-స్వాతి కుమారి
కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది?
కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి ఈ సందేహాలన్నీ ఎప్పటికప్పుడు ముసురుకుంటూ ఉండేవే. ఇవన్నీ పెద్దలందరూ వివరించిన విషయాలే ఐనా, రోజురోజుకి కవితా ధోరణులు చురుగ్గా మారిపోతున్న నేపథ్యంలో మనకి మనం చర్చించుకుని ఆత్మవిమర్శ చేసుకోవటం సమంజసం. ఈ విషయం మీద పిచ్చాపాటీ జరపటానికి పొద్దు తరఫున మూలా సుబ్రహ్మణ్యం గారిని అతిధిగా ఆహ్వానించాం. ఇక కబుర్ల లోకి..
స్వాతి: ఇక మొదలెడదాం. పొద్దుకి నేను పాతేగానీ మీరు ఇంకా పరిచయం కాలేదు.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఒక వ్యక్తిగా, ఇంకా కవిత్వానికి సంబంధించీ మీ పరిచయం ఇవ్వగలరా
సుబ్రహ్మణ్యం: సొంత ఊరు : విశాఖపట్నం, ప్రస్తుత నివాసం బెంగుళూరు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వృత్తి, కవిత్వం ప్రవృత్తి. “ఏటి ఒడ్డున” అనే కవితా సంపుటి ప్రచురించాను. ఇది పరిచయం
స్వాతి: మరి ప్రేరణ మీరు సహజంగా యే భావానికి, ప్రేరణకి స్పందించి కవిత్వం రాస్తారు?
సుబ్రహ్మణ్యం: ఏ కళకైనా పునాది, ప్రేరణ జీవితమే అనిపిస్తుంది. ముగింపు ముందే తెలిసినా ఒక్కో మనిషి జీవితమూ ఒక్కో మహాకావ్యమే! అందుకని నా కవిత్వానికి కూడా జీవితమే ప్రేరణ.
సుబ్రహ్మణ్యం: మీ ప్రేరణ కూడా చెప్పండి
స్వాతి: మీరు చెప్పినట్టే విస్తృతార్ధంలో అందరికీ జీవితమే ప్రేరణ ఐనా. ఇంకొంచం సూక్ష్మంగా చెప్పాలంటే నాకు ఎక్కువ ప్రకృతి లోంచి ప్రేరణ దొరుకుతుంది. మనమంతా ఎంతో ప్రణాళికా బద్ధంగా ఒక రొటీన్ కి కట్టుబడి జీవిస్తూ ఉంటాం, సవ్యమైన మనుగడకి అది చాలా అవసరం కూడా. కానీ చాలాసార్లు ఇది యాంత్రికంగా విసుగు తెప్పించేలా పరిణమిస్తుంది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: అలాంటప్పుడే అనుకోకుండా రాలిపడే ఒక వర్షపు చినుకో, చెప్పకుండా తాకే ఒక చిరుగాలో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.
సుబ్రహ్మణ్యం: నా కవిత్వానికి ముందు మాట రాస్తూ విన్నకోట గారు ఇలా అన్నారు “కవిత్వం జీవితాన్ని వెలిగిస్తుంది.. కాంతి మయం చేస్తుంది” అని
స్వాతి: నిజం.
సుబ్రహ్మణ్యం: ప్రకృతిలో ప్రతి అంశం ఏవో రహస్యాల్ని దాచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రహస్యాల శోధనే కవిత్వం అనుకోవచ్చేమో!
స్వాతి: ఒక పార్శ్వం నుంచి అంతే!
సుబ్రహ్మణ్యం: మరి ఇంకో పార్శ్వం?
స్వాతి: కానీ వింతేమిటంటే అవి అందరికీ తెలిసిన విషయాలే. ఒక కవి శోధించి చెప్పాక, ‘అవును కదా ఇన్నాళ్ళూ గమనించలేదు’ అనిపిస్తుంది.
సుబ్రహ్మణ్యం: చాలా నిజం. అయ్యో నేను ఇలా ఎందుకు రాయలేదు అనిపిస్తుంది. అదే గొప్ప కవిత్వం.
స్వాతి: అవును, ఎవరికోసం వారు రాసుకున్నదే అందరినీ తాకుతుంది. పాఠకులకిలా నచ్చుతుంది అనుకుని రాసినప్పుడు సార్వజనీన భావన ఉండదు కవితలో.
సుబ్రహ్మణ్యం: అవును Target audience ని దృష్టిలో పెట్టుకుని రాస్తే అది కవిత్వం కాదు.
స్వాతి: తిలక్ చెప్పినట్టు నువ్వు రాసేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి. సరే.. మీ మిగతా ప్రేరణల మాటేమిటి? ప్రకృతి కాకుండా ఇంకా మీరు కవిత్వం ఎక్కువగా దేని గురించి రాస్తారు?
సుబ్రహ్మణ్యం: నేను మొదట్లో చిన్న చిన్న వస్తువులు తీసుకుని కవిత్వం రాసేవాడిని.. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ అంటూ… అప్పుడు విన్నకోటగారు జీవితానుభవాలని కవితలుగా మలచమని సలహా ఇచ్చారు.. అలా ప్రాజెక్టు డెడ్ లైనులు, డీబగ్గింగ్ ఇలా చాలా విషయాల మీద కవిత్వం రాశాను. అదంతా ఒక సాధన అనుకోండి.
సుబ్రహ్మణ్యం: ఇవి కాక ప్రతి మనిషినీ “జీవితానికి అర్ధం ఉందా?” , ” కాల మరణాలేమిటి?” ” రాగద్వేషాలకి మూలాలేమిటి” , ” పరిపూర్ణమైన సౌందర్యం ఉందా?” వగైరా ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నంలో కూడా కవిత్వం రాస్తారనిపిస్తుంది. నావి కూడా కొన్ని కవితలు ఆ కోవలోనివే..
స్వాతి: ఆహా, ఒక తాత్విక చింతన ఉన్న కవిత్వం.. నిజమే.. ప్రతి రచయిత/ కవీ ఆ మాటకొస్తే ప్రతి మనిషికీ ఏదో ఒక దశ లో తప్పనిసరిగా కలిగే అలోచనే అది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఐతే నాకో సందేహం..
సుబ్రహ్మణ్యం: చెప్పండి.
స్వాతి: ఈ తరహా కవిత్వం వల్ల కవి తనకి తాను కానీ పాఠకుడి నుండి గానీ ఆశించేదేమిటి?
సుబ్రహ్మణ్యం: రామకృష్ణ పరమహంసని ఎవరో అడిగారుట.. “ఏమయ్యా నువ్వేదో కొండల్లో కూచుని తపస్సు చేస్తే ప్రపంచానికేమిటి ప్రయోజనం” అని
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: దానికి ఆయన ‘నాలోంచి ఒక తరంగం లేచి ప్రపంచాన్ని చుట్టబెడుతుంది. అది ప్రపంచంలో ఉన్న అశాంతిని కాస్తైనా తగ్గిస్తుంది’ అని అన్నారట. కాబట్టి అన్నిటికీ లౌకికమైన ప్రయోజనాలు ఉంటాయనుకోకూడదు.
స్వాతి: అది నిజమే ఆ మాటకొస్తే ఏ కళనుంచైనా అలోచన నుంచైనా లౌకికమైన ప్రయోజనాన్ని ఆశించలేము.
సుబ్రహ్మణ్యం: కవిత్వం విముక్తి కూడా… బాగా అలజడిలో ఉన్నప్పుడు అది రాసేస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది.. కదా?
స్వాతి: తనలోని అంతర్గతమైన తపనని అనుభూతిని అలోచనని తనకి తాను వ్యక్తపరచుకోవటమే కళాకారుడి / కళ యొక్క మొదటి ఉద్దేశం అనిపిస్తుంది
సుబ్రహ్మణ్యం: అవును.
స్వాతి: నిజం ఆనందం కోసం ఎందరు రాస్తారో నాకు తెలీదు కాని. బాధ తీరటానికి చాలా మందే రాస్తారు
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ఎప్పుడైతే ఇక ఇది రాయకుంటే ఇంకే పని మీదా ధ్యాస ఉండదు అనేంత desperate భావన కలుగుతుందో అప్పుడు మాత్రమే రాసే తరహా అన్నమాట ఇది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: కవిత్వం – పద్యం నుంచి, చంధస్సు నుంచి దూరంగా వచ్చి వచన కవిత్వంగా మారటం పట్ల మీ అభిప్రాయం? నా ఉద్దేశంలో పద్యం లోని శాస్త్రీయత, చంధస్సులో నిగూఢమైన శబ్ద సౌందర్యం సాటి రానివి.
సుబ్రహ్మణ్యం: పద్యమైనా, గద్యమైనా నేను అందులో కవిత్వం కోసం చూస్తాను. వట్టి చమత్కార పూరిత పద్యాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో కవిత్వం ఉండదు. అలాగే వచన కవితల పేరిట వస్తున్న కొన్ని రచనలు శుద్ధ వచనం. కాబట్టి కవిత్వమే ముఖ్యం.
సుబ్రహ్మణ్యం: ఐతే చెప్పండి.. పద్య కవిత్వం, వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
స్వాతి: పద్య కవిత్వం మన సంస్కృతికి, భాషా సంపదకు చిహ్నమే కాకుండా, ఒక క్రమశిక్షణాబద్ధమైన రచనా శైలి
సుబ్రహ్మణ్యం: అవును, ఐతే ఛందోబద్ధంగా రాసినదంతా కవిత్వమేనా?
స్వాతి: సరైన మాటే అన్నారు. పద్యం అనేది పదాల్ని ఒక పద్ధతిలో కూర్చోబెట్టగలిగే సాధనం మాత్రమే!
సుబ్రహ్మణ్యం: అవును..
స్వాతి: ఇక దానిలోని కవితాత్మ కవి తపనని బట్టీ..
సుబ్రహ్మణ్యం: ఒక ఉపమానం తీసుకుని చెప్పినట్లైతే
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: ఛందస్సు ఒక పాత్ర లాంటిది.. ద్రవానికి చక్కని ఆకృతిని ఇస్తుంది.. ఐతే ఆ పాత్రలో పోసేది అమృతమా, ఉట్టి నీరా అన్నది వేరే విషయం.
స్వాతి: right, ఐతే తమ పాలని గానీ నీటిని గాని తెలిసీ తెలీక ఎక్కడో ఒలకబోసుకోకుండా ఒక చక్కటి పాత్రలో పెట్టుకునేందుకు ఇదో మంచి ఏర్పాటు.
సుబ్రహ్మణ్యం: 🙂
చర్చ బావుంది.
ఛందస్సుని ఒక పాత్రతో కన్నా ఒక మూసతో (అచ్చు) పోలచడం కొంతవరకూ సమంజసం. ద్రవం పాత్రలో పోసిన తర్వాత కూడా పాత్రా ద్రవం వేరుగానే ఉంటాయి. మూసలో పోసి తీసిన పదార్థం (బంగారం కాని, మట్టి కాని), ఆ మూస తాలూకు ఆకారంలోకి మారి, ఆ ఆకృతి దాని అస్తిత్వంలో భాగమై పోతుంది. పద్యంలో రాసిన కవిత్వమూ అంతే.
వచన కవిత్వంలో ఆకారం కొత్తగా కవి సృష్టించుకుంటాడు.
ఇక కొన్ని సందేహాలు:
1. ఎవరి కోసం వారు రాసుకున్నది అందరికీ తాకుతుందని ఎలా చెప్పగలం?
2. కవిత్వానికి సార్వజనీనత అవసరమా? సాధ్యమా?
3. Target audienceని దృష్టిలో పెట్టుకొని కవిత్వాన్ని రాయలేమా?
చర్చ అర్ధవంతంగా బాగుంది. వచన కవిత్వం నాకు మహా చెడ్డ చిరాకు. “మనుష్యులు కాళ్ళతో నడుస్తారు, పక్షులు రెక్కలతో ఎగురుతాయి” అంటూ మేము మాట్లాడుకునే మాటలని కవిత్వంలో చొప్పిస్తే, ఇక మేము మాట్లాడుకోటానికి ఏముంటుంది? మేము కవిత్వమే మా భాషగా మార్చుకోవాలేమో.
కామేశ్వర్రావు గారికి ..
మీ ప్రశ్నలకి సమాధానించగల వాణ్ణి కాదుగానీ నాకు తోచిన ఆలోచనలు పంచుకోవడంలో తప్పు లేదనుకుంటాను.
1. ఎవరి కోసం వారు రాసుకున్నదే అని బయటికి అన్నా, లోపల ప్రతి రచయితకీ కవికీ తాను ఎవర్ని ఉద్దేశిస్తున్నాడో కొంత అవగాహన ఉంటుంది. అది అనుభవంతో బలపడుతుందని నా నమ్మకం.
2. సార్వజనీనత .. ఇది కొంచెం అపార్ధానికి తావిచ్చే పదం .. అంటే “అందరికీ” అని కాకుండా “అనేకులకి” అని చెప్పుకుంటే, కచ్చితంగా సార్వజనీనత అవసరమూ, సాధ్యం కూడా. ప్రవరుడి నేపథ్యం గానీ, ఊహలు కానీ, అనుభవాలు కానీ మనవి కావు, ఐనా అతన్ని గురించిన కవిత్వం ఆస్వాదించగలుగుతున్నాం. ఇది కవిలోనే కాదు, పాఠకుల్లోనూ అంతర్గతంగా ఉంది. ఆంగ్లంలో empathy అంటారు. ఇంకాస్త పైమెట్టుకి వెళితే, అనుభవ సారాన్ని పిండి ఒక తాత్వికతని ఆవిష్కరించే కవిత్వం ఇంకా గొప్ప ఆనందం కలిగిస్తుందని మీకు అనుభవమే.
3. Target Audience తప్పకుండ రాయొచ్చు. ఎప్పుడైనా గానీ, ముఖ్యంగా ప్రస్తుత సామాజిక నేపథ్యంలో కవిత్వం (రచన) కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలకి అంకితమవుతోంది. ఇక్కడ సందేశం అందిందా అన్నదే ముఖ్యం, కవిత పదికాలాల పాటు వర్ధిల్లిందా అన్నది కాదు. అది ఒక వ్యాపార ప్రకటనకి రాసిన జింగిల్ కావచ్చు, ఒక సినిమా పాట కావచ్చు, లేదా ఒక వాద సందేశం కావచ్చు. మనిషి మనుగడ పోరాటాల నించి ప్రాణం పోసుకున్న కవిత్వం భాషల సరిహద్దులు, ఎల్లలు దాటి కొన్ని దశాబ్దాల పాటు కొత్త ప్రాణం పోసుకుని కొత్త ఉద్యమాలకి పునాది ఐన దృష్టాంతాలు లేకపోలేదు. ఉదాహరణకి వికీలో we shall overcome పాట చరిత్ర చూడండి.
రామారావు గారికి .. వచన కవిత్వం చిరాకు అన్నారంటే .. మీకు తగలాల్సిన కవిత్వం తగల్లేదన్న మాట. తిలక్ రాసిన “నీవు లేవు, నీ పాట ఉంది” చదవండి. అలాంటి పద్యం ఒక్క సాంప్రదాయ కవిత్వంలో చూపించండి (అన్నమయ్య పదాల్లో తప్పించి) .. అంతెందుకు .. మూలా సుబ్రహ్మణ్యం గారి కొన్ని పద్యాలు అద్భుతంగా ఉంటాయి. కళ్ళంటూ ఉంటే చూసీ .. మనసుంటే చదివీ .. ప్రపంచమొక పద్మవ్యూహం .. కవిత్వమొక తీరని దాహం!! 🙂
బై దవే .. వెరీ వెరీ వెల్ డన్.
స్వాతి గారికీ సుబ్రహ్మణ్యంగారికీ బహుధా అభినందనలు.
ఇటువంటి ప్రయోగాలూ, ఫీచర్లూ మరిన్ని చేస్తుండాలని సంపాదక వర్గానికి వేడికోలు.
చాలా చాలా బావున్నాయి మీ కబుర్లు!! ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెప్పారు.. కవిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి పాఠకుడు కూడా కొంత కృషి చేయాలి అన్నదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.. అప్పుడే కవితని ఆస్వాదించిన అనుభూతి కలుగుతుంది!
మీ ఇద్దరికీ అభినందనలు.. Also, thanks for the wonderful links!
కొత్తపాళీ గారూ, ‘సార్వజనీనత ‘ కి మీ వివరణ అదుర్స్! 🙂
మంచి సంభాషణ. వస్తున్న వ్యాఖ్యలు కూడా మీ మాటలకు తగిన స్థాయిలోనే వున్నాయి. నిజాయితీగా ఏం మాట్లాడుకున్నా, రాసుకున్నా వాటికొక విలువ వుంటుందని మరోసారి చూస్తున్నాను.మీకూ సుబ్రహ్మణ్యంగారికీ పొద్దుకూ అభినందనలు. (ఈ సైటును, లేఖినిని నాకు పరిచయం చేసిన రామనాధకు థాంక్సు).
చక్కటి చర్చ.సుబ్రమణ్యం గారికి,స్వాతి గారికి అభినందనలు!!!
కామేశ్వరరావు గారి ప్రశ్నలు,కొత్తపాళీ గారి సమాధానాలు చాలా బావున్నాయి.ఆసక్తి ని,ఆలోచనను రేకెత్తిస్తూ.అందుకే,ఈ విషయం పై నా అభిప్రాయాలు కూడా పంచుకుందామన్న ఈ చిన్ని ప్రయత్నం.(అతిరధులు,మహారధులు వ్యాఖ్యానించాక ఇది సాహసమే అవవచ్చు!)
1.ప్రధానం గా కవి తనకోసమే రాయటం జరుగుతుందని నా అభిప్రాయం.రాయాలనే తపన పూర్తిగా వైయుక్తికమైనది.అయితే ఈ రాయటం అనేది నిజమైన కవితావేశం లోంచి వచ్చినపుడు,ఆ భావావేశం కవీత్వీకరణ అనే మాధ్యమం ద్వారా వ్యక్తీకరించబడినపుడు ఆ అనుభూతి పాఠకుడి అనుభవం లోకి వస్తుంది. ఎంత వరకూ తాకుతుంది అనేది చాలావరకు కవి ప్రతిభ మీదే ఆధారపడ్డా అందరి పాఠకుల రసానుభూతి ఒకటే కాకపోవచ్చు.అది వారి వారి స్పందనాశక్తిని బట్టి ఉంటుంది కూడా.
2.గొప్పకవిత్వ లక్షణా ల్లో సార్వజనీనత ఒకటని నా అభిప్రాయం.మొదటి ప్రశ్నలో ఉన్న “తాకే గుణం” వల్లే ఈ సార్వజనీనత సాధ్యమవుతుందేమో.ఈ సర్వజనీనత వల్లే కవి తాలూకు వైయుక్తిక అనుభూతి పాఠకుల వైయుక్తిక అనుభవంగా ఒక చక్కటి కవిత ద్వారా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుందనిపిస్తుంది.అందుకే ఇప్పటికి గజేంద్రమోక్షం,రామాయణం,వేంగిక్షేత్రం లొ కొన్ని పద్యాలు చదువుతుంటే కండ్లు చెమర్చి గొంతు పెగలకపోవటం జరుగుతుంది. అదేవిధంగా తిలక్ తన ప్రియబాంధవి పాటను ‘నా లోపల లోపల ఆరుతున్న కుంపటిలో రగులుతున్న ఒకే ఒక స్మృత్యాగ్ని కణం లాగా…” అన్న పంక్తులు చదివినప్పుడల్లా అయన వేదనా తీవ్రత మన హృదయాలను పట్టి వెంటాడుతుంది.కొత్తపాళీ గారు చెప్పిన ఎంపతీ కూడా ఈ సార్వజనీనత కు కారణం అనిపిస్తుంది.
మొత్తమ్మీద గొప్ప కవిత్వంలో ఆర్ద్రత(తాకే గుణం),సార్వజనీనత రెండూ కలిసే ఉంటాయని నా అభిప్రాయం.ఆర్ద్రత లేని కవితకు(వస్తువు ఏదయినా) కదిలించే శక్తి ఉండదు.కదిలించని కవిత కు సార్వజనీనత లోపిస్తుంది.
ఇకపోతే నా అభిమాన కవిత “నువ్వు లేవు నీ పాట ఉంది” గురించి కొత్తపాళీ గారి వ్యాఖ్య అక్షర సత్యం అనిపిస్తుంది.ఈ కవిత చదివిన ప్రతిసారీ (బహుశా కొన్ని వందలసార్లు చదువుకోవటంజరిగింది)ఒక గొప్ప సంగీత కారుడు తన ప్రియబాంధవి స్మృతుల తాదాత్మ్యం తో ఏకబిగిన ఊదిన వేణువు పాట లా,చక్కటి ధార,ఆర్ద్రత తో సాగుతుంది.
చక్కటి చర్చ.సుబ్రమణ్యం గారికి,స్వాతి గారికి అభినందనలు