ఫిబ్రవరి – తెవికీపై ఈనాడు వ్యాసం వచ్చిన నెల. కూడలిలో ఉప్పెనొచ్చిందని వీవెనన్నారు. నల్లమోతు శ్రీధర్ తక్షణ సాంకేతిక సహాయంలో కూడా ‘సాయం చెయ్యండం’టూ జనం వెల్లువెత్తారు. అలాగే ఆ వ్యాసప్రభావంతో ఓ చక్కటి బ్లాగు బయటకొచ్చింది – తెలుగులో రాసే పద్ధతుల గురించి ఈనాడు వ్యాసం చదివాక తెలిసిందని శ్రీవిద్య చెబుతున్నారు. ఈనాడుకు జై!
మీ బ్లాగు మంటనక్కలో ఎలా కనిపిస్తోందో చూసారా? బ్లాగు పాఠకుల్లో అయ్యీని (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు) అస్సలు వాడనివారు కూడా ఉంటారు. వారికి మీ బ్లాగు చదవడంలో ఇబ్బంది ఉందేమో గమనించారా?
కొన్ని బ్లాగులు మంటనక్కలో చూస్తే, హల్లులూ గుణింతాలు విడిపోయి, ఎక్స్‌ప్లోడెడ్ వ్యూ లాగా కనిపిస్తూంటాయి (అయ్యీలో బానే ఉంటుంది). ఈ చెదిరిపోయిన అక్షరాలు పాఠకులను వికర్షించే ప్రమాదం లేకపోలేదు. వీవెన్ దీనికి ఓ మందు కనిపెట్టారు కూడా – ఇది బ్లాగు చదువుకునేవారికి తాత్కాలిక ఉపశమనాన్ని కలుగజేస్తుంది. కొన్ని బ్లాగుల వ్యాఖ్యలకు, కొన్నిటిలో బ్లాగు శీర్షికకు, ఈ చిట్కా కూడా పనిచేయదు. ఉదాహరణకు అభిషేక్ చౌదరి లో వ్యాఖ్యలు చూడండి. రాబోయే మూడో తరపు మంటనక్కలో ఈ ఇబ్బంది ఉండదని భోగట్టా. ఈలోగా మీ బ్లాగు పాఠకులకు ఈ ఇబ్బందిని తప్పించే మార్గాలున్నాయి:
1. మీ మూసలో ఎక్కడైనా జస్టిఫైడ్ (justified) అని ఉందేమో చూడండి. ఉంటే దాన్ని తీసెయ్యండి.
2. మీ మూసలో లెటరు స్పేసింగు, లెటరు హైటు లాంటివి ఉంటే వాటినీ తీసెయ్యండి.
పై రెండూ చేస్తే తిక్క దాదాపుగా కుదురుతుంది. అప్పటికీ ఫలితం లేకపోతే.. సాంకేతిక గురువులున్నారు.., వారిని అడగండి.
ఇహ, ఫిబ్రవరి నెల బ్లాగుల సంగతి చూద్దాం..
జనవరి చివర్లో రాజశేఖరుపై చిరంజీవి అభిమానుల దాడి సంచలనం కలిగించింది. ఫిబ్రవరి చివర్లో ఉండవల్లి అరుణ్ కుమార్ అంబేద్కరుపై చేసిన వ్యాఖ్య ‘సం’చలనం కలిగించింది.
- తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం తన కలగూరగంపలో ఈ విషయంపై సూటి విశ్లేషణ రాసారు. పాఠకుల స్పందనలు కూడా సూటిగానే ఉన్నాయి.
- ఈ ఘటన మీదే కిరణ్ నిర్మొహమాటంగా ఓ జాబు రాసారు.
- దీనిమీద విహారి తన చెణుకొకటి విసిరారు. ఆ జాబు ఇతర సమకాలీన విషయాల మీద కూడా అక్షింతలేస్తూ పోతుంది.
- ఇదే విషయమై దిల్సే బ్లాగులో సాటి బ్లాగరులను పేర్లు పెట్టకుండా విమర్శించారు. “కొందరు బ్లాగరులు” అని రాస్తూ కొందరు కు క్రీగీత గీసారు.
రాజకీయాలపై వచ్చిన ఇతర జాబులు:
- హై. పాతబస్తీలో రాష్ట్ర మంత్రి భంగపడిన విధానంపై డల్లాస్ తెలుగు వెన్నెల రాసిన జాబు చదవండి.
- తేటగీతిలో వచ్చిన ఈ చెణుకులూ, విసుర్లూ చూసారా?
- కోనేరు రంగారావు డాక్టరేటు ఇప్పించుకోవడంపై నెటిజెన్ ఒక జాబు రాసారు. అయితే ఆ జాబులో మరో రెండు సంగతుల గురించి కూడా రాసారు. మామూలుగా గరంగరంగా ఉంటాయిందులో జాబులు. ఈ జాబు కాస్త గారాంగా రాసారేమిటా అని చూస్తే… అదీ సంగతి!
ఈ ఎన్నిక పెట్టెలో మీ వోటేసి ముందుకు సాగిపోండి.
|
[poll=2] |
ఫిబ్రవరిలో వచ్చిన ఇతర జాబులు:
సినిమా:
- తాను చూసిన ఆణిముత్యాల్లాంటి ఓ రెండు సినిమాల మీద నున్న కసినంతా ప్రదీప్ తన సమీక్షలో రాసారు, చదవండి.
- తెలుగు సినిమాను విమర్శించేవారే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో దానికి సమర్ధనగా చక్కని వాదంతో దిల్సే రాసిన ఈ జాబు చూడండి. మంచి చర్చ కూడా జరిగింది.
- అమెరికన్ ముఠామేస్త్రి సినిమా గురించిన సమీక్ష బ్లాగాడిస్తాలో చూడవచ్చు.
హాస్యం:
- సాఫ్టువేరుకు మాట్లెలా వేస్తారో నాగమురళి రాసారు. హాస్యం వెల్లివిరిసిందీ జాబులో.
- విహారి వ్యంగ్యోక్తులతో సమకాలీన విషయాలపై రాస్తూంటారు. వారానికొకటి రాసే సిద్ధ-బుద్ధ సంవాదం దీనికి ప్రసిద్ధి. ఇవి రాజకీయాల విభాగంలోకీ వస్తాయి.
- ప్రసాదం ఈనెల కొత్తిమీర కట్ట రాసారు.
సాంకేతికం:
తెలుగు బ్లాగుల్లో సాంకేతిక విషయాల గురించి క్రమం తప్పకుండా రాసేవాళ్ళలో నల్లమోతు శ్రీధర్ ప్రముఖుడు. ఎప్పటిలాగానే ఈ నెల కూడా పలు విషయాలను స్పృశించారు. కింది రెండూ మా ఎంపికలు:
సాహిత్యం:
కొందరు బ్లాగరులు పేజీకి కాగితం అని వాడుతున్నారు. అది సరైన మాట కాదు.. పేజీ లేదా పుట అనొచ్చు.
- వీడ్కోలు చదివారా? గొడవ ఫణీంద్రదైనా పాఠకుల మనసు భారం కాక మానదు!
- అలై పొంగెరా అనే పాట గురించి కొత్తపాళీ విశ్లేషణ చదవండి
- శ్రీరామమూర్తీ-సిరచ్ఛేదం అంటూ వింజమూరి విజయకుమార్ మూడు భాగాల కథ రాసారు.
- కొల్లూరి సోమశంకర్ వృక్షప్రేమికుడు అనే కథను రాసారు. గతంలో ఆంధ్రజ్యోతిలో అచ్చైన కథ ఇది.
- కథ రాయమంటూ కొత్తపాళీ ఒక ఇతివృత్తాన్ని ఇచ్చారు. ఆ ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని మార్చి 15 లోగా కథొకటి రాసి ఆయనకు పంపాలి. మీరూ పాల్గొనండి. గడువు దగ్గర పడింది.
- తిరిగొచ్చిన గిరి: పద్యాలు రాయడం ఆయనకు నల్లేరుపై నడక. మామూలు సంభాషణలను కూడా పద్యాలుగా మలచే ఒడుపు ఆయనకు బాగా తెలుసు. ఇంగ్లీషులో కూడా వృత్తాలు రాయగల అసాధ్యుడు. ఆయన మామూలుగా రాసిన వాక్యాల్లో కూడా ఏ ఛందం దాగుందోనని వెతుక్కునేవారూ లేకపోలేదు. కొంత విరామం తరవాత గిరి తిరిగి చురుగ్గా రాయడం మొదలుపెట్టారు. ఈ నెల రాసిన పద్యాల్లో ఓ పద్యంలో యవ్వనంపొలంపిక్కుల (ఇంకా ఆ బ్లాగు చూడని వాళ్ళు, ముందు ఈ మాటకర్థమేంటో కనుక్కోండి.. ఆ తరవాతే బ్లాగు చూడండి) గురించి రాసారు చూడండి. రోజుకో పద్యం చొప్పున – ఒక్కోరోజు రెండు కూడా – రాసే గిరి, ఒక్కోసారి వేగానికి నాణ్యతను బలిపెడుతూంటారు. మరింత నాణ్యమైన పద్యాలు రాయగలరని మా నమ్మకం!
- తెలుగును నిర్దయగా కు’ల్ల’బొడుస్తున్నవారిపై తేటగీతి వారు’నా’స్త్రం ఎక్కుపెట్టారు, చూడండి.
- ఓ సంస్కృతశ్లోకంలో, ఒక పాదంలోని సగభాగాన్ని పట్టుకుని రానారె ఒక జాబు రాసారు. దానికి వచ్చిన వ్యాఖ్యలు విజ్ఞానాన్ని పంచాయి. అక్కడి వ్యాఖ్యాతల్లో సూర్యప్రకాష్ ఎవరో తెలియ రాలేదు.
- జాన్‌హైడ్ కనుమూరి రెండు సంతాప కవితలు రాసారు
- వివిధ పత్రికల్లో తాను రాసిన కవితలను విశాఖతీరాన బ్లాగులో చేర్చారు.
బ్లాగుల గురించిన జాబులు..
blogger.com లో ఇప్పుడు నేరుగా తెలుగులో రాసే సౌకర్యం వచ్చింది. ఇప్పటికే ఇన్‌స్క్రిప్టు వాడి తెలుగు రాసేవారికి దీనితో పని లేదు. మంటనక్కలో పద్మ వాడిగానీ, వేరే పద్ధతుల ద్వారా RTS లో రాసి తెలుగులోకి మార్చేవారు గానీ బ్లాగరులోని ఈ కొత్త అంశంతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే RTS నుండి తెలుక్కి మార్చడంలో దాని పద్ధతి వేరుగా ఉంది.
సముద్రానికి ఆటుపోటుల్లాగా ఒరెమూనాకూ ఆటుపోట్లుంటాయి. కొన్నాళ్ళు మౌనంగా ఉండే ఈ బ్లాగు ఒక్కసారిగా చైతన్యం పొంది జాబుల వరద సృష్టిస్తుంది. ఫిబ్రవరి మొదటి పది రోజులూ ఒరెమూనా జాబులతో పోటెత్తింది. బ్లాగులు అనగానేమి? బ్లాగులతో ప్రమాదాలేమిటి? బ్లాగులెలా రాయాలి? ఇలా అనేకానేక బ్లాగు సత్యాల గురించి చావా కిరణ్ తన గొలుసుకట్టు జాబుల్లో వివరించారు. “మీ బ్లాగునకు మీరే సుమన్!” అని కిరణ్ రాసిన మాట ఈ నెల బ్లాగు మాట!
శోధన సుధాకర్ తాను మెచ్చిన బ్లాగుల జాబితా ఒకదాన్ని తయారుచేసి, ఓ జాబుగా రాసారు. ఈమధ్య ఈ జాబితాలు బాగానే వస్తున్నాయి. వీవెన్, రానారె, కొత్తపాళీ, దీప్తిధార, తెలుగువాడిని మొదలైన వారు గతంలో రాసారు. (ఇలాంటి జాబులు సున్నితమైనవి. చదివేవాళ్ళు చూసి వదిలెయ్యాలి, అంతే! అది లేదేంటి, ఇది లేదేంటని అంటూ ఉంటే ఆ జాబితా పెరిగిపోతుంది. అందులో ఉన్నవే మంచివీ, మిగతావి కాదు అని ఆ బ్లాగరి ఉద్దేశం కాదు అని గ్రహించాలి) భవిష్యత్తులో తెలుగు బ్లాగుల చరిత్ర రాస్తే గీస్తే ఇలాంటివి మంచి ముడిసరుకవుతాయి.
బ్లాగ్వీక్షణం అనే వరస జాబుల్లో సీబీరావు తాను మెచ్చిన జాబుల గురించి రాస్తున్నారు. ఈ నెల రెండు జాబులు రాసారు. ఫిబ్రవరిలో కొత్తగా బ్లాగులోకంలోకి అడుగుపెట్టిన బ్లాగు విలాపము లో వెరైటీ ఏంటంటే.. ఇప్పటి దాకా రాసిన జాబులన్నీ కూడా బ్లాగు, కూడలి గురించే!. URL కూడా చూడండి.. క్రయింగ్ బ్లాగ్ – విలపించే బ్లాగు! సరదాగా రాస్తున్న విలాపాలివి!
ప్రసార మాధ్యమాలు:
ప్రముఖుల మరణవార్తలను పత్రికలు, టీవీలూ వెలిబుచ్చిన తీరును ఇద్దరు బ్లాగరులు నిలదీసారు. తెలుగువాడిని తనశైలిలో తూర్పార పట్టగా, పూలవాన రవికిరణ్ పూల చెండుతో ఛెళ్ళుమనిపించారు.
ఇతరత్రా..
- మామూలుగా పాత జ్ఞాపకాల జాబులు నచ్చని వారుండరు. అలాంటి జాబులు చదువుతూ, తమ తమ చిన్ననాటి విశేషాలను నెమరు వేసుకోని వారు అరుదు. అలాంటి జ్ఞాపక జాబుల్లో ఎన్నదగినది సరిగమలులో వచ్చిందీ నెల. ఎండాకాలం సెలవుల మజాను తిరగదోడారు సిరిసిరిమువ్వ.
- తాడిమేటి రాజారావు తన వీధి సినిమా జ్ఞాపకాలను రేగొడియాలు బ్లాగులో చూపించారు.
ఈనెల మిస్సయిన ప్రముఖ బ్లాగులు:
త్రివిక్రమ్ బ్లాగు రాసి కొన్ని నెలలైపోయింది. పొద్దుకు అంకితమైపోయి బ్లాగు రాయడం పూర్తిగా మర్చిపోయిన త్రివిక్రమ్, మళ్ళీ చురుగ్గా బ్లాగాలని కోరుతున్నాం. అలాగే అందం బ్లాగును నవతరంగం ముంచేసింది. రాధిక, కల్హర కూడా ఈ నెల ఏమీ రాయలేదు. వాగ్విలాసం రాఘవ కూడా ఏమీ రాయలేదు. అందుకుగాను ఆయనకు తగు శిక్ష విధించాం.
కొత్త బ్లాగులు:
- “ఎల్లుండి” అనే మాట ఎలా వచ్చిందో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే తెలుగుపద్యం బ్లాగు చూడండి. ప్రజలభిమానించిన తెలుగు పద్యాల గురించి భైరవభట్ల కామేశ్వరరావు చక్కగా వివరిస్తున్నారు. భైరవభట్ల వారు గతంలో పొద్దులో గడిని తయారు చేసారు. పద్యాల గురించి తెలిసికోవడం కోసం ఈ బ్లాగును చూస్తూ ఉండండి.
- శారదమ్మ సరస్వతిలా అంతర్వాహినిలా ప్రవహిస్తోందని చెబుతున్నారు చిన్నమయ్య. ఈ వాహినిని బయటికి తెచ్చే ప్రయత్నమే మాటవరసకి! దీనిపై ఓ కన్నేసి ఉంచండి.
- ఫిబ్రవరిలో మొదలై దూసుకెళ్తున్న బ్లాగు: జాహ్నవి
ఈనెల జాబులు:
- తెలుగు బ్లాగుల్లో ఇప్పటి వరకూ తెలంగాణ అంశంపై వచ్చిన అత్యుత్తమ జాబుల్లో ఒకటి. ఈనెల జాబుల్లో ఇది మొదటిది.
- ఎండి ఎడారైపోతున్న పంటపొలాలను, తలుచుకుని ఓ రైతుబిడ్డ రాసిన ఈ జాబుకు మా రెండో స్థానం
- “శ్రీవారికి ప్రేమలేఖ” ఈనెల మా అత్యుత్తమ బ్లాగుల్లో మూడోది. పైన ఉదహరించిన “వీడ్కోలు” జాబు చదివాక, ఇది చదివితే మనసు కాస్త నిమ్మళిస్తుంది.
ఈ నెల బ్లాగు: తూలిక వారి తెలుగు బ్లాగు.
ఈ బ్లాగును నిడదవోలు మాలతి రాస్తున్నారు. చక్కటి భాష, పాఠకుణ్ణి పట్టుకు కూచ్చోబెట్టి చదివించే శైలి ఆమె సొంతం! చాలా విరివిగా కూడా రాస్తారు. మిరపకాయ బజ్జీల కబుర్లు, ఇక్ష్వాకుల కాలం నాటి తన గడియారం కథా, ‘నీరుగారి’పోతున్న కుళాయిని బాగు చేయించిన ప్రహసనం, ఈనెల జాబుల్లో కొన్ని. తాను గతంలో రాసి ప్రచురించిన కథలను కూడా తన బ్లాగులో పెడుతూ ఉంటారు. చాలా చమత్కారంగా రాస్తారు. ఓ జాబులో పైప్ డాక్టరని పిలిచే ప్లంబరు గురించి ప్రస్తావిస్తూ “ఈమధ్య అందరూ డాక్టర్లే. పైప్ డాక్టర్, రగ్ డాక్టర్, … అంటూ ఈడాక్టరేటులు ఎవరికి వారే పట్ట ప్రదానాలు చేసేసుకుంటున్నారు. డాక్టర్లెవరూ ప్లాస్టక్ ఫిక్సర్-అప్పర్, బ్రెయిన్ రిపేరర్లాంటి టైటిల్సు వాడుతున్నట్టు లేదింకా!” అని చమత్కరించారు. [ఈ మధ్య ఆంధ్ర దేశంలో రాజకీయ డాక్టర్లు అనే రకం తయారైందన్న విషయం అమెరికాలో ఉంటున్న మాలతి గారికి తెలిసిందో లేదో!!]
బ్లాగరులకు ఒక సూచన:
మీ బ్లాగుల నుండి ఇతర బ్లాగులకు ఇచ్చే “లింకులు ఎలా ఇవ్వాలి” అనే విషయమై ఓ సూచన.. ఇక్కడ చూడండి, ఇక్కడ నొక్కండి లాంటి మాటలు రాసి వాటికి లింకులు తగిలించేస్తూ ఉంటాం. సాంకేతికంగా ఇందులో తప్పేమీ లేదు. కానీ బ్లాగు గురించి రాసే వాక్యంలోనే తగు పదానికి లింకు పెట్టడం మెరుగైన పద్ధతి. ఉదాహరణకు, మీరు పొద్దుకు లింకు ఇవ్వదలచారనుకోండి.. తెలుగులో ఉత్తమ అంతర్జాల పత్రిక అనో ఆన్లైను గడి కలిగిన ఏకైక తెలుగు వెబ్ పత్రిక అనో రాసి ఆ పదాలకు లింకు తగిలించాలన్న మాట. దీంతో, ఆన్లైను గడి అనేమాటను వెదకబోయినపుడు సెర్చి ఇంజనుకు పొద్దు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గత నెల ప్రశ్నలు:
గత నెల మేమడిగిన ప్రశ్నలూ వాటి సమాధానాలూ:
- అత్యధికంగా బ్లాగులు (జాబులు కాదు) కలిగిన బ్లాగరి ఎవరు?: జ్యోతి గారని చెప్పారు కొందరు. కానీ, మేమడిగింది జాబుల గురించి కాదు – బ్లాగుల గురించి అడిగాం. ఈ గౌరవం సైకం రాజుకు చెందుతుంది. ఆయనకు ముప్ఫైకి పైగా బ్లాగులున్నాయి.
- అక్షరాల పరిమాణంలో అతిపెద్ద బ్లాగు శీర్షిక కలిగిన బ్లాగు ఏది?: కొత్త బంగారు లోకం అని అన్నారు. అయితే ఆ శీర్షికలో అక్షరాలు పొడుగే.. కానీ సన్నగా ఉంటాయి. వయ్యారంగా ఉంటాయి. వెంకటరమణ బ్లాగు చూడండి.. ఎత్తుకు తగ్గ లావుతో, దృఢంగా, గంభీరంగా ఉంటాయి. అంచేత వెంకటరమణ బ్లాగు మా ఎంపిక.
మార్చి జాబుల కోసం ఎదురు చూస్తూ..
-పొద్దు
సమీక్షా వ్యాసం క్లుప్తంగా బావుంది. అయితే, నా (ప్రసాదం) బ్లాగుకు ఇచ్చిన లింక్ సరిగా లేదు. అది విశాఖతీరానికి దారి తీస్తొంది.;-) ఫిబ్రవరి నెలలో నా బ్లాగులో నాలుగు టపాలు వున్నాయి.
ప్రసాదం
ప్రసాదం గారూ, లింకు పొరపాటును సవరించాం. అందరి బ్లాగుల్లోని అన్ని లింకులూ ఇవ్వటం లేదని మీరు గ్రహించే ఉంటారు; అది సాధ్యమూ కాదు. నెనరులు.
అన్నిటినీ విహంగ వీక్షణం చెయ్యాలనే ప్రయత్నంలో మరీ పొడుగు పెరిగింది. ఐనా, మంచిదేనేమో లెండి, ఎక్కువమంది స్ఫూర్తి పొందవచ్చు.
రాధికకీ కల్హార కీ మధ్య ఒక కామా తగిలించండి.
మొత్తానికి ఇది బాఆ శ్రమ తో కూడిన వ్యవహారం. సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు.
మంచి సమీక్ష.. నేను మిస్ అయిన కొన్ని టపాలని చదివే అవకాశం దొరికింది.. ఇన్ని బ్లాగులని వీక్షించి వాటి గురించి రాయడమంటే మాటలు కాదు. చాలా చక్కని ప్రయత్నం.. మీ శ్రమకు జోహార్లు!
లేదండీ రాజకీయడాక్టరు వినలేదు.వైద్యో నారాయణో హరిః – వైకుంఠం చేర్చగలవాడు, అన్న అర్థంలోనా.
నేను కొన్ని టపాలు మిస్ అయ్యాను.పొద్దు దయవల్ల చదివాను.
ఇలా నెల నెలా బ్లాగుల్లో ఎవరు ఏమి రాస్తున్నారో ఇవ్వడం అనేది చాలా శ్రమ తో కూడిన పని.పొద్దు నిర్వాహకులకు అభినందనలు.
నిడదవోలు మాలతి గారూ, రాజకీయ నాయకులకు వేరే ఇతర అర్హతలు లేకపోయినా మన విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇచ్చేస్తున్నారీ మధ్య. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ వ్యాఖ్య చేసాం. మీరు గమనించారో లేదో.. రాజకీయ డాక్టర్లు అనే పదం నుండి వికటకవి బ్లాగుకు ఒక లింకు ఇచ్చి ఉన్నాం.
ఎంతో కష్టపడి ఏరి మరీ రాస్తే, చదివి చూసు వదిలెయ్యమంటే చాలా బాధగా వుంది. మీరన్నట్లు అందులో వున్నవే మంచివి అనేది నా ఉద్దేశ్యం కాకపోయినా, అవే అత్యుత్తమమైనవి. మంచి బ్లాగులు చాలా వరకే వున్నాయి. అవన్నీ నేను జాబితా రాయలేను.
సుధాకర్ గారూ, నిస్సందేహంగా అది శ్రమతో కూడిన పని. మీ శ్రమను తేలికగా తీసుకోలేదు మేము. మా ఉద్దేశ్యం.. “అదెందుకుంది, ఇదెందుకు లేదు అని తరచకూడదు” అనేగానీ మరోలా కాదు.
వికటకవిగారి డాక్టరేటు వింతలు చదివేనండీ. ఆవరసలోనే బహుమతిప్రదానాలమీద కూడా రాస్తే బాగుంటుంది.
నారచనలమీద మీఅభిప్రాయాలు వెలిబుచ్చినందకు నా ధన్యవాదాలు.
అలాగే, మీకృషి కూడా అభినందనీయం.
నా పేరు “తాడిమేటి రాజారావు” అండీ బాబూ.. “తాడిమేటి రామారావు” కాదు..!! 🙂
ప్రతీ నెలా బ్లాగులను ఓపికగా సమీక్షించడం బాగుంది. మీకు నా కృతజ్ఞతలు.
తాడిమేటి రాజారావు గారూ, తప్పు సవరించాం. చూపించినందుకు నెనరులు.
పొద్దు మిత్రమా, మీరు చెప్పినది తప్పక గుర్తుంచుకుంటాను, పద్యప్రమాణము గా చెపుతున్నాను
ఎప్పుడో తప్ప సమయం దొరకడం లేదు. కానీ ఇదంతా చూస్తుంటే చాలా కుళ్ళుగా ఉంది 🙂 నేను ఎన్ని మిస్ అయిపోతున్నానా అని కూడా . నెలా నెలా జరిపే ఈ సమీక్ష బాగుంది. అందరూ లేదా చాలా మంది మెచ్చిన బ్లాగులనైనా చదివే అవకాశం దక్కుతుంది.