సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

రాయలసీమ లోని గ్రామ పార్టీల గురించి ‘పాండవబీడు‘, కనుమరుగైపోతున్న సాంప్రదాయక కళల గురించి ‘తోలుబొమ్మలాట‘, గ్రామీణ జీవితాల్లో వ్యవసాయరంగంలో వస్తోన్న మార్పుల గురించి ‘కాడి‘, మగ విద్వేషానికి బలయిన చారిత్రక వీరవనిత గురించి ‘పాలెగత్తె‘, శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి ‘చినుకుల సవ్వడి‘ నవలలు రాసారు. తదుపరి ప్రణాళిక ఏమిటి?

పల్లె జీవితంలో విపరీతమైన మార్పులొస్తున్నాయి. ప్రపంచీకరణ వల్లా, సరళీకృత ఆర్థిక విధానాల వల్లా, మార్కెటీకరణ వల్లా పల్లె మనుగడలో పెనుమార్పులు సంభవిస్తూ వున్నాయి. రైతులిప్పుడు వ్యవసాయం చేసి బతికే పరిస్థితుల్లో లేరు. అలాగని సెంటు భూమి కూడా బంజరుగా లేదు. తరాల తరబడి బీళ్ళుగా పడి వున్న భూములన్నిట్నీ ఎక్కడెక్కడి ప్రాంతాలవాళ్ళో వచ్చి, కొని, కంచెలు నాటుతున్నారు. ‘పొరుగూరి చాకిరి, పొరుగూరి సేద్యం తనను తినేవేగాని తను తినేవి కావు’ అనే సామెతకు అర్థం లేకుండా పోయింది. పొరుగూరి సేద్యానికే రైతు భయపడుతూ వున్న కాలాన్నించి వేల మైళ్ళ దూరాన్నించి వచ్చి ఇక్కడ భూములు కొని అక్కణ్నించే సేద్దెం చేయించే పరిస్థితి ఒకటి కొత్తగా వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసికోవాలో తెలీకుండా వుంది. ఈ మార్పులన్నింటికీ మూలాలేవో వెదకే దశలో నేనింకా సాహిత్య సృజన చేయాల్సిన అవసరం వుంది.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

సాహితీ వ్యవసాయంలో మీరింకా పండించదలచినవేమిటి?

ఇన్నేళ్ల నా సాహితీ వ్యవసాయంలో నేను పండించింది తక్కువే. ఒకటి రెండు మంచి పంటలు పండించొచ్చుగాక, పరిపూర్ణమైన పంట నానుంచి ఇంకా రాలేదనే నా అభిప్రాయం. నా చుట్టూ వున్న జీవితాన్ని నేను చూడాల్సిన కోణాలు ఇంకా చాలా మిగిలి వున్నాయి. వాటి గురించిన స్పష్టత నాకింకా రావలసి వుంది. నేను రోజూ చూస్తూనే వున్నా, మాట్లాడుతూనే వున్నా కొని జీవితాల్ని నేనింకా అర్థం చేసికోలేకపోతున్నాను. కూచుని దృష్టిని సంధించాల్సిన కోణమేదో అందీ అందనట్లుగా వుంది. నా తరంతోనే అంతరించిపోతూవున్న అచ్చ తెలుగు వాడుక పదాలూ, వ్యవహారాలూ, పలుకుబళ్ళూ, సామెతల్ని సాహిత్యంలో నిక్షిప్తం చేయవలసి వుంది. భవిష్యత్తులో నా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాళ్లకు రాయలసీమ వ్యావసాయక పల్లెదనం ఒక తరంలో పొందిన పరిణామం స్పష్టంగా కంపించాలి. అందుకై నేనింకా కవితలూ, కథలూ, నవలల్ని విస్తృతంగా రాయవలసి వుంది.

దిగంబరం‘ కథా కథనం చాలా బలంగా వచ్చింది. ఆ కథలోని కుటుంబ యజమానిలాంటి బతికి చెడిన రైతులు రాయలసీమలో చాలా మందే కనపడతారు. కానీ-ఆ రైతు చెల్లెలు, కూతుర్ల అవసరాలను, సంఘర్షణలను అంత దగ్గరగా ఎలా చూపించగలిగారు? కథలోని యీ పాత్రల నేపధ్యం మీ జీవితానుభవాల్లోనిదేనా? దాని గురించి చెప్పండి.

దిగంబరం‘ లోని పాత్రలు నేనెరిగినవే. మా యింటి పక్కవే. నేనే కాదు-రాయలసీమలో చాలా వూర్లలో ఇలాంటి పాత్రలు కోకొల్లలుగా దొరుకుతాయి. అయితే ఇందులోని చెల్లెలు, కూతుర్ల పాత్రలు కూడా నాకు తెలిసినవే కావటం విశేషం. వాళ్ల మానసిక సంఘర్షణకు దగ్గరగా వెళ్లి రాయటం నాకున్న పాత్రల అవగాహనవల్ల, పరిశీలన వల్ల సాధ్యమయింది. అయితే కొన్ని కొన్ని సంఘటనలు నేను కథలో చెప్పినట్లే ఏకకాలంలో ఒకే వేదిక మీద జరగాల్సిన పని లేదు. కథ, పాత్రలు, వాతావరణం ఆ యింటి నుంచే తీసికొన్నా, కథ చివరిలో ముసలోడి ఆవేదన మరో యింటినుంచి తీసికొని వుండొచ్చు. ఏక కాలంలో ఒకేచోట జరిగినట్లుగా చిత్రించిన సంఘటనలు వివిధ కాలాల్లో, వివిధ ప్రదేశాల్లో, వివిధ పాత్రల మధ్య వివిధ సంఘటనలుగా జరిగి ఉండొచ్చు. వాటిని కూర్చుకొనే నేర్పు రచయితకు ఉండాలి.

తోలుబొమ్మలాట‘ నవలలో తల్లీ కూతుళ్ల విషయం. యవ్వనం సంతరించుకొంటోన్న రోజుల్లో తల్లి అనుభవాలు మధుర జ్ఞాపకాలు కాగా, కూతురి అనుభవాలు బాధాకరమైనవి, భయం గొలిపేవి. ఆ వూర్లోని యువత ఒక తరం మారేలోగా ఎందుకలా తయారయిందోననే ఆలోచన రేకెత్తించే చిత్రణ ఆ నవల్లో వుంది. ఆ విషయమై మీ ఆలోచనలు చెప్పండి.

గతంలో ఏదయినా సమస్య తలెత్తితే గ్రామమంతా ఒకచోట సమావేశమై చర్చించుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేవారు. తాగుడు ఒక చెడు అలవాటుగా భావించేవారు. పెద్దల్ని ఎదిరించటం తప్పుగా నమ్మేవారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా గ్రామ అవసరాల కోసం సర్దుబాటయ్యేవారు. ఏవో పార్టీలున్న గ్రామాల్లో తప్ప అన్ని గ్రామాల పరిస్థితి అలాగే వుండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పార్టీలంటూ పెద్దగా లేకున్నా ప్రతి గ్రామం రెండుగా విడిపోయి ఒక వర్గం వారంటే మరొక వర్గం వారికి గౌరవాలు నశించాయి. ఆప్యాయతలూ, అనురాగాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్దల మాట ఎవరూ వినట్లేదు. ప్రభుత్వం వారు అదేపనిగా ప్రచారం చేసి మరీ మద్యం తాపుతుండటంతో ఇప్పుడు తాగటానికి ఎవడూ సిగ్గుపడటం లేదు. దాంతో విచక్షణ కోల్పోతున్నారు. గ్రామ పెద్దల అజమాయిషీ పోయింది. ఎవనికి వాడే స్వతంత్రుడై మద్యానికి బానిస అవుతున్నాడు. సమస్యలొస్తే పోలీస్టేషన్లో మాత్రమే పరిష్కారమవుతున్నాయి తప్ప గ్రామపెద్దల సమక్షంలో కాదు. రాజకీయ పార్టీల కొమ్ము కాసేవాళ్ళే ఇప్పుడు గ్రామ పెద్దలవుతున్నారు. తమ వర్గంలోని మనిషి చేజారిపోకుండేందుకు వాళ్లు తప్పు చేసినా సమర్థించుకొని కొమ్ముకాసే దశకు గ్రామపెద్దలు దిగజారిపోయారు. ఈ నేపథ్యంలో యువత అలా తయారైంది.

పదేళ్ళనాటికి, ఈ నాటికీ ‘పల్లె’ చిత్రం మారింది. బతుకుతెరువులు మారిపోయాయి. రాజకీయంగా, సామాజికంగా పల్లె నాగరికతలో వేగంగా చోటుచేసికొంటోన్న కొన్ని అనివార్యమైన మార్పులను మీరు తప్పనిసరిగా గమనించే ఉంటారు. ఈ మార్పు మీ రచనల ఇతివృత్తాల్లో ఎలా ప్రతిబింబించి ఉంటుందో మీ మాటల్లో వినాలనుంది. చెబ్తారా?

తోలుబొమ్మలాట‘ నవలలో మీరు చెప్పిన మార్పులన్నీ చాలావరకు ప్రస్తావించాను. పల్లెచిత్రం తనొక్కటే ఒంటరిగా మారలేదు. నగరాలు, పట్టణాల్లో జరిగే విపరీత మార్పులకు పల్లె కూడా స్పందిస్తోంది. ఆ మార్పులకు తన ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కొన్ని అవసరాల్ని పణంగా పెట్టి అయినా నగరాల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తోంది. ‘తోలుబొమ్మలాట‘లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాను. పట్టణాల్నించి వచ్చిన కళాకారులు ఇరవై యేళ్ళ కిందటి పల్లెను పోల్చుకొని తెగ బాధపడిపోతారు. పల్లె మారిందని చింతపడతారు. కానీ చివరకు యథార్థ భావనకు మారతారు. పట్టణాల్లోని తమ జీవితాల్లో కూడా ఊహించనన్ని మార్పులొచ్చాయి గదా! ఇళ్లల్లోకి టీవీలొచ్చాయి. వంటింట్లోకి మిక్సీలు, కుక్కర్లొచ్చాయి. చేతుల్లోకి సెల్‌ఫోన్లొచ్చాయి. పల్లెలు మాత్రం ఆ సౌకర్యాల్ని ఎందుకు అనుభవించకూడదు? అంటే వాళ్ల దృష్టిలో పల్లెలింకా దశాబ్దాల నాటి పల్లెల్లాగే ఉండాలి. ఇంకా విసరుతూ, దంచుతూ, రుబ్బుతూ, ఎంత దూరమైనా నడుస్తూ, మైళ్ల దూరాన్నుంచి నీళ్లు మోస్తూ, గోచిపంచెలు బిగించి పూరి గుడిసెల్లో ఉంటూ, ఏ వృత్తి కళాకారుడు ఆ వృత్తికి సంబంధించిన పనులే చేస్తూ, బైటి ప్రపంచం వాళ్లకి పల్లె ఒక అందమైన ఫోటో లాగా కన్పించాలా? ఇది స్వార్థపూరిత ఆలోచన కదా! వాళ్లు మాత్రం మారకూడదా? కొత్తనీరు ఉధృత ప్రవాహమైనపుడు ఇరుదరులు కోసుకుపోవడం సహజం. మార్పుకు గురవుతోన్న సమాజంలో కొన్ని అవాంఛనీయమైన ధోరణులు చోటు చేసికోవటం కూడా అంతే సహజం. సమర్థనీయం కాని పరిణామాలు కూడా చోటు చేసికోవచ్చు. అంతమాత్రాన మార్పును వ్యతిరేకించాలా?

కాడి నవలలో కూడా పల్లె వ్యవసాయ జీవితంలోని మార్పుల్ని విస్తృతంగానే చర్చించాను.

వ్యవసాయం పరిస్థితి చాలా మారింది. ఉపాధి హామీ వగైరా పథకాల వల్ల, వ్యవసాయ పనుల కాలంలో ఈ పథకాలు ప్రవేశపెట్టటం వల్ల వందరూపాయలిచ్చినా పత్తి విరుపులు వగైరా పనులకు కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడి, వ్యవసాయం దిక్కుతోచని స్థితిలో పడింది. గ్రామంలో ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగతా రైతులంతా జాబ్‌కార్డ్‌లు సంపాదించుకొని ఉపాధి హామీ పనులకు వెళుతున్నారంటే వ్యవసాయ పరిస్థితిని అర్థం చేసికోవచ్చు.

తెలుగు మీడియమ్ స్థానంలో ఇంగ్లీష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నారు. దాని ప్రభావం తెలుగు సాహిత్యంపై ఎలా ఉండొచ్చు?

ఇంగ్లీషు మీడియమ్ వల్ల తెలుగు సాహిత్యానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని నేననుకోవటం లేదు. విద్యార్థుల వల్ల కంటే తల్లిదండ్రుల వల్లే తెలుగు భాషకు నష్టం జరుగుతూ ఉంది. తెలుగును నిర్లక్ష్యం చేసేది, ఇంగ్లీషును అరువు తెచ్చుకొనేదీ వాళ్లే. తమ తీరిక సమయాల్ని పఠనం నుంచి దృశ్యం వైపుకు మళ్లించటమే భాషా వినాశనానికి నాంది ఐంది. సంభాషణల్లో ఇంగ్లీషు పదాల్ని ఉపయోగించాలనే కృతక నాగరికత కూడా ఇందుకు తోడైంది. పల్లెల దృష్టికోణం నించే నేను మాట్లాడుతోన్నా – రెండు దశాబ్దాల క్రితమే, ఇంగ్లీషు వ్యామోహం పల్లె చదువుల మీద బలంగా వాలనప్పుడే – ఇంగ్లీషు పదాల్ని తమ సంభాషణల్లో చొప్పించేందుకు చాలామంది ఉబలాటపడటం నేను గమనించాను. మాట్లాడేదంతా తెలుగే అయినా ఊత పదాలుగా సో, బట్ లాంటి ఇంగ్లీషు పదాలు వాడటం నాకయితే అత్యంత కృతకంగా అనిపించేది.

ఆ పరిస్థితికి కూడా కొన్ని కారణాలున్నాయి. టౌనుకు వెళ్లివచ్చినపుడల్లా ఓ ఇంగ్లీషు పదాన్ని మోసుకురావాల్సిన దుస్థితి. హోటల్‌కు పోతే బువ్వ, కూర అనడం అనాగరికం. రైస్, కర్రీస్ అనాలి. బస్సెక్కినపుడు తావు అనకూడదు. సీటు అనాలి. ఏ షాపు చూసినా అక్షరాలు తెలుగులోనే ఉన్నా భాష మాత్రం ఇంగ్లీషు. అన్నపూర్ణా మిలిటరీ హోటల్, సుబ్బయ్య అండ్ సన్స్ జనరల్ మర్చంట్స్, వాణి ఫ్యాన్సీ షాపు, బ్రహ్మం మెడికల్ షాపు, శ్రీదేవి క్లాత్ ఎంపోరియమ్, శివ ఫర్టిలైజర్స్, వినాయక బ్రాంది షాపు వగైరా వగైరా అన్ని అంగళ్లూ – చివరకు టీస్టాల్, పాన్ మసాలా, కూల్‌డ్రింక్స్- చచ్చినట్లు ఇంగ్లీషు పదాల్ని అలవాటు చేసికోవలసిందే. దానికితోడు సినిమాల్లో కూడా సగం ఇంగ్లీషు పదాల వాడకం. ఏ ఆఫీసుకు వెళ్లినా.., కేవలం పల్లెజనాల కోసమే నడిచే సహకార బ్యాంకుల్లో సైతం, లావాదేవీలకు సంబంధించిన పేపర్లన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. చదువుకొన్నవాళ్లు, రాజకీయ నాయకులు వగైరాలంతా ఇంగ్లీషు పదాల్ని విరివిగా ఉపయోగించటం కూడా ఒక కారణం. ఇంగ్లీషు అనేది నాగరికతకు చిహ్నంగా జనాలు అర్థం చేసికోవటం వల్ల ఈ చిక్కు వచ్చింది. ఇంగ్లీషు పదాల్ని ఇప్పుడు ఇంట్లో కూడా వాడటం వల్లనే ఇబ్బంది వచ్చిపడింది. ఇంగ్లీషు వంటింట్లోకి కూడా చొరబడింది. మనం తినే ఆహారానికి కూడా ఇంగ్లీషు వాసనలు అద్దబడ్డాయి. ఇంగ్లీషు మీడియమ్ చదివే పిల్లలకి ఇంట్లో కూడా ఇంగ్లీషు భాషావాతావరణాన్ని కల్పించటం వల్ల ఆంగ్లభాషలో నిష్ణాతులవుతారనే కుహనా సంస్కృతి ఒకటి చాలామంది చదువుకొన్న తల్లిదండ్రుల్లో ఏర్పడింది. దీనివల్ల తెలుగు భాషకు తీవ్రమైన నష్టమే జరుగుతోంది.

పిల్లలకు ఇంగ్లీషు మీడియమ్‌లో చదువు చెప్పించినా ఇంటిని ఇంగ్లీషు మీడియమ్ చేయకుంటే చాలు. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ, తెలుగు కథల పుస్తకాల్ని పిల్లలకు అందుబాటులో ఉండేలా చేస్తూ, వాళ్లని తెలుగులో కూడా నిష్ణాతులని చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మన వేషము, భాష మొరటైనవిగా, మన సంస్కృతి సంప్రదాయాలు పాత చింతకాయ పచ్చళ్లుగా పిల్లల మనసుల్లో ముద్ర పడేలా చేసి, విదేశీ వేషభాషలు, సంస్కృతీసంప్రదాయాలే గొప్పవిగా, అవి ఆచరిస్తేనే నాగరికతగా చిన్నప్పటి నుంచీ నూరిపోస్తే వాళ్లు పెద్దయింతర్వాత, విదేశాల్లో జీవనం మొదలెట్టింతర్వాత, మన భాషా, సంస్కృతుల్ని ఎట్లా పట్టించుకోకుండా వదిలేస్తారో వాటి మధ్య బతికే తల్లిదండ్రుల ఉనికినీ సంబంధాల్నీ అట్లాగే వదిలేస్తారు, తప్పదు. అందులో పిల్లల తప్పుకూడా లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా విశ్లేషించుకొని మరీ గమనించాలి.

ఇప్పుడు ఇంగ్లీషు చదువుల ప్రభావం సాహిత్యం మీద పడి తెలుగు పాఠకుల సంఖ్య బాగా తగ్గిందనటానికి – మొదట్నుంచీ సీరియస్ సాహిత్యానికి పాఠకుల సంఖ్య తక్కువే. ఆ మధ్యలో ఓ మూడు దశాబ్దాల కాలం కాలక్షేపపు కాల్పనిక సాహిత్యం తెలుగు భాషలో అడుగుపెట్టి పాఠకుల సంఖ్యను విపరీతంగా పెంచింది. అయితే ఆ పాఠకుల్ని సీరియస్ సాహిత్యం కేసి మరల్చుకోలేకపోవటం తెలుగు సాహిత్యం చేసికొన్న దౌర్భాగ్యం. టీవీ మాధ్యమం వచ్చింతర్వాత కాలక్షేపం రూపం మారింది. కాలక్షేపపు పాఠకులు కాస్తా టీవీ వీక్షకులయ్యారు. ఆ మూడు దశాబ్దాల పాఠకుల సంఖ్యతో పోల్చుకొంటే ఇప్పుడు సాహిత్యాన్ని చదివే వాళ్లు తక్కువే.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

5 Responses to సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3

Comments are closed.