– టి. శ్రీవల్లీ రాధిక
సగం సగం ఆత్మల్ని
సంపూర్ణ శరీరాలలో నింపి
దేవుడు వేడుక చూస్తుంటాడు
మనుషుల్ని ఒకచోట
మనసుల్ని మరోచోట విసిరేసి
మరణించేలోపల వెతుక్కోమంటాడు.
పున్నమి రోజునా సగం చంద్రుడే
కనిపిస్తూన్నపుడూ
యుగళగీతాలలోనూ ఒక్క స్వరమే
వినిపిస్తూన్నపుడూ
ఆ విషయం మనకి అర్ధమవుతుంది
మనదైన మరోసగం కోసం
వయో లింగ బేధాలూ
జాతిమత వైరుధ్యాలూ లెక్కచేయని
అన్వేషణ మొదలవుతుంది.
భూగోళం మొత్తాన్నీ
ఓ అరచేతిలో నిలిపి
భూతద్దం మరో చేతికి యిచ్చినా
కనులతో దానిని కనిపెట్టలేమని
త్వరలోనే తెలుస్తుంది
భూమ్యాకాశాలని
చాపలా చుట్టే సామర్ధ్యం సాధించినా
చేతులతో దానిని అందుకోలేమని
క్రమంగా అవగతమవుతుంది.
ఆతర్వాతే అసలు నరకం
మొదలవుతుంది
రొజురోజుకీ దగ్గరవుతున్న ప్రపంచం
మనకుమాత్రం అనంత శూన్యంగా
అగుపిస్తుంది
అన్నీ తెలిసిన భాషలే
అయినా మాటలు అర్ధం కావు
మళ్ళీ మళ్ళీ చూసిన మొహాలే
అయినా మనసులో నిలబడవు
రోజు తర్వాత రోజు గడుస్తూ వుంటుంది
మనసు చుట్టూ గోడ మరింత గట్టిపడుతుంది
కళ్ళనుంచి అపుడో చుక్క అపుడో చుక్క
తడబడుతూ రాలుతుంటుంది
కళ్ళు మూసే లోపల కలుసుకోలేని నేస్తం కో్సం
గుండె గుక్క పడుతుంది
మరెవరికీ కనబడని ఈ వైకల్యం
మనల్ని నిర్వీర్యం చేస్తుంటుంది
మనం అసహాయంగా చూస్తుండగానే అది
మెల్లమెల్లగా మనల్ని కబళిస్తుంది
—————————-
టి. శ్రీవల్లీ రాధిక హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి, “మహార్ణవం”, “ఆలోచన అమృతం” అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువాదమై “మిత్‌వా” అనే పుస్తకంగా వచ్చాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలోకి అనువదింపబడ్డాయి. “నా స్నేహితుడు” అనే కథకు 1994 లో “కథ” అవార్డు అందుకున్నారు. మహార్ణవం అనే పేరుతో బ్లాగు రాస్తూంటారు.
22 Responses to కైవల్యం