– నిషిగంధ
చేతికంటిన ముళ్ళ గోరింట
రంగు వెలిసిపోతోంది
ఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..
నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది
మనసు ఆదమరిచేది..
ఒక్కోసారి మంచు తడియారకుండానే
కళ్ళ ముందుంటావ్..
ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?
కాలికింద నలిగిన
ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..
ఇంకెన్నిరోజులిలా!?
దిగులుతో బాధేసి, కోపమొచ్చి
ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేస్తుంటే
వినిపించింది నీ ఆగమన రాగం!
కిటికీ అవతల నిశాంతంలో
కొమ్మ కొమ్మకీ కొత్త ఆశల
చిగురులద్దుతూ నువ్వు!
నీ అడుగుల వెనక
అలుముకుంటున్న రంగుల్లోకి
జారిపోయేముందు
అందరికీ చెప్పిరానీ
నా ప్రియసఖి వసంతమొచ్చిందని!!
————-
శ్రీవారికి ప్రేమలేఖతో సుప్రసిద్ధులైన నిషిగంధ విజయవాడలో పుట్టి, పెరిగారు. ప్రస్తుతం అమెరికాలో, మయామిలో సిస్టమ్స్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్నారు. వదలకుండా పుస్తకాలు చదవడం, కదలకుండా సినిమాలు చూడటం, ఆపకుండా పాటలు వినడం, విడవకుండా స్నేహితులతో కబుర్లు చెప్పడం, అలవకుండా వంట చేయడం ఆమెకు ఇష్టమైన విషయాలు. సంతోషంగా ఉండటమే ఆమె జీవితాశయం.
9 Responses to నీ రాక కోసం..