స్వాతి: ఈ మధ్యకాలంలో కొందరు పద్యానికి కాలం చెల్లింది అంటుంటే బాధగా అనిపిస్తుంది
సుబ్రహ్మణ్యం: పద్యానికీ, కవిత్వానికీ కాలం చెల్లడం అనేది ఉండదు..
స్వాతి: నిజం, రూపాంతరం చెందటం అనేది అతి సహజమైన విషయం. భాషలో, భావ వ్యక్తీకరణలో వచన కవిత వల్ల అభిలషించదగ్గ మార్పులే వచ్చాయి
సుబ్రహ్మణ్యం: యుగ యుగానికీ కవితా స్వభావం మారుతుంది అని తిలక్ అంటాడు వచన కవిత వల్ల చాలా నష్టాలు కూడా వచ్చాయి.
స్వాతి: కాని మరో వైపు ఈ స్వేచ్ఛని దుర్వినియోగ పరుస్తూ మామూలు మాటల్నే కవితలుగా చెలామణీ చేస్తున్నారు కొందరు.
సుబ్రహ్మణ్యం: కవిత్వానికి ప్రాణాలైన అక్షర మైత్రి, పదాల పొందిక, లయ ఇవేవీ లేకుండా శుద్ధ వచనం రాసేస్తున్నారు.
స్వాతి: ఇంకొందరు వింత ప్రయోగాలతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు.
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ప్రయోగాలు మంచివే కానీ అసలు అర్ధమూ ఆంతర్యమూ లేని కవిత్వాన్ని చూసి పాఠకులకి కవిత్వమంటే కామెడీగా అవుతుంది
సుబ్రహ్మణ్యం: నూతనత్వం కవిత్వ ధర్మం, ఐతే “అరటిపండు ఒలిచిపెట్టే” ధోరణి కవిత్వంలో మంచిది కాదు.
స్వాతి: అదసలు కవిత్వమే అవ్వదేమో.
సుబ్రహ్మణ్యం: పాఠకుడు కూడా కొంత కృషి చెయ్యాలి కవిత్వ భాషని అర్ధం చేసుకునేందుకు ఏ మాత్రం కృషి చెయ్యకుండా కవిత్వం పూర్తిగా అర్ధమైపోవాలి అనే సోమరి పాఠకుల జాబితాలోకి చేరిపోకూడదు.
స్వాతి: ఊ, అసలా మేథో మథనం ఉంటేనే కదా కవికైనా పాఠకుడికైనా రసాస్వాదన
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఈ మధ్య కొత్త ప్రక్రియల్లో ఒకలైనూ అర లైనూ కవితలొస్తున్నాయి. అవి మీకెలా అనిపిస్తాయి.
సుబ్రహ్మణ్యం: దీనికి కొంచెం పెద్ద సమాధానం ఇవ్వాలి..
స్వాతి: ఇవ్వండి.
సుబ్రహ్మణ్యం: ఒక లైను, అర లైను కవిత్వాలు అన్నారు కదా.. ముందుగా మూడు లైన్ల హైకూ రూపం గురించి మాట్లాడాలి.. కింది లంకె లోని కవిత చదవండి.. http://etiodduna.blogspot.com/2008/03/blog-post_27.html గమనించండి.. ఈ కవితలో సెలయేటి సవ్వడి చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని భంగ పరచకుండా, రెట్టింపు చేస్తోంది. జెన్ బౌద్ధం ప్రకారం కవిత్వం యొక్క పరమావధి కూడా అదే! మనిషిని మౌనంవైపు నడిపించడం. కవిత్వం భాషాతీతంగా ఉంటుందని జపనీయులు నమ్ముతారు. తెలుగులో ఈ రకమైన కవిత్వానికి ఆద్యుడైన ఇస్మాయిల్ గారు ఈ నిశ్శబ్ద కవిత్వం గురించి ఎన్నో మంచి వ్యాసాలు, పుస్తకాలు రాసారు. కాబట్టి జపనీయుల హైకూకి బలమైన తాత్విక భూమిక ఉంది. కింది వ్యాసంలో నేను ఈ విషయాన్ని మరింత విస్తారంగా చర్చించాను.http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=47645&page=1 ఐతే హైకూ యొక్క మూలాల్ని అర్ధం చేసుకోలేక చాలా మంది తెలుగు కవులు హైకూ పేరిట చెత్తంతా రాస్తున్నారు. ఇక మినీ కవితలు, నానీలు – వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళంతా గుర్తుంచుంకోవల్సింది ఏంటంటే చమత్కారం ఎప్పటికీ కవిత్వం కాదు. క్లుప్తత కవిత్వానికి ముఖ్య లక్షణం అయినప్పిటికీ కేవలం నాలుగు లైన్ల చమత్కార పూరిత రచన కవిత అయిపోదు కదా!
స్వాతి: మీరు పంపిన వ్యాసం చదివాను. మీరు రాశారా హైకూ లు?
సుబ్రహ్మణ్యం: I wrote few hai-kus those are there in my blog with name “చిరుజల్లులో పూలు”
స్వాతి: కొన్ని చదివినట్టు గుర్తు
సుబ్రహ్మణ్యం: ok
స్వాతి: పైన లింక్ లోని వ్యాసంలో మీరన్నట్టు హైకూని కవిత అనే కన్నా పద చిత్రం అనటం సమంజసం.
సుబ్రహ్మణ్యం: పదచిత్రాన్ని English లో image అంటారు… imagism was a big movement in English poetry,.. Ezra Pound was the founder of imagist poetry in English. కవిత్వంలో నిశ్శబ్దం… వ్యాసం చదవండి. Ismail wrote it.
స్వాతి: ఆహా, నాకెప్పట్నుండో ఒక సందేహం
సుబ్రహ్మణ్యం: చెప్పండి
స్వాతి: కొందరు కవులు ఒక వాక్యాన్ని నాలుగైదు పాదాలుగా ఒక్కో పాదాన్ని ఒక్కో లైన్ లో రాస్తూ ఉంటారెందుకు.
సుబ్రహ్మణ్యం: దీనికి సరైన సమాధానం చెప్పలేను గానీ..
స్వాతి: నా ప్రశ్న మీకర్థమైందా?
సుబ్రహ్మణ్యం: yeah, అర్థమైంది.. నేనైతే అక్షర మైత్రి.. లయ.. ఇవి చూస్తా.. ఉదాహరణకి “నిజాన్ని అద్దంలోంచి చూస్తూ అబద్ధంలో హాయిగా తిరిగేస్తున్నాం” ఇలా అనే కంటే “అద్దంలోంచి నిజాన్ని చూస్తూ అబద్ధంలో హాయిగా తిరిగేస్తున్నాం”
స్వాతి: రెండవ దాన్లో లయ బాగుంది
సుబ్రహ్మణ్యం: అబద్ధంలో తిరిగేస్తున్నాం అంటే ఇంకా బావుంటుంది
స్వాతి: ఇది అమోదయోగ్యం కానీ దీన్నే కొందరైతే “అద్దం లోంచి నిజాన్ని చూస్తూ”
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ఈ రకంగా విరిచి తలో మూలకి విసిరేస్తారెందుకో పేజీల ఖర్చు తప్ప ఏమీ కనపడదు
సుబ్రహ్మణ్యం: అవును, చిన్న చిన్న ఖండికలుగా రాయడం వల్ల readability పెరుగుతుంది కానీ మరీ ఇంత ముక్కలు చెయ్యక్కరలేదు.
స్వాతి: అన్నట్టు ఆ మధ్య ఒక కథ రాసినట్టున్నారు. అంటే, నేను చదివింది ఒక్కటే. మీరెన్ని రాశారో మరి 🙂
సుబ్రహ్మణ్యం: ఏ కథ చదివారు?
స్వాతి: కొంచం absurd కథలా ఉంది
సుబ్రహ్మణ్యం: oh..
స్వాతి: పేరేమిటబ్బా
సుబ్రహ్మణ్యం: Telugupeople లో చదివారా?
స్వాతి: అవును, మనిషి తనలోని నిజాయితీ బరువుని మోయలేక చంపేయటం గురించి
సుబ్రహ్మణ్యం: నిశ్చల యాత్ర కౌముది కథ చూడండి.. ఇదే నా recent story… 1 yr లో ఏమీ రాయలేదు
చర్చ బావుంది.
ఛందస్సుని ఒక పాత్రతో కన్నా ఒక మూసతో (అచ్చు) పోలచడం కొంతవరకూ సమంజసం. ద్రవం పాత్రలో పోసిన తర్వాత కూడా పాత్రా ద్రవం వేరుగానే ఉంటాయి. మూసలో పోసి తీసిన పదార్థం (బంగారం కాని, మట్టి కాని), ఆ మూస తాలూకు ఆకారంలోకి మారి, ఆ ఆకృతి దాని అస్తిత్వంలో భాగమై పోతుంది. పద్యంలో రాసిన కవిత్వమూ అంతే.
వచన కవిత్వంలో ఆకారం కొత్తగా కవి సృష్టించుకుంటాడు.
ఇక కొన్ని సందేహాలు:
1. ఎవరి కోసం వారు రాసుకున్నది అందరికీ తాకుతుందని ఎలా చెప్పగలం?
2. కవిత్వానికి సార్వజనీనత అవసరమా? సాధ్యమా?
3. Target audienceని దృష్టిలో పెట్టుకొని కవిత్వాన్ని రాయలేమా?
చర్చ అర్ధవంతంగా బాగుంది. వచన కవిత్వం నాకు మహా చెడ్డ చిరాకు. “మనుష్యులు కాళ్ళతో నడుస్తారు, పక్షులు రెక్కలతో ఎగురుతాయి” అంటూ మేము మాట్లాడుకునే మాటలని కవిత్వంలో చొప్పిస్తే, ఇక మేము మాట్లాడుకోటానికి ఏముంటుంది? మేము కవిత్వమే మా భాషగా మార్చుకోవాలేమో.
కామేశ్వర్రావు గారికి ..
మీ ప్రశ్నలకి సమాధానించగల వాణ్ణి కాదుగానీ నాకు తోచిన ఆలోచనలు పంచుకోవడంలో తప్పు లేదనుకుంటాను.
1. ఎవరి కోసం వారు రాసుకున్నదే అని బయటికి అన్నా, లోపల ప్రతి రచయితకీ కవికీ తాను ఎవర్ని ఉద్దేశిస్తున్నాడో కొంత అవగాహన ఉంటుంది. అది అనుభవంతో బలపడుతుందని నా నమ్మకం.
2. సార్వజనీనత .. ఇది కొంచెం అపార్ధానికి తావిచ్చే పదం .. అంటే “అందరికీ” అని కాకుండా “అనేకులకి” అని చెప్పుకుంటే, కచ్చితంగా సార్వజనీనత అవసరమూ, సాధ్యం కూడా. ప్రవరుడి నేపథ్యం గానీ, ఊహలు కానీ, అనుభవాలు కానీ మనవి కావు, ఐనా అతన్ని గురించిన కవిత్వం ఆస్వాదించగలుగుతున్నాం. ఇది కవిలోనే కాదు, పాఠకుల్లోనూ అంతర్గతంగా ఉంది. ఆంగ్లంలో empathy అంటారు. ఇంకాస్త పైమెట్టుకి వెళితే, అనుభవ సారాన్ని పిండి ఒక తాత్వికతని ఆవిష్కరించే కవిత్వం ఇంకా గొప్ప ఆనందం కలిగిస్తుందని మీకు అనుభవమే.
3. Target Audience తప్పకుండ రాయొచ్చు. ఎప్పుడైనా గానీ, ముఖ్యంగా ప్రస్తుత సామాజిక నేపథ్యంలో కవిత్వం (రచన) కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలకి అంకితమవుతోంది. ఇక్కడ సందేశం అందిందా అన్నదే ముఖ్యం, కవిత పదికాలాల పాటు వర్ధిల్లిందా అన్నది కాదు. అది ఒక వ్యాపార ప్రకటనకి రాసిన జింగిల్ కావచ్చు, ఒక సినిమా పాట కావచ్చు, లేదా ఒక వాద సందేశం కావచ్చు. మనిషి మనుగడ పోరాటాల నించి ప్రాణం పోసుకున్న కవిత్వం భాషల సరిహద్దులు, ఎల్లలు దాటి కొన్ని దశాబ్దాల పాటు కొత్త ప్రాణం పోసుకుని కొత్త ఉద్యమాలకి పునాది ఐన దృష్టాంతాలు లేకపోలేదు. ఉదాహరణకి వికీలో we shall overcome పాట చరిత్ర చూడండి.
రామారావు గారికి .. వచన కవిత్వం చిరాకు అన్నారంటే .. మీకు తగలాల్సిన కవిత్వం తగల్లేదన్న మాట. తిలక్ రాసిన “నీవు లేవు, నీ పాట ఉంది” చదవండి. అలాంటి పద్యం ఒక్క సాంప్రదాయ కవిత్వంలో చూపించండి (అన్నమయ్య పదాల్లో తప్పించి) .. అంతెందుకు .. మూలా సుబ్రహ్మణ్యం గారి కొన్ని పద్యాలు అద్భుతంగా ఉంటాయి. కళ్ళంటూ ఉంటే చూసీ .. మనసుంటే చదివీ .. ప్రపంచమొక పద్మవ్యూహం .. కవిత్వమొక తీరని దాహం!! 🙂
బై దవే .. వెరీ వెరీ వెల్ డన్.
స్వాతి గారికీ సుబ్రహ్మణ్యంగారికీ బహుధా అభినందనలు.
ఇటువంటి ప్రయోగాలూ, ఫీచర్లూ మరిన్ని చేస్తుండాలని సంపాదక వర్గానికి వేడికోలు.
చాలా చాలా బావున్నాయి మీ కబుర్లు!! ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెప్పారు.. కవిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి పాఠకుడు కూడా కొంత కృషి చేయాలి అన్నదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.. అప్పుడే కవితని ఆస్వాదించిన అనుభూతి కలుగుతుంది!
మీ ఇద్దరికీ అభినందనలు.. Also, thanks for the wonderful links!
కొత్తపాళీ గారూ, ‘సార్వజనీనత ‘ కి మీ వివరణ అదుర్స్! 🙂
మంచి సంభాషణ. వస్తున్న వ్యాఖ్యలు కూడా మీ మాటలకు తగిన స్థాయిలోనే వున్నాయి. నిజాయితీగా ఏం మాట్లాడుకున్నా, రాసుకున్నా వాటికొక విలువ వుంటుందని మరోసారి చూస్తున్నాను.మీకూ సుబ్రహ్మణ్యంగారికీ పొద్దుకూ అభినందనలు. (ఈ సైటును, లేఖినిని నాకు పరిచయం చేసిన రామనాధకు థాంక్సు).
చక్కటి చర్చ.సుబ్రమణ్యం గారికి,స్వాతి గారికి అభినందనలు!!!
కామేశ్వరరావు గారి ప్రశ్నలు,కొత్తపాళీ గారి సమాధానాలు చాలా బావున్నాయి.ఆసక్తి ని,ఆలోచనను రేకెత్తిస్తూ.అందుకే,ఈ విషయం పై నా అభిప్రాయాలు కూడా పంచుకుందామన్న ఈ చిన్ని ప్రయత్నం.(అతిరధులు,మహారధులు వ్యాఖ్యానించాక ఇది సాహసమే అవవచ్చు!)
1.ప్రధానం గా కవి తనకోసమే రాయటం జరుగుతుందని నా అభిప్రాయం.రాయాలనే తపన పూర్తిగా వైయుక్తికమైనది.అయితే ఈ రాయటం అనేది నిజమైన కవితావేశం లోంచి వచ్చినపుడు,ఆ భావావేశం కవీత్వీకరణ అనే మాధ్యమం ద్వారా వ్యక్తీకరించబడినపుడు ఆ అనుభూతి పాఠకుడి అనుభవం లోకి వస్తుంది. ఎంత వరకూ తాకుతుంది అనేది చాలావరకు కవి ప్రతిభ మీదే ఆధారపడ్డా అందరి పాఠకుల రసానుభూతి ఒకటే కాకపోవచ్చు.అది వారి వారి స్పందనాశక్తిని బట్టి ఉంటుంది కూడా.
2.గొప్పకవిత్వ లక్షణా ల్లో సార్వజనీనత ఒకటని నా అభిప్రాయం.మొదటి ప్రశ్నలో ఉన్న “తాకే గుణం” వల్లే ఈ సార్వజనీనత సాధ్యమవుతుందేమో.ఈ సర్వజనీనత వల్లే కవి తాలూకు వైయుక్తిక అనుభూతి పాఠకుల వైయుక్తిక అనుభవంగా ఒక చక్కటి కవిత ద్వారా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుందనిపిస్తుంది.అందుకే ఇప్పటికి గజేంద్రమోక్షం,రామాయణం,వేంగిక్షేత్రం లొ కొన్ని పద్యాలు చదువుతుంటే కండ్లు చెమర్చి గొంతు పెగలకపోవటం జరుగుతుంది. అదేవిధంగా తిలక్ తన ప్రియబాంధవి పాటను ‘నా లోపల లోపల ఆరుతున్న కుంపటిలో రగులుతున్న ఒకే ఒక స్మృత్యాగ్ని కణం లాగా…” అన్న పంక్తులు చదివినప్పుడల్లా అయన వేదనా తీవ్రత మన హృదయాలను పట్టి వెంటాడుతుంది.కొత్తపాళీ గారు చెప్పిన ఎంపతీ కూడా ఈ సార్వజనీనత కు కారణం అనిపిస్తుంది.
మొత్తమ్మీద గొప్ప కవిత్వంలో ఆర్ద్రత(తాకే గుణం),సార్వజనీనత రెండూ కలిసే ఉంటాయని నా అభిప్రాయం.ఆర్ద్రత లేని కవితకు(వస్తువు ఏదయినా) కదిలించే శక్తి ఉండదు.కదిలించని కవిత కు సార్వజనీనత లోపిస్తుంది.
ఇకపోతే నా అభిమాన కవిత “నువ్వు లేవు నీ పాట ఉంది” గురించి కొత్తపాళీ గారి వ్యాఖ్య అక్షర సత్యం అనిపిస్తుంది.ఈ కవిత చదివిన ప్రతిసారీ (బహుశా కొన్ని వందలసార్లు చదువుకోవటంజరిగింది)ఒక గొప్ప సంగీత కారుడు తన ప్రియబాంధవి స్మృతుల తాదాత్మ్యం తో ఏకబిగిన ఊదిన వేణువు పాట లా,చక్కటి ధార,ఆర్ద్రత తో సాగుతుంది.
చక్కటి చర్చ.సుబ్రమణ్యం గారికి,స్వాతి గారికి అభినందనలు