మనసుకు చూపుంటే…

–స్వాతీ శ్రీపాద

నిశ్శబ్ద సమరానికి సమాయత్త మవుతూ
భావాల బూజు దులిపి
అనుభవాల ఆక్రందనాలను
అక్షరాల్లోకి అనువదించే
మనసుకు చూపుంటే …

మాసిపోయిన మందహాసాల వెనక
జీవితం ఉరి కంబం మీద
బిక్కు బిక్కు మంటూ దిక్కులు చూసే
మధ్య తరగతి మరణ శాసనాలకు
నిలువెత్తు అద్దం పట్టే
ఆధునిక హింసా చిత్ర మయేది

గాజుగోడల సౌకుమార్యం మధ్య
అలమటించే సముద్ర ఘోష
అలలై ఎగసి పడే తామస ద్వేషాలు
నీ ఉనికిని శాసించే వేళ
ఊపిరందక ఉక్కిరి బిక్కిరయే
ఊహా గానమయేది

మొలవని రెక్కల్ను విదుల్చుకు
విహాయసంగా సుదూర తీరాలకు
వలస పోవాలని స్వప్న బాలికలు
నిర్మించే సైకత సౌధాలు

ఇంకా పుర్తిగా రూపం రాని కళ్ళ రెప్పలను చిదిమి
పదాల పెదవుల కతికించాలని
ఉబలాట పడే నిట్టూర్పులూ

తీరాన్ని మింగేసి అలలను ఆరబెట్టుకునే
సప్త సముద్రాల క్రౌర్యం

మనసుకు చూపుంటే
చరిత్ర కరపత్రాలయేవి

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

12 Responses to మనసుకు చూపుంటే…

Comments are closed.