అహంకారి

-వింజమూరి విజయ్ కుమార్
సురేఖ విడాకులిచ్చిన భర్తని పొగుడుకోడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది.

“మరేమిటి. స్త్రీ వ్యసనం. . .?” నేనింకా మాట పూర్తిచేయనేలేదు.

సురేఖ అందుకుని, “నేనంటే పిచ్చిప్రేమ సుబ్బారావుకి. నిజానికి అతడు నా భర్త కాదు. భక్తుడు.

“నేను సుబ్బారావుకి విడాకులిచ్చేశాను.” అంది సురేఖ నాతో ఫోన్లో.

నాకు మొదట్లో అర్థంగాక, “ఏమిటీ నువ్వన్నది?” అన్నాను.

“నేను సుబ్బారావుతో డైవోర్స్ తీసుకున్నానని చెబుతున్నా.” అంది సురేఖ మళ్ళీ, కంఠస్వరం పెంచి.

నేను దిగ్భ్రాంతి చెందాను. నాలుగు క్షణాలపాటు మౌనంగా వుండిపోయా.

ఆపైన, “ఎందుకు. ఏమైంది?” అన్నా అతృతగా.

“అవన్నీ ఫోన్లో చెప్పేవిగాదు. నువ్వు వీలయినంత త్వరగా విజయవాడ వచ్చెయ్. నీతో మాట్లాడాలి.” అంది సురేఖ.

“వస్తాలేగానీ, ముందు ఏమైందో చెప్పు?” అన్నా మళ్ళీ.

“ఫోన్లో చెప్పేవి కాదన్నానా? నువ్వు ఇక్కడకి రా ముందు.” ఆమె ఫోన్ పెట్టేసింది.

సురేఖ నోటి నుండి ఈ విడాకుల ఉదంతం తెలుసుకున్నప్పుడు నేను దిగ్భ్రాంతి చెందినమాట నిజంగా సత్యమే. ఎందుకంటే సురేఖ జీవితాన్ని చేజేతులా పాడుజేసుకునే వ్యక్తి కాదు. అంటే దీనర్థం సురేఖ ఎంతటి ప్రతికూల పరిస్థితిలోనైనా నెగ్గుకు రాగల సూక్ష్మగ్రాహ్యత గల స్త్రీ అనే గానీ, భర్తతో విడాకులు తీసుకునే వాళ్ళంతా బ్రతుకుని చేజేతులా పాడుజేసుకునే వాళ్ళని కాదు.

విజయవాడలో ‘మెడిసిన్’ చేస్తున్నప్పుడు సురేఖ నా క్లాస్ మేటు. మంచి స్నేహితురాలు. అందరు ఆడపిల్లలకి మల్లే సురేఖ సాదాసీదా వ్యక్తి కాదు. విశిష్టమైన రూప సంక్లిష్టాన్ని జన్మతః వెంటదెచ్చుకున్న స్త్రీమూర్తి. జిలుగురంగులతోనూ, వంపుగీతలతోనూ స్త్రీల శరీర భంగిమలనూ, చక్కదనాల ముఖాల చిత్రికలనూ రవివర్మ ఎంత శ్రమకోర్చి రచించినా, వాటిలో జీవాంశమైన ప్రాణం లేకపోవడంవల్లనేమో వాటితో సమానంగా సురేఖ రూపచందాల్ని పోల్చడానికి నాకెందుకో మనసొప్పేదిగాదు. అందుకే నేనామెకి బ్రిటీష్ యువరాణితోనూ, మొగల్ మహరాణితోనూ పోలికపెట్టేవాడిని.

నేనన్నట్టే సురేఖ నిజంగా ఇక్కడి లోకపు వ్యక్తిగాదు.

ఎందుకంటే ఆమె నడవడికలో ఒక విధమైన రాజసం ఎప్పుడూ వెన్నాడుతుండేది. అది నిరంతరం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనూ వుండేది.

ఇప్పుడైతే నేను వృత్తిరీత్యా హైదరాబాదులో జీవించవలసివచ్చింది గానీ.. నాదీ, సురేఖదీ స్వస్థలం విజయవాడే. ఆమె తండ్రి దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. తల్లి యింటిపట్టునే వుండేది. సురేఖ ఒక్కగానొక్క కూతురు గనుక సహజంగానే గారాబంలో పెరిగింది.

వాళ్ళకి ఓ కారు వుండేది. ఆ కారులో నన్ను కూర్చోబెట్టుకుని సురేఖ విజయవాడంతా కలియదిరిగేది. తక్కువగానే మాట్లాడినా ఆమె మాటలు ఒక తరంనాటి మానసిక పరిణతిని కలిగివుండేవి. కవిత్వమూ, కథలూ రాసేది. అవన్నీ నాకు విన్పించేది. నన్నూ రాయమని బలవంతపెట్టేది. “ఇతివృత్తం నువ్వు చెప్పాలేగానీ, కథ రాయడం నాకో పనికాద”ని సరదాగా నవ్వుతూ, ఆమె మాటలు కొట్టిపడేసేవాడిని. నాతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ, కార్లో మేం ఎన్ని షికార్లు కొట్టినప్పటికీ రోడ్డు ప్రక్కన ఏ కొబ్బరినీళ్ళో, కూల్ డ్రింకో తాగి సరిపెట్టేదే గానీ, సురేఖ ఏనాడూ నాతో కలసి కనీసం కాఫీ హోటల్ వరకైనా వచ్చి ఎరగదు. ఆమె అభీష్టానికి భిన్నంగా నడుచుకోవడం నాకూ రుచించేది కాదనుకుంటా. నేనూ అటువంటి చవకబారు వేషాలకు ఆమెను బలవంతపెట్టేవాడిని కాదు. నాలోని ఈ లక్షణం కూడా మా స్నేహం బలీయమవడానికి ఒక ప్రధాన కారణమనుకుంటా.

ఆమె మాటలతో తర్కిస్తూ, ఆమె సౌందర్యాన్ని అవలోకిస్తూ ఆమెతో నా చెలిమిని ‘మెడిసిన్’ పూర్తయేంతవరకూ సాఫీగానే సాగనిచ్చా. అంతలోనే మా చదువు పూర్తవడం, ఏదో ప్రళయకాలం ముంచుకొస్తున్నట్టు సురేఖ తల్లిదండ్రులు, సాప్ట్ వేర్ ఇంజనీరు సుబ్బారావుతో ఆమె పెళ్ళి జరిపించేయడం రెండూ జరిగిపోయాయి.

సురేఖ ఈ అకస్మాత్తు వివాహం నన్ను కృంగదీసిందనే చెప్పాలి. స్నేహితురాలి లోటు బాగానే తెలిసొచ్చింది. అయినా కాలం బలీయమైనది. మరపు మహత్తరమైనది. ఏడాది తిరగకుండానే నేనూ గాయత్రిని పెళ్ళి చేసుకోవడం, హైదరాబాదుకి మకాం మార్చి ఓ కార్పొరేటు హాస్పిటల్ లో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడిపోవడం అంతా జరిగిపోయింది.
పెళ్ళయినంత మాత్రాన సురేఖ నన్ను మర్చిపోలేదు. వారానికోసారైనా సురేఖ, సుబ్బారావులిద్దరూ నన్నూ, గాయత్రినీ పలుకరించి, పరామర్శించేవారు. పెళ్ళయిన ఏడాదికే వాళ్ళకి ఓ బాబు పుట్టాడు. వాడికిప్పుడు నాలుగేళ్లు.
అయినా, ఐదేళ్ళ సంసార జీవనం గడిపాక కూడా సురేఖ, సుబ్బారావుతో విడిపోవడం నా ఊహ అందుకోలేని విషయం. ఎందుకంటే, సురేఖది సరళమైన జీవితం. ఆ జీవితం యింత పెద్ద మలుపు తీసుకోవడానికి సురేఖ అనుమతించదు. అయినా ఆమె జీవితంలో ఈ వైచిత్రికి చోటు దొరకడం ఏమిటో నాకు భోదపడలేదు.

ఏమైనా, ఆ తెల్లవారే విజయవాడ వెళ్ళదలచుకున్నా.

* * *

“చెప్పు సురేఖా!” అన్నాను. టీ తాగడం అయినాక. కప్పు టీపాయ్ మీద ఉంచుతూ.

“అతడితో కలిసి జీవించలేననిపించింది. అందుకే దూరం జరిగా.” అంది సురేఖ తలొంచుకుని. ఆమె నా ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆర్గండీ కాటన్ సెల్వార్ కమీజ్ వేసుకుని వుంది. బంగారు వర్ణంలో వున్న మెడమీద అదే వర్ణంలో వున్న గోల్డు చెయిన్ తళుక్కుమని మెరుస్తోంది—తనలోని లోహతత్వాన్ని తెలుపుకుంటూ.

“ఏమైంది? సుబ్బారావు బాధలుపెడ్తున్నాడా?” అన్నా.

ఆమె ‘ఔన’న్నట్టు తలూపింది. ఆపైన ముఖం పక్కకి తిప్పుకుంది. కలువరేకుల వంటి ఆ కనుల కొలనుల్లో నీళ్ళు మెరుస్తున్నాయి. అనాదినుండీ స్త్రీ విలాపానికి చిహ్నంగా ఆమె వెన్ను విరిచి బయటకు పొర్లుకొచ్చే విషాదపు కన్నీళ్లు -మళ్ళీ మెరుస్తున్నాయి.

నేను క్షణం సేపు మాట్లాడలేదు. తర్వాత, “తిట్టడం కొట్టడం లాంటివి చేసేవాడా?” అన్నా.

సురేఖ నవ్వింది విషాదంగా. నా వేపు తిరిగి, “హింసంటే గిట్టదు సుబ్బారావుకి. అది శారీరకమైనా మానసికమైనా. అయినా సుబ్బారావు అనాగరికుడు కాదు కొట్టడానికీ, తిట్టడానికీ.” అంది. సన్నగా, నేర్పుగా కత్తిరించబడిన ఆమె కనుబొమలు భృకుటివద్ద విచ్చుకున్న రేకుల్లా విడివిడిగా కన్పిస్తూ, ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.

“మరి. తాగుడు, డ్రగ్స్ లాంటి అలవాట్లు. . .?”

“అటువంటివీ లేవు. అతడు టీ తాగడంకూడా నేను చూసెరగను–మా పెళ్ళయిన తర్వాత.” అంది . నుదుటిమీది నల్లటి చిన్న ఫ్యాన్సీ బొట్టుని తీసి, చూపుడు వేలుతో మళ్ళీ అతికించుకుంది. అక్కడి నుదుటిమీది చర్మం బిగుతుగా కాంతివంతంగా మెరుస్తోంది.

“పోనీ డబ్బాశతో పేకాట, గుర్రప్పందాలూ వంటివి?” సుబ్బారావు అంతమాత్రం మనిషి కాదని తెలిసినా కావాలనే అడిగాను.

ఆ మాట సురేఖకి కోపం తెప్పించినట్టుంది. పలుచనైన ఆమె చెంపలు కోపంతో రక్తాన్ని నింపుకుని గులాబీ వర్ణం దాల్చాయి. ముక్కు చక్కదనానికి తామేమీ తీసిపోమని ముక్కుపుటాలు సరిపడినంత వంపుని తీసుకుని పెదిమల పై భాగంలో చర్మంలోకి చొచ్చుకుపోయాయి. క్షణం తర్వాత ఆమె మామూలుగా అయిపోతూ..

“అవీ లేవు. ఒకవేళ గుర్రప్పందాలకని వెళ్ళినా డబ్బు సంపాదించగలడే గానీ, పోగొట్టుకుని వచ్చే మనిషిగాదు సుబ్బారావు. నువ్వు నమ్మలేవేమో గానీ రేస్ కోర్స్ లో గుర్రాల జాతుల దగ్గర్నుండి, ట్రాక్ మీద కిలోమీటర్ దూరానికి ఎన్ని లెంగ్తులో, ఏ గుర్రం ఎన్ని మైక్రో సెకన్లలో ఎన్ని లెంగ్తులు దాట గలదో, కేజీ బరువు ఎక్కువ వేస్తే ఏ గుర్రం ఏ క్షణంలో ఎంత వెనకబడిపోగలదో అన్నీ చెప్పగలడు. కానీ, గుర్రప్పందాలు ఆడడు. అంతటి తెలివితేటలు సుబ్బారావుకి.”

సురేఖ విడాకులిచ్చిన భర్తని పొగుడుకోడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది.

“మరేమిటి. స్త్రీ వ్యసనం. . .?” నేనింకా మాట పూర్తిచేయనేలేదు.

సురేఖ అందుకుని, “నేనంటే పిచ్చిప్రేమ సుబ్బారావుకి. నిజానికి అతడు నా భర్త కాదు. భక్తుడు. నన్ను కాదని మరొక స్త్రీని తాకిన గాలి కూడా తనని తాకడానికి యిష్టపడడు.” అంది. ఆపైన, జడని భుజం మీదుగా ముందుకి వేసుకుంది. పైన రబ్బరుబాండు బిగించిన ఆ జడ మిగిలిన భాగం స్వేచ్ఛగా వదిలేసి చివర్లో గుర్రం తోకలా సమంగా కత్తిరించి, మృదువుగా వుంది.

రెండవ పేజీ>>

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

17 Responses to అహంకారి

Comments are closed.