ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

ప్రశాంతి ఉప్పలపాటి

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……ఏమిటో ఆమె మాటల్లోనే:

నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని చేద్దాం అనుకునేదాన్ని. మొత్తానికి ఏమీ చేయకుండానే కాలం గడిచిపోయింది.

కార్గిల్ యుద్ధం అప్పుడు మాత్రం ఏదైనా చేయాలనే తపన నా భయాలనన్నిటినీ అధిగమించి డబ్బులు సేకరించి పంపేలా చేసింది. ఇంకోసారి పేపరులో స్రవంతి అనే అమ్మాయికి రక్తమార్పిడి కోసం డబ్బులు అవసరమని చదివి నెట్ స్నేహితులందరికీ మెయిల్స్ పంపితే తక్షణమే స్పందించి వారి సహాయాన్నందించారు. మంచి పని ఏదైనా సరే అనుకున్న వెంటనే అమల్లో పెట్టేయాలి, తోడ్పాటు దానంతటదే అందుతుందని అర్థమయ్యేలా చేసారు.
group-photo_2.jpg
అయినా నాలో పెద్ద మార్పు లేదు. ఎందుకంటే అవి అన్నీ తాత్కాలిక స్పందనలే. ఆ సమస్య పరిష్కారాం కాగానే, హమ్మయ్య ఓ మంచి పని చేయగలిగాననే ఆనందం తప్ప, ఇంకా ఏమి చేయగలనా అని ఆలోచించలేదు. అప్పట్లో ఉద్యోగరీత్యా నాకు మంచి బ్రేక్ రాలేదు. మానసికంగా కూడా నేను సరిగా లేను.

“నేను జీవితంలో ఇంకా నిలదొక్కుకోలేదు.”
“కొంత వెనకేసాక సేవ చేస్తాను.”
“నాకు అంతటి సామర్ధ్యం ఉందా?”
“నాకు సమయం చాలదు.”
“ఎవరైనా ముందు ఉంటే నేను చేస్తాను.”

ఇలాంటి పలాయనవాదంతో గడిపేదాన్ని. ఎప్పటికైనా చేస్తానులే, సేవ చేయాలంటే పక్కా ప్రణాళిక ఉండాలి అని నన్ను నేను సముదాయించుకునేదాన్ని.

అలాంటి సమయంలో నాలో మార్పు తెచ్చింది ఓ ప్రయత్నం. చేద్దాంలే, చూద్దాంలే, పక్కా ప్రణాళిక వేసుకుందాం ఇలా అనుకుంటే అసలు మొదలే కావు. ఏదో ఒకటి మనం చేయలేనంత మాత్రాన మిగతావేవీ చేయలేమని కాదు. ఫలానాదేదో చేశాక, సాధించాక ఇంకేదో చేయడం కాదు. అసలు మనం ఉన్న పరిస్థితుల్లో, మనకు ఉన్న వనరులను ఉపయోగించుకుని పని చేసేటట్టు ఉండాలి. ఏవో లేవు అనుకోకూడదు, అని నేర్పిందో సందర్భం.

అర్థరాత్రి …… అపురూప క్షణాలు

2005 ఫిబ్రవరి 4 రాత్రి, ఈనాడు హెల్ప్ లైన్ లో ‘పదకొండేళ్ళ బాలిక అస్మా కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ కి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది’ అని చదివి మనసాగక తెలుగుపీపుల్ డాట్ కాం చర్చావేదికలో పోస్ట్ చేసాను. మనం అందరం కలిసి ఎంతో కొంత పంపుదాం అని. ఏదో పోస్ట్ చేసానే కానీ ఎంతమంది స్పందిస్తారు అనేదాని మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు. నేను ఒక్కదాన్నే ఇవ్వగలిగే మొత్తం కంటే, ఏ కొంచెం ఎక్కువ అందచేయగలిగినా చాలు అనుకున్నాను.

పొద్దున లేచి చూస్తును కదా, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. చాలా మంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. డబ్బులు ఎలా పంపాలి అని అడిగారు. భాస్కర్ గారైతే అప్పటికే ఎమ్మార్వో గారికి డబ్బులు పంపేసారు. నాకు కొంచెం ఉత్సాహం వచ్చి, కొద్ది రోజుల వ్యవధి పెట్టుకుని ఎంత సేకరించగలిగితే అంత ఒక్కసారే పంపుదాం అని చెప్పాను. అలా మొదలైన ప్రయత్నం, ఇంకా బాగా సహాయం చేయగలమా అనే ఆలోచనతో మొదలై చివరికి మేమే బాధ్యత తీసుకునే స్థితికి వచ్చింది. ఎంతో అనుభవం ఈ మొదటి కేసులోనే. ఎలాగైతేనేమి ఆ పాపకి ప్రాణభయం లేదు, ఆపరేషను అవసరం లేదు, ఫిజియోథెరపీతోనే నయం చేయచ్చు అని విన్నాక ప్రాణం లేచొచ్చింది.

అస్మా విషయం విజయవంతంగా ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు నాలో చాలా అంతర్మథనం జరిగింది. ముందు నిలబడగలిగితే, కొంచెం బాధ్యత తీసుకుంటే మనకు చేయూతనిచ్చేవారు ఎంతమంది ఉన్నారు, ఇతరులకి సహాయపడడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు అని అనిపించింది. అందరూ ఒకలాగే ఆలోచిస్తారు. ఎవరో ముందు నడిస్తే తాము ఎంతటి పని చేయడానికైనా సిద్ధపడతారు. ఒకసారి మనం ముందు నిలబడితే చాలు, తరువాత ఇక నడవనవసరం కూడా లేదు, మన తోటి వారే మనల్ని ముందుకు తీసుకెళతారు. ఇది నా అనుభవం నాకు తెలిపిన నిజం.

ఐతే ఆ బాధ్యత తీసుకోవడానికి ముందు వ్యక్తిగతంగా నా లోటుపాట్లు ఏమిటి, నలుగురికీ ముందు నిలబడగలగడానికి నా అర్హత ఏమిటి అనేది నా పరంగా ఎలా ఉంది, నలుగురి దృష్టికోణంలో ఎలా ఉంది అని ఆలోచించాను. అంతమంది నన్ను నమ్ముతున్నప్పుడు, నా మాటకు విలువిచ్చి మంచి పనికి తోడుగా వస్తున్నందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా అనిపించింది. నన్ను పట్టి పీడించే అపోహలు, నా పట్ల, నా సమర్థత, అర్హతల పట్ల నాకు గల భావాలు అన్నిటినీ ఆ నాటి ఆ స్ఫూర్తి అధిగమించింది.

సరే. ఈ సాయాన్ని ఇలాగే కొనసాగించాలి, ఇలా ముందుకు వచ్చిన వారిని వెనక్కి పోనీయకుండా ఇంకా ముందుకు సాగాలి అనుకున్నంత వరకు బాగుంది. ఎలా సాగాలి, ఇది తదుపరి ప్రశ్న. ఇలాంటి పనులు చెయ్యాలనుకున్నప్పుడు మొదట ఎదురయ్యే పెద్ద సమస్య కమ్యూనికేషన్. అవసరమొచ్చినప్పుడల్లా ఒక్కొక్కరికి మెయిల్స్ పంపడం చాలా కష్టం. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలా కాకుండా ఒక మెయిలింగ్ గ్రూప్ ప్రారంభించినట్లైతే ఆ గ్రూప్ కు నేను మెయిల్స్ పంపుతూ ఉంటాను, ఇష్టమైన వాళ్ళే అందులో సభ్యులుగా చేరుతారులే అనుకున్నాను. గ్రూప్ ప్రారంభించాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆ గ్రూప్ కి పేరు ఏమి పెట్టాలి అనే ప్రశ్న ఎదురైంది.

పేరులో ఏముంది!!

నెల్లూరులో శ్రీ పెరుగు రామకృష్ణ దంపతులు, శ్రీమతి జయప్రద గారి ప్రోద్బలంతో, మిగతా కవులందరి ప్రోత్సాహంతో నేను రెండు మూడు కవి సమ్మేళనాల్లో పాల్గొనడం జరిగింది.

శ్రీమతి పెరుగు సుజనారామం గారి శ్రేయోభిలాషి ఒక రిటైర్డ్ అంకుల్ ఉండేవారు. సాహిత్యం అంటే తనకి ఎంతో ఇష్టం. ఆయనకు నా కవితలు నచ్చాయి. నన్ను రామకృష్ణ గారి ఇంటిలో కలిసారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అందరమూను. ఆ తరువాత ఒకసారి ఆయన తను కొత్తగా చదివిన పుస్తకం గురించి చెప్తూ, తనకు బాగా నచ్చిన కథ చెప్పారు:

సముద్రంలోని ఆటుపోట్ల వల్ల ఎన్నో స్టార్ ఫిష్ లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. కొన్ని కిలోమీటర్ల మేర పరుచుకున్న ఒడ్డంతా స్టార్ ఫిష్ లే ఉన్నాయి. ఒకతను ఒక్కొక్క స్టార్ ఫిష్ ను తీసుకుని సముద్రంలోకి విసరసాగాడు. ఓ బాటసారి అతన్ని చూసి దగ్గరకి వెళ్ళి ఇలా అడిగాడు:

‘చూడు ఒడ్డు ఎంత పొడవుగా ఉందో. ఎన్ని వేల స్టార్ ఫిష్ లు ఉన్నాయో. ఒక్కొక్క దాన్ని అలా విసరడం వల్ల ఈ సమస్య తీరుతుందా, పరిస్థితిలో మార్పు వస్తుందా! ఎందుకీ వృథా ప్రయాస!’.

అప్పుడు అతను ఇతనికేసి చూసి, మరలా ఇంకొక స్టార్ ఫిష్ ను చేతిలోకి తీసుకుని ‘దీని పరిస్థితిలో మార్పు వస్తుంది’ అంటూ సముద్రం లోకి విసిరేస్తాడు.

చాలా అద్భుతమైన కథ అనిపించింది. ఆ రోజు అంకుల్ చెప్పిన ఆ కథ నాకు మరలా గుర్తొచ్చింది. మనందరి మనస్తత్వానికి సరిపోయే కథ. సమస్య పెద్దదైనప్పుడు, మనం చేసే ఓ చిన్న ప్రయత్నం వల్ల ఏమి ప్రయోజనం అనే నిరాశావాదం, పలాయన ధోరణే ఎక్కువ ఉంటుంది సమాజంలో.

అంతే కానీ ఏ ఒక్క వ్యక్తికి మనం మేలు చేయగలిగినా అది గొప్ప విషయమే అని అనుకోం. ఏది చేయలేం అనేదాన్ని గురించే ఆలోచిస్తాం తప్ప, మార్పుకోసం ఏది చేయగలం అని ఎప్పుడూ ఆలోచించం. అందుకే ఆ ఆలోచన కలిగించడానికే గ్రూపు పేరు “మార్పుకోసం” (ఇంగ్లీషులో “To Make A Difference”) అని పెట్టాను. గ్రూపు URL ఇది: http://groups.yahoo.com/group/tomakeadifference
గ్రూపుకొచ్చే మెయిళ్ళను, గ్రూపులో జరిగే చర్చలను అక్కడ చూడవచ్చు.

స్ఫూర్తిదాయకం

గ్రూప్ పెట్టాలనుకోవడం, పేరు నిర్ణయించడం అయిపోయాక, ఇక ఆచరణలో పెట్టడమే మిగిలింది. అప్పుడే ఎప్పుడో చదివిన మరొక కథ గుర్తొచ్చింది:

ఒకతను ఏదో కారణం వల్ల జైలుకెళ్తాడు. వాళ్ళ నాన్న అతనికొక ఉత్తరం రాస్తాడు. ‘ఒరేయ్ బాబు! మేం ముసలివాళ్ళమైపోయాం. బయటిపనులు చేయలేం. మన పెరడులో పాదులేసుకుని, పండే కూరగాయలతో ఏదో బతుకుబండిని నెట్టుదామనుకుంటున్నాం. పెరడు చదును చేసే శక్తి లేదు. వేరే వాళ్ళ చేత చేయించడానికి డబ్బులు లేవు. నువ్వు ఇక్కడ ఉండి ఉంటే ఈ బాధ్యత నువ్వు తీసుకునేవాడివి కదా’ అంటూ. అది చదివి ఇతను ఆలోచనలో పడతాడు.

ఓ పదిహేను రోజుల తరువాత తండ్రి నుంచి మళ్ళీ ఓ ఉత్తరం వస్తుంది తనకి. ‘ఒరేయ్ బాబు! పోలీసులకు నువ్వు ఏమి చెప్పావు? వాళ్ళు వచ్చి పెరడు అంతా తవ్వి వెళ్ళారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ నాకైతే సంతోషంగా ఉంది. ఇక మొక్కలు వేసుకోవచ్చు’, అని. ఆ ఉత్తరం చదివి ఇతను తృప్తిగా నవ్వుకుంటాడు.

నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అన్నదాంతో సంబంధం లేకుండా, మనస్ఫూర్తిగా ఏమైనా చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలవు అనేదే నీతి ఈ కథలో.

యాడ్ వాల్యూ టు యువర్ మనీ – ఇది టాగ్ లైను. డబ్బుకి విలువ జోడించడమంటే, ఆ డబ్బు ద్వారా కలిగే ప్రయోజనంతో పోల్చడం. మనం ఇచ్చిన 100 రూపాయలు లేక 500 రూపాయలు, ఒక సహాయానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒక ఆపరేషను నిమిత్తం మనం ఇచ్చే డబ్బు, అందరి చేతులు కలిసే సరికి పది వేలో, ఇరవై వేలో, లేదా ఓ లక్షో అవుతుంది. ఇక్కడ 100 విలువ ఆ లక్షతో సమానం. ఓ మనిషికి దక్కిన ఆరోగ్యంతో, నిలబెట్టిన ప్రాణంతో సమానం, వెరసి ఓ జీవితం, ఊపిరి పీల్చుకున్న కుటుంబం. ప్రపంచంలోని ఏ బాంక్ అయినా, ఏ షేర్, స్టాక్ లేదా మ్యూచ్యువల్ ఫండ్ అయినా మన డబ్బుని అన్ని రెట్లు చేయగలదా, ఇంత తక్కువ సమయంలో. ఈ సత్యమే ఆ టాగ్ లైనుకి అర్థం.

ఇక గ్రూప్ పేజీలో ఉన్న ఫోటో గురించి కూడా చెప్పాలి. గూగుల్ లో గాలించి రెండు, మూడు ఇమేజులను కలిపి ప్రస్తుతం ఉన్న ఫోటో ని సృష్టించాను. “మిమ్మల్ని మీరు గ్రూప్ కి పరిచయం చేసుకోండి”. అందరికీ మన గురించి తెలియచేయడానికి సూర్యకిరణాలు సంకేతం. పరిచయం చేసుకున్నాక అందరితోను మన భావాలు, అనుభవాలు, సలహాలు పంచుకోవాలి. అప్పుడు ఒకరికొకరం బాగా అర్థమవుతాం. మార్గం చాలా పెద్దది. ఆశయం ఉదాత్తమైనది. కలిసి పని చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం.

ప్రత్యేకతలు:

ఎన్నో సంస్థలు సంఘసేవలో రకరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే, ఓ కొత్త గ్రూపు పెట్టాల్సిన అవసరం ఏముంది! దీని ప్రత్యేకత ఏమిటి?

1. ఏ ఒక్క నిబంధనకో బందీ కాకపోవడం:

సాధారణంగా సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటికి లోబడే అవి పనిచేయాలి. ఎంత డబ్బున్నా సరే, అవసరం ఎంత న్యాయమైనదైనా సరే వారి పరిథిలోకి రాకపోతే వారు ఎలాంటి సహాయం చేయరు. ఇది ఎవరి తప్పు కాదు. ఒక సంస్థ ప్రణాళికాబధ్ధంగా నడవాలంటే నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలి.

ఈ గ్రూపు అలా ఉండకూడదు, ఏ ఒక్క నిబంధనో ఓ మంచి పని చేయడానికి అడ్డు రాకూడదు అనేదే ముఖ్యోద్దేశ్యం. ఇవే చేయాలి, ఇలాగే చేయాలి అనే థంబ్ రూల్స్ ఏవీ లేవు. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమే. ఒక కేస్ మా దృష్టికి వచ్చినప్పుడు, అది సరైనదేనా, ఫలాన వారికి సహాయం చేయాలా, వద్దా, చేయదలుచుకుంటే ఎలా చేయాలి అనేది నిజానిజాలు తేల్చుకుని, అందరూ కలిసి నిర్ణయిస్తాము.
ముఖ్యంగా ఎవరూ, ఏ సంస్థ సహాయం చేయని కేసులని మేము తీసుకుంటాము. అవసరం నిజమైందా కాదా అని మాత్రమే చూస్తాము. మానవతా దృక్పథమే మా నిర్ణయాలకు ప్రాతిపదిక.

2. నగదు చేతికి ఇవ్వకుండా ఉండడం:

విద్యా పరమైన సహాయమైనా, ఆరోగ్య పరమైన సహాయమైనా, ఇక ఏ రకమైనా సాధ్యమైనంతవరకు మేము డబ్బులు అవసరార్థులకు ఇవ్వము. పాఠశాల లేదా కళాశాల యాజమాన్యానికి కడతాము. టెక్స్టు మరియు నోటు పుస్తకాలు, సంచీలు, పెన్సిల్స్, పెన్ లు వగైరా అన్నీ మేమే కొంటాము. అలాగే హాస్పిటల్ కు రోగి తరపున డబ్బులు కడతాము. మందులు మేము కొనడం కానీ లేదా రోగి కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం కానీ చేస్తాము.

3. పాలనపరమైన ఖర్చులు లేకపోవడం:

మేం ఏ పని మీద వెళ్ళినా ఖర్చులు వలంటీర్లే భరిస్తాం. కన్వేయన్స్ చార్జులు, ఫోను బిల్లులు ఇలాంటి ఖర్చులు ఏవీ ఉండవు. ఎవరు ఎంత పంపినా సరే, మొత్తం ఆయా కేసుల పరంగా ఖర్చు అవుతుందే తప్ప, వాలంటీర్ల ఖర్చులంటూ ఏవీ ఉండవు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆయా ఖర్చులు భరిస్తాం.

4. కుటుంబం లాగా ఉండడం:

సాధారణంగా సంస్థలు సంస్థల్లాగే ఉంటాయి, సభ్యులు సదస్యులలాగే ఉంటారు. కానీ మేం ఈ గ్రూప్ ని ఓ కుటుంబంలా భావిస్తాం. ఒకే రకమైన అభిప్రాయాలు లేకపోయినా, ఆలోచనా విధానాలు, ఆశయాలు ఒకటే. మా వ్యవహార శైలి అంతా ఆత్మీయంగా ఉంటుంది. ఓ సభ్యుల సమూహంగా కాక, స్నేహితుల కూటమిగానే దీన్ని మేం పరిగణిస్తాం. అలాగే వ్యవహరిస్తాం.

సేవ, ఇతరులకేనా?

నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అస్మాకు నేను సహాయం చేసానా, అస్మా నాకు సహాయం చేసిందా అని!!

1. నా సమయాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఒకప్పుడు చాలా వృథాగా గడిపేదాన్ని.

2. ఓ కవిత రాస్తేనో, ఓ పుస్తకం చదివితేనో, ఓ పాట వింటేనో, ఓ సినిమాకెళ్తేనో కలగని ఆనందం నాకు ఈ పనులు చేయడం వల్ల కలుగుతోంది.

3. ఎంతో మంది మంచివారితో నాకు పరిచయం కలిగింది. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత. అన్ని వయసుల వారిలోనూ ఉత్సాహం. ఏదో చేయాలనే తపన.
allgroups_1.jpg
4. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అనుభవాలు పాఠాలు నేర్పాయి.

5. నాకు నా బ్లడ్ గ్రూపు ఏదో కొన్ని నెలల క్రితం వరకు తెలీదు. భయం. డాక్టర్లన్నా, ఇంజెక్షను అన్నా చాలా భయం. అలాంటిది నేను థలస్సీమియా వ్యాధి గురించి తెలుసుకున్నాక నా బ్లడ్ గ్రూపు చెక్ చేయించుకున్నాను. నేను ఎలాంటి సేవ అయినా చేస్తాను కానీ రక్తదానం మాత్రం చేయను అనుకునేదాన్ని. ఇంజెక్షను అంటేనే భయం. ఇక రక్తదానం అంటే అమ్మో!! కానీ త్వరలో అది కూడా చేయబోతున్నాను.

6. నాకు చిన్నప్పటి నుంచి షిర్డీ బాబాతో మంచి అనుబంధం. ఎప్పుడూ ఏదో ఒకటి తగువులాడుతూ ఉంటాను. అలాంటిది లోకంలో ఉండే బాధలు కొంచెం దగ్గరగా చూడడం మొదలెట్టాక, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినందుకు మనం ఎంతగా వినమ్రులమై ఉండాలో, అందుకు ప్రతిగా మన తోటివారికి ఎంతగా సేవ చేయాలో కదా అనిపిస్తుంది.

7. పాశ్చాత్య దేశాల్లో మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాలి అని చదివి తెగ విమర్శించుకునేదాన్ని. కానీ ఆ మాటకర్థం నాకు ఇప్పుడు బాగా తెలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మా ఇంటికి రావడం, నా పనులు నిలిచిపోవడం, లేదా చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో విలువ తెలిసొస్తోంది. ఎవరినీ విమర్శించకూడదు. ఆయా పరిస్థితులు మనకు అనుభవంలోకి వస్తే కానీ అలానే ఎందుకు ప్రవర్తిస్తారో మనకు అర్థం కాదు.

8. మనసుంటే మార్గముంటుంది. అలాగే మనం తీవ్రంగా దేనికోసమైనా తపిస్తే తప్పక దాన్ని మనం సాధించగలం. పరిస్థితులు వాటంతట అవే ఎదురవుతాయి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా. ది అల్కెమిస్ట్ లోని ‘వెన్ యు వాంట్ సంథింగ్, ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్’. ఇది చాలా నిజం. సమాజానికి ఏదో చేయాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. అనుకోకుండా నేను మొదలెట్టాను. అనుకున్నట్టుగా చేయగలుగుతున్నాను. ఇంకా బాగా చేయాలనే ఉత్సాహాన్ని పొందుతున్నాను.

9. సహజంగా నేను చాలా మూడీ. అలాంటిది ఓ కొత్త వ్యక్తి గ్రూపు గురించి మెయిల్ చేసినా, ఫలానా విధంగా పని చేద్దాం అని చెప్పినా, ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అన్నీ మరిచిపోయి ఇంకా ఇంకా శ్రమించాలని ఉత్తేజం కలుగుతుంది.

10. అన్నిటికీ మించి వెలకట్టలేనిది, వర్ణించలేనిది, మన సహాయం అందుకున్న వారి మొహంలోని సంతోషం, కృతజ్ఞతాభావం.
allgroups_2.jpg

ఇప్పుడు చెప్పండి. మనం ఇతరులకు సహాయం చేస్తున్నామా, మనకు మనమే సహాయం చేసుకుంటున్నామా?

వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది?

ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు?

ఈ ప్రశ్నకు, ప్రత్యేకతే నిబంధనగా పెట్టుకున్న ఈ గ్రూపు సభ్యుల సమాధానమేమిటి, వారు ఏమేమి చేసారు, చేద్దామనుకుంటున్నారు, చేయలేకపోయినవేంటి… ఇవన్నీ ……… వచ్చే వారం తెలుసుకుందాం.

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం.

ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం . ఏ . ఇంగ్లీషు చదివిన ప్రశాంతి (లేఖిని వాడి) యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.

About ఉప్పలపాటి ప్రశాంతి

“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం. ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం.ఏ ఇంగ్లీషు చదివిన ప్రశాంతి, లేఖిని వాడి యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

19 Responses to ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

Comments are closed.