అహమ్!

-ఆదినారాయణరెడ్డి

మనపెద్దలు మనకు పూజలు, సేవలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, ధ్యానాలు మొదలైన వెన్నో భగవత్ ప్రీత్యర్థం ఉపదేశించారు. కానీ భగవంతుడు ఏమిటి? ఆయనను ప్రసన్నం చేసుకునే మనం–అంటే వాటిని నిర్వహించే “నేను” అనుకొనే ఎవరికి వారైన మనమంతా ఏమిటి? అంటే మన సిసలైన ప్రామాణిక స్వరూపం ఏమిటి? ఈ”నేను”ను మనపూర్వులు ఎవరెవరు ఏయే విధంగా తెలియజేశారు? ఈ విషయంలో నాకు కల్గిన అతి పరిమితమైన జ్ఞానాన్ని తమ ముందు సమర్పించుకుంటున్నాను. పాఠకులైన తామందరూ తమకు గల అపార జ్ఞానాన్ని నాతో పంచుకొని నాకు మరింత తెలుసుకునే అవకాశమిస్తారని ఆశిస్తున్నాను.

…ఆకాశానికి కూడా అంతం “నేను” అని. దానినే “అహం” అనీ “ఆత్మ” అనీ అన్నారు. అంటే— అనంతమైనదీ, సర్వ బ్రహ్మాండాలనూ తనలో స్థితం చేసుకున్నదీ అని —మనం అనుకొనే ఆకాశం “నేను” ముందు పరిమితమే!

“నేను అనగా నా శరీరము” అని భావించడం సరియైన సమాధానము కాదు. శరీరము ఏర్పడక మునుపు దాని నిర్మాణము యొక్క ఆవశ్యకతకు ప్రేరేపణ ఏమిటి? కొందరు చెప్పవచ్చు.. తల్లిదండ్రుల శారీరిక సంపర్కమే కదా? అని. అది కొంతవరకు మాత్రమే సరియైనది. తల్లిదండ్రుల పరంపర, పంచ భూతాల పరంపర, ఖగోళం లోని మొత్తం పాలపుంతల పరంపర ఇవన్నీ కూడా సృష్టింప బడటానికి మూల శక్తి ఒకే ఒక్కటి. దానినే “అహం” అని ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతలో చెప్పారు.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః!
అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత మేవచ!!

అని.ఇంత వరకూ దీనికి అర్థం చెప్పిన చాలామంది – “అన్ని ప్రాణులలోనూ నేనే స్థితమై ఉన్నాను. ప్రాణులయొక్క మొదలు, మధ్య, అంతమూ (అంతం చేయువాడను),అంటే– సంహరించు వాడను నేనే” అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెప్పారు. భూతానాం అన్నపదానికి ప్రాణులు అన్న అర్థాన్ని తీసుకున్నారు.

అయితే, “భూతానాం” అంటే “పంచభూతాలకూ” (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములన్నింటికీ) అని అర్థం చేసుకుంటే … భూమికి పరిమితి ఉంది. నీటికి పరిమితి ఉంది. అలాగే వాయువుకు, అగ్నికీ పరిమితం వుంది. అంతు లేనిదీ ఆరంభం కూడా లేనిదీ ఒక్క ఆకాశం మాత్రమే. కానీ శ్లోకంలో చెప్పినదేమిటంటే ఆకాశానికి కూడా అంతం “నేను” అని. దానినే “అహం” అనీ “ఆత్మ” అనీ అన్నారు. అంటే— అనంతమైనదీ, సర్వ బహ్మాండాలనూ తనలో స్థితం చేసుకున్నదీ అని —మనం అనుకొనే ఆకాశం “నేను” ముందు పరిమితమే!

“భూతానామంతమేవచ” అనగా ఆకాశంతో సహా పంచభూతాలు సమస్తమూ “అహం” (ఆత్మ/నేను) లో ఉన్నాయి అని అర్థం. అంటే పంచభూతాల సృష్టికర్త ఈ “నేను”. శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లుగా గీతలో పేర్కొనబడిన ఈ సత్యం … వాస్తవంగా వ్యాసమహర్షిచే సంకలనమైన ఉపనిషత్తుల సారం. (కృష్ణుణ్ణి బ్రహ్మాండ కుక్షింభరుడుగా, పరమాత్మగా భావించేవారికి ఈ భావం మింగుడుబడక పోవచ్చు. ఐతే కృష్ణుడు కూడా సాందీపని అనే గురువు వద్ద విద్య నభ్యసించిన ఒక శిష్యుడే అని తెలుసుకుంటే ఈ సమస్యకు సమాధానం లభిస్తుంది. ఈ శిష్యుడు తాను చదివి, గ్రహించిన చదువులలోని సారాన్నంతా సమయం వచ్చినప్పుడు అర్జునునకు ఉపదేశించి, పరమగురువుగా వెలుగొందినాడు. కానీ దీనినంతా మనకు ప్రసాదించినది మాత్రం సత్యమెరిగిన వ్యాసభగవానుడే) అందుకే కాబోలు సరస్వతీపుత్ర బిరుదాంకితులైన స్వర్గీయ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒకసారి ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసంగిస్తూ, “వ్యాసమహర్షి ఆకాశం మొత్తాన్ని తన పిడికిట్లో ఇముడ్చుకున్న మహనీయుడు” అని కీర్తించారు.

ఇదే విషయాన్ని అదిగురువు శంకరాచార్యులు మరికొంత వివరంగా తెలియ జేశారు. అదేమిటంటే…నేను ఏదికాదు? నేనేమిటి? అనేదానికి పరిపూర్ణ వివరణ.

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే !
నచవ్యోమ భూమి ర్నతేజో నవాయుః
చిదానంద రూపశ్శివోహం శివోహం !!

అనగా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంటే వీటి యొక్క చైతన్యము (Consciousness) … ఇవి “నేను” కాదు. జ్ఞానేంద్రియములైన చెవి, నాలుక, ముక్కు, కన్ను – వీటియొక్క జ్ఞాన సంపత్తి “నేను” కాను. భూతసముదాయాలైన ఆకాశము, భూమి, తేజస్సు (అగ్ని), గాలి — ఇవేవి నేను కాను.

మరి నేనెవ్వరు అంటే … యే బంధానికి సంబంధము లేని శాశ్వత ఆనంద స్వరూపమైన శివాన్ని. ఈ గురువుగారు తనదైన శైలిలో “నేను”(ఆత్మ) “శివం” అన్నారు.

నమృత్యుర్నశంక నమే జాతిభేదా
పితానైవ మే నైవమాతా న జన్మ!
నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్యా
చిదానందరూప శ్శివోహం శివోహం!!

సిసలైన “నేను”కు తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, జాతిభేదం లేదు. ఎందుకంటే అసలు జన్మే లేదు కాబట్టి – మృత్యువు కానీ, దాని వలన భయము కానీ లేవు. పుట్టలేదు. కానీ ఉంది. అదీ “నేను”-“అహం”-“శివం” “ఆత్మ” .

నజాయతేమ్రియతేవాకదాచిన్నాయంభూత్వాభవితావానభూయహా
అజో నిత్యశ్శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే

జన్మలేదు. మరణములేదు. భూత భవిష్యత్తులు లేవు. నిత్యము, శాశ్వతము, పురాతనమైనది ఆత్మ.

సర్వ నేనులు కూడా “నేను” (ఆత్మ) యందే ఆది, మధ్య, అంత్యములను పొందినట్లు భ్రాంతి కలుగుతుందేకానీ–వాస్తవం మాత్రం “నేను” లో జరిగే పరిణామక్రమమే!

ఒక ప్రార్థన ఉంది –

అనంతనామ ధేయాయ సర్వాకార విధాయనే
సమస్త మంత్ర వాచ్యాయా విశ్వైక పతయే నమహా

– అని. ‘అంతం లేని వాడు’ అనే పేరు గల్గిన వాడు అని ఒకర్థం. ‘ఇన్ని పేర్లు అని చెప్పడానికి వీల్లేనన్ని పేర్లు గలవా’డనేది మరో అర్థం. (రెండర్థాలూ సమంజసమే)ఇక అన్ని ఆకారములూ తనే. అన్యము లేదు. అంతా తనే. అన్నీ తనే. ఒక్కటే–.మహా కవి పోతన అంటాడు. “సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నే శరణంబు వేడెదన్” అని.(భాగవతం లోని గజేంద్ర మోక్షం ఘట్టం లోనిది) అన్నిమంత్రాలు కూడా తనే. ఈ అనంత విశ్వ పతి ఒక్కడే. ” నమహా ఆంటే–వందన మాచరిస్తున్నా నని కాదు.(“మహా”మమ కారం “న” లేదు. అంటే నేనన్నది లేదు). ఈ తాత్ కాలిక నేను అన్నది లేదు. ఉన్నదొక్కటే. ఈ అవగాహనే ఈ మంత్ర పరమార్థం. అలా కాకుండా నేను వందన మాచరిస్తున్నాను-అంటే మన శరీరం లోని ఒకానొక పరమాణువు మనకు నమస్కరించి నట్లుగా –అది మనకొక గుడి కట్టిస్తానని మొక్కు కున్నట్లుగా అదొక జోక్ గా ఉంటుంది.

పద కవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులవారు.”భావము లోన బాహ్యము నందును” కీర్తనలో “అచ్యుతు డితడే ఆదియు నంత్యము” “హరిలోనివే బ్రహ్మాండంబులు”అంటారు.”బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అంటూ విశద పరుస్తారు. మరో రచనలో “పురుడు లేదుర నీకు పురుషోత్తమా” అంటారు -ఇలా వివిధ రీతుల్లో అనంత విశ్వశక్తి యొక్క ఏకత్వాన్ని వివరించడం జరిగింది.

జ్ఞానోదయానంతరం గౌతమబుద్ధుడు కూడా అంతా శూన్యం నుండే ఏర్పడిందనే చెప్పాడు. తెలిసో తెలియకో సాధువులనిపించుకున్న వారు వూతపదంగా చెప్పే మాట “అంతా మిథ్య” అని. ఇందు లోని పరమార్థ మేమిటో సైన్సు ప్రకారం నిరూపించ వచ్చునేమో కొంత పరికించి చూద్దాం. అనంత విశ్వంలోని ఏ పదార్థమైనా మూలకాలు లేకుండా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి మూలకము కూడా ఎలెక్ట్రాన్స్ , న్యూట్రాన్స్, ప్రోటాన్స్ (వీటిని ENP అందాం) అనే ఈ మూడూ ఆయా నిష్పత్తుల సమ్మేళనముతో ఏర్పడిందని కూడా ప్రపంచ శాస్త్రవేత్తలందరూ నిరూపించి ఏ అభిప్రాయ భేదాలూ లేకుండా వున్నారు కదా! మరి మూలకాలకు మూలమైన ENP ల వుత్పత్తికి మూలం ఏది?

ఇంతవరకూ నిర్దిష్టంగా ఎవ్వరూ కనుగొన్న దాఖలాలు లేవు. ఎన్ని ఆవిష్కరణలు జరిగినా మూలము ఇదీ అని నిరూపించగలిగినా…. అన్నింటికీ మూలం మాత్రం అనంతమహా శూన్యమనే చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో మన అనుభవంలో గోవు జనితం గోవు, మేక జనితం మేక, మనిషి జనితం మనిషి, అలా దేనికి పుట్టింది ఆ జాతికి చెందుతుంది. కాబట్టి ప్రతి నిర్మాణానికీ మూలమైన ENP లు మహా శూన్య జనితాలైనప్పుడు. సర్వస్వానికీ మాతృక అనంత మహా శూన్యమే కదా! ఆవిధంగా మన అనుభవం ప్రకారం చూసినా గానీ శూన్య జనితాలైన సర్వస్వమూ కూడా శూన్యమే కదా! “అంతా మిథ్య” అన్నమన పూర్వుల మాట కేవల నిరాశావాదం కాదనీ, సాలోచనగానే వారు ఈ నిర్ణయానికి వచ్చివుంటారని మనం గ్రహించాలి.

————

ఆదినారాయణరెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి రైతు. పీ.యూ.సీ వరకూ చదువుకున్నారు. పాఠశాల విద్యకు అంతటితో స్వస్తి చెప్పవలసి వచ్చినా సామాన్యశాస్త్రం, చరిత్ర, ఆధ్యాత్మికాంశాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. ఒక పల్లెటూర్లో, ఇప్పటిదాకా కంప్యూటర్ అంటే తెలియని ఒక వ్యక్తి, టెక్నాలజీ నేర్చుకొని ఇంత పూనికగా రాయడం e-తెలుగు సంఘానికి ఘనవిజయమే!

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

18 Responses to అహమ్!

  1. Rohiniprasad says:

    ఇందులో రెండు వేరువేరు అంశాలున్నాయి. రచయిత స్వశక్తితో ఇటువంటి వ్యాసాన్ని రాయడం చాలా అభినందనీయం. అయితే ఒక స్థాయికి మించి దీన్ని patronizing toneలో పొగడడం భావ్యంకాదు.

    ఇక రచయిత ప్రస్తావించిన విషయాల మాటకొస్తే ఈ రోజుల్లో స్పృహ లేక consciousness అనేది ఏమిటో, ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడానికి క్రీ.పూ. ఆరో శతాబ్దపు బుద్ధుడిపైనా, మధ్యయుగపు తెలుగు కవులపైనా ఆధారపడనవసరం లేదు. “నేను, అహం” మొదలైన భావనలు ఎలా ఏర్పడతాయో ఆధునికవిజ్ఞానం వివరించగలదు. మనసులో కలిగే భావనలకు మితిమీరిన ప్రాముఖ్యతను ఆపాదించి , ఏవో అతీతశక్తులున్నాయనుకోవడం వట్టి భ్రమ. అమీబా నుంచి మనిషి దాకా జీవపరిణామానికి అవసరమైనంత మేరకు నాడుల స్పందనలు కలుగుతూ ఉంటాయి. మనిషికి గల ప్రత్యేక నాడీవ్యవస్థా, మెదడూ మరింత ఊహాశక్తిని కలిగించి ఉన్నవీ, లేనివీ ఒకటేననే భావాలను కలిగిస్తాయి. ‘అంతటినీ’ మనసులోని భావాల ద్వారా తెలుసుకోవచ్చుననుకోవడం అన్నిటికన్నా అర్థంలేని ప్రతిపాదన. బ్రహ్మాండమైన ఈ విశ్వాంతరాళంలో నలుసులుగా జీవిస్తున్న మనుషులకు అంత ‘సీన్’ లేదని ప్రతివారూ తెలుసుకోవాలి.
    http://prajakala.org/mag/category/essays/alochanalu_avagaahana/

  2. mohanrao says:

    manishi antha teluskonnanu, vivarincha galamu anukovadamu anthaa aham athi chinna vishayaalanu kuda science inka aavishka rincha ledu, agnaanulu konne chadivi antha ardham ayyindi anukontaru, mundu anni ijaalu pakkana petty andhari versions chadavandi, aham emito telusthundi.

  3. Rohiniprasad says:

    మనకేది తెలుసో, ఏది తెలియదో తెలుసుకోవడమే జ్ఞానం. అది సైన్సు ద్వారాతప్ప సాధ్యం కాదు, కాలేదు. సైన్సును ఈసడించుకుంటున్నవారందరూ ఒకప్పటి సైన్సువల్లనే లాభంపొందారు. అందుకనే తెలియని విషయాలను తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం కొనసాగాలి. ఏవో అతీతవిషయాలున్నాయనీ, అవి ఎన్నటికీ ఎవరికీ అర్థంకావనీ, అదే జ్ఞానమనీ అనుకోవడమే పెద్ద అజ్ఞానం.

  4. ఆదినారాయణరెడ్డి గారి కృషికి వందనాలు. బ్రహ్మాండమైన వ్యాసం. “..ఇక అన్ని ఆకారములూ తనే. అన్యము లేదు. అంతా తనే. అన్నీ తనే. ఒక్కటే–.మహా కవి పోతన..” ఏ స్థితిలో అన్నారో +ప్రత్యక్ష అనుభూతితో+ తెలుసుకోవడంలో ఎంతో విలువ వుంది.

    అది తెలుసుకుంటే మోహన్ రావు గారి వ్యాఖ్య వేరేలా ఉండేది 🙂 ఇక రోహినీ ప్రసాద్ గారికి అనుభవ జ్ఞానం ఏమి లేదని ఆయన మాటల్లో తెలుస్తున్నది.

  5. ఆదినారాయణరెడ్డి గారికి స్వాగతం. విషయం సంగతి అలాగుంచి, చక్కటి తెలుగు రాశారు. మీకు మPయుటరు ఎలా పరిచయమైందో ఒక బుల్లి ఆత్మకథలాగా చెబితే తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

  6. పైన వ్యాఖ్యలో మాట .. కంప్యూటరు

  7. R kranthi kumar reddy says:

    This article is very good.
    which gives some knowledge about “aham”.

    but upto now nobody defined what it(Aatma) is exactly.

    i feel Rohiniprasad don’t know anything about spirituality.
    He has only limited science knowledge. I think with this limited knowledge you r not eligible to comment on this Article.

  8. రాజేంద్ర says:

    మన అభిప్రాయాలకు భిన్నంగా ఎవరు వ్యాఖ్యానించినా అవతలి వాళ్ళకు ఏమీ తెలియనట్లేనా?ఆదినారాయణ గారు అహం గురించి తనకు తెలిసినవిషయాలు{ నాకు కల్గిన అతి పరిమితమైన జ్ఞానాన్ని}పంచుకున్నారు.రోహిణీప్రసాద్ గారు తనకున్న సైన్సు పరిజ్ఞానంతో తన భావాలను వ్యక్తం చేసారు,మిగిలిన వారిలాగానే.శాస్త్రవేత్త అయినంతమాత్రాన ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడకూడదూ,నీకు తెలియదు నోర్ముయ్ అన్నట్లు మాట్లాడటం ఏమి మర్యాద,ఎక్కడి సభ్యత?

  9. lalitha says:

    దేవుడు, సైన్స్ ఇవి mutually exclusive అంటారా?
    ఒకటి నమ్మే వారు ఇంకొకటి నమ్మ కూడదా?

    రోహిణీ ప్రసాద్ వారి వ్యాసాలు నేను చాలా ఆసక్తిగా చదువుతాను.
    పూర్తిగా ఏకీభవించలేను వాటితో. కాని వారి వ్యాసాల ఉద్దేశ్యంతో
    ఏకీభవిస్తాను అనే అనుకుంటున్నాను. సామాన్య ప్రజానీకం మూఢ భక్తి, నమ్మకాలతో
    మోసపోవడం, మోసగించడం, రాజకీయాల కోసం నమ్మకాలను వాడుకోవడం, ఆవేశాలను పెంచడం,
    దేవుడి సినిమాలతో డబ్బు చేసుకోవడం చూసి ఎంతటి భక్తులూ(నిజమైన భక్తులు) విసుగు చెందక మానరు.
    అలా దేవుడనే మాయలో కొట్టుకుపోకుండా ఆపడమే ఈయన వ్యాసాల ఉద్దేశ్యం అని నాకనిపించింది, చదివినంత వరకు.

    దేవుడిని సైన్సులాగా సైన్సుని దేవుడిలాగా
    భావించడం రెండూ అనర్థ దాయకమే అనే భావన నాది. “సైన్స్” అనే మాయతో
    కూడా మనుషులను ఏమార్చే వారు ఉన్నారన్నది పచ్చి నిజం.

    భగవద్గీతలో నాకు దొరికిన కొద్ది పాటి అర్థం ఇక్కడ ప్రస్తావించాలి అనిపించింది.
    ఫలాపేక్షను త్యజించడం అన్న sacrifice నే వేదాలలో చెప్పబడిన యజ్ఞం లేదా sacrifice గా ర్థం చేసుకోవాలి అని చెప్పబడింది. నాకు ఆసక్తి కరంగా అనిపించింది.

    నేను వేదాలు చదవలేదు. భగవద్గీత కూడా పూర్తిగా చదవలేదు. ఇక అర్థం చేసుకోవడం అనేది నాకు ఇప్పటికి తలకు మించిన పని. కాకుంటే నిజంగా ఆధ్యాత్మికతను ఆశ్రయించిన వారెవరూ మూఢ భక్తినీ, మహిమలనూ, “ఖర్మ” సిద్ధాంతాన్నీ ప్రతిపాదించినట్లు కాక అందులో చాలా మటుకు నిజానికి so called సంప్రదాయాలనీ, ఆచారాలనీ, rituals నీ తృణీకరించిన వారేననీ నాకు ఇంత వరకూ కనిపించింది.

    అందరి వల్లే నేనూ, నాకు తెలిసినదెంత తక్కువో తెలిసి నేనేమి నేర్చుకోగలనో తెలుసుకునేందుకే ఈ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేసుకుంటున్నాను.

  10. Manjula says:

    logicalగా అలోచిస్తే దేవుడు ఉండే అవకాశం లేదు. (దేవుడు అంటె ఇక్కడ ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు అని). జనాలు దేవుడిని నమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి దేవుడు ఇచ్చే security.

    ఇకపోతే సైన్సు దేవుడు mutaully exclusive అంటే నేను చెప్పే సమాధానం, దేవుడు తర్కం mutually exclusive and science is based on logic.

    I want to reiterate that science not a religion. There is NO faith involved in science.

  11. lalitha says:

    I hope to leave this is a food for thought without heating up discussion:
    I am neither a believer nor a non-believer. I am a seeker.
    దేవుడు లేడు అని logical గా ఎలా వివరించ గలమో తెలుసుకోవాలని ఉంది.
    దేవుడు, తర్కం mutually exclusive ఎందుకయ్యాయో కూడ నాకు అర్థం కాలేదు.
    సైన్సు లో నమ్మకం ఎందుకు లేదు? అన్నిటినీ నిరూపించగలం అనుకోవడం నమ్మకం కాదా?
    “దేవుడు లేడు” అనేది ఒక నమ్మకం కాదా?
    Science is supposed to be open to questions. మరి “దేవుడు” అన్న
    సిద్ధాంతాన్ని ఎందుకు explore చెయ్యడానికి వప్పుకోరు, సైన్సు ఒక్కటే నిజమనే వారు?
    నాకు తెలిసి హిందూ ఆధ్యాత్మికత ప్రశ్నించడాన్ని ప్రోత్సాహిస్తుంది.
    “ఆ మాట అనకు, కళ్ళు పోతాయి” అనే టైపు ఆధ్యాత్మికత గురించి కాదు నేననేది.

    ఇంకొక విషయం నాకు పంచుకోవాలనిపిస్తోంది ఇక్కడ. నాకు “కర్మ” సిద్ధాంతం బావుంటుందనిపిస్తుంది, కాని అర్థం కాదు. అయితే నాకు భగవద్గీతలో కనిపించే సందేశం ఒక్కటే,
    “Action!”. ఇదే విషయం నా స్నేహితురాలితో చర్చిస్తుంటే తను ఇలా అంది. “నిజమే కదా మరి, make yourself matter” అని అర్థం ఏమో కదూ అంది.

  12. Rohiniprasad says:

    లలితగారికి,

    http://prajakala.org/mag/category/essays/alochanalu_avagaahana/
    ఇంతకు ముందు నా కామెంటుతో బాటుగా ఇచ్చిన ఈ పై లింకులో దేవుడి భావనల గురించి నేను రాసిన వ్యాసాలు చూడవచ్చు.

  13. Manjula says:

    దేవుడు ఉన్నాడు అనడానికి ఏ రుజువులూ, ఆధారాలు లేవు (దేవుడు scienceలొ ఒక భాగం కానందుకు కారణం అదే). కబట్టి దేవుడు ఉన్నడు అంటే నేను నమ్మను. అంటే నా నమ్మకం ప్రకారం దేవుడు లేడు అనే కదా అర్ధం?

    ఏదైన వస్తువు లేదు అని నిరూపించడం సాధ్యం కాదు. ఉంది అని నిరూపించగలరు. దేవుడు అనే సిద్ధాంతాన్ని propose చేసినవారే దాన్ని నిరూపించాలి. అది నిరూపించినప్పుడు మాలాంటివాళ్ళు (నాస్తికులు) నమ్ముతారు.

    మన దేశంలో తర్కానికి చాలా ప్రాముఖ్యం ఉండేది. I’m very curious to know, how it died.

    This is a blog I’ve written loong back about belief of God.

    http://transcendentalpi.blogspot.com/2005/03/god-savior.html

  14. lalitha says:

    ముందుగా ఆదినారాయణరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఆలోచింపచేసే అంశాన్ని అందించినందుకు.
    మీరు ఇంకా ఇలా వ్రాస్తూ ఉండగలరు. మీ అభిప్రాయాలను కూడా పంచుకోగలరు.

    రోహిణీప్రసాద్ గారు,
    మీ వ్యాసాలు చాలా సార్లు చదివాను, చదువుతూ ఉంటాను. ఆవేశంలోనో, ముందు ఏర్పరిచేసుకున్న అభిప్రాయాలతోనో చాలా సార్లు చదివి కూడా సరిగా అర్థం చేసుకోక పోయుండచ్చు అన్న అనుమానం నాకు ఉంది.
    ఈ సారి ప్రత్యేకంగా ఇంకా కొన్ని విషయాలు ఇంతకు ముందు గమనించనివి గమనించాను. నాకొచ్చిన సందేహాలు, నా అభిప్రాయాలు ఒక టపాలో రాసే ప్రయత్నం చేస్తున్నాను.

    మంజుల గారు, సైన్సులో నమ్మకం అనే దానికి తావు లేదు అని క్యాపిటల్ అక్షరాలతో రాసి మరలా “దేవుడు లేదు అని నా నమ్మకం” అంటూ రాసారు కదా? మీ టపా కూడా చదివాను. అందులో ప్రస్తావించిన సంభాషణ ఆసక్తికరంగా ఉంది. నమ్మకం అనేది ఎలా ఉపయోగపడుతుందో లేద ఉపయోగించుకుంటారో చక్కగా చెప్తోంది.

  15. Pingback: దేవుడు, సైన్స్ « ఓనమాలు

  16. Rohiniprasad says:

    మంజులగారూ,

    మనదేశపు ప్రాచీన షడ్దర్శనాల్లో ఒక్క వేదాంతం తప్ప తక్కిన అయిదూ కూడా దేవుడు లేడని వాదించడమే కాక దేవుడు ఉండడానికి వీల్లేదని నిరూపించాయట. ఆసక్తి ఉంటే ప్రొ. దేవీప్రసాద్ చట్టోపాధ్యాయ రాసిన పుస్తకాలు చదవండి.

    గుడ్డినమ్మకాలు తర్కానికి నిలవవు. సైన్సును ఎవరూ ‘నమ్మరు’. సైన్సు అనేది ప్రకృతి గురించిన కొన్ని సార్వత్రిక లక్షణాల సహేతుక వివరణ. నిరూపణలు లేకుండా సైన్సు ముందుకు సాగదు.

    నేను సైంటిస్టుగా పనిచెయ్యడం మొదలుపెట్టి నలభై ఏళ్ళే అయింది. సైన్సు రచనలు మొదలెట్టి పాతికేళ్ళే అయింది. ఇంకా ఎంతో నేర్చుకోవాలి. అందుకనే నా ‘అనుభవజ్ఞానరాహిత్యం’ గురించిన విమర్శలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం Galilieo’s Finger అనే ఆసక్తికరమైన సైన్సు పుస్తకం చదువుతున్నాను.

  17. భగవద్గీత నూ, ఆదిశంకరాచార్యుల వారినీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వారినీ ఉటంకిస్తూ “అహం ” అనే భావన గురించి ఆదినారాయణ రెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి . సైన్సు పరంగా మూలకాల పుట్టుకకు కారణాల ఆధారంగా ఆదినారాయణ రెడ్డి గారు లేవదీసిన వాదన సమంజసంగా ఉంది. భారతీయతకు మూలాలైన తాత్విక, వేదాంత మీమాంసలు చర్చకురావడం ఆసక్తి కరంగా ఉంది.తాత్విక చింతనకూ, శాస్త్రీయ భావనలకూ మధ్య అనివార్యంగా ఉన్న విభజన రేఖను గమనిస్తే ఇలాంటి వాదోపవాదాలకు తావుండదని నా అభిప్రాయం. చక్కటి వ్యాసం రాసిన ఆదినారయణ రెడ్డి గారికి అభినందనలు.

  18. పొద్దు సంపాదకులుకు,
    మీకు అవగ్రహము పరిచయము చేయదలచుకున్నాను.
    దీని దేవనగరి చిహ్నము ऽ
    దీని తెలుగు చిహ్నము ఽ (ఇది కనబడడానికి మీ కడ వేమన, పోతన ఖతులు వుండాలి, లేదా విండోసు ౭ వుండాలి)
    శివః అహం – శివోఽహం
    शिवः अहं – शिवोऽहं
    सोऽहम् సోఽహం వంటి మాటలలో ఇది వుండడం వుచితం.
    దీని ప్రయోగం ఎక్కడ చేయాలన్నది ఇక్కడ చూడండి.

    పై వ్యాసంలో వుండవలసిన చోట ఇది లేక, పత్రికా సంపాదకులుగా మీకు తెలిస్తే ఈ విషయం పదిమందికీ తెలియడం తేలికవుతుందని ఇక్కడ చెబుతున్నాను.

    రాకేశ్వర

Comments are closed.