిన గొల్లపూడి మారుతీరావుగారి ఆత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా‘ అనే ఆసక్తికరమైన పుస్తకంలో ఆయన తాను కలుసుకున్న ప్రసిద్ధులు అనేకుల గురించి క్లుప్తంగా, చక్కగా వర్ణించారు. వారిలో ప్రముఖ నటుడు, నాటక ప్రయోక్త కె.వెంకటేశ్వరరావు గురించి కూడా ఉంది. ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం 1960లలో ప్రసారం చేసిన కన్యాశుల్కం నాటకంలో వెంకటేశ్వరరావు దర్శకుడుగా, గిరీశంగా పోషించిన పాత్ర అద్భుతం. నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదివినప్పుడు ఆయన థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఆయనతో గిరీశం పాత్రను గురించి ముచ్చటించడం, ఆయన దర్శకత్వం వహించిన రావిశాస్త్రి నాటకం ‘విషాదం’ చూడడం, ఆయన స్వయంగా నటించిన కనకపుష్యరాగం తిలకించడం ఎన్నటికీ మరిచిపోలేను. నటన గురించి ఆయన తరుచుగా ఇచ్చిన ఉపన్యాసాలు వినేవాళ్ళం. 1969లో గాంధీ శతజయంతికి ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖలో నిర్వహించిన షాడోప్లే నోళ్ళు తెరుచుకు చూశాం. గొల్లపూడివారి పుస్తకం చదువుతూంటే ఆ అనుభవాలన్నీ గుర్తుకొచ్చాయి. మారుతిరావుగారికి ఇలా ఎందరితో మధురమైన స్మృతులున్నాయో కదా అనిపించింది.
పాతదంతా గొప్ప అని ఎందుకనుకోవాలి? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. రాజకీయాలతో సహా ఏ రంగంలోనైనా రానురాను నిజాయితీ లోపించడం కనబడుతుంది. సినిమాల విషయం తీసుకుంటే సినీ గోయర్ డాట్‌కామ్ వంటి సైట్లలో నిర్మాతలతోనూ, డిస్ట్రిబ్యూటర్లతోనూ ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు కనబడతాయి. నేను గమనించినంతవరకూ 1970, 80ల తరవాత వచ్చినవారంతా ‘ఫలానా సినిమాలు తీశాం, ఫలానాది బాగా పోయింది, ఫలానాది ఫెయిలైయింది’ అని చెప్పడం మినహా మరేమీ కనబడదు. అదే ఏ బి.ఎన్.రెడ్డిగారో అయితే తమ సినిమాల కథ గురించో, ఇతివృత్తం గురించో చెప్పకుండా మానరు. సినిమాల్లో కళ వాసనలు పోయి వ్యాపారం మాత్రమే మిగిలిందని కొన్ని ఇంటర్వ్యూల్లో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది.
రాజకీయాలైనా, సినిమాలైనా, సాహిత్యమైనా వ్యాపారదృష్టి ప్రతి తరంలోనూ తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే దానితో బాటు ‘గ్రాఫు’ నిరంతరం కిందికే జారుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. కాలమహిమ అనాలేమోగాని 1960ల ‘మాస్’ సినిమాలు కూడా ఇప్పుడు క్లాసిక్స్‌లాగా అనిపిస్తాయి. అయితే బురదలోంచి పంకజం పుట్టినట్టు నవతరంగాలు లేస్తూనే ఉంటాయి. గత వైభవాన్ని తలుచుకున్న కొందరైనా పరిస్థితిని మార్చడానికి పూనుకుంటారు. ప్రస్తుతం మనకు కావలసినది అదే. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా స్ఫుర్తిని పొందే మార్గం అదేనేమో.
సాహిత్యానికి సంబంధించినంతవరకూ వ్యాపారదృష్టి లేని వెబ్ పత్రికలు ఔత్సాహిక రచయితలని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా విడేశాల్లో స్థిరపడ్డవాళ్ళు తెలుగును మరిచిపోకుండా ఉండడానికి ఇవి తోడ్పడుతున్నాయి. రాసే విషయాల్లో వైవిధ్యం పెరుగుతోంది. (నాకు తెలిసిన ఒక తెలుగు మిత్రుడు అమెరికాలో స్థిరపడే ముందు నార్వేలో నేవల్ ఇంజనీరింగ్ చదివి కెనడా ఉత్తర ప్రాంతాల్లో మంచులో దుర్భరపరిస్థితుల్లో నౌకలు నడిపాడట. తన అనుభవాలను వచ్చీరాని తెలుగులోనైనా సరే రాయమని నేను చాలా సార్లు అడిగాను కాని అతనింకా పూనుకోలేదు) బ్లాగ్ రచయితలు పెరుగుతున్నారు. వారిలో కొందరికి తెలుగు స్పెల్లింగులు కూడా సరిగ్గా రాని మాట నిజమేగాని తెలుగులో రాయాలనే వారి ఉత్సాహం, తపన మెచ్చుకోదగ్గవి.
ఒకప్పుడు సాహిత్యం పండితుల చేతుల్లో ఉండేది. 1930లలో మాసపత్రికలూ, వారపత్రికలూ రావడంతో ‘కాలక్షేపం’ కథలూ, కొత్త రచయితలూ పుట్టుకొచ్చారు. 1950, 60లు పత్రికలకు స్వర్ణయుగమే. ఆ తరవాత తెలుగువారికి ‘జనరల్’గా సాహిత్యంలో ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా ఉద్యమసాహిత్యం ఊపందుకుంది. విప్లవరచనలూ, స్త్రీవాదం, దళితవాదం, ముస్లిం రచయితలూ, తెలంగాణా రచయితలూ పెరిగారు. కాలక్షేపానికి పుస్తకాలకు ప్రత్యామ్నాయంగా ముందు సినిమాలూ, తరవాత టీవీ వచ్చాయి. ఆ కారణంగా ఉద్యమాల్లో ఆసక్తిలేనివారితో కూడిన చదువుకున్న నిరక్షరాస్య సమాజం ఒకటి తయారయింది. ఈ రోజుల్లో ఏ ప్రోగ్రామింగో నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదించకుండా సాహిత్యం, భాష, సంస్కృతి అని మథనపడేవాళ్ళు వెర్రివాళ్లలా కనిపిస్తున్నారు. తెలుగు రాయడం, చదవడం వచ్చినవారి సంఖ్య తగ్గుతోంది కనక అవి రెండూ చెయ్యగలిగిన ‘వెర్రివాళ్ల’ మీదున్న బాధ్యత మరింత పెరుగుతోంది. భాషని బతికించవలసినది వాళ్ళే.









Pingback: రెండు ప్రకటనలు « ఊక దంపుడు
Pingback: ఈమాట » కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం