-చదువరి
తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల విప్లవం వస్తున్నట్టుంది. “అబ్బో.. నలభై యాభై దాటి వ్యాఖ్యలు వచ్చేస్తున్నాయం”టూ మేం ఆశ్చర్యపడిపోయి నిండా రెణ్ణెల్లు కాలేదు, ఇప్పుడవి వందకు చేరాయి. మనసులోమాట సుజాత రాసిన మీ చదువులు మా చావులు టపాకు వ్యాఖ్యలు వందకు చేరిన సందర్భంగా తెలుగు బ్లాగులు ఒక మైలురాయిని చేరుకున్నాయి.
తెలుగు మాధ్యమాలు బ్లాగులపై దృష్టి సారించాయి. బ్లాగులంటే ఏమిటో, ఎలా రాయాలో చెప్పే వ్యాసాలతో పాటు, వారం వారం ఒక బ్లాగును పరిచయం చేసే వ్యాసాలూ వస్తున్నాయి. వీటి ప్రభావం కూడలిలోనూ, బ్లాగు పాఠకుల సంఖ్యలోనూ తెలుస్తోంది. బ్లాగులు నిదానంగా జాలజనజీవనస్రవంతి లోకి జొరబడుతున్న సూచనలు కనబడుతున్నాయి.
రాజకీయాలు, చర్చలు
అక్టోబరు రాజకీయ బ్లాగులు మతము, మతఘర్షణల చుట్టూ ఎక్కువగా తిరిగాయి. చర్చలు కూడా ఎక్కువగా రాజకీయ బ్లాగుల్లోనే జరిగాయి. ఒరిస్సాలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో మతమార్పిడులను చదువరి రక్తపాత రహిత కుట్రగా వర్ణించారు. అక్కడ జరిగిన చర్చ మహేష్ పర్ణశాలలో రాసిన టపాలో కొనసాగింది. అసలు వీటికి మూలం నాగప్రసాద్ రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే టపా! ఈ లోగా వాసిలి సురేష్ ఒరిస్సాలో జరిగిన దాడులకు మూలాలను వెతికారు. ఇదిలా ఉండగా అబ్రకదబ్ర అభి-మతం అనే టపాలో తన అబిప్రాయం రాసారు. క్రైస్తవం గురించి జాన్ హైడ్ కొన్ని టపాలు వేసారు. రామాయణం మీద వస్తూ ఉన్న టపాల వరుసలో మరొక టపా దుర్గేశ్వర రాసారు. ఇతర టపాల లాగానే ఇది కూడా చర్చకు వేదికయింది.
జ్ఞానపీఠానికి తెలుగువారిలో అర్హులెవ్వరు అంటూ ఒక చర్చ జరిగిందీ నెల. పూలదండను పట్టుకుని చంద్రమోహన్ జ్ఞానపీఠార్హులెవరంటూ వెదకబోయారు. కొత్తపాళీ కూడా ఈ పీటముడిని విప్ప ప్రయత్నించారు. త్రివిక్రమ్ అందుకుని జ్ఞానపీఠపు మర్మాన్ని కనుగొన ప్రయత్నించారు.
సాహిత్యం, సంగీతం
- గోరటి వెంకన్న రాసిన పల్లే కన్నీరు పెడుతోందో అనే పాటపై తన భావాలను పలికించారు బొల్లోజు బాబా
- కవిత్వం రాయాలంటే ఎలానో చెబుతున్నారు శ్రీ అరుణం.
- అన్సంగ్ హీరోస్ లాగే అన్సంగ్ (!) పాట లను పరిచయం చేస్తున్నారు మధురవాణి, చూడండి
- 108 యాంబులెన్సు సేవల నేపథ్యంలో పద్మకళ అల్లిన ఈ కథ చదవండి. అన్నట్టీ బ్లాగు పేరు చూసారా.. కొత్త బంగారు లోకం! ఇప్పటికే ఒక పాత కొత్తబంగారులోకం ఉంది. ఆ బ్లాగరి – విహారి – మరో ప్రత్యేకత ఏంటంటే.. బ్లాగు పేరు లాగే తన పేరు కూడా మరో ప్రసిద్ధ బ్లాగరి పేరుతో కలుస్తోంది. అందుకే తనను “కెబియెల్ (కొత్తబంగారులోకం) విహారి” అని పిలుచుకుంటారు.
- “రసికావతంసుడా”, “రసికవతంసుడా” అనే విచికిత్సతో టపాను మొదలుపెట్టిన రానారె, టైపాటు అనే ఓ కొత్త పదాన్ని కాయించి, ముగించారు.
- సినిమా వాళ్ళు బ్లాగరులైతే వాళ్ళ బ్లాగుల పేర్లెలా ఉంటాయో జంబలకిడిపంబలో చూడండి.
- పొద్దు నిర్వహించిన భువనవిజయంలో ఇచ్చిన సమస్యలకు తన పూరణలను ఊకదంపుడు తమ బ్లాగులో పెట్టారు.
- డా.కేశవరెడ్డి రాసిన సిటీబ్యూటిఫుల్ నవలికను సమీక్షించారు పూర్ణిమ.
- పెళ్ళిని విషయంగా తీసుకుని భావకుడన్ రాసిన కథ చదివారా?
- పాలగుమ్మి విశ్వనాథం రాసి, స్వరపరచి, పాడిన “మా ఊరు ఒకసారి పోయి రావాలి” అనే చక్కటి పాటను వేణు శ్రీకాంత్ పరిచయం చేసారు
- ఛందోబద్ధ పద్యాల్లో యతి నియమాల గురించి వివరిస్తూ రెండు టపాలను వేసారు, రామకృష్ణారావు.
స్వగతాలు, స్వ గతాలు
- తనను ప్రభావితం చేసిన ఫిజిక్సు మాస్టారి గురించి నాగమురళి చెప్పారు.
- జపాను కబుర్లు చెప్పే ప్రఫుల్ల చంద్ర ఫుజ పర్వతారోహణాన్ని వివరిస్తున్నారు.
- గోయిందల పడక్కి గోయిందలు కొట్టొచ్చినామంటూ అనామిక చెప్పే ఈ గోయిందల కథేంటో చదివారా?
- తెలారుఝామున వచ్చిన ఫోనంటూ ఒక చిన్న ధారావాహిక రాసేసారు రాజేంద్ర కుమార్
సినిమా
- “చింతకాయల రవి” పాత చింతకాయ పచ్చడంటూ, ప్రవీణ్స్ పెన్ లోను, మనకోసం లోను సమీక్షలొచ్చాయి.
- గడ్డిపూలులో మాన్సూన్ వెడ్డింగ్ అనే సినిమా సమీక్ష వచ్చింది.
- కొన్నాళ్ళ బ్లాగు విరహం తరువాత, కస్తూరి మురళీకృష్ణ మళ్ళీ బ్లాగులోకంలోకి ప్రవేశించారు. అక్టోబరులో ప్రధానంగా సినిమాలపై టపాలు వేసారు. హ్యాపీడేస్ సినిమాపై ఆయన రాసిన టపా వీటిలో ఒకటి. ఆ సినిమాపై తనదైన కోణాన్ని చూపించారు.
- “కొత్తబంగారులోకం” సినిమా చెత్త అని చెబుతూ ఎందుకో కూడా విపులీకరించారు లక్ష్మి
- “కేక ఓ దిక్కుమాలిన సినిమా” అంటూ గౌరవించారు కాలాస్త్రిలో
హాస్యం, వ్యంగ్యం
- బట్టతల వచ్చేసిందే బాలా అంటూ ఖర్వాట పురాణం ఒకటి ధారావాహికంగా వస్తూంది తేటగీతి బ్లాగులో. అక్టోబరును బట్టతలకు అంకితం చేసేసారు మురళి. కేశసంరక్షణ సూత్రాల లాగా బట్టతలురకు జుట్టు మొలిపించే సూత్రాలేమైనా ఉంటే మురళి గారి హీరోలకు సౌకర్యంగా ఉంటుందని ఆ హీరోభిమానులు భావిస్తున్నట్టు తెలియవస్తూంది.
- మలయాళీ భామలను ఎలా ఆకట్టుకోవాలో చెబుతూ బ్లాగరులను ఆకట్టుకున్నారు తోటరాముడు
- ఇదిలా ఉండగా బ్లాగాడించే రవి కూడా కొన్ని మలయాళ మంత్రాలను బ్లాగరులకు పరిచయం చేసారు.
- తన శైలిలో కార్టూన్లు వేస్తున్నారు ప్రముఖ కార్టూనిస్టు భగవాన్.
- స్వర్గీయ మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి ఇంగ్లీషు వనితకు తెలుగు నేర్పిన విశేషాలను వివరించారు సురుచి
- ఎటో వెళ్ళిపోతోంది మనసు అంటూ చెణుకులు విసిరారు మేధ.
- పాపం, రిషి పడ్డ ఇంగ్లీషు పాట్లు చదవండి!
- ఆంప్ర రారోరసం వారి బస్సులో ప్రయాణానుభవాన్ని వివరిస్తున్నారు చైతన్య
ఇంద్రధనుస్సు
- తిండి మీద దృష్టి సారించారు బ్లాగరులు. పప్పును మించిన పాకము కలదా అంటూ పప్పుసుద్ద శ్రేష్టత గురించి మాకినేని ప్రదీప్ రాస్తే, పప్పుల్లో మహాపప్పు కందిపప్పు అంటూ వ్యాఖ్యాతలు రాసారు.
- వాసన పట్టేసిన భాస్కరరామరాజు ముద్దపప్పు గురించి ఓ టపా వేసారు. వివిధ రకాలైన పప్పులను తయారుచేసే ప్రోగ్రాములను అందరికీ అర్థమయ్యే రీతిలో రాసారు కూడా.
- బాపు అనగానే రమణ గుర్తొచ్చినట్టు, పప్పనగానే ఆవకాయ గుర్తుకు రావడం ఆంధ్రుడి లక్షణం. తల్లక్షణ ఫలితమే విరజాజి పూయించిన ఆవకాయ పురాణం టపా!ఈ విధంగా పప్పావకాయతో అక్టోబరు బ్లాగులు రుచులూరిపోయాయి.
- భోజనాలకి పిలిచి వేళకి భోజనం పెట్టకపోతే కలిగే బాధను తాడేపల్లి తన ఆఱు నూఱైనా…. లో వివరించారు.
- గార్లపాటి ప్రవీణ్ ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి … అంటూ తన ఆలోచనాస్రవంతిని బ్లాగులో ప్రవహింపజేసాడు.
- వివిధ బ్లాగులు, బ్లాగరుల పేర్లను స్పృశిస్తూ, గతంలో కొల్లూరి సోమశంకర్ పొద్దులో ఒక లేఖ రాసారు. ఇప్పుడు వివిధ బ్లాగరులను పలకరిస్తూ లీలామోహనంలో ఒక జాబు వచ్చింది. బ్లాగు పేర్లకు తగిన బొమ్మలు పెట్టడం ఈ టపా ప్రత్యేకత.
- కురులను సంరక్షించుకోవటం ఎలా అనే విషయంపై శ్రీసత్య వరసగా టపాలు వేస్తున్నారు. వాటిలో ఈమధ్య వచ్చిన టపా ఇది.
- నేను హార్లిక్సు తాగను, తింటాను అన్నట్టు, టీవీలో యాడ్లే చూస్తాను అంటూ చెబుతున్నారు పసిగుడ్డు.
- శివుడాజ్ఞ అంటూ నిడదవోలు మాలతి ఒక కథ రాసారు. విశిష్టత ఏంటంటే.. రెండు ముగింపులను ఇచ్చి ఏది నచ్చిందో చెప్పండని పాఠకులను అడగడం.
- భయం భయం అంటూ లచ్చిమి రాసిన టపా ఆకట్టుకుంది. తన అసలు పేరు రష్మి (చిన్నపిల్ల కావడంతో ర ను ‘ల’ గానూ, ‘ష్మి’ని ‘చ్చిమి’గానూ పలుకుతున్నదని అనిపిస్తోంది) అని ఎప్పటికి చెప్పగలుగుతుందో.
- మహాత్ముడి పుట్టినరోజు మాటున మరుగునపడిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజును మననం చేసుకున్నారు సురేష్.
- పొద్దులో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కైవల్యం కవితపై తన అభిప్రాయాన్ని రాసారు అరుణాంక్
కొత్త బ్లాగులు
- మీతో చెప్పాలనుకున్నానంటూ వచ్చిందో బ్లాగు
- సీతారామ్ మెసేజీల సేకరణలు అంటూ కొత్త సందేశాలతో వచ్చిందో బ్లాగు.
- ఊహాలోకం నిర్మిస్తోంది, కావ్య
- తొలి దండం అమ్మకే పెడుతూ తన సత్యాన్వేషణ మొదలుపెట్టారు గీతాచార్య
- బాటసారినంటూ వచ్చారో బ్లాగరి
ప్రత్యేక ప్రస్తావన
సుప్రసిద్ధులైన తెలుగువారి గురించి మనకు తెలీని ఎన్నో విషయాలను చెబుతూ సాగిపోయే బ్లాగు తెలుగురథం. మనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన మహామహుల జీవితాల గురించి, ప్రసిద్ధ సంఘటనల గురించి, పండుగల గురించి ఈ బ్లాగులో టపాలు వస్తూంటాయి. సందర్భోచితంగా – మహానుభావుల జయంతి లేదా వర్ధంతి రోజునగానీ, పండుగల రోజునగానీ, సంఘటనల వార్షికానగానీ – వ్యాసాలను వెలువరించడం ఈ బ్లాగు ప్రత్యేకత. పాత వ్యాసాలను చదువుకునేందుకు వీలుగా నెలవారీగా టపాలకు లింకులు ఇస్తే బాగుంటుంది.
తెలుగురథం చోదకులు కొంపెల్ల శర్మకు అభినందనలు
చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.
23 Responses to అక్టోబరు బ్లాగుల విశేషాలు