-లలిత
“తెలుగు నేర్పడం ఎలా?” అన్న పేరుతో రంగనాయకమ్మ గారు కొన్ని తెలుగు పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, కొన్ని సూచనలనూ జోడించి ఒక పుస్తకం వ్రాశారు. రంగనాయకమ్మగారే ఒక పాఠ్య పుస్తకం కూడా రాశారు. చదివిందీ, నేర్పిందీ మర్చిపోయిన తర్వాత మిగిలినదే విద్య అని ఆంగ్లంలో ఒక నానుడి. అది వాడుకుని, ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు మిగిలిన అనుభూతి, నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటున్నాను.
పెద్దబాలశిక్షలో ఉన్న అక్షరమాల కాక తెలుగు భాషా పరిచయంలో పిల్లలకు మనం ఇవ్వవలిసిన క్రొత్తదనం ఏదీ లేదని, వాడుకలో లేని కొన్ని అక్షరాలను తొలగించడము, మరీ తక్కువగా వాడే అక్షరాలను అక్షరమాల నుంచి తొలగించి అవసరమైనప్పుడు పరిచయం చెయ్యడము మాత్రమే అవసరం అని సూచించారు. అలాగే తను తయారు చేసిన పాఠ్యపుస్తకంలో అందించారు కూడా. అది అంతగా అభ్యంతరకరం కాదనిపించినా, నా అభిప్రాయంలో ఆ మార్పు కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. వర్ణమాలను యథాతథంగా పరిచయం చెయ్యడంలో తప్పు లేదని నాకనిపిస్తుంది. మనం ఇప్పుడు వాడే భాషలో కొన్ని అక్షరాలు అరుదుగా మాత్రమే ఉపయోగపడినా, భాష నేర్పడం అంటే ఆ భాషలోని సాహిత్యాన్ని ఆస్వాదించే స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహించడం కూడా అని భావిస్తాను నేను – అందునా మాతృభాషను. కాబట్టి మన ప్రాచీన సాహిత్యాన్ని చదివేటప్పుడు ఈ అరుదైన అక్షరాలు అవసరం అవుతాయి. అంతే కాదు, 26 అక్షరాలు మాత్రమే ఉన్న ఆంగ్ల భాషలోనే ఒకే శబ్దాన్ని పలకడానికి వేరు వేరు సందర్భాలలో వేరు వేరు అక్షరాలు వాడతారు. ఉదాహరణకు k, c మరియు, g, j. ఇంకో ప్రక్క, స్వల్ప తేడాతో ఒకేలా ధ్వనించే “వ” శబ్దానికి రెండు వేరు వేరు అక్షరాలున్నాయి. మరి “ర”, “ఱ” లను ఒకే అక్షరంతో సూచించగలమనుకోవడం ఎందుకు?
అయితే, నాణానికి ఇంకో వైపు, అక్షరానికీ ధ్వనికీ సంబంధం పరిచయం చేసే స్థాయిలో ఈ విచక్షణ చూపించడం ఫరవాలేదనిపిస్తుంది. అంటే, అరుదుగా వాడబడే అక్షరాలతో పదాలు ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టక్కర లేదేమో. కుతూహలం కొద్దీ పిల్లలు అడిగితే జవాబులతో సిద్ధంగా ఉండగలిగేందుకు బోధించేవారికి ఆయా అక్షరాల గురించి కావలిసిన పరిజ్ఞానం ఉండడం మాత్రం అవసరం.
ఏ విషయం నేర్చుకోవడానికైనా ఎన్ని పద్ధతులున్నా, ఎన్ని పరికరాలున్నా, పరిశ్రమ, శ్రద్ధ, క్రమశిక్షణ లేకుండా ఏ విద్యా అలవడదు, ఉపయోగపడదు. పోతన వంటి మహానుభావులకు తప్పితే సామాన్యులకు గురువు ద్వారా కాని విద్య అబ్బదు, అందునా ప్రాథమిక విద్య. పెద్దబాలశిక్షను పద్ధతిగా అనుసరించి క్రమశిక్షణతో నేర్చుకుంటే తెలుగు భాష చక్కగా నేర్చుకోవచ్చు అనడానికి సందేహం లేదు. ఇక క్రొత్తదనం గానీ, ఆకర్షణ గానీ ఎందుకు అన్న ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు. సహజంగానే పిల్లలూ, మారామూ దగ్గిర స్నేహితులు. అత్యవసరమైనదైనప్పటికీ, ఆహారాన్ని కూడా ఆటపాటలతో అందిస్తే తప్ప అంటుకోరు చాలా మంది పిల్లలు. ఇక ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా ఉండడమే కాక, అవసరార్థం ఆంగ్లాన్ని ఆకర్షణీయంగా అందజేస్తున్న తల్లిదండ్రులు, తెలుగును మాత్రం అప్పచెప్పే పద్ధతిలో నేర్చుకోమనడం అన్యాయం కదూ? అసలే తెలుగు ఎందుకు అని అడిగే పరిస్థితులున్నప్పుడు, అది నేర్చుకుంటే తెలుస్తుందని చెప్పడానికైనా నేర్చుకునే పద్ధతులు మెరుగైతే, ఆకర్షణీయంగా తయారైతే, తెలుగులో ఆరోగ్యకరమైన వినోదం అందిస్తే భాషాభ్యుదయానికి అవకాశం లభిస్తుంది కదూ?
భాషే కాదు, ఏ విషయం నేర్చుకోవాలన్నా చదవడం అనే అలవాటు అవసరం. ఆంగ్లంలో ఎన్ని భారతాలు ఉన్నా ఆంధ్రమహాభారతం చదివితే కలిగే ఆనందం ఆంగ్ల భారతాలు ఎన్ని చదివితే వస్తుంది? చదవాలంటే అక్షర జ్ఞానం కావాలి. అక్షరాలు అలవాటు కావాలంటే కూడా చదవాలి, తల్లి దండ్రులు పిల్లలతో కలిసి పుస్తకాలు చదవాలి.
చదువు అనే నవలలో కొ.కు. గారు రాసినట్టు, చూసి చూసి అక్షరాలు నేర్చుకోవడం నాకు స్వానుభవం – నా విషయంలోను, మా పిల్లల విషయంలోనూ. ఐతే మా పిల్లలు ఆంగ్ల వాతావరణంలో ఉండి ఆంగ్లం నేర్చుకున్నారు. నా కాలంలో అప్పటికింకా టీవీ రాలేదు, ఆంగ్లం అంత అందుబాటులో లేదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అందుకే ఇప్పుడు తెలుగు నేర్పే పద్ధతులు ఈ కాలానికి తగ్గట్టు ఏర్పరచుకోవాలి. చూస్తున్న కొద్దీ అర్థమైనా కాకపోయినా గుర్తులు మనసులో ముద్రించుకుపోతాయి. తర్వాత నేర్చుకునేటప్పుడు అవి సులభంగా వచ్చేస్తాయి. మూడు నాలుగేళ్ళ పిల్లలకు అక్షరాలు అర్థం కాని పిచ్చి గీతల వంటివే అయినా అక్షరాలతో పాటు వాటి ధ్వనిని ఉపయోగిస్తూ బొమ్మలూ, వస్తువులూ పరిచయం చేస్తే అవి వారి ఎదిగే మెదడుపై ముద్ర వేస్తాయి. అక్షరాభ్యాసం కాని పిల్లలతో కూడా కలిసి కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటే వారు బొమ్మలనే కాదు అక్షరాలనూ తెలియకుండానే గుర్తించడం అలవాటు చేసుకుంటారు. నేర్పేది అక్షరాలూ, గుణింతాలూ, వత్తులూ వంటి క్రమంలోనే అయినా.. చదువుతూ, పుస్తకాలూ, పటాలూ, సైను బోర్డులూ వంటి వాటి ద్వారా అన్ని అక్షరాలనూ, పదాలనూ చూపిస్తూ ఉండవచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అని నాణేనికి రెండో వైపున, అక్షరాలు నేర్వక ముందే అచ్చు పుస్తకాలు బొమ్మలు లేనివి, పెద్ద పెద్ద వాక్యాలూ, కఠినమైన పదాలూ, క్లిష్టమైన వాక్య నిర్మాణం, సంక్లిష్టమైన కథా వస్తువూ ఉన్న పుస్తకాలతో మొదలు పెడితే, అందునా ఈ కాలంలో, మొదటికే మోసం రావచ్చు.
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలకు ఆంగ్లం ఎన్ని రకాలుగా, ఎన్ని మాధ్యమాలలో పరిచయం చేస్తున్నామో దానితో పోటీ పడేలా తెలుగుని పరిచయం చేసి వారికి అసలు అభిరుచి ఏర్పడేందుకు దోహదం చెయ్యాల్సిన బాధ్యత తల్లి దండ్రులదే. ఇది భాషాభిమానం ఉన్నవారికీ, భాషతో తమ గుర్తింపు, అస్తిత్వం, వారసత్వం మొదలైనవి ముడిపడి ఉన్నాయనుకునే వారికీ వర్తిస్తుంది. తెలుగు చదవదం, రాయడం అవసరం లేదు, మాట్లాడితే చాలు అనుకునే వారికి ఈ వ్యాసం ద్వారా చెప్పదల్చుకున్నది ఏమీ లేదు. చెయ్యాలి అనుకునే వారే ఆలోచించాలి, తగు చర్యలను చేపట్టాలి కదా? తెలుగు నేర్చుకునే అవకాశం కల్పిస్తే అప్పుడు భాషతో అనుబంధం పెంచుకోవడం ఇక పిల్లల బాధ్యత అవుతుంది అని నా నమ్మకం. అంతేగాని తల్లిదండ్రులం కదా అని వారిదైన భాష నుండి వారిని వేరు చేసే అధికారం మాత్రం లేదనిపిస్తుంది.
ఇక తెలుగులో మాట్లాడడం అనేది కూడా చాలా అవసరమైన విద్యే. సాంకేతికంగా ఎదుగుతూ అందువల్ల సంబంధిత ఆంగ్ల పదజాలాన్ని విరివిగా అరువు తెచ్చుకుంటున్నాము. తెలుగులో మాట్లాడడం అంటే ప్రతి పదమూ తెలుగే ఉండాలి అన్న అసాధ్యమైన ఆలోచన వల్ల కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఒక పెద్ద పనిగా అనిపించడమూ అనుభవమే. తెలుగు నేర్చుకుని సగానికి పైగా ఆంగ్లం వాడటం ఎబ్బెట్టుగా అనిపించినట్టే మాటలు నేర్చే దశలో వాక్యం మొత్తం తెలుగు పదాలతోనే నిర్మించాలనుకోవడమూ దురాశే అనిపిస్తుంది. పద్యాలూ, పాటలూ వినడమూ, వినిపించడమూ, అనిపించడమూ కూడా నోరు తిరగడానికి కొంతలో కొంత ఉపయోగపడుతుంది. పద సంపద పెరిగేందుకూ దోహదం చేస్తుంది – ముఖ్యంగా ప్రవాసాంధ్రులకు. ఇక్కడ ఎదురయ్యే సమస్య పిల్లల వయసుకు, ఆలోచనలకు, వారికి ఈ రోజులలో ముఖ్యంగా దైవ, ధార్మిక విషయాలలో కలిగే అవగాహనకు సరిపోయే తెలుగు పద్యాలూ, పాటలూ తెలిసి ఉండడం, లేదా తెలుసుకునే మార్గాలు ఉండడం. అంతర్జాలంలో మాగంటి, ఆంధ్రభారతి, తెలుగుదనం, వంటి వారి సేకరణలు అమూల్యమైన నిధులు. కాస్త శ్రమపడి వెతికితే ఆణి ముత్యాలే దొరుకుతాయి. తరచూ పిల్లలతో కూర్చుని నెమరు వేసుకుంటుంటే భాష పెరుగుతుంది. అలాగే బంధం కూడా – భాషతోనూ, పిల్లలతోనూ.
అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడే లంకెలు ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఉండవచ్చనిపించిన లంకెలు తెలిస్తే తెలుగు4కిడ్స్ వారికి తెలియచేయవచ్చు. రంగనాయకమ్మ గారి “తెలుగు నేర్పడం ఎలా” వంటి తెలుగు పుస్తకాలతో సహా పిల్లల పుస్తకాల కోసం, AVKF వారిని సంప్రదించవచ్చు.
5 Responses to తెలుగు – పిల్లలు