నుడికారము – మరికొన్ని కోణాలు

రానారెయర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. తెలుగు నుడికారం పై పొద్దులో ఒక వ్యాసం రాసి పాఠకజనావళి అభిమానం పొందిన రానారె, అదే అంశంపై రాసిన రెండో వ్యాసమిది. ఆస్వాదించండి.

——————–

“పురుగు మూజూసింది!” అనేది ఒకానొక పలుకుబడి. పురుగు అంటే విషపురుగు. ముఖ్యంగా పాము. మూజూడటం అంటే మామూలు అర్థం వాసన చూడటం అని. కానీ ఈ పలుకుబడిలో మాత్రం కాటువేసిందని అర్థం. పాము కరచిందని చెప్పొచ్చుకదా ఎందుకీ “డొంకతిరుగుడు”!? అనిపించవచ్చు. కారణం ఏమిటంటే కరచిన ఆ పాము పేరు వినవస్తే మత్రంయొక్క లేదా మందుయొక్క ప్రభావం పోతుందని ఒక నమ్మకం. ప్రస్తుతం ఆ నమ్మకం ఉన్నా లేకున్నా ఈ పలుకుబడి మాత్రం జనంలో నిలిచిపోయింది.

“బొత్తిగా నల్లపూసవైపోయావు, ఏమిటి సంగతులు?” పలుకరించాడొక మిత్రుడు. నల్లపూసనయిపోవడం ఏమిటి? “ఈ మధ్య కనబడటం లేదు, కనీసం నీ గొంతుకూడా వినలేదు, నీ గురించి ఏ సమాచారమూ లేదు” అనే ప్రేమపూర్వకమైన అర్థమున్నట్లు తెలుగు వాతావరణంలో తిరగినవారికి తెలుసు. భాష మాత్రమే తెలిసినవారూ లేదా కొత్తగా తెలుగునేర్చుకున్నవారైతే, “ఎండాకాలం కదా, బయట తిరిగి బాగా నల్లబడి చిక్కిపోయావు” అనే అర్థముందేమోనని బుర్రలకు పనిచెప్పవలసింది.

ఇట్లాగ ఒక వాక్యంలోని పదాల అర్థాన్ననుసరించిగాక, ఆ ప్రాంతపు జనజీవన నేపథ్యాన్ననుసరించి కొత్తభావం పుడుతుందన్నమాట. పురుగు మూజూసింది, నల్లపూసవైపోయావు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ – ఈ పదాలనుండి యథాతథంగా వచ్చే భావము ఒకటి. ఈ పలుకుబడులలో దాగిన వాడుకలోని భావము మరొకటి. ఇదే నుడికారపు ముఖ్య లక్షణం. గత వ్యాసంలో ఈ విషయాన్ని మరింత విపులంగా ప్రస్తావించడం జరిగింది.

“పొద్దు గూట్లో పడింది” అంటే ఏమిటో, “చిలక గోరింకల్లాగా” కాపురం చేయమనడం ఏమిటో తెలుసా?
****************************

ఒక భాషలోని పలుకుబడులు మరో భాషలోకి తర్జుమా చేయడంలో ఎన్నో ఇబ్బందులు. రెండు భాషల ప్రజల జీవన విధానాల మధ్య అంతరాలు ఎక్కువయేకొద్దీ ఈ ఇబ్బందులు తీవ్రమౌతాయి. అనువాదరచనలు చేసేవారికి భాష తెలిస్తే సరిపోదు. ఆయా భాషలకు సంబంధించిన సంస్కృతులపై అనువాదకునికి అవగాహన లేకపోతే ఆ అనువాదంలో జీవం ఉండదు.

మనవాళ్ల పెళ్లిచూపుల తంతగాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలంటే అందులో ఎంతోకొంత అసహజత్వం తొంగిచూడక తప్పదు. ఎందుకు? పెళ్లిచూపులు అనబడే వ్యవహారమే ఆంగ్లేయులకు అసహజం కనుక. అందుచేత ఏ భాష నుడికారం ఆ భాషకే ప్రత్యేకం. మన జీవనం పాశ్చాత్య జీవనానికి దగ్గరగా మారేకొద్దీ ఈ ప్రత్యేతక కనుమరుగౌతూ పోతుంది. అప్పుడు మన నుడికారం కూడా ఆంగ్ల నుడికి దగ్గరగా మారిపోతుంది. జీవనవిధానమే నుడికారానికి ముడిసరుకు కనుక ఇది అనివార్యం.
****************************

సినిమాలలో ఒక సన్నివేశానికి తీవ్రతను చేకూర్చడంలో నేపధ్య సంగీతం ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో మనకు తెలుసు. సందర్భానికి తగిన శబ్దాలతోకూడిన పదప్రయోగం చేయగలిగే వీలు భాషలోనే ఉండటం ఒక చెప్పుకోదగ్గ విశేషం. చిన్న ఉదాహరణ చూద్దాం. విపరీతమైన కోపంలో ఉన్న మహా బలవంతుడైన ఒక మహాకాయుని ముఖాన్ని ఊహించండి. ఆ ముఖంలో క్రోధాన్ని తెలుపుతూ అతని నొసలు ఎగిరెగిరి పడుతోంది. ఈ ఉగ్రరూపాన్ని కళ్లకు కట్టేందుకు వాడబడిన ఒకేఒక్క పదం: నటదుద్యద్భృకుటీభయంకరము. ఈ పదాన్ని పలకడంలోనే ఆ ఉధృతి అర్థమౌతుంది. నటత్ ఉద్యత్ భృకుటీ భయంకరము. నుడి అంటే మాట,పలుకు అనే అర్థాలున్నాయి.

దాశరథీ శతకంలోని ఈ పద్యం చూడండి – రాముడు తిరుగులేని వీరుడు, ఎదురులేని దేవుడు, రెండవ సాటి దైవమింక లేదనే భావాన్ని ఎలుగెత్తి ప్రకటించే ఈ పద్యంలోని శబ్దార్థాలు గమనించండి.

భండన భీము డార్తజన బాంధవు డుజ్జ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి, రామ మూర్తికిన్,
రెండవ సాటి దైవ మిక లేడనుచున్, గడగట్టి, భేరికా
దాండ డడాండ డాండ నినాదంబు లజాండము నిండ, మత్తవే
దండము నెక్కి చాటెదను! దాశరథీ కరుణా పయోనిధీ!

ఇంతకు మించిన ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. మీకు తోచింది మీరూ ఒకటి చెప్పండి.

ఉచ్చారణలోని వైవిధ్యం వలన జనించే అర్థాలు పలువిధాలుగా ఉండటం మనకు అనుభవంలోనిదే. ఇది దాదాపుగా ఏ భాషలోనైనా ఉండేదే. ఈ విధానం తెలుగుకు ప్రత్యేకమేమీ కాదు. కానీ ఇది ఒక్కో పదాన్ని నొక్కి పలికే తీరులో మాత్రం ఏ భాష ప్రత్యేకత దానిదే. ఇక్కడే భాష ప్రత్యేతకను నుడికారము నిలబెడుతుంది.
****************************

“తలపులు ఎన్నెన్నొ – కలలుగ కంటావు. కల్లలు కాగానె – కన్నీరౌతావు. మౌనమె నీ భాష ఓ మూగ మనసా …” ఈ గేయాన్ని మీరు వినే ఉంటారు. తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా ఉంటూనే ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పినట్లుగా అనిపించే సంబోధన “ఓ మనసా” అనేది. ఈ ప్రయోగం మాటల్లోనూ, పాటలోనూ, కవితల్లోనూ కనబడుతూ ఉంటుంది. బహుశా వాగ్గేయకారులు “ఓ మనసా … ” అనే సంబోధనను వాడకంలో పెట్టి ఉండవచ్చు.

జనసామాన్యంలోకి చొచ్చుకుపోయి దీర్ఘకాలంపాటునిలిచే రచనలు చేసిన వారందరూ తమదైన నుడికారాన్ని అప్రయత్నంగానే సృష్టిస్తూ ఉంటారు.
****************************

నీ శ్రాద్ధమ్, నీ పిండమ్, అప్రాచ్యుడా – ఇలాంటి సంస్కృతతిట్లు బ్రాహ్మణుల ఇళ్లలో వినబడటం మీరు గమనించే ఉంటారు. ఆ సమాజాల్లో సంస్కృతం చదువుకున్నవారు ఎక్కుగా ఉండటం వల్ల కావచ్చు. ప్రాచ్యం అంటే తూర్పుప్రాంతం. ప్రాచ్యుడు కానివాడు అప్రాచ్యుడు. తిట్లేకాదు మామూలు మాటల్లో కూడా సంస్కృతం ఎక్కువగా తొంగిచూస్తుంది. దేవభాషాపరిమళం ఎంత ఎక్కువగా ఉంటే ఆ భూసురునికి అంత గౌరవం. బ్రాహ్మణేతర సమాజాల్లో తిట్లు, మాటలూ మరోలా ఉండటం మనకు తెలిసిందే. ఇలా బ్రాహ్మణుల నుడికారం కాస్త ప్రత్యేకం(గా ఉండేది). గురజాడ కన్యాశుల్కం, చిలకమర్తివారి గణపతి మొదలైన రచనలలో మనం ఈ నుడికారాన్ని చూడవచ్చు.

కొన్నేళ్ల కిందటి మాట. మా పల్లెకు ఒక కొత్త కోడలు వచ్చింది. చాలా ఆరోగ్యవంతురాలు. మగవాళ్లు మాత్రమే చేయగలిగే కొన్ని సేద్యపు పనులను కూడా అలుపు లేకుండా చేయగలిగేంది. ఆమెకొక బిడ్డ కలిగిన కొత్తల్లో వాళ్ల పుట్టింట్లో కొన్నాళ్లుంది. వాళ్లు ఆమెకు కేవలం గొడ్డుకారం మాత్రమే ఆహారంగా పెట్టారు. నీళ్లు ఎక్కువగా తాగనివ్వలేదు. ఇలా పథ్యం పెట్టకపోతే బాలెంతరాళ్లకు కొన్ని ప్రాణాంతక వ్యాధులొచ్చే అవకాశం ఎక్కువని వాళ్ల గట్టి నమ్మకం. బిడ్డతో ఆమె మా ఊరికొచ్చేసరికి ఆమె ఆరోగ్యము, బలమూ అన్నీ శాశ్వతంగా కోల్పోయింది. ఆమె పరిస్థితి చూసి హృదయం ద్రవించినవాళ్లు అన్నమాట – “ఎద్దట్లాటి మనిషి. ఎట్టైపోయనో చూడు.” ఒక ఆడ మనిషిని ఎద్దుతో పోల్చడం – కేవలం వ్యవసాయాధారిత సమాజంలో మాత్రమే వినబడుతుంది. మిగతావారికిది మొరటుగానూ ఎబ్బెట్టుగానూ ఉంటుంది. ఎద్దులపై సహజీవనం చేసేవారికీ వాటిపై ప్రేమగలవారికీ ఇవేమీ కనబడవు. ఎద్దుల శక్తి, ఎప్పుడంటే అప్పుడు ఎంత పనైనా చేసేందుకు సిద్ధపడటమే కనబడుతుంది.

సముద్రానికి దగ్గరగా నివసించే మత్స్యకారులకు వారి జీవనవిధానంనుడి పుట్టిన ప్రత్యేక నుడికారం ఉంటుంది. ఇలా ఏ వృత్తిలోనివారికి ఆ వృత్తికి, ఆ జీవితానికి సంబంధించిన పలుకుబడులు వారి భాషలో భాగమైపోతాయి. ఇందుకే తెలుగు నుడికారం భాషకు సంబంధించినది మాత్రమేగాక మన సమాజ జీవనానికి సంబంధించినది.
****************************

ప్రపంచంలోని ప్రతి భాషకు వ్యాకరణము, ఛందస్సులాంటి కొన్ని సంప్రదాయనియమాలతో తనదైన శిల్పం ఉంటుంది. ఈ లక్షణం ఆయా భాషల నుడికారాలను నిర్దేశిస్తుంది. ప్రతినిత్యం మనం టీవీలో చూసే వ్యాపార ప్రకటనల్లో వినిపించే భాషను గమనించండి. ఉదాహరణకు ఒక సబ్బు గురించి “ఇది రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది” అనేమాటను నమ్మకంగా సాధికారంగా సొగసుగా చెప్పవచ్చు. కానీ దీన్నే మరోవిధంగా చెబుతారు – “ఇది ఉంచుతుందీ… మిమ్మల్ని రోజంతా తాజాగా.” ఇలాంటి మాటలు హిందీనుండి లేదా ఇంగ్లీషునుండి అనువదింపబడిన వ్యాపారప్రకటనల్లో తప్ప మామూలుగా ఎవ్వరూ మాట్లాడరు. ఇది ఉంచుతుంది … అంటూ మొదలెట్టడం ఆ భాషలకు నప్పుతుందేమోగానీ, తెలుగుకు ఇది కొత్త. కానీ పదేపదే మన టీవీల్లో ఇలాంటిమాటలు వినీవినీ మన పిల్లలకు ఇది అలవడవచ్చు.
****************************

కేవలం వ్రాత(లిపి) ద్వారా నుడికారం అన్నది అందదు. శబ్దార్థం నుడికారానికి ప్రాణం. దీన్నే యాస అనుకోవచ్చు. ఒక మాటను ఎలా పలుకుతున్నామన్నదాన్నిబట్టి మాత్రమే కాక, ఎవరితో మాట్లాడుతున్నామన్నదాన్నిబట్టి కూడా దాని అర్థం మారిపోతుందని మనకు తెలుసు. ఔనా!? — అంటే “అలాగన్నమాట, సరే” అని ఒక అర్థం, “తెలిసి చెబుతున్నావా, నాకు తెలీదని చెబుతున్నావా” అన్న సందేహం వ్యక్తపరచడం ఇంకొక అర్థం. “అబ్బా! మాకు తెలీదులే” అనే వేళాకోళం మరొక అర్థం. పలికే పద్ధతినిబట్టి, శ్రోతల నేపథ్యాన్నిబట్టి ఈ అర్థాలు మారుతూంటాయి.

ఆంధ్రదేశంలో ‘బాగున్నావా?’ యొక్క కొన్ని ఇతర రూపాలు: “బాగున్నవా? బావున్నావా? మంచిగున్నవా? మంచిగున్నావె? మంచిగున్నవానె? బాగుండావా? బాగుండావ్? బాండా..వ్?”

నేను దగ్గరగా గమనించిన ఒక ఉదాహరణ – సాధారణంగా వ్యవహారంలో వినబడే ప్రశ్న “బాగున్నారా?”. దీన్ని కడపజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో …
— తూర్పు-ఆగ్నేయం — “బాగుండా…రు?” (‘డా’ను కొంచెం సాగదీసి, ‘రు’ను కొంచెం కుదించి)
— తూర్పు-ఈశాన్యం — “బాగుండారూ…?” (‘రూ’ను కొంచెం సాగదీసి)
— పశ్చిమ-నైరుతి — “బాగుండారా?”
— పశ్చిమ-వాయవ్యాలలో ఎలా పలుకుతారో నాకు ఇదమిద్దంగా తెలియదు.

ఇలా ఒకే జిల్లాలోనే అతి సామాన్యమైన, సాధారణమైన ఒక చిన్న మాటను వివిధ రకాలుగా ఉచ్చరించడాన్నిబట్టి నుడికారపు ప్రాంతీయతను గురించి మనం అవగాహన చేసుకోవచ్చు. కడపజిల్లా యాస అంటూ ప్రత్యేకించి ఒకే ఒక్క యాస లేదు. కాకపోతే, మిగిలిన జిల్లాలతో పోల్చినపుడు సార్వజనీనమైన ఒక యాస ఉందనుకోవచ్చు. అలాగే, “రాయలసీమ మాండలికం” అన్నది కూడా. తెలంగాణ, కోస్తా ప్రాంతాల యాసలతో పోల్చినపుడు మాత్రమే రాయలసీమ మాండలికం కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు దేనికదే సార్వజనీనమైన ప్రత్యేక యాస ఉంది. కాబట్టి రాయలసీమలోని ఏ ప్రాంతపు భాషను మరియు యాసను ‘రాయలసీమ మాండలికం’ అంటున్నారన్నది రాయలసీమ వాసులకు తెలియనట్లే, తెలంగాణలోని ఏ ప్రాంతపు యాసను ‘తెలంగాణ’ మాండలికం అంటున్నారో వారికీ తెలియదనుకొంటాను. అలాగే కోస్తా జిల్లాల్లోనూ ఎన్నో మాండలికాలు. “వస్తా ఉండారా, పోతా ఉండారా” అని ఏవో రెండుమూడు పదాలు మాట్లాడి, అదే రాయలసీమ నుడికారం అనిపింపజేస్తుంటారు మన సినిమాల్లో. ప్రాంతీయజన జీవనంతో మమేకమైతే తప్ప, ఏ ప్రాంతపు నుడికారమైనా ఎవ్వరికీ అలవడదు. మన సినిమాల్లో చూపించే ‘సీమ యాస’ సీమలోని ఏ ప్రాంతానికీ దగ్గరగా ఉండదు. కాకపోతే అది సీమేతరులకు తెలిసే అవకాశం తక్కువ. సినిమాల్లోని తెలంగాణ, కోస్తా యాసల సంగతి కూడా ఇంతేనేమో!?
****************************

ఒక వ్యవస్థకు, రంగానికి లేదా వర్గానికి సంబంధించిన వ్యక్తులమధ్య జరిగే సంభాషణలో వారికే ప్రత్యేకమైన, ఒకోసారి వారికి మాత్రమే అర్థమయ్యే నుడులు దొర్లుతూ ఉంటాయి.

హాస్టలు విద్యార్థుల మధ్య కొన్ని నుడులు పుడుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ: “జాతీయం చేసెయ్యడం” — అంటే ఏదైనా ఒక వస్తువు దొరికితే, దాని సొంతదారుడు గుర్తుపట్టకుండా రూపురేఖలు మార్చి, అందరూ కలసి దాన్ని వాడుకోవడం. నాగార్జునసాగరం లాంటి ఆనకట్టలను జవహర్లాల్ నెహ్రూ జాతికి అంకితం చేయడం, బ్యాంకుల జాతీయకరణం మొదలైనవి పాఠ్యపుస్తకాలలో చదవడం ఈ నుడికారానికి నేపథ్యం. మన విద్యాలయాల్లో ఇలాంటి పలుకుబడులు లెక్కలేనన్ని.

రెవెన్యూ వ్యవహారాలలో ఎక్కువగా వినబడే ఉర్దూ, పారసీ భాషల పదాలు. దీనికి కారణం బహుశా మహమ్మదీయ రాజుల పరిపాలనలు కావచ్చు. ప్రామిసరీనోటు రాయడానికి ఉపయోగించే భాష ప్రత్యేకంగా ఉంటుంది. డబ్బు చెల్లించినపుడు “… గాన, ముట్టినది” అని ‘రసీదు’ రాసివ్వడం రెవెన్యూ నుడికారం.

కాలంతోబాటుగా పుట్టి, కాలంతోబాటే మాసిపోగల నుడులకు ఒక ఉదాహరణ ‘గాంధీలెక్కల్లో కలిపెయ్యడం’ — గాంధీ ప్రభావం తగ్గుతున్నకొద్దీ, ఈ నుడి వాడుక తగ్గుతోంది.

ఇంగ్లీషు మాట్లాడినట్లుగా తెలుగు మాట్లాడటం. ఎంత కాదనుకున్నా, మన తెలుగు టీవీ ప్రయోక్తలదీ ఒక నుడికారమే. బయట మామూలుగా మాట్లాడేవారు, కెమెరా ముందుకు రాగానే, వారు మాట్లాడే పద్ధతి మారిపోతుంది (కారణాలు, అవసరాలు ఏవైనా).

మన సామెతలన్నీ నుడికారంలో భాగాలే.
****************************

సంధులు, సమాసాలద్వారా ఒకటికన్నా ఎక్కువపదాలను కలిపి ఒక కొత్త పదాన్ని తయారుచేయగలగడం తెలుగులోని ఒక భాషావిశేషం. ఒక పదానికి ఒకటికన్నా ఎక్కువ అర్థాలున్న పదాలతో ఇలా ఏర్పడిన కొత్తపదాల్లోని కొన్ని చమత్కారాలు:
ఆలమంద అంటే ఆవుల మంద అని అర్థం. పెళ్లాల మంద కాదు.
ఆలవాలము – ‘ఆలవాలము’ అంటే ‘పాదు’ అని అర్థం. మొదళ్ల చుట్టూ నేల కుళ్లగింపబడి, నీళ్లు నిలిచి, మొక్కలు చురుకుగా పెరగడానికి అనువైన పరిస్థితి పాదులో ఉంటుంది. రాజమహేంద్రవరాన్ని (రాజమండ్రిని) వర్ణిస్తూ ‘కవిసార్వభౌములకిది ఆలవాలము’ అన్నారు. అలా కాకుండా ‘ఆలమంద’ నుండి ఆవులయొక్క అని గ్రహిస్తే, వాలము అంటే తోక గనక, ఆవులతోక. పక్షులు ఆవులపై వాలి వాటిని బాధించే పిడుదులను, వాటిపైవాలే ఈగలను తింటాయి, ఆ ఈగల్లాగా పక్షులలాగా ‘ఆవులపై మేము వాలము’ అని ఇంకో అర్థం కూడా తీయొచ్చు. తెలుగులో ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఎన్నెన్నో.
****************************

గతంలో నుడికారంపై నేను రాసిన వ్యాసానికి పూర్ణత్వాన్నిచ్చే ప్రయత్నంగా నాతో ఈ వ్యాసాన్ని రాయించిన (సాలభంజికల)నాగరాజుగారికి కృతజ్ఞతాభివందనాలతో … రానారె.


~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

15 Responses to నుడికారము – మరికొన్ని కోణాలు

Comments are closed.