-రానారె
“ఆస్వాదించడంతో పాటే అభినందించడమూ నేర్చుకోవాలి. బహుశా నాకిది చిన్నప్పణ్ణించీ కచేరీలకి వెళ్ళడం వల్ల కొంత అలవాటైంది అనుకుంటా. కచేరీ జరుగుతూ ఉండగానే … భలే, శెబాష్ అంటూ ఉండటం, కచేరీ ఐపోయాక, పాడిన వారి దగ్గిరికి వెళ్ళి నచ్చిందని చెప్పడం .. మా అమ్మ నవ్వేది .. ఒరే అంత పెద్ద గాయకులైన ఆయన దగ్గిరికి నువ్వెళ్ళి చెప్పక పోతే తనకి తెలీదా తాను చాలా బాగా పాడుతున్నానని అని. నేను ఒప్పుకోలేదు. ఆయన ఎంత విద్వాంసుడైనా .. ఎప్పటికప్పుడు .. రసికుడు ఎంత చిన్నవాడైనా .. బాగుంది అనే కామెంటు కళాకారుడి మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. నేనిది మహామహుల ముఖాల్లోనే ప్రత్యక్షంగా చూశాను.
ఇక రచయితల విషయానికి వస్తే .. కవులూ రచయితలూ ఇదివరకు తమ రచనని తామే గానం చేసి వినిపించేవారు. మెప్పో తప్పో సభాముఖంగా పొందేవారు మిగతా కళాకారుల్లాగే. కానీ ప్రింట్ మీడియా వచ్చాక వీళ్ళు పాఠకులకి దూరమై పోయారు. అభిమానుల ఉత్తరాలు తప్పించి రచయితకి feedback అందే అవకాశం లేదు.
ఈ నాడూ మళ్ళీ అంతర్జాలం పుణ్యమా అని రచయితా పాఠకుడూ ఒకే లెవెల్ మీద తారసిల్లుతున్నారు. పాఠకుడి ముఖతః రచయిత వినే అవకాశం యిప్పుడున్నది. అది బాధ్యత గల పాఠకుడు తప్పక వినియోగించుకోవాలి. ఇందులో యింకో సూక్ష్మం ఉంది. సమాజపు తీరుకి భిన్నంగా ఒక ఇతివృత్తంతో రచనేదైనా (కథ అనుకో) వచ్చినప్పుడు, ఆ కథ రాయడానికి రచయిత చాలా మథనపడి ఉంటాడని మనం గ్రహించొచ్చు. ఎందుకంటే అటువంటి రచన మనం చెయ్యాలంటే మనం ఎంత మథన పడతామో కదా! కానీ కొన్ని సార్లు అటువంటి రచనలు అవసరం. మనం ప్రోత్సహిస్తే తప్ప రచయితకి అది తెలిసే అవకాశం లేదు. మళ్ళీ అటువంటి రచనలు చేయలేడు. ప్రోత్సహిస్తే, పదిమంది దాన్ని గురించి మాట్లాడితే … మిగతా రచయితలు కూడా దాన్ని గురించి రాసే ధైర్యం చెయ్యొచ్చు.”
కృతజ్ఞత, అభినందన మొదలైన భావాలను వ్యక్తపరచడం గురించి చాలా రోజుల క్రితం జరిగిన ఒక తేలికపాటి సంభాషణలో నాతో ఒక మిత్రుడు చెప్పిన కొన్ని మాటలివి.
————
ప్రముఖ మిమిక్రీ కళాకారుడైన నేరెళ్లవేణుమాధవ్ ఒకసారి పాకిస్తాన్ పర్యటనలో ఒక టాక్సీలో ప్రయాణిస్తుండగా ఆయన ప్రజ్ఞను మాటల సందర్భంలో గ్రహించిన ఆ టాక్సీడ్రైవరు ఆయనతో మాటలు కలిపి, అప్పటి మన హిందీనటుల గొంతుకలను కూడా అడిగి అనుకరింపజేసి విని ముగ్ధుడై, “అయ్యా, మీ వద్ద గొప్ప విద్య వుంది. నిన్ను ఓదార్చేవారివద్దనే యేడవమని – మా పెద్దలు ఒక సామెత చెప్పేవారు. తమ ప్రజ్ఞపై కలిగిన అభిమానంతో తమకిది చెప్పాలనిపించింది.” అన్నాడట. ఒక ఆదివారం రేడియోలో బాలల కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకొంటూ మరచిపోలేని ఒక అనుభవంగా ఈ ఘటనను చెప్పుకొచ్చాడాయన.
దీన్నిక్కడ ఎందుకు ఉదహరిస్తున్నానంటే – అంతర్జాలంలో, జాలపత్రికలలో, ముఖ్యంగా బ్లాగులలో ఒకే వేదికపై తారసిల్లుతున్న రచయితకు, పాఠకుడికి ముఖాముఖి పరిచయం, దాని పర్యవసానాలు చర్చించదగిన అంశమే కనుక, వేణుమాధవ్ గారు ఉటంకించిన మాటలు ఈ సందర్భంగా ఇద్దరికీ పనికొస్తాయని. ఇందులో, ఇటు రచయితా, అటు పాఠకుడూ కూడా ఈ సౌకర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది ఇప్పుడు ఎవరికివారు నేర్చుకోవాలి.
————
పెదవి దాటితే, పృథివి దాటుతుందనే సామెత అంతర్జాలంలో అక్షరసత్యం. మనకంటూ, అంతర్జాలంలో ఓ విలాసం వచ్చాకా, మన విలాసాలు, విన్యాసాలు కాస్త గమనించుకోవాలి. మన అభిప్రాయాలు, ఆలోచనలూ అందరికీ నచ్చకపోవచ్చు, చాలామందికి నచ్చవు కూడా – వారు నచ్చడం, నచ్చకపోవడమనేది వారికిష్టమైన రీతిలో తెలియజేస్తారు. ఓ సారి బ్లాగంటూ మొదలెట్టాకా, మనమీద విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు తప్పనిసరిగా ఎప్పుడో ఓ సారి వస్తాయి, తప్పదు. వీటిని చూసి భయపడి బ్లాగు మూసేసుకోవడమో, లేకపోతే – ప్రతి విమర్శకూ తీవ్రంగా స్పందించటమో మొదలెడితే – మనకే ఇబ్బంది, సమయం వృధా.
మీబ్లాగులో ఉన్న కంటెంటుకంతటికీ, కామెంట్లతో సహా – మీరే బాధ్యులు. ఎటువంటి కామెంట్లు వస్తాయి అనేది మీరు రాసే అంశాలపై, మీ శైలిపై, సాధారణంగా – మీరు వ్యాఖ్యలకి, మిగిలిన బ్లాగర్లతో ఎలా వ్యవహరిస్తారు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
టపా రాయగానే – ఇది ఎటువంటి స్పందనలని కలుగచేస్తుందో, టపా పోస్టు చేసేముందు ఓసారి ఆలోచించుకోవటం ఉత్తమం. మరీ వివాదస్పదమయ్యే అంశాలు కనిపిస్తే, భాషని గాని, దానిని రాసే, చెప్పే పద్దతిని గాని కొంచెం మార్చుకొంటే, చాలా వరకూ వ్యక్తిగత విమర్శలని, దాడులని తప్పించుకోవచ్చు. వీలైతే, మీ టపాని – పోస్టు చేసేముందు కొంతమంది స్నేహితులకి అభిప్రాయంకోసమో, సమీక్షకోసమో పంపితే ఇంకా మంచిది.
ఏదైనా టపా ఆవేశంలో రాస్తే, ఓ మూడు రోజులాగి పోస్టు చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవటం మేలు. చాలాసార్లు, మన కోపం తగ్గగానే, మనం రాసింది మనకే అసహ్యంగా అనిపిస్తుంది. తనకోపమె తన శత్రువు అని మరవవొద్దు.
బ్లాగులో, మీరు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు అనేది ఒక పాలసీగా పెట్టుకొంటే – అది మీకు, పాఠకులకి కూడా చాలా ఉపయోగం.
వచ్చిన ప్రతి వ్యాఖ్యకూ వెంటనే స్పందించటం – వ్యాఖ్య రాసినందుకు నెనర్లనో, వ్యాఖ్య నచ్చకపోతే దానిపై ప్రతివ్యాఖ్యో రాయటం. ఈ పాలసీ ఉన్నప్పుడు, వ్యాఖ్య కనిపించగానే స్పందించడం కాకుండా – ఓ రెండు మూడు రోజులాగి అన్ని వ్యాఖ్యలు ఓసారి చదువుకొని, అప్పుడు సమాధానం రాయటం మంచిది. ఇందులో ఒక లాభమేమిటంటే, ఒకవేళ ఎవరైనా ఘాటుగా దాడికి దిగితే, మీకన్నా ముందే వేరే వారెవ్వరైనా ఆ వ్యాఖ్య రాసిన వారిని వారిస్తూనో, మరోవిధంగానో మీకు సపోర్టు చేసే అవకాశం చాలా ఎక్కువ – అందువల్ల, మిమ్మలని మీరే సమర్ధించుకొనే తలనొప్పి తగ్గుతుంది.
అసలు ఏ వ్యాఖ్యకూ స్పందించకపోవడం – దీనివల్ల, మీకు వచ్చే వ్యాఖ్యల సంఖ్య తగ్గుతుందేమో కాని, తుంటరివ్యాఖ్యలు – కేవలం మిమ్మలని రెచ్చగొట్టడానికి మాత్రమే రాసే వ్యాఖ్యలు తగ్గుతాయి. ఈ బ్లాగరు ఎలాగు ఏ వ్యాఖ్యకి సమాధానం రాయడు అని ఓ ముద్ర పడిపోతుంది గదా – ఇలాటి వారితో తుంటర్లు టైము వేస్టు చేసుకోరు.
వ్యక్తిగతమైన దాడులు ఉన్న వ్యాఖ్యాతలకి మాత్రం స్పందించకపోవడం. దీనివల్ల – పోను, పోనూ మీ గౌరవం పెరుగుతుందేగాని తగ్గదు. కొంతమంది వారి అభిప్రాయాలని ప్రశ్నల రూపంలో సంధిస్తారు – ఇటువంటి వ్యాఖ్యలే, చాలా వరకూ చర్చలని లేవదీస్తాయి. ప్రశ్న వేరు, అభిప్రాయం వేరు.
మీరు ఎంత సంయమనం పాటించినప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని నొప్పించే వ్యాఖ్యలు రావొచ్చు. బ్లాగంటూ ఒకటి మొదలు పెట్టాక ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనడం మొత్తంమీద బ్లాగరుకు, ఒకోసారి వ్యాఖ్యాతకు కూడా అంతిమంగా మంచి చేసే అనుభవమే. నెటిజనుల ముందుకొచ్చి, ఓ నాలుగుముక్కలు రాయటం, ఆ రాసిందానివెనక నిల్చోడంలో ఉన్న కష్టమేమిటో తెలీనివాళ్ల వ్యాఖ్యల సంగతి ఇది. ఈ మధ్యకాలంలో – బ్లాగులు లేకపోయినా, కేవలం కామెంట్లు రాసేవాళ్ళు ఎక్కువమందే ఉన్నారు. ఇది శుభ పరిణామమే!
సదుద్దేశంతో చేసే విమర్శ కూడా సరిగ్గా రాయకపోవడం వలన ఒక్కోసారి మనస్తాపం కలిగించిన సందర్భాలున్నాయి. సదుద్దేశంతో చేసిన విమర్శను బ్లాగరి సరిగా అర్థం చేసుకోలేక ఆవేశంగా స్పందించిన సందర్భాలూ వున్నాయి.
ఆవేశంలో టపాలుగానీ, వ్యాఖ్యలుగానీ రాసేముందు గుర్తుంచుకోవలసింది చట్టం చేతులు చాలా పెద్దవని కూడా. సైబర్ నేరాల చిట్టాలో ఏమేమున్నాయో తెలియదుగానీ మన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకుండే చట్టపరమైన పరిమితులు వెబ్బులో కూడా వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. సభ్యతా మరియు నైతిక పరిమితులను ఉల్లంఘించడం, కోర్టుధిక్కారం, ఇతరులను నిందించడం, పరువునష్టం కలిగించడం, వ్యక్తులనుగానీ, సమూహాలనుగానీ రెచ్చగొట్టేవిధంగా రాయడం, దేశసమైక్యత, సార్వభౌమత, దేశరక్షణ, ఇతరదేశాలతో ఉండే స్నేహసంబంధాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే రాతలు రాయడం ఇవన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటిని గుర్తెరిగి మసలుకోవడం బ్లాగరులకు విధాయకం.
అంతర్జాలంలో తెలుగు రచన వెలుగొందుగాక!
27 Responses to క్షణికమ్