మరో ప్రపంచం కోసం

-గార్ల సురేంద్ర నవీన్

.

పరిగెడుతున్నాను…..

కష్టాల కొండలు ఎక్కుతూ
నిరాశా నదులు దాటుతూ
చిమ్మ చీకటికి దూరంగా
వెలుతురు కోసం ఆశగా
పరిగెడుతున్నాను……

ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ
అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ
చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ
ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి
దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి
ఇంకా కనిపించని గమ్యం కోసం
పరిగెడుతున్నాను……

ఎక్కడా ఆగక
ముళ్ళను లెక్క చెయ్యక
పువ్వుల కోసం ఆశపడక
ఎవరు పిలచినా పలకక
వెనకకు తిరిగి చూడక
పరిగెడుతున్నాను……

తిరిగితే కోరికలు దయ్యాల్లాగా పిలుస్తాయ్
వికార ఆకారాలన్ని ప్రియంగా కనిపిస్తాయ్
విచక్షణ నన్ను వదిలి దూరంగా పారిపోతుంది
మాయ మైకంలా నేనున్నానంటూ ఆవహిస్తుంది

తప్పు తియ్యగా …నిజం చేదుగా
రుచిస్తుంది
నిజాలకు దూరంగా …కలలకు దగ్గరగా
జరగాలనిపిస్తుంది
శరీరం నిజం …ఆత్మ చాదస్తం
అనిపిస్తుంది
దు:ఖం సుఖంగా… ఆనందం భ్రమగా
ఉంటుంది

అందుకే …
ఆనందంతో పొంగే గుండెల కోసం
సు:ఖం పండిన మనస్సుల కోసం
పవిత్రత నిండిన ప్రపంచం కోసం
ప్రేమ విరిసిన ఆత్మల కోసం
మరో ప్రపంచం అందుకొనేందుకు
పరిగెడుతూనే ఉన్నాను….

—-

జి.ఎస్.నవీన్ గార్ల సురేంద్ర నవీన్ తన పూతరేక్స్ బ్లాగు ద్వారా నెజ్జనులకు సుపరిచితుడు. బ్లాగరిగానే కాక, వికీపీడియన్‌గా కూడా ప్రసిద్ధుడు. తెలుగు వికీపీడియాలో తెలుగు సినిమా ప్రాజెక్టులో విశేషమైన కృషి చేస్తున్నారు. మదనపల్లె వాస్తవ్యుడైన నవీన్ బెంగళూరులో సాఫ్టువేరు ఇంజనీరుగా పని చేస్తున్నారు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.