-కొణతం దిలీప్
“అభివృద్ధిని అర్థం చేసుకోవడం చాలా తేలిక. అదే సమయంలో చాలా కష్టం కూడా. అభివృద్ధి చాలా బలంగా కనపడుతుంది కాబట్టి దానిని అర్థం చేసుకోవడం సుళువు. అదే సమయంలో అభివృద్ధిని అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే మిరుమిట్లు గొలిపే అభివృద్ధి వెలుగుల మధ్య అది సృష్టించే నల్లని చారలు మన కంటికి కనపడవు”
ఆర్. ఎస్. రావు (ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త)
—
మేం ప్రయాణిస్తున్న ఏసీ ఇండికా కారు ముంబై హైవేపై పరుగులు తీస్తోంది. సిటీకి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో కొత్తగా వెలసిన ఒక రిసార్టుకు ఆఫీసు నుండి మా టీం సభ్యులమంతా పిక్నిక్ కొరకు బయలుదేరాం. అప్పటి దాకా వాతావరణం గురించీ, హైదరాబాద్ ట్రాఫిక్ గురించీ జరిగిన మా కబుర్లు హఠాత్తుగా రాజకీయాలపైకి మళ్లాయి. వెనుక సీట్లో ఉన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొలీగ్ అన్నాడు – “You guys from Andhra are really lucky, man. You have a great leader like Chandra Babu Naidu”. ఆ మాట నేను వినడం అది మొదటిసారి కాదు. రాష్ట్రం వెలుపలి నుండి వచ్చిన వారెవరైనా చంద్రబాబును పొగడకుండా ఉండటం అరుదు. అందులో యువత మరీను. అన్న ఎన్.టి.ఆర్. తెలుగు వాడి ఖ్యాతిని డిల్లీ దాకా తీసుకువెళ్తే మన బాబుగారేమో ఆ ఖ్యాతిని దేశ తీరాలను దాటించి న్యూయార్క్, వాషింగ్టన్ దాకా వ్యాపింపజేశాడు. ఇంత పేరు సంపాదించడానికి మీడియా కన్సల్టెంట్లకు తగలేసిన ప్రభుత్వ సొమ్మెంత అనేది వేరే విషయం.
నేను చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కొంచెం మాత్రమేనని, ఆ సమయంలోనే రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ అప్పుల విషవలయంలో చిక్కుకు పోయిందని చెప్పానా అబ్బాయికి.
“వరల్డ్ బ్యాంక్?” ప్రశ్నార్ధకంగా మారిందా అబ్బాయి ముఖం.
“Is it some bank like Citi Bank?” అని అడిగాడా యువకుడు.
నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రాజకీయార్ధిక విషయాలపై మన దేశపు యువతలో ఉన్న విషయపరిజ్ఞానానికి ఆ కుర్రాడు ఒక ఉదాహరణ మాత్రమే.
మనదేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా, ఒక పోస్టర్ బాయ్ గా నిలిచినవాడు చంద్రబాబు. అటువంటి వ్యక్తి ఇటీవలి కాలంలో మండుటెండల్లో ఉరూరా తిరుగుతూ వ్యవసాయానికి 12 గంటల ఉచిత కరెంటు ఇస్తానని తిరగడం ప్రపంచీకరణ సమర్థకులకు ఒక చెంపపెట్టు వంటిది. ఒక విధంగా ఇది ప్రజల విజయం. చంద్రబాబు నాయుడిని 2004 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తే గానీ.., ఈ దేశప్రభువులకు సంస్కరణలు దారి తప్పుతున్నాయని తెలియ రాలేదు. ఎన్ని హైటెక్కులొచ్చినా బువ్వపెట్టే వాడు రైతన్నేనని, అతనికి మేలు చేయని ఏ విధానమూ దేశానికి మేలు చేయదనీ మత్తు వదిలేలా చేసినవాడు మన తెలుగు రైతన్నే. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం ఎలా ఉందో, సమీప భవిష్యత్తులో అది ఎలా ఉండబోతుందో అన్నది రేఖామాత్రంగా చర్చించడమే ఈ వ్యాసోద్దేశం.
—
రాష్ట్ర ఆర్ధిక రంగం- ప్రస్తుత స్థితి
పోయిన సంవత్సరం రాష్ట్రంలో స్థూల వార్షికోత్పత్తి (GSDP) దాదాపు పది శాతం పెరిగి 2,29,461 కోట్లకు చేరుకుంది. అన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లాగే మన రాష్ట్ర ఆర్ధిక రంగం కూడా మెల్లగా ప్రాథమిక రంగమైన వ్యవసాయం నుండి తృతీయ రంగం అయిన సేవల వైపు మళ్లింది. ఒకప్పుడు మన రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 65 శాతాన్ని సమకూర్చిన వ్యవసాయ రంగం వాటా ఇప్పుడు 26 శాతానికి పడిపోయింది. ద్వితీయ రంగమైన పరిశ్రమల వాటా 9 శాతం నుండి 21 శాతానికి చేరగా, సేవల (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హోటల్స్, ఇన్స్యూరెన్స్ వంటివి) వాటా 27 శాతం నుండి 52 శాతానికి పెరిగింది.
ఈ యేడు మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు దాటింది. ఇది బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల బడ్జెట్ల కన్నా ఎక్కువని మన ఆర్థిక మంత్రి చెప్పారు కూడా. మన వ్యవసాయ వృద్ధి రేటు 8.38 శాతం. జాతీయ స్థాయిలో ఇది 2.59 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ప్రస్తుత సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 180 లక్షల టన్నులు ఉండగలదని అంచనా; ఇదొక రికార్డు. తలసరి ఆదాయ వృద్ది రేటు జాతీయ స్థాయిలో 7.55 శాతం ఉంటే మన రాష్ట్రానిది 9.35 శాతం ఉంది. ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలే. అయితే ఈ మెరుపుల వెనుక కనపడని మరకల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అభివృద్ధికి సరైన కారణాలు, దీనికి చోదక శక్తిగా పనిచేస్తున్న వ్యక్తులు, శక్తులు, విధానాల గురించి మనం అలోచించాలి. కొన్ని గణాంకాలు వాటికవే కథ మొత్తాన్నీ చెప్పవు. దాని వెనుకున్న ఇంకొక గణాంకం తెలిస్తే కానీ దాని రెలెవెన్స్ అర్థం కాదు.
ఒకసారి ఈ గణాంకాలు కూడా చూడండి. స్థూల రాష్ట్రోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత నాలుగు దశాబ్దాల్లో సగానికి సగం తగ్గగా ఆ రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య మాత్రం 8 శాతమే తగ్గింది. దీనర్ధం ఏమిటంటే తక్కువ మంది ఆధారపడ్డ రంగం ఎక్కువ సంపాదిస్తుంటే, ఎక్కువమంది ఆధారపడ్డ రంగం తక్కువ సంపాదిస్తున్నది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం సర్వీసుల రంగంపై ఆధారపడి మనవంటి రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. వ్యవసాయ వృద్ధి రేటు పడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సకాలంలో రుతుపవనాలు రావడం వల్ల నీటి లభ్యత పెరగడం, ఉచిత విద్యుత్తు మూలంగా ఇప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఫర్వాలేదు.కానీ ఈ రెండిట్లో ఏది లేకపోయినా మళ్ళీ కథ మొదటికొస్తుంది.
మన రాష్ట్రానికి ఉన్న అప్పు దాదాపు లక్షకోట్లు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో దాదాపు 50 వేల కోట్ల పై చిలుకు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మింది. అప్పులు తెచ్చుకుని, ఆస్తులు అమ్ముకుని సాధించే అభివృద్ధికి ఏమైనా అర్థం ఉందా?
అభివృద్ధికి అసలైన కొలమానంగా భావించే మానవాభివృద్ధి సూచిక (Human Development Index)లో ఆంధ్ర ప్రదేశ్ 1991 సంవత్సరంలో 9వ స్థానంలో ఉంటే 2001 నాటికి 10వ స్థానానికి దిగజారింది. ఇక కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మానవాభివృద్ధి నివేదిక (Human Development Report) ను తయారుచేస్తానని చెప్పి ఆ మేరకు నిధులు కూడా పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ తయారయినా బయట పెట్టట్లేదు. ఆ నివేదిక బయటికి వస్తే ఈ అభివృద్ధి బండారం బయటపడుతుందని భయం.
పేరుకు పెద్ద బడ్జెట్ అని ఇప్పుడు ఢంకా బజాయించినా అనేక రంగాలకు ఘనమైన కేటాయింపులు జరిపి యేడాది చివరకు అందులో చాలా నిధులు ఖర్చు చేయకపోవడం, చేసినా ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఆదరా బాదరాగా ఖర్చు చేసి వృధా చేయడం గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం వంటి రంగాలకు కోతపెట్టి డబ్బు ఆదా చేసే పద్ధతి ఏ మాత్రం సమర్ధనీయం కాదు.
రెండు రూపాయలకు కిలో బియ్యం పధకానికి ఈ బడ్జెట్లో 1980 కోట్లు కేటాయించారు. పేదవారికి తక్కువ ధరలో బుక్కెడు బువ్వ పెట్టాలనుకోవడం సంతోషమే కానీ అదే సమయంలో ఆ పథకం అమలుకు అవసరమైన డబ్బులు ఆబ్కారీ ఆదాయం పెంచుకోవడం ద్వారా సమకూర్చుకోవాలనుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. పేదల కుటుంబాలను గుల్లచేసేటట్టు మద్యం పారించి ఆ డబ్బుతోనే వారికి సబ్సిడీ బియ్యం ఇవ్వడం ఏ విధంగా సంక్షేమ రాజ్యం అవుతుందో ఏలికలే చెప్పాలి.
ఒక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. దేశంలో ఎక్కడా జరగనంత మెరుగ్గా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది. లబ్ది దారులకు జాబ్ కార్డులు ఇచ్చి, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు జరిపి మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలిచింది. కొన్ని లక్షల మంది పేదలు ఈ పథకం వల్ల లబ్ది పొందారు.
ఇక బడ్జెట్లో అన్ని ప్రాంతాల మధ్య సమతులనం పాటించడం ప్రభుత్వ బాధ్యత. తెలంగాణా ప్రాంతంలో వచ్చిన రాబడిని ఆంధ్ర ప్రాంతానికి వినియోగిస్తున్నారని ముప్ఫై యేళ్ల కిందటే లలిత్ కమిటీ తేల్చి చెప్పినా, గత సంవత్సరం కూడా రాష్ట్ర శాసనసభలో ఆర్ధిక మంత్రి ఈనాటికీ అలాగే జరుగుతున్నదని ఒప్పుకోవడం ప్రాంతీయ భావాలు ఇంకా రెచ్చగొట్టే అంశమే.
ప్రపంచ బ్యాంకు – చంద్రబాబు – వైయెస్
భారత్ వంటి ఫెడరల్ దేశాల్లో రాష్ట్రాల ఆర్ధిక రంగాలు అనేక విషయాల్లో కేంద్ర నిర్ణయాలను బట్టి ఉంటాయి. 1991 తరువాత మన దేశంలో సరళీకరణ పేరిట జరిగే అనేక విధాన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం పెద్దగా లేదు. అయితే రాష్ట్ర స్థాయిలో జరిగే అనేక విధాన నిర్ణయాల్లో ఎటువంటి దారిలో వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది.
ఇక ప్రపంచ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వాన్ని బైపాస్ చేసి నేరుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే వ్యవహారాలు నడపడం, రాష్ట్ర ఆర్ధిక రంగంలో నేరుగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోనే. ఒక విధంగా మన రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ఒక Lab Rat గా, ఒక Guinea Pig గా వాడుకుంది.
చంద్రబాబు నాయుడు హయాంలో మన రాష్ట్రం సంస్కరణల అమలులో దేశానికే ఒక దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి అయితే అవకాశం దొరికినప్పుడల్లా చంద్ర బాబును ఆకాశానికెత్తేవాడు. విద్యుత్ రంగంలో బాబు మొదలు పెట్టిన ప్రైవేటీకరణ ఘోరంగా విఫలమయ్యాక ఇప్పుడు ఆ మాటెత్తే ధైర్యం చేయట్లేదెవరూ. నాయుడుగారు మరొకసారి గెలిచి ఉంటే ఈ పాటికి సింగరేణి, ఆర్టీసి, హైదరాబాద్ మంచి నీటి సరఫరా ప్రైవేటుపరం అయ్యేవి. విద్యుత్ బోర్డులో అర్ధాంతరంగా ఆగిన ప్రైవేటీకరణ పూర్తి అయ్యేది.
ఇంకొన్నేళ్ల దాకా మన రాజకీయాలన్నీ వ్యవసాయ రంగం చుట్టే తిరుగుతాయనడంలో సందేహం లేదు. అయితే పరిస్థితి రాత్రికి రాత్రే వ్యవసాయానికి అనుకూలంగా మారలేదు. ఉచిత విద్యుత్తు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు మెడలు వంచి ఇప్పుడు నేను కూడా ఉచిత విద్యుత్తు ఇస్తాననే వరకూ తేగలిగింది ప్రజల చైతన్యమే.
చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణల యజ్ఞం వికటించింది. ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు వద్ద అప్పులు చేస్తూనే ఉన్నా, బ్యాంకు షరతుల విషయంలో కొంచెం జాగరూకతతో వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది.
నాయుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు చాలా అధ్వాన్నంగా ఉండేవి. ఏ పూటకు ఆ పూట అప్పుచేస్తే కానీ బండి నడవని పరిస్థితి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేసేది రాష్ట్ర ప్రభుత్వం. 2000-01 సంవత్సరంలోనయితే కొత్తగా తీసుకున్న అప్పులో 71% పాత అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఆ అప్పుల భారం నేటికీ అలా పెరుగుతూనే ఉంది.
తాకట్టుపెట్టే వాడు పోయి అమ్మేవాడొచ్చాడు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అప్పులు చేయడం కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం మరొక ప్రమాదకర పద్ధతి ఎంచుకుంది. సాక్షాత్తూ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దళారీగా అవతారమెత్తింది. హుడా, హౌసింగ్ బోర్డ్, ఎ.పి.ఐ.ఐ.సి. వంటి సంస్థల వద్ద ఉన్న భూములను అందినకాడికి తెగనమ్మేస్తోంది. ప్రభుత్వశాఖలకు నెలవారీ టార్గెట్లు పెట్టి మరీ భూములు అమ్మడం ప్రపంచ చరిత్రలో ఇదివరకు ఎవరూ చేసి ఉండని పిచ్చిపని. ఎ.పి.ఐ.ఐ.సి అయితే తన వద్ద ఉన్న భూములే కాక యేటా కొన్ని వేల ఎకరాల భూములను రైతులనుంచి బలవంతంగా తక్కువ ధరలకు సేకరించి ప్రైవేటు కంపెనీలకు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటోంది.
తాజాగా భూముల వ్యాపారం చేయడానికి డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి పబ్లిక్ గా తాను దళారీ వ్యాపారం చేయాలనుకుంటున్నానని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటోంది మన రాష్ట్ర ప్రభుత్వం.
ఏ హైదరాబాద్ చుట్టు పక్కలనయితే ఇంత అన్యాయంగా ప్రభుత్వం భూములు అమ్ముకుంటోందో అదే హైదరాబాద్ లో ఉన్న 800 గవర్నమెంటు స్కూళ్లలో 200 పైచిలుకు స్కూళ్ళు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయంటే మన అభివృద్ధి ఎంత డొల్లనో అర్థం అవుతుంది.
భవిష్యత్తేమిటి?
రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్ధకమైన రోజులివి. ఆర్థిక రంగ భవిష్యత్తు చెప్పడం కొంచెం కష్టమే. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు కొత్త జలవనరులు ఏర్పాటు చేయడం, రుణాలు ఇప్పించడం, మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపరచడం వంటి చర్యలు చేపడితే వ్యవసాయరంగం మనల్ని పదికాలాల పాటు చల్లగా ఉంచుతుంది. జల యజ్ఞం పనుల్లో జరుగుతున్న భారీ అవినీతిని అరికడితే గానీ అటువంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడవు.
సాఫ్ట్ వేర్ రంగంపై అమెరికా మాంద్యం నీలి నీడలు కమ్ముకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మాంద్యం ప్రభావం ఎక్కువైతే మనకు ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగావకాశాలపై దెబ్బపడటమే కాక అమెరికా నుండి మనవాళ్ళు పంపుతున్న డబ్బు (Remittances) కూడా తగ్గుముఖం పడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం నుండి వచ్చే డబ్బులు తగ్గితే రాష్ట్ర ఆర్థిక రంగంపై కూడా స్వల్ప ప్రభావం ఉండక తప్పదు. ఏదేమైనా ఈ రంగం నుండి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంతో ఖచ్చితంగా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. పరిశ్రమ వృద్ధి దెబ్బతినకుండా ఈ రంగం నుండి ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషించాలి.
ఇప్పటికే స్పెక్యులేషన్ తో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన రియల్ ఎస్టేట్ ధరలు నేల వైపు దిగి రావడం మొదలైంది. కొన్నాళ్లైతే రియల్ ఎస్టేట్ భూముల ధరలు స్థిరీకరణ పొందుతాయి. ఈ రంగంలో విచ్చలవిడిగా చలామణి అవుతున్న నల్లడబ్బుకు కళ్లెం వేయాలి. అప్పుడే రాష్ట్ర ఖజానాకు ఏమైనా లాభం వస్తుంది. రిజిస్ట్రేషన్ విలువలను హేతుబద్ధం చేయడం ఇందులో తొలిమెట్టు కాగలదు.
కొత్త ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తే మనకు రాబడి మార్గాలు చాలానే ఉన్నాయి. అప్పులు, ఆస్తుల అమ్మకం చేయకుండా కూడా ఈ రాష్ట్రాన్ని చక్కగా నడపొచ్చు. ఇనుము, బాక్సైట్, సహజ వాయువు, చమురు, బొగ్గు వంటి సహజ వనరులను ప్రభుత్వమే వెలికితీసి అమ్ముకుంటే యేటా వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. (ఒక్క సింగరేణి బొగ్గు అమ్మకం ద్వారానే 350 కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి)
ఇక సేల్స్ ట్యాక్స్, ఇతర వాణిజ్య పన్నులను సరిగ్గా వసూలు చేయడం ద్వారా ఇంకొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించవచ్చు.
ఇవన్నీ జరగాలంటే చిత్తశుద్ధి ఉండాలి. మరి రేపు వచ్చే కథానాయకులకు అది ఉన్నదా? కాలమే జవాబు చెప్పాలి.
కొణతం దిలీప్ తెలుగు జాల పాఠకులకే కాక, పుస్తక పాఠకులకు కూడా పరిచితులే. 2006లో ఇంగ్లీషులో ప్రచురితమయిన కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్ ను ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించారు. ఆ అనువాద పుస్తకం రెండేళ్లలో ఆరు ముద్రణలు పొందింది. అదొక రికార్డు.
దిలీప్ నల్గొండ జిల్లా మోత్కూరు పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీ.వీ కాలేజిలో బీయస్సీ, వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి యెంబీఏ (మార్కెటింగ్) చదివి, ప్రస్తుతం హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో నాన్-సాఫ్టువేరు ఉద్యోగం చేస్తున్నారు.
దిలీప్ మొదటి రచన “సహస్రాబ్దికి స్వాగతం” అనే సీరియల్ 2000 సంవత్సరంలో స్వాతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ పత్రిక నిర్వహించిన పోటీలో 25,000 రూపాయల నగదు బహుమతి గెల్చుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపట్ల తన అభిప్రాయాలను తన బ్లాగు – hridayam.wordpress.com – లో వెల్లడిస్తూంటారు. వీక్షణం పత్రికలో కూడా వ్యాసాలు రాస్తూంటారు.
20 Responses to ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం