తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీ. మరికొందరు బ్లాగరుల బ్లాగులు, వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో…
అంశం: చీమకుట్టింది
వీవెన్:
చీమ కుట్టింది, నెప్పి పుట్టింది.
పప్పు నాగరాజు
చీమాయణం:
మన బ్లాగు వీరులందరూ చీమలమీద రాసిన టపాలు చదివేక నాకు కూడా చీమ-కుట్టింది. అదే, చీమలమీద ఓ టపా రాయలనే దుర్భుద్ది పుట్టింది.మనం మనుషులం కాని మాకులం కాదుగదా – నెప్పి తెలియకపోవడానికి. చీమో, దోమో, నల్లో, బల్లో – కుడితే నొప్పి తెలియని మానవుడుంటాడా. సరిగ్గా ఇది రాస్తున్నప్పుడే నన్ను చీమ కుట్టి నాకు నెప్పి పుట్టింది. ఇంత నెప్పి పుడుతోందేమా అని చూద్దును గదా అది చీమ, ఆడ చీమ!. నేనే పాపం చేసేనని అది నన్ను కుట్టింది? ఇది గిట్టనివారి కుట్ర కాదుగద? చీమల్లో కూడా ఆడచీమలు కుడితే నెప్పి ఎక్కువగా ఉంటుందని రసవాదంలో రాసేరు. కానీ ఇదేంటి, మరీ ఇంత నెప్పి పుడుతోంది? అయితే ఆడచీమలు కుట్టేది ఆపేక్షతోనే గానీ కసితో కాదని, వాటి మనసులో ప్రేమకే తప్ప పగకు తావు లేదని మగ పురుగులు గ్రహించాలి. నేను చీమ కుట్టినచోట మా ఆవిడ చేత కాపడం పెట్టించుకోవడానికి పోతున్నా.
అంచేత రెండో భాగం వచ్చేవారం.
చదువరి:
మిగిలిన చీమలన్నీ ఒక వరుసలో పడి క్రమశిక్షణగా పోతుంటే ఈ చీమొక్కటే అడ్డదారులు వెతుకుతూంది. నేనప్పుడే అనుకున్నా.. ఇదేదో రాజకీయ చీమ లాగుందే అని. దానికి బుద్ధి చెబుదామని వేలడ్డం పెట్టా. ఇంకేముంది, అసలే రాజకీయ చీమ, పైగా దాని తప్పుడు పనులకు అడ్డం వచ్చాను కదా.. కసుక్కున కుట్టేసింది. వామ్మో అని వేలు పిసుక్కునే లోగా, కిసుక్కున ఓ నవ్వు నవ్వి, మాయమై పోయింది. హబ్బ, ఇంకా నెప్పదరగొడుతోంది.
రానారె:
మా ఈరబల్లె బళ్ళో పిలకాయలకు నేనే లీడర్నని చెపినా గదా, అందుకని మా పెదపంతులు గారు నన్ను పిల్చుకోని “ఒరే రామనాథమూ, రేపు మనమెళ్ళే విహారయాత్రలో పిలకాయలనూ నివ్వే జాగ్రత్తగా చూసుకోవాల. వాళ్ళ సంగతి నీకే అప్పజెప్తా ఉండా” అని చెప్పినాడు. ఇగ జూసుకో నా రాజా, నాకు ఇమానమెక్కినట్లా అయిపోయినాది. యాత్రకెళ్ళే ఆ పొద్దు నాకు యమా ఉశారుగా ఉండాది. పిలకాయలంతా మనం చెప్పినట్టల్లా ఇనుకుంటారు గదా, ఎందుకుండదు మరి? మా క్లాసులో ఉండే ముని రత్నం గాడికి నేనంటే మా ఉక్రోశం, వాణ్ణి కాకుండా నన్ను లీడర్ను జేసినారని. యాత్రలో తమాశైన విషయం జరిగింది. పిలగాయలంతా ఓ చోట గుమిగూడి ఉన్నారు. ఏంది జేస్తా ఉండారు అని అడుగుతా నేను ఆడికి బోయినా. మా ముని గాడు ‘ఒరే రామూ ఈ బొక్కలో నా ఉంగరం పడి పోయినాదిరా, నాకు రాడం లేదు, తీసిపెట్టవా’ అని అన్యాడు. మీరంతా తప్పుకోండిరా అని నేను ముందుకెళ్ళి ఆ బొక్కలో నా వేలు పెట్టినా. ఏమి చెప్పమంటారు? చీమ కసుక్కున కుట్టింది. కళ్ళనీళ్ళు దిరిగినాయి గానీ, నేను లీడర్ని గదా, అందుకని నీళ్ళను కళ్ళ లోకి తోసేసుకుని, ఉచ్చ బోసుకుందామని చెట్టు చాటుకు బోయి, తనివిదీరా ఏడ్సినా. పిలగాళ్ళంతా నవ్విన ఇదానం తలుసుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తాది నాకు.
విహారి:
నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది ఎర్ర చీమా,
దీనికి పొయ్యే కాలం రానూ, దీని ఆయువు మూడీ పోనూ.
– విలాప విహారి
శోధన:
ఎంతసేపూ చీమ కుట్టిందని మన గోల మనదే గానీ అసలా చీమను ముందు బాధపెట్టి అది తిరగబడి మనలను కుట్టేవరకు పరిస్థితిని తీసుకొచ్చిందెవరు అని ఆలోచించరేం? అసలు ఒక చీమకు మనిషంతవాణ్ణి కుట్టాలంటే ఎంత సాహసం కావాలి? ప్రాణాలు పోగొట్టుకునేంత వెర్రి సాహసం ఎవరైనా ఎప్పుడు చేస్తారు? ప్రాణాధారమైనదాన్నో లేక ప్రాణం కంటే విలువైనదాన్నో కోల్పోయినప్పుడే కదా? అది ఆలోచించకుండా మనలను చీమ కుట్టిందో అని గోలపెట్టడం ఒఠ్ఠి బాధ్యతారాహిత్యం. తాను చీమకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపపడకుండా గోలపెట్టే హక్కు చీమకాటు తిన్న మనిషికెవరిచ్చారు? లోపం మనలోనే ఉంది. ఆ లోపాన్ని గురించి ఆలోచించకుండా చీమకుట్టిందని బాధపడడం పిచ్చిపని.అబ్బా……..! చీమ నన్ను కూడా కుట్టింది బాబోయ్!
ఒరెమూనా:
ఓ రోజు
ఓ రాజు
ఓ కంత
ఓ చీమ
ఓ కాటు
ఓ కేక
…
ఆ వేలెవరిది?
ఈ అరుపెందుకు?
…
కోహం?
అహం బ్రహ్మస్మి
అహం విష్ణుహు
అహమేవా ఈశ్వరహ
??
యు.వెంకటరమణ:
చీమ కుట్టడం, దద్దుర్లు రావడం, మందు పూయడం, దద్దుర్లు తగ్గిపోవడం ఎలా ఉంటుందో ఈ పోస్టు వివరంగా తెలియజేస్తుంది. ఇక్కడున్న స్క్రీనుషాట్లను ఒకదాని తరువాత ఒకటి చూసుకుంటూ వెళ్ళండి.ఈ టపాలో మామూలు ఎర్రచీమకాటు గురించి వ్రాసాను. నల్లచీమకాటుకు, గండుచీమకాటుకు, కొరివిచీమకాటుకు విడిగా టపాలు వ్రాస్తాను.
గమనిక: ఈ స్క్రీనుషాట్లలో దద్దుర్లు మాత్రమే కనిపిస్తాయి, నెప్పి కనబడదు. ఇవి అన్ని ఆపరేటింగు సిస్టముల్లోను కనిపిస్తాయి. మీకేమైనా సందేహాలుంటే, చీమ
మిమ్మల్ని కుట్టాక నాకు రాయండి.





అంతరంగం:
చీమల్లోని ఐక్యత, భావ సమైక్యతను గమనిస్తే నాకు అబ్బురమనిపిస్తుంది. తమకు కలిగిన నాడు దాచుకుని లేనినాడు వాడుకునే వాటి అలవాట్లను చూసి మనమెంతో నేర్చుకోవాలని నాకు అర్థమైంది. పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా కలిసిమెలిసి బతికే వాటి జీవిత విధానం చూసి.. మనుషులు కూడా అలా భేదభావాల్లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా బతకొచ్చు గదా అని ఆలోచనల్లో మునిగి పోయాను. ఇంతలో వేలు ఛర్రు మనిపించి ఉలిక్కి పడి చూస్తే ఏముంది.. ఓ చీమ కసుక్కున కొరికి పారిపోతోంది. హు.. వీటిలో మనుషుల లక్షణాలూ ఉన్నాయని తెలుసుకుని ఎంతో బాధపడ్డాను. అది కుట్టిన నెప్పి కంటే మనుషులకు తీసిపోని దాని ప్రవర్తన నాకెంతో బాధ కలిగించింది.
కల్హార:
చీమ కుట్టిన వెన్నెల వేళ
వెన్నెల జారుతూంది
జలతారు దారాల్లా
వెన్నెల తాగి
బరువెక్కిన కనుదోయి
మత్తులో మూసుకుపోయి
తీయని హాయిని అనుభవిస్తున్నాయి
సరిగ్గా అప్పుడు
చీమకుట్టిన చప్పుడు
చురుక్కుమన్నది చిటికెనవేలు
తళుక్కుమన్నవి కంటి కొసలు
కుట్టింది వేలినైతే
కంటి కెందుకో ఈ ప్రసవవేదన!
చీకటి కారుతూంది
కన్నుల కాటుకలా
అవీ-ఇవీ:
రాత్రి చీమ నన్ను ముద్దు పెట్టుకుంది. చీమ కుట్టడం విన్నాం గానీ ముద్దు పెట్టుకోవడమేమిటీ అని అనుకుంటున్నారా? కుట్టేందుకు అసలు చీమకు పళ్ళే లేవని మీకు తెలుసా? పళ్ళే లేకపోతే కుట్టడమేమిటి? కుట్టడమని మనమేదైతే అనుకుంటున్నామో అది కుట్టడం కాదు, అది మనలను ముద్దు పెట్టుకుంటున్నదన్నమాట! నిజం!! ముద్దుపెట్టుకున్నపుడు చీమ మీసాలు మనకు గుచ్చుకుని చురుక్కుమనిపిస్తాయి. దాన్ని మనం కుట్టడంగా అపోహ పడుతున్నాం. ఈ విషయాన్ని ఈ మధ్యే పరిశోధించి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలకు హిందూలో వచ్చిన ఈ లింకు చూడండి. కాబట్టి ఇకపై చీమ పుట్టలో వేలు పెట్టినపుడు వేలు చురుక్కు మంటే అది కుట్టిందని ఆక్రోశించకండి.. తన ఇంట్లోకి ఆహ్వానిస్తూ మిమ్మల్ని ముద్దెట్టుకుందని గ్రహించండి.
దీప్తిధార:

నేను ఇందాకటి టపాల్లో రాయడం మర్చిపోయాను. నేను బ్లాగు సమావేశాలకు హాజరవడం మొదలుపెట్టినప్పుడు లేదుగానీ నెల్లూరుకెళ్ళొచ్చాక ప్రతిసారీ నన్ను సమావేశస్థలిలో చీమలు కుడూతూనే ఉన్నాయి. అసలు నన్ను కుడుతున్నది లోకల్ చీమలు కాదు.

అవి రైల్లో నాతోబాటు ఇక్కడికొచ్చిన నెల్లూరు చీమలే. ఇది ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నెల్లూరు చీమలు కుడితే కుట్టినచోట మొదటగా మంట పుడుతుంది. ఆ తర్వాత రుద్దిన కొద్దీ చిన్న దద్దు లేస్తుంది. చీమ కుట్టిన ప్రతిసారీ నాకు అచ్చం అలానే జరుగుతోంది.

అడవిలో అర్ధరాత్రి కూడా నాకు ఇలాంటి అనుభవాలు చాలానే కలిగాయి. ఇది చీమల మీద నేను రాయబోయే 10 టపాల్లో మొదటిది. చీమల గురించి ఇన్ని టపాలు రాయడానికి ఇంకో కారణం కూడా ఉంది. మా ఇంటిపేరు ‘చీమ’కుర్తి.
(గమనికః ఈ రచనలో వాడిన ఫోటోలు flickr.com నుంచి తీసుకోబడ్డాయి.)
బ్లాగుల పేరడీ 2 కూడా చూడండి
Pingback: సోది sOdi » Blog Archive » భ్లాగర్లపై చీమల దాడి
Pingback: The Hidden Agenda: కూడలి « వీవెనుడి టెక్కునిక్కులు