స్వేచ్ఛా విహంగాలు (Stray birds)

— విశ్వకవి రవీంద్రుని ‘Stray birds’కు స్వేచ్ఛానువాదం: రవి

భగవంతుడి శక్తి మలయమారుతానిది.
ఝంఝామారుతానిది కాదు.

విశ్వం బాధతో నా ఆత్మను చుంబించి,
సాంత్వన కోసం నా గానాన్ని కోరింది.

ఓ స్త్రీ! నీ నవ్వులో జీవితమనే జలధారలోని సంగీతం ఉంది.

జీవితపు ఆనందం గ్రీష్మంలో పూచే పూలలోనూ,
శిశిరం లో రాలే ఆకులలోనూ ప్రక్షిప్తం.

నీకు ఆకలి లేదని, భోజనాన్ని నిందించకు.

నువ్వు చిరునవ్వు నవ్వి శూన్యం గురించి మాట్లాడేవు.
అందుకోసమేనేమో నా నిరీక్షణ అని నాకనిపించింది.

తర్కపూరిత చిత్తం కత్తితో సమానం.
ఉపయోగించే చేతికది చేస్తుంది గాయం.

మనం ప్రపంచాన్ని వక్ర దృష్టి తో చూసి,
ప్రపంచం మనను మోసపుచ్చిందనుకుంటాం.

కడలి తరంగాలు, పక్షుల కలయికలా మనం దగ్గరౌతాం.
పక్షులు నింగికెగసి పోతాయి.
కడలి తరంగాలు వెనక్కు మళ్ళుతాయి.
మనమూ అలానే దూరమవుతాం.

——————
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు.
గతంలో ఇతర వెబ్‌సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు.

తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

11 Responses to స్వేచ్ఛా విహంగాలు (Stray birds)

Comments are closed.