జాలంలో శ్రమదానం

-వీవెన్

ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకుండా, మన (సామూహిక) అవసరాలను తీర్చుకోవడానికి కృషిచెయ్యడమే శ్రమదానం. ఈ శ్రమదానంలో ఓ ముఖ్య అంశమేమంటే, మన సమస్యలకు మనమే బాధ్యత వహించి, వాటి పరిష్కారానికి కార్యోన్ముఖులం కావడం.

మీ ఊరి రోడ్డు గతుకులుగా ఉంటే మీ ఊరి ప్రజలే పూనుకుని మొరం తోలి, రోడ్డుని చదును చేసుకునే కార్యక్రమం చూసే ఉంటారు. ఊరి చెరువులోనో, కాలువలోనో పూడిక తీసుకునే కార్యక్రమం కూడా గ్రామ ప్రజలే పూనుకుని చేయడం వినే ఉంటారు. వ్యక్తుల శ్రమదాన ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. చంద్రబాబు నాయుడు తన హయాంలో జన్మభూమి అని పేరు పెట్టి ఇలాంటి శ్రమదాన కార్యక్రమాలకు/పనులకు ప్రభుత్వ సహాయం కూడా అందించే పథకం అమలు పరిచాడు. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారంకాని సమస్యలు కూడా ఈ శ్రమదానాల వల్ల ఇట్టే జరిగిపోయేవి. విపత్తులూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తోటి జనమంతా ఏకమై, నష్టపోయిన ప్రాంతాల్లో జన జీవనాన్ని పునరుద్దరించడానికి పాటుపడటం చూస్తూనే ఉన్నాం.

జాలంలో తీసుకుంటే, వికీపీడియా లాంటి మహా విజ్ఞానం సర్వస్వం కూడా ఇలాంటి సమిష్టి కృషితోనే సాధ్యమైంది. అలానే ఫైర్‌ఫాక్స్ విహారిణి లాంటి అనేకానేక ఓపెన్ సోర్సు మృదూపరకణాలు కూడా ఎందరో వికాసకుల శ్రమదాన ఫలితమే. కంప్యూటర్ని నడిపే క్లిష్టమైన నిర్వాహక వ్యవస్థలు కూడా ఇలా సమష్టి కృషితోనే రూపొందుతున్నాయి.

అంతిమ వాడుకరులుగా మనం ఉపయోగిస్తున్న చాలా ఉపకరణాలు, పనిముట్ల తయారీలో మనమూ పాలుపంచుకోవచ్చు. జాలం వల్ల సాధ్యపడినవాటిలో ఒకటి – భౌగోళిక హద్దులు చెరిగిపోయి, ఏ ప్రాంతం వారైనా వారున్నచోటినుండే పరస్పరం సంభాషించుకోగలిగే సౌలభ్యం. దీని వల్ల వివిధ ప్రాజెక్టులలో ఎవరైనా భాగస్వాములు కాగలిగే అవకాశం వచ్చింది.

కంప్యూటర్లలో మరియు జాలంలో తెలుగు వికాసాన్ని చూడాలనుకునే వారు చేయదగిన శ్రమదానం: పలు తెలుగు ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం. తెలుగు వికీపీడియా దగ్గరనుండి వివిధ ఉపకరణాల స్థానికీకరణ వరకూ అందరూ పాలుపంచుకోవచ్చు.

కేవలం మనలాంటి వారి శ్రమదానం వల్లే, తెలుగు వికీపీడియాలో ఇప్పటికి 40 వేల పైబడి వ్యాసాలు పోగయ్యాయి. వ్యాసాలు రాసే స్థాయి లేదనుకుంటే, అచ్చుతప్పులను సరిదిద్దడమైనా చెయ్యవచ్చు.

మనమందరం వారానికి కనీసం ఓ గంట ఈ శ్రమదానానికి కేటాయించడం ద్వారా చాలా సాధించవచ్చు.

తాజాకరణ (అక్టోబర్ 1, 2008): వివిధ ఉపకరణాలని తెలుగులో స్థానికీకరించడానికి జాలంలోని గూళ్ళు.

This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.