సింధువు

swathi.bmp“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి రచనలు పొద్దు పాఠకులకు కొత్తకాకపోయినా పొద్దులో ఇది స్వాతి గారి తొలి కవిత కావడం విశేషం.

————-

గవ్వల గనుల అన్వేషణ లో
అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో
ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో
పసితనపు పాటలకు
పరుగులెత్తి పడిన పందేలకు
సేద తీర్చిన సాగర సమీరం.

కలల తీరం లో
ప్రేమ పారవశ్యం లో
ఊహల భారం తో
మాటలు వెదికే మౌనం లో
మెల్లని కెరటాలని
పాదాల మీదకి పంపి
తలపులని తేలిక చేసే ఆర్ద్ర సముద్రం.

చిత్తమంతా చింతలు ముప్పిరిగొని
ఒకదాన్నొకటి ఢీకొని
ఒక్కో అల ఉద్రేకం తో ఎగసిపడి
మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి
ఆటు పోట్ల అంతస్సంఘర్షణ
నిదర్శనం గా కల్లోలపు కడలి.

ఘడియో క్షణమో
ఉద్రేకమో క్రోధమో
జీవితాల్నీ ఆశయాల్నీ
ఇళ్ళ్లనీ ఊళ్ళనీ
సుడిగుండాలతో సునామీలతో
మున్నీట ముంచిన
మహోగ్ర మహార్ణవం.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

7 Responses to సింధువు

Comments are closed.