సురేఖ మళ్ళీ నవ్వింది. “ఆర్నెళ్ళ పసివాడికి కాన్సర్ ఎందుకొస్తుందంటే ఏం చెపుతావు? సుబ్బారావు కూడా పసివాడే కదా! అందుకే వచ్చుంటుంది.” అంది కాళ్ళు ముడుచుకుని. చీరని పాదాలమీదికి లాక్కుంది. పాలవంటి ఆ తెల్లటి పాదాల దగ్గర బంగారు రంగు పట్టీలు మెరుస్తున్నాయి.
“అయితే ఏమంటున్నారు డాక్టర్లు?”
“ఏమన్నారు? అతడు బ్రతకడానికి మూత్రపిండం కావాలన్నారు. ఎవరిస్తారు సుబ్బారావుకి. అందుకే నేనే యిచ్చా.” అంది సురేఖ.
“నువ్విచ్చేవా మూత్రపిండం సుబ్బారావుకి?” బాధగానూ, ఆశ్చర్యంగానూ అడిగా.
“మరి నేనతడి దేవతని కదా నేనివ్వక మరొకరినివ్వనిస్తానా?” అని, మళ్ళీ తనే స్వగతంలో అనుకుంటున్నట్టుగా, “సుబ్బారావు ప్రేమని సంపాదించగలిగిన నేనెంతటి ధన్యురాలిని?” అంది.
“అయితే యిప్పుడెలా వుంది?” అన్నా ఆతృతగానే.
“ఆయనకేం మహారాజు. వెంటనే కోలుకున్నాడు. నాకే గ్యారంటీ లేదన్నారు డాక్టర్లు.”
“ఏమన్నారు?” శరీరం గగుర్పాటు చెందగా ప్రకంపించిపోతూ అడిగాను.
“బ్రతకనన్నారు. చూసేవా? కంటి ఆపరేషన్ లో నెగ్గుకు రాగలిగేను గానీ ఇక్కడ ఓటమి తప్పలేదు.”
నా చిరకాల నేస్తం మృత్యువు పాలవబోతుందన్న విషయం నన్ను నిర్వీర్యుడ్ని చేసింది. శోకోన్మత్తత నా శరీరాన్ని ముప్పిరిగొనగా నేనామె తల దగ్గర కూర్చుని ఆమె నుదుటిమీద చెయ్యేశా.
సురేఖ నవ్వింది. “చూశావా! నీలో ప్రేమని ఈనాటికి నాతో చెప్పుకోగలిగావు.” అంది, నా చేతిని తన రెండు చేతుల్తో ఆప్యాయంగా పట్టుకుంది.
నేను నాచేతిని గబుక్కున లాక్కోబోయి, ఏదో అనుమానం వచ్చినవాడిలా ఆమె కళ్ళలోకి చూశాను.
“నీ ప్రేమ గురించి నాకు తెలుసు. నా ఈ శరీరం మీద నీకున్న వ్యామోహం, ఆకర్షణ ఎంత బలమైనవో కూడా నాకు తెలుసు.” అంది సురేఖ.
కన్నీరు తుడుచుకుంటూ ఆమె వైపు చిత్రంగా చూశా.
“నిజమే. ఓ పదినిముషాలపాటు ఈ శరీరాన్ని నీకు అర్పించుకునివుంటే ఈ ప్రపంచానికేం నష్టం. నాకూ పోయేదేముందిగానీ, ఆ పని చేయను ఈ శరీరం మీద నాకేం అధికారం వుందని. ఈ శరీరం నాదీ నీదీ కాదు. సుబ్బారావుదే!” అంది మళ్ళీ కన్నీరు పెట్టుకుంటూ.
నేనామె వైపు నిశ్చలంగా చూస్తున్నాను.
“కోర్టులకెళ్ళి మంచోళ్ళతో విడివడిపోవడమే తెలుసుగానీ మొద్దుమాలోకం ఈమెకేం తెలుసు ప్రేమ గురించి అనుకుంటున్నావు. కదూ?” తల పక్కకు వాలుస్తూ ప్రశ్నించింది. మెడ ప్రక్కన పుట్టుమచ్చ ఆమెమీది ప్రేమతో అక్కడే ఆమె చర్మాన్ని కౌగిలించుకుని అందంగా కన్పించసాగింది.
‘కాద’న్నట్టు తలూపాను. అంతటి బాధలోనూ.
“నిజంగానే నాకు తెలీదు. పెళ్ళయినాక సుబ్బారావే చెప్పాడు ఒకరోజు. నీ కళ్ళూ, నీ చూపులూ, నన్ను ఆరాధించే తత్వం కలిగివుంటాయట. నువ్వు కూడా తనలాగే నా భక్తుడివట. భర్త ఎవరైనా భార్యకట్లా చెపుతాడా? అంతటి ఉదార హృదయుడూ, మంచివాడూ, తెలివైనవాడూ సుబ్బారావు.” అంది.
అంత విషాదంలోనూ నేను దిగ్భ్రాంతికి గురయ్యా.
సురేఖ మాట్లాడుతూనే వుంది.
“చూశావు గదూ? ఎన్ని కన్నీళ్ళు పెట్టించాను సుబ్బారావు చేత! అవన్నీ యిప్పుడు నన్ను చుట్టుముట్టాయి” అంది– కన్నీటిని వ్రేలితో తొలగిస్తూ.
పశ్చాత్తాపంలో ప్రక్షాళన పొంది ఆమె కన్నుల నుండి జాలువారుతున్న అశ్రుధారలు అవి. నాకెందుకో అవి నాకలా అన్పించలా. పవిత్ర తీర్ధంలా తోచాయి.
“నేను సుబ్బారావుతో విడిపోయినందుకు పశ్చాత్తాపపడుతున్నా ననుకుంటున్నావు నువ్వు. లేదు. ఆ విషయంలో నేనెప్పటికీ వెనక్కి చూసుకోడమనేది లేదు. స్త్రీ అనే పదం యిక్కడెందుకుగానీ, వ్యక్తిగా అతడితో సంబంధం వదులుకుని నేను నా ఆత్మగౌరవం కాపాడుకున్నాననే భావిస్తా. మరి ఈ ప్రేలాపన, ఈ మూత్రాపిండాల దానం యివన్నీ ఎందుకంటావా? మానవత్వంగల మనిషిగా నా క్షేమంకోసం పరితపించిన సుబ్బారావు మీద నాకు అచంచలమైన భక్తి. అలాగే దయ కూడా” సురేఖ దుఃఖాన్ని నిగ్రహించుకుంది. “అన్నట్టు నిన్నెందుకు పిలిపించానో తెలుసా?” అడిగింది.
“తెలీదు.” అన్నా.
“సుబ్బారావుకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అతడు బతుకుతాడు. నాకు తెలుసు. కానీ, ఒకవేళ దురదృష్టం వెన్నాడి అతడికేదైనా అయితే. . .?” సురేఖ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
“ఏదైనా అయితే బాబు బాధ్యత నన్ను తీసుకోమంటావు. అంతేకదా?” అనడిగా.
“అంతేగాదు. బాబు పేరు కూడా మార్చాలి నువ్వు.”
“అలాగే. ఏం పేరు పెట్టమంటావు చెప్పు.” అన్నా. వంగి, అనునయంగా ఆమె తలమీద చెయ్యేస్తూ.
“ఇంకేం పెడతావు? సుబ్బారావని పెట్టు. అంతకుమించిన అందమైన పేరు తెలుసా నాకీ లోకంలో. తండ్రి గుణంలో సగం లక్షణాలొచ్చినా చాలు. మెరుపులా బ్రతికేస్తాడు నా బాబు.” అంది సురేఖ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
“అలాగే. సురేఖా!” అన్నా దుఃఖోద్విగ్నుడనై ఓదార్పుగా ఆమె చేతుల మీద నేను చెయ్యేస్తూ.
క్షణం తర్వాత సురేఖ మళ్ళీ, “నేను ఇతివృత్తం చెబితే కథ రాస్తానంటావుగా. ఇప్పుడు రాయి కథ” అంది.
ఆమె చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడలేదు.
మళ్ళీ సురేఖే అంది. “నా బ్రతుకే నీ కథకి ఇతివృత్తం. రాయి. బహుశా మంచి కథవుతుందనుకుంటా” అటువేపు తిరిగి కన్నీరు విడిచింది.
నేను మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె మాట నాకేమీ తప్పుగా అన్పించలా. నిజంగానే జీవితాన్ని కథకి కావలసినంత అతిశయంతో నింపుకుంది సురేఖ. కాదంటారా?
————-
(నా కథలు చదివి, అభినందించి, నన్ను ప్రోత్సహించి, ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాచేత కథ రాయించిన “కల్హార” బ్లాగు రచయిత్రి ‘స్వాతి’గారికి కృతజ్ఞతలతో_రచయిత)
వింజమూరి విజయ్ కుమార్ గారు పుట్టింది పెరిగింది నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామం. భాగ్యనగరంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో సీనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం. http://abhinayani.blogspot.com అనే తన బ్లాగులో రాస్తూంటారు. కథకుడిగా ప్రముఖ తెలుగు పత్రికలలో బహుమతులు అందుకున్నారు. కథలు, చిత్రలేఖనం, తత్వమీమాంస అభిరుచులు. ‘పనిగట్టుకు సేవాకార్యక్రమాలు చేసే అవసరం లేకుండా, వృత్తిలో భాగంగానే పదమూడేళ్ళుగా డిప్యుటేషన్ పై సచివాలయంలో మంత్రుల ఆఫీసుల్లో పనిచేస్తూ, పదిమందికీ సేవచేసే భాగ్యం నాకు కలిగింది’ అని అంటారాయన.
17 Responses to అహంకారి