-స్వాతికుమారి
“ఈ నెలలో ఐదు శుక్రవారాలొచ్చాయి.”
“ఈ మంత్ లో ఫయివ్ ఫ్రైడేస్ ఉన్నాయి” అని కాకుండా పై విధంగా ఏ చదువుకున్న తెలుగువాడైనా అంటే ఆశ్చర్య పోవటమో, ముసిముసిగా నవ్వటమో, అలా అన్న వ్యక్తితో కొంచం చనువుంటే “are you alright?” అని మేలమాడ్డమో వీటిల్లో ఏదో ఒకటి తోటి తెలుగువాడి ప్రతిస్పందనగా ఎదురయ్యే స్థితిలో ఉంది ప్రస్తుతం తెలుగు జాతి.
దైనందిన జీవితంలో తెలుగు:
ఏ భాషైనా జీవనది లాంటిది. ఎన్నో పిల్లకాలువ లొచ్చి నదిలో కలుస్తుంటాయి. అలానే కలిశాయి. బస్సు, రైలు లాంటి ఎన్నో పదాలను తెలుగు భాష లోకి సాదరంగా అహ్వానించాం. తెలుగు భాషకి అన్యభాషా పదాలని తనలో కలుపుకొనే వెసులుబాటు ఉంది. కాబట్టి -మన భాషలో ఇలాటి అన్యభాషా పదాలు వచ్చి చేరాయి, చేరుతూ ఉంటాయి, మన భాషలో లీనమైపోతుంటాయి. ఇదే విధమైన సహజ పరిణామక్రమం కొనసాగి ఉంటే ఇది మనకు ఇంతటి ఆందోళన కలిగించి ఉండేది కాదు.
కానీ ప్రపంచీకరణ, సమాచార/సాంకేతిక విప్లవ ప్రభావమో మరేమో కానీ గత కొన్నేళ్ళుగా తెలుగు భాష పిల్లకాలువల్ని కలుపుకోవటం మాని తనే వెళ్ళి ఒక మహాప్రవాహంలో కలిసి ఇంగ్లీషులో ఐక్యమైపోయే దిశగా మళ్ళింది. ఈ సంపాదకీయం మొదట్లోచెప్పిన ఉదాహరణే ఇందుకు సాక్ష్యం. ఇదేమీ ఉన్నట్టుండి వచ్చి పడిన ఉపద్రవం కాదు. దాదాపు ఒక రెండు దశాబ్దాలుగా ఈ మార్పు చాలా స్పష్టంగా తెలుస్తున్నా, దానిని అభివృద్ధిగా భావించి నిర్లక్ష్యం చెయ్యటం వల్లే ప్రస్తుతం సగం పైగా ఇంగ్లీషుతో సంకరమైపోయిన తెలుగు భాషను మాత్రమే మనం వినగలుగుతున్నాం.
అసలు ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తే ఈ కింద చెప్పినవి ముఖ్యంగా కనపడతాయి.
- విదేశాలలో మంచి ఉద్యోగావకాశాలు ఉండటం వల్ల ఆ దిశగా సిద్ధం చేసే ఆంగ్లమాధ్యమం లోని చదువే గొప్పదని మధ్యతరగతి వర్గంలో బలపడ్డ అభిప్రాయం.
- వ్యావహారిక, మాండలిక, పుస్తక స్థాయిల్లోని తెలుగు తర్వాత ఇంగ్లీషులో మాట్లాడ్డమే మెరుగైన నాగరికతా చిహ్నంగా పల్లెటూరినుంచి నగరానికి వలస వచ్చాక తమ జీవన విధానంలోని అభివృద్ధిని తెలియజేసే సాధనంగా భావించడం.
- గత కొన్నేళ్ళుగా ఇక్కడ విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తున్న విదేశీ సంస్థలలో తెలుగువాళ్ళు పని చేయటంవల్ల భాష లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ పొడసూపే మార్పులకి సర్దుబాటవటం కోసం సొంత భాష, సంస్కృతులను నిర్లక్ష్యం చెయ్యటం.
- ఎటువంటి ఉద్యోగాల్లోకైనా అభ్యర్ధుల ఇంగ్లీషు సామర్థ్యాన్ని ఆశించినట్టు, మాతృ భాషా జ్ఞానాన్ని ఏ సంస్థలూ అడగకపోవటం. ఇందువల్లే చాలామంది, తెలుగురాకపోతే నాకొచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించగలుగుతున్నారు.
ఇలాంటివే మరికొన్ని కారణాలు.
ఐతే ఇక్కడ సమస్య ఇతర భాషలు నేర్చుకోవటం కాదు. మాతృభాష వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదనే నిర్ణయానికి వచ్చి, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటం. మరోలా చెప్పాలంటే నాకు తెలుగు సరిగ్గా రాదు అని గర్వంగా చెప్పుకోగలగటం. ఐతే మాతృభాష మట్టిగలిసిపోనీ గాక – మనకొచ్చే జీతమేమైనా తగ్గుతుందా, అసలు మనకి తెలుగు రాకపోతేనేం? వేరే భాషతో కలగాపులగం చేస్తేనేం? అనే ప్రశ్నలకి ఆర్ధిక లాభనష్టాల భాషలో సమాధానం ఇవ్వటం కష్టమే. కాకపోతే మాతృభాషని మర్చిపోవటంవల్ల మన ఆత్మని, అస్తిత్వాన్ని కించపరచుకున్న వాళ్ళమౌతాము. ఎన్నో గొప్ప భావవ్యక్తీకరణలను, సాహితీ సంపదను, సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించలేని మూఢులమౌతాము.
ఇంతకీ మనందరం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఇతర భాషలను నేర్చుకోవటంద్వారా జ్ఞానాన్ని పెంచుకోవటం, భాషేతరులతో సత్సంబంధాలు, అభివృద్ధి – ఇవి మాత్రమేలక్ష్యాలు. కానీ రోజువారీ జీవితంలో వాటికి మాతృభాషని మించిన ప్రాధాన్యం ఇవ్వటం (అవసరం లేని సందర్భాల్లో కూడా) నిశ్చయంగా ఇతరుల దృష్టిలో (వాస్తవంగా కూడా) మనని మనం దిగజార్చుకోవటమే.
ఈ సమస్య సామాజిక పరిణామంత పెద్దదైనప్పటికీ, పరిష్కారం మాత్రం ప్రతివ్యక్తి/సంస్థ తనకి తాను అమలు చేయగలిగిన చిన్న మార్పుల ద్వారా సాధ్యమౌతుంది.
1. ఎదుటి వ్యక్తి తెలుగువాడే అయినప్పుడు అంకెలు, వారాల వంటి వాటిని, ఇతర సాధారణ సంభాషణల్లోని పదాలను తెలుగులోనే చెప్పటం అలవాటు చేసుకోవాలి.
2. అభ్యర్ధుల ఇంగ్లీషు సామర్ధ్యాన్ని పరీక్షించే సంస్థలు మాతృభాషలో కనీస అవగాహన ఉండటం కూడా ఒక తప్పనిసరి అర్హతగా గుర్తించాలి.
3. మనలో, మన వాళ్ళలో తగ్గిపోతున్న (తెలుగు) చదివే అలవాటును మనకు మనంగా పునరుద్ధరించుకోవాలి. ఏ విషయాన్నైనా మాతృభాషలో చదివి అర్ధం చేసుకోవటంవల్ల ఆలోచనా విధానం, అవగాహనా శక్తి తప్పక మెరుగౌతాయి.
పైన చెప్పినవాటితో పాటు ఇతర మార్గాల్లో తెలుగు భాష పునరుద్ధరణ కోసం ఇప్పటికే కొంత కృషి జరుగుతోంది. ఈ మధ్య కాలంలో అంతర్జాలంలో ఎందరో తెలుగువారు బ్లాగుల ద్వారా, చర్చావేదికల ద్వారా మరుగున పడ్ద సాహిత్యాన్ని, భాషా విజ్ఞానాన్ని అందరితోపంచుకొని తమ తోటి వారికి అవగాహన కల్పించగలిగారు. వర్ధమాన రచయితలకు కూడా ఇవి మంచి వేదికలుగా మారాయి. ఇదిలా ఉండగా మరికొందరు ఔత్సాహికులు ఆన్‌లైన్ పత్రికల ద్వారా భాషాభివృద్ధిని, ప్రాచీన సాహితీ ప్రక్రియల్నీ ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా ఆశాజనకమైన పరిణామం. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ‘పొద్దు’ వినూత్న శైలిలో ‘భువన విజయం’ పేరిట దేశ విదేశాల్లోని తెలుగువారితో ఆన్‌లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. దీనిని ఉగాది పర్వదిన సందర్భంగా పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాం.
భావితరాల కోసం తెలుగు:
మనకి మనం భాష ప్రాముఖ్యతని, అవసరాన్ని, గొప్పతనాన్ని గుర్తించటం వల్ల కొంతవరకూ ఉపయోగం ఉన్నా.., అంతకన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబట్టాలంటే మనపిల్లలకు ఈ వారసత్వాన్ని అందించటం ముఖ్యం. మాతృభాషలో కనీస జ్ఞానం సంపాదించక పోయినా ప్రాథమిక స్థాయి నుండి వృత్తి విద్యల వరకూ ఏదైనా పూర్తిచెయ్యగల విద్యావిధానాన్ని అనుమతించిన ప్రభుత్వాల్ని తప్పుపట్టేకన్నా, ఎవరి పిల్లల విషయంలో వారికి ఆచరణసాధ్యమైన సూత్రాలు కొన్నిటిని పాటించవచ్చు.
– పిల్లలకి ఇంగ్లిష్ ఒక్కటే కాదు, ఇంకో డజను భాషలు నేర్పినా తప్పు లేదు. కాని ఆ నేర్చుకునే భాషల్లో తెలుగు కూడా (!) ఉండేలా చూడాలి.
– పిల్లల్ని బళ్ళో వేసేప్పుడు తెలుగు మాట్లాడితే ఫైన్ తరహా నియమాల్లేకుండాచూసి, కనీసం రెండో, మూడో భాషగా ఐనా తెలుగు నేర్పేచోట చేర్చటం.
– పిల్లలకి తెలుగు కథలు, పద్యాలు వంటివి నేర్పటం. (ముందు మనంనేర్చుకోవాలి). సామెతలు, జాతీయాల వంటివి మనం వాడటం ద్వారా వాళ్ళకి ఆసక్తిని కలిగించి భాషనే కాక, లోక జ్ఞానాన్ని కూడా నేర్పిన వాళ్ళమౌతాము.
-వారి వయసుకు, స్థాయికీ తగ్గ పుస్తకాలను ఎప్పటికప్పుడు కొని చదివిస్తూ, ఆ చదివిన దాని సారాన్ని వాళ్ళు తిరిగి మనతో చర్చించేలా అలవాటు చెయ్యాలి. పిల్లలకు ఇచ్చే బహుమతుల్లో పుస్తకాలు, డైరీలు ఉండేలా చూస్తే అవి విలువైన వస్తువులనే అభిప్రాయం కలగటమే కాకుండా భాషను చదవటమూ తిరిగి రాయటం మీదా కూడా పట్టు సాధించగలుగుతారు.
– మంచి సాహిత్యం, అర్ధం ఉన్న పాటలను వినిపించటం, భాషా ఉచ్చారణ చక్కగా ఉండే టీ వీ కార్యక్రమాలను చూపించటం ద్వారా వారికెన్నో కొత్త పదాలను,వాడుకను నేర్పవచ్చు. మంచి భాషాభిరుచిని పెంపొందించవచ్చు.
చిన్నారులకి ఏం నేర్పినా భాషలోని మాధుర్యాన్ని వారు అస్వాదించి అర్ధంచేసుకునేలా మానసికంగా సిద్ధం చెయ్యటం అవసరం. లేదంటే, ప్రపంచమంతా వేరేలా ఉంటే తమని మాత్రం మనం తెలుగు నేర్చుకొమ్మని నిర్బంధిస్తున్నామనే భావన వాళ్ళకి కలగొచ్చు. వ్యక్తిగతంగా తల్లిదండ్రుల బాధ్యతగానే కాక, ఒక సామాజిక బాధ్యత గల పత్రికగా ఈ దిశగా పొద్దు వైపు నుంచి మేము కొన్ని ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నాం. పిల్లల్లో తెలుగు పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడంలో తల్లిదండ్రులకు సాయపడే దిశలో మా ఆలోచనలు సాగుతున్నాయి. మా ఆలోచనలు అమలు జరిపే దశకు చేరుకున్నాక, వీటి వివరాలను ప్రకటిస్తాం.
మా ఈ ప్రయత్నాలన్నిటికీ ఎప్పటిలానే పాఠకుల, రచయితల తోడ్పాటు, ప్రోత్సాహం ఉంటాయని మా పూర్తి నమ్మకం. ఇదంతా మనందరం కలిసి సాధించవలసిన ఒక మహోన్నత లక్ష్యం.
————
స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరు.
11 Responses to ఉగాది సంపాదకీయం